ముంగిలి > రాజకీయం > కప్పు కాఫీ, దమ్ము, రాజకీయంపై దుమ్ము

కప్పు కాఫీ, దమ్ము, రాజకీయంపై దుమ్ము

ఎంచక్కా ఓ కప్పు కాఫీ తాగుతూనో, ఓ దమ్ము కొడుతూనో, ప్రపంచంలో యెన్నో విషయాలలో తేలిగ్గా తప్పులెంచడం మహా సరదాగా ఉంటుంది కదూ? అలా స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతూ దుమ్మెత్తబడే విషయాలలో బహుశః రాజకీయాలు, రాజకీయ నాయకులది ప్రదమ స్థానమై ఉంటుంది.

వాడున్నాడే ఒట్టి దుర్మార్గుడు. ఈ ప్రభుత్వానికి ఏమీ చేతకాదు. ఓట్లకోసమయితే అడుక్కోడానికి మన దగ్గిరకొస్తారు ఎన్నికలవ్వగానే మరుస్తారు. ఈ వ్యవస్థ మారాలి గురు. ఛీ ఛీ యేమిటిది?

ఇక దూరదర్శనిలో వార్తా చాణల్ల సంగతి చెప్పనే ఒద్దు. వీటి అస్తిత్వమే రాజకీయనాయకుల తప్పుడు చేష్టలనెంచడం పై ఆధారపడి ఉంటుంది. చలనచిత్రాల సంగతి సరే సరి. ప్రతినాయకుడు స్వయంగా ఒక రాజకీయ నాయకుడో, లేదా వాడి తొత్తో అయివుంటాడు. ఇంత నీచంగా చిత్రించబడే వీరు అసలు ఎలా నెట్టుకొస్తున్నారు? ప్రజల చేతకాని తనమా? ఈ తప్పుడు నాయకుల సమర్ధతా? వ్యవస్తాపరమైన లోపమా లేక ఈ దేశ దౌర్భాగ్యమా?

ఓ చిన్ని ప్రశ్న. మీ వీధిలో శునకాలు లేకుండా ఉండడం ఎప్పుడైనా జరిగిందా? గేటెడ్‌ కమ్మ్యూనిటీల సంగతి కాదు. మామూలు విధుల గురించి నేను ప్రస్తావించేంది. మనభాగ్యం కలిసి వస్తే పురపాలక సంస్థ వారు కరుణిస్తే, కుక్కలబండి వొచ్చి అప్పుడప్పుడూ కాస్త ఊరట కలుగుతుంది. కాని కొద్దిరోజుల్లోనే ఎక్కడినుంచో వేరే కుక్కలొచ్చి చేరతాయి. మళ్ళీ కథ మామూలే. ఈ కుక్కలకి మన దుమ్మెత్తిపోసే విషయానికి పొంతనేమిటనుకుంటున్నారా? ఉంది. ఖచ్చితంగా ఉంది.

ఎలాగయితే విధికుక్కల బెడద ఓ కొలిక్కిరాదో, ఈ రాజకీయ భ్రష్టత్వానికీ సమాధానం లేదు. అసలు నిజం చెప్పాలంటే మన సమాజ నిలకడకి ఈ వ్యవస్థ ఒక కీలక కారణం. ప్రజాస్వామ్యంలో ప్రజలదే ఎన్నుకునే హక్కూ బాధ్యత. కాకపోతే ఉన్నవాళ్ళలో ఎవరు కాస్తో కూస్తో ఫరవాలేదనిపిస్తుందో వారికే ఓటు వేస్తుంటాము. నిర్మొహమాటంగా చెప్పాలంటే, తలమీద రూపాయి పెడితే అర్ధ రూపాయి కూడా తూగని వెధవలే ఎన్నికయ్యేది.

ఒక్కసారి ఊహించి చూడండి. ఇటువంటి రాక్షస ప్రవృత్తి కలిగిన వారు రాజకీయ పదవీవ్యామోహంతో మన ముందు చెతులు కట్టుకొని వోట్లకోసం అర్థిస్తూ లేదా ఎన్నికయ్యాక నేను ప్రజలమనిషినని తన రాక్షసత్వాన్ని దాచుకుంటు ప్రవర్తించకుండా సమాజంలో ఒక సగటు వ్యక్తిగా కలిసి ఉండి ఉంటే మన నిత్య జీవితం ఏమికాను? ఏ ఆకు రౌడీయో లేక వీధి గూండాగానో వీధి కుక్కల మల్లె సమాజానికి తలనొప్పయి కూర్చుంటాడు.

నన్నడిగితే, ప్రజాస్వామ్యం ఓ తేనె పట్టు. మహత్వాకాంక్ష ఉన్న ఏ వ్యక్తయినా ఎదగ గలడనే ఆశ కల్పిస్తుంది. చదువూ, ప్రగ్న్యా, చరిత్రా ఏమీ అవసరం లేదు. ఎవడైనా దూకేయొచ్చు. హత్యలు, మానభంగాలు, దొమ్మీలు ఏమి చేసిఉన్నా ఫరవాలేదు. రాజకీయ జీవితం కోసం ప్రయత్నించొచ్చు. ఏదో పదవికి ఎన్నికయిన తరువాత ఇక ఆశకు హద్దే ఉండదు. ఓ కార్పొరేటరు ఎమ్మెల్యే అవ్వడానికి, ఓ ఎమ్మెల్యే మంత్రి పదవి కోసం, ఓ మంత్రి ముఖ్యమంత్రి కుర్చీ కోసమో, ఓ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అవ్వాలనో జీవితాంతం తపిస్తూనే ఉంటారు. అందుకోసం గుప్తంగా కొన్ని నేరాలు ఘోరాలు ఘాతుకాలు చేసినా అయినంత మటుకు తన మీద బురద పడకూడదనే ప్రయత్నిస్తుంటాడు. ఎప్పుడూ ప్రజల మనిషిననిపించుకోవాలనే యత్నిస్తుంటాడు. ఎంతసేపూ తనలాంటి మరొకడిని పడగొట్టి వాడి కుర్చీనెలా లాక్కుందామని ప్రయత్నిస్తుంటాడు. అవతలవాడు వీడి ఎత్తులకు పైఎత్తులు వేస్తు తన కుర్చీ కాపాడుకోవడంలో నిమగ్నుడయి ఉంటాడు.

అలా కాకూండా ఇలాంటి అసురులను పదవులకు, రాజకీయాలకు దూరంగా పెడితే ఏం జరుగుతుంది? భారతదేశం మరో పాకిస్తానో, అఘనిస్తానో అయి కూర్చుంటుంది. ఈ అసురులు సమాజాన్ని పీక్కుతింటారు. కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాము. పదో అవతారమయిన కల్కి అవతరించడానికి ఇంకా ఎన్నో వేల యేళ్ళు పడతాయి. అప్పటిదాకా ఈ అసురులను తమలో తాము కుమ్ముకుంటు ఉంచే ఈ వ్యవస్థే సరైన సమాధానం.

ఇంతకీ నేను చెప్పోచ్చేదేమిటంటే, కాఫీ తాగుతూనో, దమ్ము కొడుతూనో మనఃపూర్తిగా ఎవరిని పడితే వారిని దుమ్మెత్తి పొయ్యండి. ఏం ఫరవాలేదు. కాకపోతే లోలోపల కాస్త ఆలోచించండి. ఈ వ్యవస్థ ఒక శాపమా లేక వరమా అని.

ప్రకటనలు
వర్గాలురాజకీయం ట్యాగులు:
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s