భేతాళ కథ

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్ళి, చెట్టుపైనుంచి శవాన్ని దింపి భుజాన వేసుకొని, ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, “రాజా, ఏమి ప్రయోజనమాశించి అర్థరాత్రివేళ ఇలా కఠోర శ్రమ చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అయితే, కొందరు విశేషంగా పరుల తప్పులను ఎంచి దుమ్మెత్తిపోసి తిరిగి వాళ్ళతోటే స్నేహం చేసి ప్రజలను అయోమయంలో పడవేస్తూ ఉంటారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి కథ నీకు వినిపించి నీకు శ్రమ తెలియకుండా ఉండేటట్టుగా ప్రయత్నిస్తాను. సావధానచిత్తుడవై ఆలకించు.” అని ఒక కథ చెప్పడం మొదలు పెట్టాడు.
భేతాళ కథ

భేతాళ కథ

పూర్వం కళింగరాజ్యానికి ద్రవిడరాజ్యానికి నడుమ ఆంధ్ర ప్రదేశమను ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యమునందు ప్రజాతంత్రమను వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థలో ప్రజలందరు తమ తమ నాయకులను ఎన్నుకొనేవారు. ఆ ఎన్నుకొనబడిన ప్రజా ప్రతినిధులు తమలో ఒకరిని ఎన్నుకొని ఆ రాజ్యానికి రాజుగా చేసేవారు. అలా ఎందరో గొప్ప గొప్ప వారు ఆ రాజ్యానికి రాజులుగా ఉండి విశేషమైన సేవలందించారు. (అబ్బా-ఛా!)

ఒకానొక కాలంలో తిరిగి ప్రజలు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవలసిన సమయం ఆసన్నమయింది. ఆ ఎన్నికలలో ప్రధానంగా కొందరు నాయకులు ఎన్నికవ్వడానికి సమాయత్తమయ్యారు. అప్పటివరకు రాజుగా ఉన్న రాజశేఖర వర్మ, అంతకు ముందు రాజుగా చేసిన చంద్ర కేతులు ప్రధాన పోటీదారులు. ఆ రాజ్య విభజన కోరిక వ్యక్తంచేసి ఒక భాగంలో విశేషంగా గుర్తింపు పొందిన చంద్రశేఖరవర్మ కూడా ఎన్నికలకు సమాయత్తమయ్యారు. అనూహ్యంగా ఆ రాజ్యంలో ఎంతో పేరు గడించిన ఒక కళాకారుడైన చిరంజీవి వర్మ బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యానికి గురి చేసారు. అప్పటి వరకు ఇద్దరి మధ్యనే ఉండే పోటీ ఒక్కసారిగా మార్పు చెందింది. ప్రజలు కాస్త అయోమయ పరిస్థితులలో పడ్డారు.

ఎన్నికవ్వడానికి ఆ అభ్యర్థులు ఒకరిమీదఒకరు బురద చల్లుకున్నారు. వీడు చవట అంటే వాడు వెధవ అని సామూహిక సభలలో తమ అభిప్రాయాలను వ్యక్త పరచారు. చిరంజీవి వర్మ సోదరుడైన పవన వర్మ ఎంతో ఆగ్రహావేశాలతో ప్రసంగాలు చేసే వారు. రాజశేఖర వర్మ వర్గాన్ని ఛెఢా-మెఢా కడిగేసేవాడు. “అబ్బా! ఇంతుందా?” అని ప్రజలు వీస్తూ పోయేంతగా ప్రజ్వలించి పోయే వారు. కానీ జయాపజయాలు దైవాధీనాలు కదా! చిరంజీవి వర్మ ప్రవేశం వల్ల అర్థం కాక ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో తెలియక ఆ ఎన్నికలలో పాల్గొన్నారు. చివరికి చంద్రశేఖర వర్మ, చిరంజీవి వర్మల ప్రవేశ పుణ్యమా అని చంద్ర కేతు తీవ్రంగా దెబ్బ తిన్నారు. మరలా రాజశేఖర వర్మకే పట్టంకట్టబెట్ట బడింది. గతం గతః అని అందరినీ కలుపుకుపోవాలని రాజ శేఖర వర్మ చిరంజీవి వర్మ కూటమిని తన కూటమితో కలిపే ప్రయత్నం మొదలు పెట్టారు.

ఇంతలోనే ఎవరూ ఊహంచని సంఘటన చోటు చేసుకుంది. రాజ శేఖర వర్మ ప్రమాదానికి గురై కన్నుమూయడం జరిగింది. ఏమి జరిగిందో అర్థంకాని పరిస్థితులలో, రాజ శేఖర వర్మకు ఎంతో దగ్గిర వ్యక్తి అయిన రోష వర్మ తాత్కాలిక రాజుగా నియమింపబడడం జరిగింది. రాజ్యంలో విషాద పరిస్థితులు సద్దుమణిగాక మెల్లిగా ఒక దాని తరువాత ఒకటిగా జటిల సమస్యలు తలెత్తడం మొదలు పెట్టాయి. విపరీతమైన వర్షాలు. చంద్ర శేఖర వర్మ ప్రాబల్యం అధికమవడం. ఆర్థిక పరిస్థితులు చేయి జారి పోవడం. రాజ పరివారంలో వ్యతిరేక స్వరాలు వినిపించడం. ఓహో ఒకటేంటి?

రాజశేఖర వర్మ సుపుత్రుడైన జగన్మోహన వర్మ రాజు కావాలనే మహత్వాకాంక్ష ప్రభావం వల్ల, రోష వర్మ జీవితం మరీ దుర్భరంగా మారిపోయింది. పైపెచ్చు ఆరోగ్య సమస్యలు. ఇక వీలు పడక కుమార వర్మ అనే మరో అధినేతను రోష వర్మ స్థానంలో రాజును చేయడం జరిగింది. ఈ సంఘటన జగన్మోహన వర్మను మరీ కోపోద్రిక్తుడను చేసింది. రాచ పరివారం నుంచి తెగతెంపులు చేసుకునే వరకు దారి తీసింది. ఏ సమయంలోనైనా జగన్మోహన వర్మ కుమార వర్మ మీదకు దాడికి దిగగలడన్న అనుమానాల గాఢాంధకారంలో ఆ రాజ్యం చిక్కుకు పోయింది. ఎమీ తోచడం లేదు. ప్రజలు ఎంతో బాధ పడడం మొదలు పెట్టారు. అయ్యో! చక్కటి అభివృద్ధి పథంలో ఉన్న రాజ్యానికి ఏమి దృష్టి తగిలిందో? ఏమి అపరాదం జరిగిపోయిందో? అంటూ బాధ పడుతున్న సమయంలో మరో ఉత్కంఠ భరితమైన సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. కుమార వర్మ కూటమిలోకి చేరిపోతున్నట్టు చిరంజీవి వర్మ సంచలనం సృష్టించారు.

“రాజా విన్నావుగా ఈ కథ. నా యీ ప్రశ్నలు కూడా విను” అంటూ భేతాళుడు విక్రమార్కుడిని కొన్ని ప్రశ్నలడిగాడు.

1. ఒకరినొకరు దూషించుకున్న పద్దతికి సగటు మనిషి కనక అయితే దోసెడు నీళ్ళళో దూకి ఆత్మహత్య చేసుకునేవాడేమో? అంతగా దూషించిన-దూషింపబడిన చిరంజీవి వర్మను కుమార వర్మ కూటమిలో చేరడానికి ప్రోత్సహించిన కారణాలేంటీ?
2. చేరిన తరువాత కుమార వర్మ రాజ్యాధికారానికి చిరంజీవి వర్మ వల్ల ప్రమాదమేమన్నా ఉంటుందా?
3. ఈ పరిణామం వల్ల చంద్ర కేతు, చంద్రశేఖర వర్మలకు లాభం కలుగుతుందా నష్టం జరుగుతుందా?

“రాజా! తెలిసి కూడా సమాధానం చెప్పలేదంటే నీ తల వేయి వ్రక్కలవుతుంది” అని భేతాళుడు సమాధానం కోసం వేచి ఉన్నాడు.

మీరేమన్నా సహాయం చేయగలరా విక్రమార్క మహారాజుకి?

ప్రకటనలు
 1. SIVA
  10:35 సా. వద్ద ఫిబ్రవరి 3, 2011

  బేతాళ కథ బాగా వ్రాశారు. చిరంజీవి వర్మ నవ్వులపాలు కావటం ఖాయం. జగన్మోహన వర్మ మళ్ళి . రాచ పరివారం లో చేరిపోతాడు.

 2. vamshi
  12:50 ఉద. వద్ద ఫిబ్రవరి 4, 2011

  vikramarkudiki kooda kastamina prashna vesaaru ? chala bagundhi.

 3. రాధాకృష్ణ
  9:11 ఉద. వద్ద ఫిబ్రవరి 11, 2011

  ఈ ప్రశ్నలు విన్న విక్రమార్కుడు అప్పటిదాకా వున్న పెద్దమనిషి తరహాను మరచి వికవికమని నవ్వి అయ్యో అమాయక భెతాళా ఇన్నాళ్ళు ఎన్నో కధలు చెపుతుంటే ఎదో తెలివిగలవాడివని అనుకున్నాను….

  అసలు, కధ మొదలు పెట్టినదే రాజశేఖర వర్మ, చిరంజీవి వర్మనూ… వీరిద్దరూకలసి ప్రజలను విడదీసి దాని ద్వారా చంద్రకేతును ఓడించటానికినూ. దాని తర్వాత ఇద్దరూ కలిసి రాజ్య పాలన చెయ్యటానికీనూ.. ఇదంతా ముందర అనుకున్నదే; కానీ రాజశెఖరవర్మ దుర్మరణం వలనా, ఆయన కుమారుడు జగన్మోహన వర్మ రాజ్యకాంక్షవలనా మోదలుపెట్టిన కార్యం కాస్తా బెడిసి కొట్టింది. కానీ చిరంజేవి వర్మ పట్టువదలని విక్రమార్కుడిలా… అదేలే నాలాగా ప్రయత్నం చేసి సఫలం అయ్యాడు అని విక్రమార్కుడు చెప్పగానే రివ్వున ఎగిరి పోవల్సిన భేతాళుడు ధబ్బున భుజం మీంచి జారి కింద పడి సినిమాలో బ్రహ్మానందం లాగా కొట్టొకోనారంభించాడు. దానితో జాలి పడిన విక్రమార్కుడు భేతాళుని తిరిగి చెట్టుమేద పడేసి వెనుదిరిగాడు.

  రాధాకృష్ణ
  విజయవాడ.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s