ముంగిలి > దేవాలయాలు, మన సంస్కృతి > కొన్ని దేవాలయాలు కొండల మీద, అడవులలో ఎందుకుంటాయి?

కొన్ని దేవాలయాలు కొండల మీద, అడవులలో ఎందుకుంటాయి?

సమాధానం క్లుప్తంగా వ్రాయవచ్చును. కానీ సరిగా అర్థమవాలంటే కోంత ఉపోద్ఘాతం తప్పదు.

దేవాలయాలు దైవం కోసమా మన కోసమా?

ముందు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. కాసేపు “దేవాలయాలు” దైవం కోసమే అనుకుందాం. ఉదాహరణకు మన తిరుమల క్షేత్రం. తిరుమల క్షేత్రంలో వేంకటేశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు. మరి ఆ దైవ స్వరూపానికే అంటే వేంకటేశ్వరుడికే, ఊరూరా-దేశదేశాలలో వేరే గుళ్ళు ఎందుకు? తిరుమలలో నైవేద్యం పెడితే సరిపోయేదానికి, ఉన్న ప్రతి వేంకటేశ్వరాలయంలో కూడా సేవలు నైవేద్యాలు ఎందుకు? అంటే తిరుమలలో వేంకటేశ్వరుడు మిగతా గుళ్ళళ్ళో ఉన్న వేంకటేశ్వర మూల విరాట్టులు వేరు వేరా? అలా కాదే! అక్కడా వేంకటేశ్వరుడే, ఇక్కడా వేంకటేశ్వరుడే! తేలికగా చెప్పాలంటే, తిరుమలలో మాత్రమే వేంకటేశ్వరాలయం ఉండి ఉంటే, దర్శనం ఆశించినప్పుడల్లా తిరుమలకు ప్రయాణం కట్టవలసిందే! కుదరదు కాబట్టి, భక్తుల “సౌకర్యార్థం” ఇన్ని దేవాలయాలు. మన “సౌకర్యం” కోసం శాస్త్రబద్ధంగా ఒక దేవాలయాన్ని నిర్మించి అందులో ఆ దైవిక శక్తిని విశేషంగా ఆవాహనం చేసి ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ విషయంలోనే మరికొన్ని ప్రశ్నల సమాధానం దాగి ఉంది.

ఏఁ? దైవం తన రక్షణ తాను చూసుకోలేడా? పోలీసులు-బందోబస్తులు ఎందుకంటా?” అనే వాళ్ళు అర్థం చేసుకోవలసిందిదే! దేవాలయాలలో మాత్రమే దేవుడుండడు. కాకపోతే మన “సౌకర్యార్థం” మనం నిర్మించుకున్న దేవాలయాలు కాబట్టి వాటి రక్షణా నిర్వహణా బాధ్యతా మనదే!

గుళ్ళో దేవుడుకి కూడా మనలాగే ఆకలి దప్పికలుంటాయా? అందుకేనా నిత్య పూజలు నైవేద్యాలు?” మరలా అదే సమాధానం. మన “సౌకర్యార్థం” ఒక రూపంతో దైవాన్ని ఊహించుకొని అలా ప్రతిష్ఠించుకొని అరాధిస్తున్నప్పుడు, ఆ రూపానికి మనలాగే ఆకలి దప్పులు కలుగుతాయని భావించి భక్తికొద్దీ అందిచే నివేదనలు. విశేష చమత్కారాలు అప్పుడప్పుడు జరిగినా, సాధారణంగా ఆ సమర్పించిన నైవేద్యాలు చివరిగా చేరేది మన కడుపుల్లోకే కదా!

మానవేతర జీవాలకు పరిసరాలను మనలాగా తీర్చిదిద్దే శక్తి ఉండి ఉంటే, అవి కూడా వాటికోసం దేవాలయాలు నిర్మించుకోగలిగి ఉండి ఉంటే, వాటి దైవ స్వరూపం మనలా ఉంటుందా? ఏమో? అరూప-రూపి అయిన పరమేశ్వర లింగాకృతి స్వరూపం వెనకనున్న రహస్యాలలో ఇదొకటేమో?

కాబట్టి దేవాలయాలు దేవుడు కోసం కాదు మన కోసం అనే విషయం బోధ పడితే ముందుకు సాగడానికి విలవుతుంది. అలా నిర్మించుకున్న దేవాలయాలు పలురకాల ప్రయోజనాలను ఆశించి నిర్మిస్తారు. కొన్ని దేవాలయాలు ఆ రాజ్య, క్షేత్ర సర్వతోభివృద్ధికొరకైతే, కొన్ని యోగ సాధన కొరకు. కొన్ని విజయ చిహ్నాలయితే, కొన్ని రాజ్య సంరక్షణ కొరకు.

ఇక అసలు విషయానికి వద్దాము. “కొన్ని దేవాలయాలు కొండల మీద, అడవులలో, దుర్గమ ప్రదేశాలలో ఎందుకుంటాయి?” ఈ ప్రశ్నకు సవిస్తారమైన, విపులమైన సమాధానం నాకు ఇప్పటి వరకు దొరకలేదనే చెప్పాలి. కానీ, వైష్ణవ ఆగమ శాస్త్రాలలో, మూల విరాట్టు రూప వివరణ సంధర్భంలో ఎదురైన విశేషం కొంతమటుకు సమాధానంలా తోచింది. దానిని మీతో పంచుకుంటున్నాను.

దేవాలయ నిర్మాణ-నిర్వహణల విషయాలకు ఆగమ శాస్త్రాలు ప్రధాన ప్రామాణాలని ముందు టపాలలో మనవి చేసుకున్నాను. ఈ ఆగమ శాస్త్రాలలో ధృవ మూర్తి రూప-ఆకార విశేషాలు నియమాలు కూడా ఉన్నవి. నిర్మాణ సంకల్పానుగూణంగా దేవాలయాలు ముఖ్యంగా నాలుగు రకాలు. వీటిలో మనకు సాధారణంగా తెలిసిన మూడు రకాల గురించి క్లుప్తంగా ప్రస్తావిస్తాను.

-*-*-*-

భోగ మూర్తి:

భోగమూర్తి స్వరూప ధృవ మూర్తి ప్రతిష్టీంచబడిన దేవాలయాలు, జనావాసాలలో ఉంటాయి. ఈ కోవకు చెందిన దేవాలయాల వలన ఆ గ్రామ-పట్టణాలకు ఎంతగానో కలసివస్తుంది. పూర్వకాలంలో, రాజులు చక్రవర్తులు వారి రాజధానులలో నిర్మించిన దేవాలయాలు ఈ కోవకు చెందినవి.

యోగ మూర్తి:

యోగ మార్గాన్ని అవలంబించే భక్తుల కోసమని పేరులోనే తెలుస్తోంది. యోగ మూర్తి స్వరూప ధృవ మూర్తులున్న దేవాలయాలు సాధారణంగా జన సాంధ్రత కలిగిన గ్రామాలు-పట్టణాలకు బయట, ఆడవుల్లో, కోండలమీద, నదుల సంగమ స్థానాల వద్ద, నదీ-నదాలకు సమీపాన నిర్మించడం జరుగుతుంది. (పడమర నుండి తూర్పుకు ప్రవహించేది నది; తూర్పు నుండి పశ్చిమ దిశకు ప్రవహించేదాన్ని నదము అంటారు) యోగ మూర్తి ప్రతిష్టితమైన దేవాలయాలు జనావాసాలలో నిర్మిస్తే, మంచికి బదులు కీడు సంభవిస్తుంది.

వీర మూర్తి:

వీర మూర్తులు విరాజిల్లే దేవాలయాలు ఊరి బయటే నిర్మించ బడతాయి. వీటి ప్రయోజనం పరాక్రమ, విజయాపేక్ష.

-*-*-*-

జనాభా విపరీతంగా పెరిగిపోయి, ఆడవులు కొండలు అన్నీ ఆక్రమించుకోవడం జరుతున్న విషయం అందరికి తెలిసినదే. రవాణా వ్యవస్థ మెరుగవ్వడం కూడా మరో కారణం. మొత్తానికి, ఈ కాలంలో ఎక్కడ ఆసరా దొరికితే అక్కడ జనాభా చేరిపోతుండటంతో, చుట్టుప్రక్కల జనసాంధ్రత లేని దేవాలయాలు చాలా తక్కువగానే కనిపిస్తుంటాయి.

మరో గమనిక. పైన ప్రస్తావించిన సంగతులు స్వాయంభూ క్షేత్రాలకు వర్తించవు సుమా! నాకు ఇంకా అర్థం కానీ విశేషాలలో ఒకటేంటంటే, పరమాత్మ మనమీది కరుణతో కొన్ని దివ్య క్షేత్రాలలో స్వయంగా ఆవిర్భవించినా, అవి కూడా సాధరణంగా కోండలు, అడవులూ కావడమే.

ఈ విషయంలో మీకు కానీ మరికొన్ని విశేషాలు తెలిసుంటే, తప్పక తెలుపగలరు.

ప్రకటనలు
 1. madhavaraopabbaraju
  4:37 సా. వద్ద ఫిబ్రవరి 8, 2011

  ఆర్యా (మీ పేరు తెలియకపోవటంతో),నమస్కారములు.

  “కొన్ని దేవాలయాలు కొండల మీద, అడవులలో, దుర్గమ ప్రదేశాలలో ఎందుకుంటాయి?” ఈ ప్రశ్నకు సవిస్తారమైన, విపులమైన సమాధానం నాకు ఇప్పటి వరకు దొరకలేదనే చెప్పాలి.

  పై వాక్యాన్ని చదివినతరువాత, మీ గురించి నాకు అర్ధమయ్యిందేమిటంటే, మన శాస్త్రాలలోని రహస్యాలను తెలుసుకోవాలనే కోరిక మీకు వున్నదని; మీరు తెలుసుకున్నంతవరకు ఇతరులకు చెబుతూ, తెలియనిదానిని నాకు ఇంతవరకు తెలియలేదు అని నిండు మనసుతో చెప్పటంద్వారా మీ మనస్సులో భేషజాలు లేవని.

  ఇక అసలు విషయానికి వస్తే, టీ.వి. టవర్స్; సెల్‍ఫొన్ టవర్స్ – ఇలాంటివాటిని ఎత్తైన ప్రదేశాల్లోకానీ, ఎత్తైన కొండలపైన కానీ నిర్మిస్తుంటారు. మనకందరికీ ఇది తెలిసిన విషయమే. దీనికి కారణం: శబ్ద తరంగాలు, భూమికి చాలా ఎత్తులో స్పష్టంగా వుంటాయి. భూమిమీదికి వచ్చేటప్పటికల్లా అవి నేలమీదవుండే వాహన, మరియు ఇతర శబ్దాలతో కలిసిపోయి తమ స్పష్టతను కోల్పోతాయి. భూమ్యాకర్షణశక్తి కూడా ఈ శబ్దాలను గ్రహించివేస్తుంది. అందుకనే, ఎత్తైన టవర్సు ద్వారా, యాన్‍టీనాస్ ద్వారా, శబ్ద తరంగాలను కలుషితంకాకుండానే గ్రహిస్తుంటారు. దీనినిబట్టి మనకు అర్ధమవుతున్నదేమిటంటే, ఎత్తైన ప్రదేశాలలో శబ్ద తరంగాలుగానీ, విశ్వ చైతన్యశక్తిగానీ స్వఛ్చంగా, అధికంగా వుంటుంది అని.

  పై సిద్ధాంతం ఆధారంగానే మన పూర్వీకులు దేవాలయాలను ఊరికి బయటవున్న, ఎత్తైన కొండలపైన నిర్మించారు. అదేవిధంగా, అడవులలో చైతన్యశక్తి – ఇక్కడ చెట్లు యాన్‍టీనాస్ గా పనిచేస్తూ, ఈ శక్తిని గ్రహిస్తుంటాయి కాబట్టి, దేవాలయాలను అడవుల్లో నిర్మించారు. కాబట్టి, కొండలపైకి వెళ్ళినప్పుడు, మనం చైతన్యశక్తిని త్వరగా, సంపూర్ణంగా అందుకుంటాము. మరొక విషయమేమిటంటే, గుడికి వెళ్ళిన భక్తులందరు, ఒక విశ్వాసంతో, దేవుడిపై మనస్సును లగ్నంచేసి పూజచేస్తారు; లేదా భజనలు చేస్తారు. అప్పుడు, ఆ ప్రదేశమంతటా విద్యుతు అయస్కాంతశక్తితోకూడిన విశ్వ చైతన్యశక్తి ఉత్తేజపూరితమై వుండి, అక్కడవున్న వారందరిపైనా ఒకేరకంగా ప్రవహిస్తుంది. అందువలనే, మనం దేవాలయాలలో వున్నంతసేపు ఒక రకమైన ఉద్వేగపూరిత శక్తికి లోనయివుంటాము. మరొక విషయమేమిటంటే, గ్రామం మధ్యలో దేవాలయాల్ని కట్టినప్పుడు, వాటిని మిగిలిన కట్టడాలతో పాటు ఒక కట్టడంగానే చూస్తాముకానీ, ప్రత్యేకంగా చూడం. దూరంగా, విడిగా వున్నప్పుడు, దానిని ప్రత్యేకంగా చూస్తాము; ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తాము. ఇవీ ఇందులోని రహస్యాలు.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 2. 5:33 సా. వద్ద ఫిబ్రవరి 8, 2011

  మాధవరావు గారు,

  మీ విశ్లేషణ, వివరణలు బాగా ఆకట్టుకున్నాయి. సమయం వ్యత్యించి తెలుపడానికి మీరు చేసిన ప్రయత్నం, తమకు నా గురించి ఏర్పడిన అభిప్రాయానికి మనఃపూర్వక కృతజ్ఞతలు.

  ఒక సారి రుచి మరిగితే, వదిలేదు కాదు కదా మన శాస్త్రాల గురించి తెలుసుకోవాలనే తృష్ణ! నాకు అందుబాటులో ఉన్న సాధనాలతో ప్రయత్నిస్తుంటాను. తెలియకపోతే, తెలియదని ఒప్పుకున్నపుడు తమ వంటి పెద్దలు చెబితే ఆసక్తిగా గ్రహిస్తుంటాను. ఈ రోజు మరో కొత్త విషయాన్ని తెలుసుకున్నానన్న తృప్తి కలుగుతున్నది.

  ధన్యవాదాలు.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s