ముంగిలి > దేవాలయాలు, మన సంస్కృతి > దేవాలయాలు / 3 – ప్రామాణాలు, పుణ్య ప్రభావ విస్తారం, మూర్తులు, కట్టడం

దేవాలయాలు / 3 – ప్రామాణాలు, పుణ్య ప్రభావ విస్తారం, మూర్తులు, కట్టడం

ఈ టపాలో “సాధారణంగా” అనే పదం పలుమార్లు ఉపయోగించ బడింది. వ్రాసిన ప్రతి విషయానికి ఏదో ఒక దేవాలయములో భిన్నంగా నిరూపణలు కనిపించవచ్చు. దయచేసి గమనించగలరు.

నిర్మాణ, ప్రతిష్ఠ, నిర్వహణ ప్రామాణాలు
దేవాలయ నిర్మాణ-నిర్వహణ నియమాలు, సూత్రాలు, పద్దతులు ఆగమ శాస్త్రాలలో ఉంటాయి. ఈ ఆగమ శాస్త్రాలు వైష్ణవ, శైవ, శాక్తేయ భాగాలుగా విభజింపబడ్డాయి. ఆగమశాస్త్రాల గురించి మరి కొంత విస్తారంగా “సనాతన ధర్మం” శీర్షికలో మున్ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. దేవాలయ నిర్మాణం గురించి అలాగే ప్రతిష్ఠ, పుజావిధానము గురించి అగ్ని పురాణంలో కూడా విశేషంగా తెలియజేయ బడింది.

దేవాలయ పుణ్య ప్రభావ విస్తారం
ఆవిర్భవించిన కాల-విధానానుగూణంగా స్థల పురాణ రిత్యా, దేవాలయాలను ఐదు రకాలుగా విభాగించ వచ్చును. ఇటీవలి కాలంలో మానవుడిచే, అంటే ఏ ధార్మికుడో, రాజు లేక చక్రవర్తో నిర్మించిన వాటిని “మానుష నిర్మిత క్షేత్రాలు” గా పరిగణించ వచ్చును. భద్రాచల పుణ్య క్షేత్రం ఒక ఉదాహరణ. తరువాత వచ్చేవి “పౌరాణిక స్థలాలు.” తేలికగా చెప్పాలంటే, కలియుగం ముందు పురాణాలలో ప్రస్తావించ బడినవి. స్కాంద పురాణంలో ప్రస్తావించబడిన యాదవగిరి అదే యాదగిరిగుట్ట అటువంటిది. వీటి తరువాత “ఆర్ష స్థలాలు” వస్తాయి. ఋషులు, సిద్ధులచే ప్రతిష్ఠీంచబడినవి. ఉదాహరణకు అగస్త్య మహర్షిచే స్థాపించబడిన లేపాక్షి పుణ్య క్షేత్రం. అటు పిమ్మట “దైవిక స్థలాలు”. దేవతలచే ప్రతిష్ఠీంపబడినవి. ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు ఇంద్రుడు ప్రతిష్ఠించిన అమరేశ్వర క్షేత్రం (అమరావతి) ఈ కోవకు చెందినది. చివరివి “స్వయంవ్యక్త” క్షేత్రాలు. దేవ దేవుడు అపార కరుణతో స్వయంగా ఉద్భవించిన క్షేత్రాలు. తిరుమల పుణ్యక్షేత్రం లోకమెరిగిన స్వాయంభూ క్షేత్రము. ఇదేక్రమంలో వీటి ప్రభావం ఒక యోజనం, మూడు యోజనాలు, ఐదు యోజనాలు, వంద యోజనాలు. స్వయంవ్యక్త స్థలాల ప్రభావం అన్ని లోకాలలో ఉంటుంది. తొందరపడి నిర్ణయాలకు రాకండి. చిన్నా-పెద్దా తేడాలు చూడాలని కాదు మరీచి మరియూ బృగు సంహితలలో ప్రస్తావించిన ఈ ప్రభావ విశేషాన్ని ఇక్కడ ఉటంకించింది! కేవలం విషయ పరిజ్ఞానం కోసమే. నిన్నా మొన్న శాస్త్రోక్తంగా నిర్మించబడి నిర్వహింపబడుతున్న దేవాలయాలుకూడా ఎంతో పవిత్రత-ప్రభావాలు ప్రసరించేవే!

మూర్తులు
సాధారణంగా దేవాలయ మూల విరాట్టును (మూలబేర) కదల్చడానికి వీలు పడదు. అందుకే ధృవమూర్తి అని పిలుస్తారు. (పూరీ జగన్నాథుడి వంటి మూల విరాట్టులు దీనికి మినహాయింపు) ఇంచుమించు అన్ని ప్రధాన దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలను చూస్తుంటాము. వీటిని ఊరెరిగింపుకి, కళ్యాణం వంటి ఉత్సవాలకూ వినియోగిస్తుంటారు. ఈ తరహా స్థిరంగా ప్రతిష్ఠింపబడని మూర్తులు నాలుగు రకాలు.

ధృవం చ లోకరక్షార్థం, అర్చనార్థంచ కౌతుకమ్,
ఔత్సవ ఉత్సవార్థం చ బల్యర్థం బలిబేరకమ్,
స్నపనం స్నపనార్థం చ, పంచబేరాః ప్రకీర్తితాః ||

కౌతుకబేరం – దీని రూపురేఖాదులు ధృవ మూర్తిని పోలి ఉంటాయి. మూల మూర్తికి జరిగే అన్ని అభిషేకాలు-అర్చనలు ఈ కౌతుకబేరానికి కూడా జరుపబడతాయి. ఈ మూర్తి కూడా బ్రహ్మస్థానంలోనే ఉంచబడుతుంది.
ఉత్సవబేరం – ఉత్సవాలు ఊరెరిగింపుల కోసం ఇతరత్రా అన్ని సేవలకు వాడతారు. ఈ మూర్తి మూల విరాట్టుకు ఎడమ ప్రక్కన ఉంచబడుతుంది.
స్నపనబేరం – అభిషేకాలకు వినియోగిస్తుంటారు. ధృవమూర్తికి కుడివైపు ఉంచ బడుతుంది.
బలిబేరం – నిత్యోత్సవాలకు, పరివార దేవతలకు బలి (నైవేద్యం) సమర్పించినపుడు వాడతారు. ఇదీ కుడి వైపే.

గర్భగృహంలో స్థలం సరిపోకపోతే, ఉత్సవ, స్నపన, బలిబేరములను ముఖమంటపం లేదా అంతరాలమునందు ఉంచుతారు.

దేవాలయ కట్టడం
వివిధరకాల దేవాలయ రూపరేఖ శైలులను ఆగమ శాస్త్రాలు ప్రస్తావిస్తాయి. నవ-షట్-పంచ మూర్తి ఆలయం, త్రితల-నవ-మూర్తి ఆలయం, ద్వితలాలయం, ఏకతల ఏకవిమాన నవ-షట్-పంచ-మూర్తి ఆలయం ఇత్యాదులు. సాధారణంగా మనము దర్శించేవి “ఏక తల ఏక మూర్తి ఆలయాలు.” ఈ కోవకు చెందిన ఆలయాలలో, ఒకే ధృవ మూర్తి మరియూ కౌతుక బేరం ఉంటాయి.

దేవాలయ మూలవిరాట్టు కొలువైఉన్న కట్టడాన్ని గర్భగృహం అంటారు. సాధారణంగా గర్భగృహంలో దీపపుకాంతి మరియూ ముందరి ప్రాకారంనుంచి ప్రసరించే వెలుతురు తప్ప, గవాక్షాల వంటి అమరికలు కనిపించవు. ప్రవేశ ద్వారం తప్ప అన్ని వైపులనుండి మూయబడిన కట్టడం. గర్భగృహముపై ఉన్న గోపురాన్ని విమానమని పిలుస్తారు. విమానమంటే అవయవానురూపత్వము కలిగినదని అని ఒకానొక అర్థం. సాధారణంగా దక్షిణదేశ విమాన గోపురాలు వ్రవేశ గోపురాల కన్నా చిన్నవిగా, ఉత్తరదేశ విమాన గోపురాలు పెద్దవిగా ఉంటాయి.

ఆనంద నిలయం - తిరుమల వేంకటేశ్వరుని గర్భగృహ విమాన గోపురం

ఆనంద నిలయం - తిరుమల వేంకటేశ్వరుని గర్భగృహ విమాన గోపురం

సాధారణంగా గర్భగృహానికి చేరికగా సుకనాసి, అర్ధమండపాలుంటాయి. తరువాతి కట్టడం అంతరాలము (అంతరాలయము). పిదప ముఖమంటపం. దాని తరువాత మంటపం. దీనినే నృత్యమంటపం లేదా నవరంగమని కూడా పిలుస్తారు. తమ కళలను దైవానికి అర్పిస్తూ కళాకారులు ప్రదర్శనలు జరిపేది ఇక్కడే. దక్షిణదేశ శైలిలో ఎంతో ప్రముఖమైన ధ్వజస్తంభం గర్భగృహం లేదా అంతరాలయం లేదా మంటపం వద్ద ఉంటుంది.

ధ్వజస్తంభం

ధ్వజస్తంభం

ఉత్తర భారత దేవాలయాలలో సాధారణంగా ఒక ధ్వజం ఎగురవేస్తారు. మూలవిరాట్టు వాహనము ఈ ధ్వజస్తంభంపై లాంఛనంగా విరాజిల్లుతుంటుంది. అధోముఖంగా ఉన్న పద్మాకృతిలో పక్కనే బలిపీఠం ఉంటుంది. పరివారదేవతలకై, వివిధ భూతాలకు ఈ పీఠంపై బలి (నైవేద్యం) పెట్ట బడుతుంది.

బలిపీఠం

బలిపీఠం

ఈ మొత్తం వ్యవస్థను చుడుతూ దేవాలయ ప్రాకారం (ప్రహరీ గోడ) ఉంటుంది. ఈ ప్రాకారానికి ఒక ముఖ్య ద్వారం (గోపురం) మూడు ఆశ్రిత గోపురాలు ఉంటాయి.

ప్రాకారం లోపల పరివార దేవతల ఉపదేవాలయాలుంటాయి. ఇవి కాక యాగశాల, పాకశాల వంటి మిగతా కట్టడాలుంటాయి. కొన్ని దేవాలయాలలో దీపస్థంబం కూడా ఉంటుంది.

— సశేషం

ప్రకటనలు
 1. Kameswara Rao
  8:43 ఉద. వద్ద ఫిబ్రవరి 6, 2011

  indulo telugulo vyakhyalu rayalante elagu

 2. 10:23 సా. వద్ద ఫిబ్రవరి 6, 2011

  ^ పై వ్యాఖ్యకి ప్రతిస్పందన :

  మామూలుగా ఇంటరునెట్ లో తెలుగు వ్రాసే పద్ధతిని మీరు అనుసరించవచ్చును. ఇందుకు మొదట్లో http://lekhini.org సహాయం తీసుకోవచ్చును. ఆ సైటులో పైన బాక్సు లో ఆంగ్ల అక్షరాలతో వ్రాసినది కింద బాక్సులో తెలుగులో వస్తుంది. కాపీ చేసుకుని కావలిసిన చోట పేస్టు చేయడమే…

  బ్లాగు రచయితకి:
  వర్డు ప్రెస్ ఉపయోగిస్తున్నారు కనుక ఈమాట వారి తెలుగు కామెంట్ల ప్లగిను అమరిస్తే పాఠకులకి చాలా అనువుగా ఉండే అవకాశం ఉంది. గమనించగలరు
  manavaani గారి అనుమతిమేర ఈ భాగాన్ని తొలగించడమైనది. –తెలుగుభావాలు

 3. sreenivas goud
  6:01 సా. వద్ద నవంబర్ 21, 2012

  meeru chiliyajesina iee vivaralu yentho prayojanakaranga unnavi vititho patuga marinni photolu jatha chesina yedala maku marinni vivaralu chala baga teliyajesina varu avutharu

 4. Madhura devi
  10:04 ఉద. వద్ద సెప్టెంబర్ 19, 2013

  దేవలయం లొ ఉండే మూలవిరట్టుకు వెనక భాగం లొ
  మకర తొరనం యొక్క ప్రసస్త్యం తెలుపగలరు

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s