రామేశ్వరము / 1

క్రితం వారం దక్షిణ తమిళనాడులోని కొన్ని దేవాలయాల యాత్రలకు వెళ్ళాము. పరీక్షల సమయం కాబట్టి రద్దీ తక్కువ ఉంటుందని ఈ సమయం ఎంచుకున్నాము. అనుకున్నట్టుగానే, దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. దైవ దర్శనమే కాకుండా, దేవాలయాలు వాటి పరిసరాలను తీరికగా, క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం దొరికింది. కొన్ని టపాలలో ఆ విశేషాలను పంచుకుంటాను.

రామేశ్వర తూర్పు రాజ గోపురం

రామేశ్వర తూర్పు రాజ గోపురం

రామేశ్వరం చార్ ధామ్ (चार धाम्‌/నాలుగు పుణ్య ధామాలు) లలో ఏకైక శైవ క్షేత్రం. మిగతా మూడు ఉత్తరమున బదరీనాథ్, తూర్పున జగన్నాథపురి మరియూ పశ్చిమాన ద్వారక. అంతేకాక రామేశ్వరం ద్వాదశ జ్యోతిర్లింగాలో కూడా ఒకటి.

ఈ క్షేత్రం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో మహాదధి సముద్రంలో (Bay of Bengal) ఉన్న ద్వీపం. పంబన్ రైల్వే బ్రిడ్జ్ మరియూ ఇందిరాగాంధీ రహదారి బ్రిడ్జ్ లతో భారత భూభాగంతో రవాణా సంబంధం కలదు. ఈ క్షేత్రంలో ఎద్దుల వినియోగంతో ముడిపడిఉన్న వ్యవసాయం, నూనేగానుగలు మరియూ కుమ్మర వృత్తులు (కుండలు తయారు చేయుట) నిషిద్ధం. ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నప్పుడు, ఇది శైవ క్షేత్రమా లేక వైష్ణవ క్షేత్రమా అనే అనుమానం కలిగే విధంగా ఇక్కడి వింతలూ విశేషాలు రామాయణంతో, శ్రీ రామునితో ముడి పడి ఉంటాయి.

స్థలపురాణం

స్థలపురాణపరంగా ఇక్కడి శివలింగం సీతమ్మవారు ఇసుకతో తయారు చేసినది. వివరాలలోకి వెళితే, రావణ సంహారం తరువాత బ్రాహ్మణుడైన రావణుని వధ వలన కలిగిన బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించుకోడానికి అగస్త్యులవారి నిర్దేశము మేర శ్రీరాముడు శివ పూజకై సుముహూర్తాన్ని నిర్ణయించి తదుచితమైన శివ లింగమును తెమ్మని హనుమంతుని కైలాస పర్వతానికి పంపుతారు. కానీ ముహూర్త సమయం దాటిపోతుందేమోనని సీతమ్మవారు ఒక సైకత లింగాన్ని (ఇసుకతో చేసినది) తయారు చేస్తారు. ఆవిడ పవిత్ర హస్త స్పర్శచే ఆ సైకత లింగం గట్టి పడుతుంది. రాములవారు ప్రతిష్ఠ గావించి ముహుర్తానికి సంకల్పించిన కార్యక్రమం పూర్తి చేస్తారు. కానీ ఇంతలోనే పవనపుత్రుడు అక్కడికి చేరి జరిగినదానికి చిన్నబుచ్చుకొని, తను తెచ్చిన లింగానికే పూజ జరగాలని విన్నవించుకుంటారు. అందుకు శ్రీరాముడు, తాను తెచ్చిన లింగాన్ని సీతా నిర్మితమైన శివలింగ స్థానంలో ప్రతిష్ఠించే ప్రయత్నంచేయమని హనుమంతుని ప్రేరేపిస్తారు. చివరికి తన తోకను ఒక తాడుగా చేసి కూడా ఆ లింగాన్ని కదిలించలేకపోతారు. అప్పుడు రామచంద్రులవారు హనుమంతుని బుజ్జగించి తను తెచ్చిన విశ్వనాథలింగానికే మొదటి పూజలు జరుగుతాయని వరమిస్తారు.

కానీ, వాల్మీకి రామాయణాన్ని పరిశీలిస్తే, రావణవధ తరువాత శ్రీరామచంద్రుడు సీతా సహితంగా పుష్పక విమానంలో లంక నుండి బయలుదేరి కిష్కిందలో వానర వనితలను తోడ్కొని, భారద్వాజ ముని ఆశ్రమం అటు పిదప అయోధ్యకు చేరుకున్నట్టు ప్రస్తావించబడింది. ఇప్పటి రామేశ్వరక్షేత్రంలో ఆగినట్టు దాఖలాలు కనపడవు. కాబట్టి, కొందరు ఇక్కడి శివలింగాన్ని శ్రీరామచంద్రుడు యుద్ధానికి ముందే ప్రతిష్ఠించి అర్చించినట్టు భావిస్తారు. ఏది ఏమైనా, శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలోని రామనాథుని అర్చించారు అన్నది మాత్రం నిర్వివాదాంశం.

మూర్తి, స్థలము మరియూ క్షేత్రములైన మూడు లక్షణాలున్న అద్భుతమైన దేవాలయ సమూహం. మాటవరుసకు రాసింది కాదు సుమా! ఈ క్షేత్ర దర్శనం పరిపూర్ణమవ్వాలంటే కనీసం రెండు లేక మూడు రోజులు సునాయాసంగా పడతాయి. తదుపరి టపాలో, ఇక్కడికి  చేరుకొనే పద్దతులు, క్షేత్ర విశేషాల గురించి ప్రస్తావిస్తాను. ఈ రామేశ్వర శిర్షిక ద్వారా చూడవలసిన విశేషాలు, నేను నేర్చుకొన్న కొన్ని పాఠాలు, కొన్ని అంతగా ప్రాచుర్యంపొందని విశేషాలు, వింతలు పంచుకోవడంలోని ఆంతర్యం ఇతరులు తమ రామేశ్వర యాత్ర ప్రణాళికను తయారుచేసుకోవడంలో తోడ్పడడానికని గమనించగలరు.

–సశేషం

ప్రకటనలు
  1. 9:31 సా. వద్ద మార్చి 19, 2011

    చక్కగా వ్రాశారు. “సశేషం” కోసం ఎదురు చూస్తా.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s