ముంగిలి > పిచ్చాపాటి, రాజకీయం, శిరోభారం > నేనొక రాజకీయ నాయకుడిని అయి ఉంటే?

నేనొక రాజకీయ నాయకుడిని అయి ఉంటే?

“అయి ఉంటే?” అంటున్నానంటే, నేను కాదు కాబట్టి. ముందస్తుగా అ ముక్క చెబితే, ఎందుకైనా మంచిది; అలా పడుంటుందనిపించింది.

పొద్దున లేచింది మొదలు ఎప్పుడు పడుకుంటానో అప్పటి వరకు, పదవిలో ఉన్నవాడికో లేక రాజకీయ పలుకుబడి ఉన్నవాడికో ఊడిగంచేస్తూ, ఓ తొత్తులా పడుండాలి. ఏదో ఒక సభ లేక నిరసన లేదా ఆందోళణలవంటి వాటికి పిలవగానే వెళ్ళాలి. డబ్బు వస్తుందో రాదో తెలియదు.

నాకంటూ కొంత మంది అనుచరులుంటారు; కాబట్టి వారి అవసరాలను తీర్చడానికి నాకున్న వనరులనుంచి డబ్బు తీయడమో లేక ఎవరికో ఉపకారం చేస్తానని నమ్మబలికి వాడి నుండి డబ్బు లాగడమో చెయ్యాలి. అలా డబ్బు ఇచ్చిన వాడి పని కోసం నాకున్న కాస్తో కూస్తో పలుకుబడిని వినియోగించడమో లేక తగిన పలుకుబడి ఉన్నవాడి కాళ్ళు పట్టుకోడమో చెయ్యాలి. పని జరిగితే కాలరెగరేసుకుంటూ తిరగొచ్చు; అవ్వకపోతే అలా విషయాన్ని సాగదీస్తూ డబ్బిచ్చిన వాడికి సర్దిచెబుతూ ఉండాలి.

ఏ పనీ-పాటా లేకపోయినా, ఏదో ఒక పనున్నట్లు కనబడుతుండాలి. తెల్ల బట్టలు, ఓ బంగారు నెక్లెసు, నుదుటిమీద తిలకం అద్ది అందరూ నన్ను రాజకీయ నాయకుడు అనుకునేలా కనపడాలి. పోలీస్ స్టేషన్, పేరుగల గూండాలు, వార్తా ఛానళ్ళవారు, లాయర్లు వంటి వారితో ఏదో రకంగా సత్సంబందాలు వెలగబెట్టాలి.

నా పలుకుబడి పెంచుకోడానికి అవకాసం కలిసొస్తే ఆందోళణలలో పాల్గొంటూ, ఎదో ఒక కారణానికి జైళ్ళకు గట్రా వెళుతుండాలి. అలా అరెష్ట్ అయినపుడు నన్ను టివీ వాళ్ళు చిత్రీకరించారో లేదోనని కాస్తంత తహ తహ. ఒకవేళ చిత్రీకరిస్తే, ఎప్పుడు వస్తుందో, చూడవలసిన వారు చూస్తారో లేదో అనే ప్రశ్నలు.

ఏ ఉగాదికో, సంక్రాంతికో, కొత్త సంవత్సరం సంధర్భంగా పోష్టర్లు వేయించాలి. వాటిలో నా బొమ్మతో పాటు నాకు తెలిసిన వారివి, పరిచయంలేని పైవారివి కూడా ఫోటోలు పెట్టాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలతోపాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జత చేస్తే డబ్బు పొదుపుగా వాడటమే కాకుండా పోష్టర్ కూడా ఎక్కువ కాలం కలిసివస్తుంది.

ప్రజల మనిషిని అనిపిచ్చుకోవాలి కాబట్టి ఎక్కడ ఎవరికి కష్టమొచ్చినా, ఆదుకునే వాడిలా కనపడాలి. అవసరమైనపుడు ధర్నాలు గట్రా చేయ్యాలి.

మాది అధికార పక్షమైతే ప్రజారంజక కార్యక్రమాలలో నాలాంటి ఇతరులతో పోటీ పడి ఏది దొరికితే అది, ఎంత దొరికితే అంత నొక్కాలి. లేకపోతే నా ఖర్చులెలా నెట్టుకు రావాలి? మాది అధికార పక్షం కాకపోతే, నా లాంటి అధికార పక్షంలో ఉన్నావాళ్ళని చూస్తే కడుపు మండి వాళ్లని దుమ్మెత్తి పొయ్యాలి. మా రోజులు కూడా వస్తాయిలే అని నిరీక్షించాలి.

ఇక ఎన్నికలొస్తే, నా కష్టాలు ఏమని చెప్పను? నయానో-భయానో వాళ్ళని-వీళ్ళని బుజ్జగించో-బెదిరించో ఎంతో కొంత చందాలు వసూలు చెయ్యాలి. నాకున్న ఆర్థిక వనరులనుంచి కూడా కొంత తీసి పెట్టుబడి పెట్టాలి. పార్టీ ఆఫీసులో పేరురావాలంటే, మా ఏరియాలో మా పార్టీకి ఓట్లు బాగా పడాలి కదా?

ఈ ప్రజలు ఈ మధ్య తెలివి మరిగి ఎన్నికల సమయంలో ఎంత దండుకోవచ్చో అంత, మా రాజకీయ నాయకుల వద్దనుండి దండుకుంటున్నారు. ఇంత ఖర్చు పెట్టినా, మాకే ఓటు వేస్తారో లేదో గ్యారంటీ లేదు. మీటింగులకు వీళ్ళని తరలించాలంటే ఎంతటి కష్టమో మీకేం తెలుసు? బ్రతిమాలో, బెదిరించో వీళ్లకి బిర్యానీ, మందు, డబ్బు ఎర చూపాలి. అలా ఒప్పుకున్న వాళ్ళని లారీలలో తరలించాలి. ఇంతా చేసి, మా నాయకులనుంచి “ఇంత తక్కువ మందేనా” అంటు వేసే అక్షింతలు బోనస్. చచ్చే చావనుకోండి. ఇక వేదికల ఖర్చులు, పోలీసులకు శాంతులు, జర్నలిష్టులకు సపర్యలు…తల ప్రాణం తోకకొస్తుందనుకోండి. ఎన్నికల లెంక్కింపులు జరుగుతున్నప్పుడు, కేంద్రాలలో కుక్కల్లా కాపలా కాయాలి. ఓడితే అక్కడితో సరనుకోండి. ఎవడి కొంపకు వాళ్ళు చేరుకొని మా ఆహానికి తగిలిన దెబ్బల్ని నాక్కుంటూ, ఈ మోసకారి ప్రజలను తిట్టుకుంటూ మరో ఐదేళ్ళపాటు నిరీక్షించాలి.

గెలిస్తే, అదో విచిత్రమైన తలనొప్పి. మా నాయకుణ్ణి ఊరేగించి విజయోత్సాహాలు జరుపుకోవాలి. ఏఁ తక్కువ ఖర్చనుకుంటున్నారా? గెలిచిన మా నాయకుడి దృష్టిలో పడి మా వంతు గుర్తింపు త్వరగా పొందాలి. లేకపోతే ఏమీ సంభంధంలేని గుంట నక్కలు పక్కనే కాచుకూర్చోనుంటారు. తరువాత మా నాయకుడికి మంచి పదవి రావాలని మేము, మా లాంటి ఇతరులు మా నాయకుడి వెంట రాజధానిలో విషయం తేలే వరకు మకాం వేయాలి. ఎక్కడ దొరికితే అక్కడ కాపురంపేట్టి మా నాయకుడి వెంటే ఆయన ప్రజా బలం ఏంటో చూపించడానికి అలా నీడలా వెంటే ఉండాలి. ఇంతలో పోలీసుల గోడవ ఒకటి. సెక్యూరిటీ అని, రద్దీ అని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తుంటారు. అబ్బో అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది వీడు ఓడితే బాగుణ్ణేమో అని. ఈ దిక్కుమాలిన కష్టాలు తప్పేవి కదా!

ఇలా అంచెలంచలుగా ఒక్కొక్క మెట్టెక్కాలి. నా ప్రాణ స్నేహితుడు, రక్త సంభందీకుడు అనే తేడా లేకుండా ఎంతో మందిని తొక్కుకుంటూ పోతేగాని ఎదగలేము. రాజకీయాలలోకి రావాలంటే ఏమన్నా అర్హతలా పాడా? ఎవడు పడితే వాడు దూరొచ్చు. అందుకే మాకు కాంపిటీషన్ ఎక్కువ. పది మందిని తొక్కితే కానీ ఒక్క ఆడుగు కూడా ముందుకెళ్ళలేము.

ఇష్టమున్నా లేకపోయినా, ఇలా ఎందరినో తొక్కుకుంటూ, శత్రువుల సంఖ్య పెంచుకుంటూ బయటకు రాలేని ఒక ఉచ్చులో తెలీకుండానే చిక్కుకుంటూ పోతాము. మా చుట్టూ తిరిగే వాళ్ళు మమ్మల్నభిమానించి తిరిగే వాళ్ళు కాదు. ఎలాగయితే మా రాజకీయ జీవితారంభంలో ఇష్టమున్నా లేకపోయినా వెధవల్లాంటి మా అప్పటి నాయకుల చుట్టూ తిరిగామో మా చుట్టూ తిరిగే వాళ్ళు కూడా అంతే.

మాకు పదవి ఉంటేనే విలువ. లేకపోతే మా నీడలా మమ్మల్నంటుకొని తిరిగిన వాళ్ళు కూడా కనపడకుండా పోతారు. పదవి లేకపోతే పాత శత్రువులందరూ మూకుమ్మడిగా మీద పడి మమ్మల్ని పీక్కుతింటారు. పదవిలోకి రావడం ఒక ఎత్తయితే, దాన్ని నిలబెట్టుకోవడం మరొకటి. ఒక్క సారి పదవి పోయిందంటే డబ్బు, పరపతి, గౌరవం, ప్రతిష్ఠ అన్నీ పోతాయి. అందుకే పదవిలో ఉన్నప్పుడే ఎంత దొరికితే అంత డబ్బు నొక్కేయాలి. మాకేమన్నా పింఛన్లా పాడా? పరపతికోసమో లేక మా కులం వారికో లేక ఇతరత్రా పనికి వచ్చే వారికో కాంట్రాక్టులు గట్రాలు ఇప్పించాలి. ఏమో కష్టకాలంలో వీళ్ళేమన్నా ఆదుకుంటారేమో? అదీకాక నేను గెలవడానికి డబ్బు రూపేణా, శ్రమ రూపేణా వీళ్ళు పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలం ఆశించడం సబబే కదా? పదవిలో ఉన్నప్పుడు మొండి చెయ్యి చూపిస్తే వచ్చేసారి మళ్ళీ సాయం చేస్తారా? పన్లో పనిగా ఉన్న వ్యాపారానికో లేక కొత్తగా మొదలుపెట్టిన వ్యవహారానికో ఎంత కుదిరితే అంత అధారాన్ని ఏర్పరుచుకుంటే ముందు ముందు పనికొస్తుందనే ఆశ.

నా దగ్గిర నానా గడ్డి తిని సంపాదించిన పవర్ ఉంది. దానిని వాడుకోవాలని అందరూ ప్రయత్నిస్తారు. మరి దానికి తగ్గ రుసుము చెల్లించుకోవలసిందే కదా? అలా అక్రమార్జిత డబ్బు రుచి మరిగి, అవసరమున్నా లేకపోయినా ప్రతిదానికి డబ్బు ఆశించడం అలవాటయిపొతుంది. డబ్బెవరికి చేదు చెప్పండి? అలా లెక్కకు అందనంత కూడబెట్టుకుంటూ ఎక్కడ దాచుకోవాలో తెలియక “దగ్గిర వాళ్ళు” అనుకున్న వారి వద్ద దాచిపెట్టడం మొదలు పెడతా. బేనామీ పేర్లతో భూములు కొంటాను, స్టాక్ మార్కెట్ లో పెడతాను, ఇతరుల వ్యాపారాలలో పెడతాను, చివరికి చిన్నమొత్తాల పొదుపుల్లో కూడా పెడతా. ఎక్కడ పెట్టాలో అర్థంకాక సతమతమవుతుంటే, స్విస్ బ్యాంకుల వంటివాటిలో పెట్టే సౌలభ్యం గురించి తెలిసి హవాలా అనుకోండి మరొకటి అనుకోండి; నా డబ్బును వాటిలో భద్ర పరుస్తా.

కానీ ఇక్కడే ఒక తిరకాసుంది. లెక్కకు లేనంత సంపాదించినా, ఎందుకూ పనికిరాకుండా ఉంటుంది. కట్టుకోడానికి మంచి మంచి బట్టలు కొనలేను. నా దగ్గిర ఫోర్బ్స్ మ్యాగజైన్ లోని సంపన్నుల జాబితాలో చేర్చబడటానికి సరిపడా డబ్బున్నా, ఎవరికీ నా అస్తి గురించి బహిరంగంగా చెప్పలేను. డయాబిటీస్, బ్లడ్ ప్రెషర్ వంటి రోగాల కారణంగా సరిగా తినలేను. లివర్ కొంచెం చెడడంవల్ల మందు తాగడమూ కష్టమే. తిండి తక్కువ మందులెక్కువ. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఇరవైనాలుగ్గంటలూ టెన్షనే. ఓ గంపెడు కేసులు ఎప్పుడూ అలా నడుస్తుంటాయి. టీవీ వాళ్ళు ఏ “స్టింగ్ ఆపరేషన్” చేస్తున్నారో అని మరో భయం. ఎదుగుతున్న సమయంలో అనాలోచితంగా చేసిన తప్పులు ఎప్పుడు కాటేస్తాయో అని బెంగ. ఇళ్ళమీద ఎప్పుడు రైడ్లు జరుగుతాయో అని విపరీతమైన భయం. ఏ తప్పుడుపని చేస్తూ పట్టుబడతానో అని ఎప్పుడూ, అన్నిటినీ, అందరినీ అనుమానిస్తూనే బతుకుతుంటా. అసలు కంటినిండా నిద్ర పోవడమంటే ఏమిటో పూర్తిగా మరిచిపోయాను.

అడ్డూ-ఆపు లేకుండా పెరిగిన సంతానం ఎందుకూ పనికిరాకుండా తయారయ్యారు. చదువును అటకెక్కించి అమ్మాయిలూ, మందు, డ్రగ్స్, జూదం వంటి అన్ని దిక్కుమాలిన అలవాట్లు అలవర్చుకున్నారు. నేను పడ్డ కష్టాలు వీళ్ళకేం తెలుసు? కానీ కేసులు గట్రాలలో ఇరుకున్నప్పుడు తప్పదు కదా? నా పవర్ వినియోగించి వారిని ఎలాగోలా బయటకు తెస్తుంటా. సంతానానికి పనికిరాకపోతే ఇంతటి పవర్ ఎందుకండి?

ఇంతకీ నేను చుప్పొచ్చేదేంటటే, నేను ఓ పెంపుడు కుక్కలా కాక ఓ వీధి కుక్కలా పెరిగిన వాణ్ణి. అవకాశం దొరికితే వాడుకోవాలని ఈ సమాజమే నాకు నేర్పింది. నేను ఎదిగి పవర్ లో ఉన్నప్పుడే మీకు నా గురించి తెలుసు. కానీ అలా ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డనో ఎవరూ పట్టించుకోరు. మాకేమన్నా తరగతులా, కళాశాలలా? జీవితం నేర్పిన పాఠాలే దిక్కు.

ఇక్కడ గమనించవలసిన ఓ ముఖ్య విషయముంది. మా రాజకియ నాయకులను ఎప్పుడూ అందరూ దుమ్మెత్తిపోస్తుంటారు. అవినీతిపరులమని, లంచగోండివాళ్ళమని… నిజం చెప్పండి. మా సిఫారసులకోసం మీలో ఎంత మంది మా చుట్టూ తిరగరు? ఉద్యోగానికనో, ప్రమోషన్ల కోసమనో చివరికి తిరుమలలో కాటేజీ కోసం కూడా. మేము అవినీతిపరులమైతే, మా పేరు చెప్పుకొని చెలామణీ అయ్యే మీలోని సామాన్యులను ఏమనాలి? కొందరు కొందరైతే ఏదో ఒక సంధర్భంలో ఓ ఫోటో దిగి, దాన్ని వేళ్ళాడదీసి మాతో ఏదో సంబందం ఉందని సమాజంలో లేనిపోని డాంబికాలు ప్రదర్శిస్తుంటారు. పాఠశాలల వార్షికోత్సవాలకని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తారు. తెలుసులెండి ఇవన్నీ మామీద గౌరవంతో కాదని. అలా మేమొస్తే మీ పలుకుబడి పెరిగి మీ స్కూళ్ళ వ్యాపారాలు బాగా సాగాలనే కదా?

పోనీ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. దేశానికి ఏమన్నా చేద్దామా అని. కానీ వెంటనే కొందరు కొందరి చరిత్రలు గుర్తొచ్చి మిమ్మల్ని నమ్మడం కుదరక మళ్ళీ మా మామూలు స్థితికి వెళ్ళిపోతుంటాము. మన దేశ దశ తిరగడానికి మూల కారణమైన పీ.వీ.నరసింహారావుగారిని ఎలా పట్టించుకోకుండా వదిలేశారు? గోద్రా అనే ఒకే ఒక్క తప్పు చేసిన పాపానికి నరేంద్రమోడీ చేస్తున్న ఎన్ని మంచి పనులను మీరు గుర్తించారు? మీకు జ్ఞాపక శక్తి తక్కువ. మంచి చేసినా, చెడు చేసినా అలా ఓ రెండ్రోజులు గుర్తుంచుకోని మూడో రోజుకల్లా మరుస్తారు. అలాంటపుడు కష్టపడి మంచి చేయడం కన్నా మాకు లాభించే చెడు చేయడమే తెలివున్న పనా కాదా?

ఇంకా చెప్పాలంటే, మేము చేస్తే అవినీతి. మీరు చేస్తే నీతా? ఇంటర్నెట్ లో సినిమాలు, పాటలు డౌన్లోడ్ చేయడం తప్పుకాదా? అడ్డదారిలో ఉద్యోగాలు, ప్రమోషన్లు పొందడానికి మా నుంచి సిఫారసులు అర్థించడం సరైన పద్దతా? వీధులూడ్చే మున్సిపల్ సిబ్బంది వారానికి మిమ్మల్ని డబ్బు అర్థిస్తే అది లంచం కిందకి రాదా? ఏఁ పది రూపాయలైనా, పది లక్షలైనా డబ్బు డబ్బే కదా? చివరికి మంచినీటి కుళాయిలనుకూడా దొంగతనం చేస్తుంటారే మీలోని సామాన్యులు; వాళ్ళమీద మీకెందుకు మామీదొచ్చినంత కోపం రాదు? మీలోని ఎంతమంది ప్రభుత్వోద్యోగులు జీతానికి తగినంత పని చేస్తున్నారు? మీలోని ఎంత మంది వ్యాపారులు పూర్తిగా పన్నులు చెల్లిస్తారు? మీలో అందరూ పంక్తిలో నిరీక్షించే ఒపిక ఉన్నవాళ్ళేనా? అలా అడ్డదారిలో ముందుకేళ్ళడానికి నిర్మొహమాటంగా లంచాల ఆశ చుపించరూ? మాకో నీతి, మీకో నీతా? అయినా మేమేమన్నా వేరే గ్రహాలనుంచి ఊడిపడ్డమా లేక ఇతర దేశాలకు చెందిన వాళ్ళమా? మీలో పుట్టి పెరిగిన వాళ్ళమేగా? మరెందుకండి మీకు మేమంటే అంత అసహ్యం, అయిష్టం?

కాస్త ఆలోచించండి.

ప్రకటనలు
  1. 12:57 ఉద. వద్ద ఏప్రిల్ 23, 2011

    🙂

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s