రామేశ్వరము / 3

తీర్థములు

రామేశ్వర యాత్ర అనగానే మొదట జ్ఞాపకముంచుకొనవలసిన విషయం, తీర్థ స్నానాలు. రామేశ్వర క్షేత్రములో మరియూ చుట్టు ప్రక్కల ఎన్నో పుణ్య తీర్థాలు ఉన్నాయి. అన్నిటికీ పౌరాణిక ప్రామాణాలున్నాయి. స్కాంద పురాణము నందలి బ్రాహ్మఖండములోని “సేతు మాహాత్మ్యము” పూర్తిగా రామేశ్వరక్షేత్ర విశేషాలతో నిండి ఉన్నది. రామేశ్వరంమీది అన్ని టపాలను చివరిగా ఆ పౌరాణిక ప్రామాణముతో అనుసంధానము చేసే ప్రయత్నంతో ఈ రామేశ్వర శీర్షికను ముగిస్తాను.

గుడి తూర్పు ప్రవేశ ద్వారానికి కోసవేటు దూరంలో (వంద మీటర్లు) సముద్రతీరము ఉన్నది. దీనిని అగ్నితీర్థం అంటారు. క్రింద జత చేసిన చిత్రం దానిదే. కనిపిచ్చే కట్టడము ఇటీవలే నిర్మించారు. మొదట ఇక్కడ స్నానంతో భక్తులు దేవాలయం లోపలి 22 తీర్థాల స్నానానికి ఉపక్రమిస్తారు.

అగ్నితీర్థము
అగ్నితీర్థము

దేవస్థానంవారు ప్రతి బావి వద్ద ఒకరిద్దరిని నీళ్ళు తోడి భక్తుల స్నానాలకు సాయపడటానికి నియమించారు. కానీ నన్నడిగితే, దేవాలయపు ముఖద్వారం వద్ద కొందరు తెల్ల దుస్తులలో చేతిలో చిన్న చిన్న బక్కెట్లతో మనిషికి వంద రూపాయల చొప్పున సేకరించేవారిని వినియోగించుకోమ్మని సలహా ఇస్తాను. వీరయితే నీళ్ళు గుమ్మరించకుండా నెమ్మదిగా పోస్తారు. ఇంకా ఉత్తమమైన మార్గం మీరే చిన్ని బొక్కెన, దానికో సన్నని తాడు కట్టుకొని తీసుకెళ్ళడం. దేవాలయం వెలుపల ఉన్న తీర్థ స్నానాలకు మీ బక్కెట్టు ఎంతో ఉపకరిస్తుంది. అక్కడ ఇలాంటి వారు ఎవరూ ఉండరు.

సాధారణంగా తడి గుడ్డలతో దైవ దర్శనం నిషిద్దం. అంచేత ప్లాస్టిక్ బ్యాగులో లేక నీళ్ళను లోనికి చొరబడకుండా ఉంచే సంచులలో ఎండు గుడ్డలు తీసుకెళ్ళాలి. కెమేరాలు, మొబైల్ ఫోన్లు గట్రా జాగ్రత్త సుమా! నేను వెళ్ళినప్పుడు పెద్దగా రద్దీ లేదని ముందే చెప్పాను. అయినాకూడా ఈ గుడిలోపలి తీర్థాలలో కాస్తో కూస్తో తోపులాట తప్పలేదు. పసిపిల్లలు, పండు ముసలివాళ్ళతో ఈ స్నానాలు కాస్తంత కష్టమనే చెప్పొచ్చు.

దేవాలయం లోపలి తీర్థాలు

1 మహాలక్ష్మి తీర్థం
2 సావిత్రి తీర్థం
3 గాయత్రి తీర్థము
4 సరస్వతీ తీర్థము
5 సేతుమాధవ తీర్థము
6 గందమాదన తీర్థము
7 కవచ తీర్థము
8 గవయ తీర్థము
9 నల తీర్థము
10 నీల తీర్థము
11 శంఖ తీర్థము
12 చక్ర తీర్థము
13 బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్థము
14 సూర్య తీర్థము
15 చంద్ర తీర్థము
16 గంగా తీర్థము
17 యమునా తీర్థము
18 గయా తీర్థము
19 శివ తీర్థము
20 సత్యామృత తీర్థము
21 సర్వ తీర్థము
22 కోటి తీర్థము

వీటిలో సావిత్రి, గాయత్రి మరియూ సరస్వతీ తీర్థములు ఒకే బావిలోనున్నట్టు బయటనుంచి కనిపించినా, లోపలికి వంగి చూస్తే మూడు వేరు-వేరుగా కనిపిస్తాయి.

మూడు తీర్థాలు - సావిత్రి, గాయత్రి మరియూ సరస్వతీ తీర్థములు

మూడు తీర్థాలు - సావిత్రి, గాయత్రి మరియూ సరస్వతీ తీర్థములు

సేతుమాధవ తీర్థము కోనేరు. కొన్ని బావులు ఒకటిగా, కొన్ని కొన్ని రెండేసి, మూడేసి ఐదేసిగా ఒకే చోటు ఉంటాయి. బావుల పేర్లు, వాటి సంఖ్య, వాటికి దారి ప్రస్పుటంగా గోడల మీద కనబడుతుంది. నీళ్ళు చేది మీమిద గుమ్మరించేవారు కాస్తంత వేగంగా బావుల మద్య పరుగులు తీస్తారు. అంచేత తడి బట్టలలో వారిని అనుగమిస్తూ పరిగెట్టడం తప్పదు!

సేతుమాధవ తీర్థము

సేతుమాధవ తీర్థము

మొదటి 21 బావులలోనుంచి నీళ్ళు చేదుకొని స్నానమాచరించవచ్చును. కాని చివరిదైన కోటి తీర్థం సన్నని ధారగా ప్రవహిస్తుంది కాబట్టి దానికొక పంక్తి ఉంటుంది. అలా మెల్లిగా పంక్తిలో అక్కడికి చేరుకోగానే, ఒక బొక్కెనలో ధారగా కోటి తీర్థం పడుతూఉంటే, దేవస్థానం మనిషి ఒకరు చిన్ని లోటాలో దోసెడు నీళ్ళుతీసి మనమీద పోస్తాడు.

కోటి తీర్థము

కోటి తీర్థము

ఈ కోటి తీర్థానికి చాలా ప్రాముఖ్యం ఉన్నది. ఇది లింగార్చనకై సాక్షాత్ శ్రీరామచంద్రుడే తన ధనుస్సుతో సృష్టించారు. కోటి తీర్థజల సంప్రోక్షణతో (స్నానం అనడం కష్టం) దేవలయంలోపలి తీర్థ స్నానాలు ముగుస్తాయి. అక్కడే తడిగుడ్డలు విప్పేసి పొడిగుడ్డలు వేసుకొని దైవదర్శనానికి వెళ్ళాళి. ఒకవేళ మీ బస దేవాలయానికి సమీపంలో ఉంటే, అలాగే బసకు చేరి  బట్టలు మార్చుకొని దైవదర్శనానికి తిరిగి రావచ్చును.

కోటి తీర్థ జలాలనే స్వామివారి నిత్య అభిషేకాలకు కూడా వాడతారు. వీటిని చిన్న ప్లాస్టిక్ బాటిల్స్ లో దేవాలయంలోపలే దేవస్థానంవారు విక్రయిస్తారు. ఒకటో రెండో తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఇంటికి చేరాక మనమే వాడుకోవచ్చు లేకపోతే ఇతరులకు పంచవచ్చును. వాకబు చేశానులెండి. అవి కోటి తీర్థజలాలా లేక కుళాయి తీర్థమా అని. గర్భగుడికి ప్రక్కనే వీటిలో జలాలు నింపి మూతలు బిగించడం చూశాక నమ్మకం కుదిరింది. దేవాలయం వెలుపల కొంటే, వాటిగురించి నేనేమీ చెప్పలేను.

కోటితీర్థం ప్లాస్టిక్ బాటిల్లో

కోటితీర్థం ప్లాస్టిక్ బాటిల్లో

–సశేషం

ప్రకటనలు
 1. 8:45 ఉద. వద్ద మార్చి 23, 2011

  రామేశ్వరం గురించి వ్రాసినందుకు ధన్యవాదములు.

 2. Snkr
  6:15 సా. వద్ద మార్చి 23, 2011

  అంతా బాగుంది, ఒక్కటి తప్ప. కోడి తీర్థం అని బాటిల్ మీద స్పష్టంగా కనిపిస్తూంటే, కోటితీర్థమని బుకాయించడానికి మీకు మనసెలా వచ్చిందండి? 🙂 😛
  కోడి తీర్థమా .. ఛీ ..యాక్

 3. 6:36 సా. వద్ద మార్చి 23, 2011

  హిందీలో రాసున్నదాన్ని ఎలా పలుకుతారు? “ఖోటీ తీరత్తమ్” ఆంగ్లంలో ఉన్నది? “కోడి థీర్థమ్” తమిళంలో ఉన్నది “కోడి తీర్థమ్”

  తమిళ, మళయాళ ఉచ్ఛారణ పద్దతులు తెలుగు, సంస్కృత ఉచ్ఛారణకు కొద్ది భిన్నంగా ఉంటయి. ధనుష్కోడి అనే ఒక పౌరాణిక స్థలమున్నది ఇక్కడ. పౌరాణికంగా దాని ఉచ్ఛారణ “ధనుష్కోటి” అర్థం చేసుకుంటారనుకున్నాను.

  హాస్యానికి వ్యతిరేకిని కాదు. కానీ కొన్ని కొన్ని విషయాలలో హాస్యం అపహాస్యంగా ఉంటుంది. ఏమనుకోవద్దు కానీ మీ వ్యాఖ్య ఆ కోవకే చెందుతుంది.

 4. Snkr
  6:46 సా. వద్ద మార్చి 23, 2011

  మీరు మరీ ఇంతలా .. నాకేం తెలుసు? నా వ్యాఖ్య తీసేసి మీరు చండామార్కులవారనే సందేశాన్నివ్వండి. మీతో సీరియస్‌గా వుండడానికి ప్రయత్నిస్తా, గ్యారంటీ ఇవ్వలేను.

  :(( ఏడిచాను లేండి, మీరు శాంతించండి.

 5. 6:59 సా. వద్ద మార్చి 23, 2011

  అంతటి కితాబుకు నేను అర్హుడను కాను మాష్టారు. కాకపోతే “రామేశ్వరం” విషయంలో “ఛీ…యాక్” అన్న పదాలు ఇమిడినట్టుగా లేవు కదూ?

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s