ముంగిలి > దేవాలయాలు, మన సంస్కృతి > దేవాలయాలు / 2 – వాస్తు శాస్త్రం

దేవాలయాలు / 2 – వాస్తు శాస్త్రం

మొదటి టపాలో దేవాలయ నిర్మాణ విహంగ వీక్షణం చేశాము. ఆ టపాలో కేవలం నామమాత్రంగా ప్రస్తావించిన వాస్తువిన్యాస వివరాలను కొంత వివరంగా దీనిలో ప్రస్తావిస్తాను.

“వాస్తు” అనే పదము మనము తరచుగా వింటూ ఉంటాము. ఆ వాస్తు, దాని పుట్టు పూర్వోత్తరాలేంటి?

ఒకానొకప్పుడు, అంధకాసురుడనే రాక్షసుడిని సంహరిచడానికి యుద్దము చేస్తున్న ఈశ్వరుని లలాటమునుండి ఒక చెమటబిందువు భూమిపై పడి దాని నుండి భయంకరమైన కరాళవదనంతో ఒక గొప్ప భూతం ఉద్భవించి క్రమ క్రమంగా సర్వం వ్యాప్తిచెందింది. ఈ సంధర్భంలో “భూతం” అంటే, “దెయ్యం – భూతం” అనుకునేరు! భూతం అంటే, ప్రాణి, వస్తువు, పదార్థం వంటివి కాని ఒక చైతన్యమనుకోండి. చైతన్యం కూడా సరి అయిన పర్యాయపదం కాదనుకోండి. ఆ మహాభూతాన్ని చూసిన ఇంద్రాది దేవతలు భయభ్రాంతులకు లోనయి బ్రహ్మదేవుని శరణువేడారు. సర్వలోక సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు వారిని శాంతింప జేసి, భయాందోళనలు పోగొట్టీ, ఆ భూతమును కట్టడిచేసే ఉపాయం ఉపదేశించారు. ఏ విధంగా దానిని భూమి మీద అధోముఖంగా పడవేయాలో వివరించారు. బ్రహ్మదేవుని ఆనతి పొంది, దేవతలందరూ ఏకమై ఆ భూతమును పట్టి అధోముఖంగా కిందకు పడవేశారు.

అలా పడినప్పుడు ఈశాన్యాన (North-East) శిరస్సు, నైరుతిన (South-West) పాదాలు, వాయవ్య (North-West) – ఆగ్నేయాలందు (South-East) బాహువులతో అధోముఖంగా ఉంది. ఆ భూతం తిరిగి లేవకుండా దేవతలు దానిపై కూర్చున్నారు.

వాస్తుపురుష స్వరూపం

వాస్తుపురుష స్వరూపం - ఈశాన్యాన శిరస్సు, నైరుతిన పాదాలు, వాయవ్య-ఆగ్నేయాలందు బాహువులతో అధోముఖంగా ఉండే స్వరూపం.

ఇంతమంది దేవతాతేజస్సముదాయంతో దేదివ్యమానంగా వెలుగొందుతున్న ఆ భూతాకార అద్భుతాన్ని తిలకించిన బ్రహ్మదేవుడు దానికి “వాస్తు పురుషుడు” అని ఒక గుర్తింపు ప్రసాదించారు. భాద్రపద బహుళ (కృష్ణ పక్ష) తదియ, మందవారం (శనివారం) కృత్తికా నక్షత్రంలో ఆ వాస్తు పురుషుడు జన్మించాడు.

“ఏ అపకారం చేయని నాపై అధిష్టించి ఈ దేవతలు పీడిస్తున్నారు” అని వాపోతు కాపాడమని ప్రార్థించిన ఆ వాస్తు పురుషుని బ్రహ్మదేవుడు కరుణించి అనుగ్రహించారు. బ్రహ్మదేవుడు వరమిస్తూ “వాస్తు పురుషా! గృహములు నిర్మించినపుడు, త్రివిధమయిన గృహ ప్రవేశ సమయమునందు, గ్రామములు, నగరములు, పట్టణములు, దుర్గములు, జలాశయాలు, ఉద్యానవనాలు మాత్రమే కాకుండా దేవాలయాల నిర్మాణ సమయములందు కూడా ముందుగా నిన్నే పూజిస్తారు.” అలా మొదలయింది వాస్తు ప్రస్తావన. ఆ వాస్తుపురుషుని మీద అన్ని దిక్కులలో విరాజమానమై ఉన్న దేవతలకనుగూణంగా కట్టడాలుండేలా సూచించేదే వాస్తు శాస్త్రం.

నా అభిప్రాయం ఓ రెండు ముక్కలు ఈ సంధర్భంగా మీతో పంచుకుంటాను. వినడనికిదేదో కాకమ్మ కబుర్లా అనిపించొచ్చు. “ఏది? ఇక్కడ తవ్వితే వాస్తు పురుషుడు అధోముఖంగా పడుకొని ఆయన మీద దేవతలు కూర్చోని కనిపిస్తారా?” అని ప్రశ్నిస్తే అది ఖచ్చితంగా చాంధసవాదమే.

సామాన్య మానవుడికి తేలికగా గుర్తుండడానికి, పోల్చుకోడానికి అనువుగా ఒక విషయాన్ని ఇలాంటి పద్దతిలో కూర్చడం సనాతన ధర్మంలో కనిపిస్తుంది. నా అనుభవంలో కొన్ని సంధర్భాలలో వాస్తు ప్రభావం ప్రత్యక్షంగా చుసాను. మీలో మరికొందరు కూడా చూసే ఉంటారనుకుంటున్నాను. కానీ ఎక్కడ విషయం జటిలమవుతుందంటే, ఒకచోట జరిగిన వాస్తు తప్పిదమే మరోచోట జరిగినపుడు ఒకే లాంటి దుష్ప్రభావం కనిపించక పోవచ్చు. “అక్కడ జరిగి ఇక్కడ జరగలేదు కాబట్టి ఇది ఒట్టి మూఢ నమ్మకం” అని కొట్టి పారేస్తారు. తల్లీ కూతుర్లే ఒక వంటకాన్ని విడి విడిగా ఒకే పద్ధతి అవలంబించి చేసినా ఎన్ని సార్లు ఒకే రుచి పోలి ఉంటాయి? అంతెందుకు? ఒకే వ్యక్తి ఒక ఒంటకాన్ని రెండు సార్లు చేసినపుడు రుచి ఒకేలా ఉంటుందని నమ్మకముందా? పై పై నిర్ణయాలకు రాకుండా, కూలంకుశంగా పరిశీలిస్తే కారణాలు తెలుస్తాయి. ఒక చోట జరిగిన తప్పిదం సరైన బలంచేకూర్చే అమరిక లేకుండా ఉండి, మరో చోట ఆ తప్పిదాన్ని విరగకొట్టే బలం ఇస్తున్న అమరిక ఉండడం వల్ల ప్రభావంలో తేడాలుంటాయి.

ఇంతకీ నా అభిప్రాయమేమిటంటే, ఇలాంటి సనాతన విశ్వాసాలు మనము గుడ్డిగా నమ్మి అవలంభిస్తుంటాము. తప్పు కాదు. కానీ ఆ విషయాన్ని కూలంకశంగా పరిశీలించే ఓపిక చాలా కొద్ది మందికే ఉంటుంది. మిగతా వారందరూ మరొకరు చెప్పింది చెప్పినట్టు పాటిస్తారు. ఆ చెప్పిన వ్యక్తికి ఆ విషయంపై ఎంత పట్టుందని కానీ, ఆ వ్యక్తి ఆ విషయాన్ని సరైన కోణంలో అభ్యసించాడా లేదా అని కానీ నిర్ధారించుకోలేము. మిడి మిడి జ్ఞానంతో చెప్పిన విషయం నమ్మి దాన్ని అవలంబించి సరైన ఫలితం దక్కక, ఆ వ్యక్తినే కాక ఆ విద్యపైనే మన నమ్మకం ఎగిరిపోతుంది. మంచి వాక్పటుత్వం ఉంటే, మరి కొందరిని నమ్మకుండా ఆ వాపోయిన వ్యక్తి బుర్ర పాడుచేసేస్తాడు. మసి పూసి మారేడుకాయ చేయడానికి మీడియా ఎలాగూ ఉండనే ఉంది.

సరే. దేవాలయాలగురించి ప్రస్తావన కాబట్టి, ఈ విషయాన్ని ఇక పక్కన పెడదాం. మరో టపాలో మరి కొన్ని విశేషాలు. ఏవైనా తప్పులున్నా లేక మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయ గలరు.

— సశేషం

ప్రకటనలు
 1. vamshi
  1:25 ఉద. వద్ద జనవరి 24, 2011

  HI,

  It seems the image is vertically reverse. NE should point towards Arunachal pradesh, so vastu purush head should be placed in that side…

  Thanks
  Vamshi

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s