దేవాలయాలు / 1

ఆనంద నిలయం

ఆనంద నిలయం

ఇవాళ దేవాలయాలగురించి చిన్నపాటి చర్చ వచ్చింది. చాలా రోజుల తరువాత ఇలాంటి మంచి విషయం ప్రస్తావనకు రావడం ఏదో ఆనందం కలిగించింది. ఇలాంటి చర్చ ప్రస్తావించినందుకు ఆ వ్యక్తికి ధన్యవాదం తెలుపుకుంటూ, దీనిపై కొన్ని విషయాలు ప్రస్తావించాలనిపించింది. దేవాలయాల గురించి సర్వం తెలిసిన జ్ఞానిని కాకపోయినా, తెలిసిన కొన్ని విషయాలపై భాగాలుగా టపాలు వ్రాయాలనిపించింది. తప్పులేమన్నా ఉంటే తప్పకుండా తెలియజేయగలరు.

అచంచలమైన నమ్మకంతో ప్రేరేపింపబడిన దేవాలయ నిర్మాణ సంకల్పం, పురాకృత సుకృత కర్మ ఫలం. మన శాస్త్రాలలో ప్రస్తావించబడిన ఉత్తమమైన కర్మలలో ఇదొకటి. అంటే, దేవాలయ నిర్మాణమే ఏకైక పథమని నా ప్రస్తావన కాదు. హోదా, సంపన్నత వగైరాలు పక్కన పెట్టి, దేవాలయ పరిశుభ్రతోలో పాలుపంచుకోవడమూ ఉత్తమమే. దేవాలయ నిర్వహణలో రవ్వంత పాలుపంచుకున్నా, ఎంతో గొప్ప విశేషం.

ఉత్తమమైన సంకల్పం, అందుకు తగిన వనరులు గల వ్యక్తిని యజమానిగా పిలవవచ్చు. నౌకరు-యజమాని తరహా కాదు. యజ్ఞము చేసే వాడిని యజమాని అంటారు. యజమాని సంకల్పబలానుగూణంగా స్థాపకుడు అంటే ఆచార్యుడు ఆలయ నిర్మాణాన్ని అన్ని రకాలుగా పర్యవేక్షించే మరొక కీలక సూత్రధారి. అటువంటి ఆచార్యుడు ఉత్తమమైన చరిత్ర, నడవడి, దైవభక్తి, అచార వ్యవహారాలపై మంచి పట్టు గలవాడైఉండాలని విడిగా చెప్పే అవసరం లేదనుకుంటను.

దేవాలయ నిర్మాణంలో తనతో సమానమైన అర్హతా సమర్థతగల స్థాపతిని ఆచార్యుడు నియమిస్తాడు. స్థాపతికి సూత్రగ్రాహి, తక్షక, వార్ధాకినులు తోడ్పడతారు. నిర్ణయమయిన పిదప యజమాని, ఆచార్యుడు సంకల్పంబూని నియమబద్ధమయిన జీవన విధానాన్ని అవలంబించడం మొదలు పెడతారు.

ఆలయ నిర్మాణంలో వాడబడే శిలలు, కలప తదితర సామాగ్రి కొత్తగా సేకరించబడి ఉండాలి. ముందే వాడబడినవి నిషిద్ధం. నిర్మాణంలో వినియోగించబడే అన్ని పనిముట్లని పవిత్రంగా పూజిస్తారు. మొదట పవిత్రమైన, ప్రాకృతిక సౌందర్యం, ప్రశాంతత కలిగిన చోటుని ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్న ప్రదేశాన్ని చక్కగా చదునుచేసి నిర్మాణానికి సిద్ద పరుస్తారు. అడ్డం వచ్చే మొక్కలు, చెట్లు తదితర భౌతిక అడ్డంకులే కాక, దుష్ట శక్తులవంటి వాటిని కూడా మంత్రబద్ధంగా శుద్ది చేయడం జరుగుతుంది.

ఆలయ నిర్మాణ ప్రణాళిక తదితరాలు సిద్ధమయిన తరువాత, వాస్తువిన్యాసం తరువాతి ప్రక్రియ. సుముహూర్తాన నిర్మాణ స్థలమునందు వాస్తుమండలాన్ని వేయడం దీని ఉద్దేశ్యం. అరవైనాలుగు చతురశ్రాలలో మంత్రపూర్వకంగా వాస్తుపురుషుడిని ఆవాహనచేయడం జరుగుతుంది. మున్ముందు, ఆలయ ప్రధాన అర్చాముర్తిని దిని మధ్యలోనే ప్రతిష్టిస్తారు.

అడంకులు కలుగకుండడానికి, పుర్తి నిర్మాణ ప్రక్రియ సంకల్పానుకూలంగా సిద్ధించడానికి అంకురార్పణ మరో ముఖ్యఘట్టం. నిర్మాణం మొదలుపెట్టేముందు, నిర్మాణ చిట్ట చివరి ఘట్టంలో (మూర్ధేష్టకం), ప్రధానముర్తి నేత్రాలు తెరిచే ముందు (అక్షిమోచనం) లాంటి సంధర్భాలలో జరిగే తంతు ఇది. అంకురార్పణలో వడ్లు, నువ్వులు, ఆవాలవంటి దినుసులను 16 రాగిపాత్రలలో మొలకెత్తిచ్చి సమర్పించడం జరుగుతుంది.

నిర్మాణంలో తరువాయి ఘట్టం శిలాన్యాసం. మొదటి శిల లేదా ఇటుకను పెట్టి పునాదినిర్మాణం మొదలు పెడతారు. వాయవ్యంలో శిలాన్యాసం జరుగుతుంది. పునాది నిర్మించిన తరువాత మట్టిని మధ్యభాగం మినహా, పూర్తిగా నింపుతారు. మధ్యభాగం మూడోవంతు మాత్రమే నింపబడుతుంది. ఈ ప్రదేశ మధ్యంలో ఆధారశిల, దానిపై రాతితో చెక్కిన నిధికుంభం, కూర్మం, పద్మం; వాటిపై వెండితోచేసిన నిధికుంభం, కూర్మం, పద్మం; వీటన్నిటిపై బంగారంతో చేసిన నిధికుంభం, కూర్మం, పద్మం అమరుస్తారు. ఇవన్నీ ఒక రాగి యొగనాళంతో అనుసంధానించబడతాయి. వీటన్నిటిని కప్పివేస్తు, బ్రహ్మశిల అమర్చబడుతుంది. ఈ బ్రహ్మశిలపైనే ప్రధాన అర్చాముర్తిని ప్రతిష్ఠించేది.

సదాధార ప్రతిష్ఠ

సదాధార ప్రతిష్ఠ - 1 ఆధార శిల; 2 నిధికుంభము; 3 పద్మము; 4 కూర్మము; 5 వెండి, బంగారు నిధికుంభ, పద్మకూర్మములు6 యోగనాళము; 7 బ్రహ్మశిల, నపుంసకశిల, పీఠాలు

మరొక ముఖ్యమైన ఘట్టం గర్భన్యాసం. ఆలయ కొలతలకు అనుగూణంగా ఉన్న ఒక రాగి తట్ట లేదా తబుకును మంచి ముహుర్తాన రాత్రి సమయంలో పాతి పెట్టటం జరుగుతుంది. దాని పాతిక గడియలలో వివిధ రకాల వస్తువులను భద్ర పరచి శాశ్త్రోక్తంగా పూజించడం జరుగుతుంది.

బ్రహ్మశిల అమరిక, గర్భాన్యాసం పూర్తయిన తరువాత ఆలయ స్థంభాలు, గోడలు, ప్రాకారాలు వంటి మిగతా ముఖ్యమైన కట్టడాలన్నీ మొదలుపెట్టబడతాయి. శిఖరనిర్మాణంతో నిర్మాణ ప్రక్రియ చరమదశకు చేరుతుంది. అర్చామూర్తుల నిర్మాణం, ప్రాణ ప్రతిష్ఠ తరువాయి ఘట్టాలు.

— సశేషం

ప్రకటనలు
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. 10:22 ఉద. వద్ద జనవరి 24, 2011

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s