ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి > అక్షయ తృతీయనాడు బంగారం కొనాలా?

అక్షయ తృతీయనాడు బంగారం కొనాలా?

కాదు. బంగారం దానం చేయాలంటే నమ్ముతారా?

హోరెత్తే విధంగా వాణిజ్య ప్రకటనలతో అక్షయ తృతీయ వైశిష్ట్యాన్ని తలక్రిందులుగా మార్చేశారు. చాలామంది అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారాన్ని కొన్నా అది సంవత్సరమంతా ఆ వ్యక్తికి సంపదను, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇది “అబద్దం” అనే ఆధారం ఎక్కడా దొరకకపోయినా, వైశాఖ శుక్ల తదియ (తృతీయ) నాడు ఎలాంటి కార్యాలు చేయాలో పురాణాదులలో తెలియజేయడం జరిగింది. కొన్ని విశేషాలు…

వైశాఖ మాస ప్రాశస్త్యం

పన్నెండు మాసాలలో కార్తీక, మాఘ, మార్గశిర మరియూ వైశాక మాసాలు చాలా పుణ్యప్రదమైనవి, శుభప్రదమైనవి. స్కాంద పురాణంలోని వైష్ణవఖండాతర్గత ధర్మసూత్రాలననుసరించి యుగాలన్నిటిలోకి కృతయుగం, తీర్థజలాలలో గంగ, దానాలన్నిటిలో జలదానం మరియూ మాసాలన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమమైనవని చెప్పబడింది. ఈ మాసానికి మరోపేరు “మాధవమాసం”. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తం (నక్షత్ర దర్శనమైన తరువాత భోజనం చేయడం), అయాచితంగా భూజించడం ఉత్తమం. చలివేంద్రాలు, పళ్లరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలను నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం బహుపుణ్యఫల ప్రదాయకం. ఈ నెలలో శివుని అభిషేకించడం, సంతతధారగా నీరుపడేలా శివలింగానికి ధారాపాత్ర ఏర్పాటు చేయడం శుభఫలాలనిస్తుంది. లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువును పూజించే వారికి సకల శుభాలు కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయని విష్ణుపురాణం పేర్కొంటుంది.

అక్షయ తృతీయ

ఇటువంటి గొప్పమాసంలో వచ్చే మొదటి (శుక్ల, శుద్ధ) తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. పద్దతి ప్రకారమైతే, ఉదయమే అభ్యంగన స్నానంచేసి యవలు, గోధుమలు, పెసలు, శెనగలు మొదలైనవాటిని దానం చేస్తారు. పెరుగన్నం కూడా కొందరు దానం చేస్తారు. అలా చేసినట్లైతే శాశ్వతంగా కైలాసంలో స్థానం లభిస్తుందని భవిష్యపురాణం, దేవీ పురాణాలలో ఉందట. పితృదేవతలకు “పిండరహితమైన” శ్రాద్ధం చేయాలి. ఈ వ్రతంచేసేవారు ఉప్పును తినకుండా ఉండి చక్కెర కలిపిన పేలాల పిండిని తీసుకుంటారు.

ఈ రోజున చేసిన జపాలు, హోమాలు, పితృతర్పణాదులు అక్షయమౌతాయని స్మృతి గ్రంథాలు పేర్కొన్నాయట. గోడుగు, చెప్పులు, గోవు, భూమి, బంగారం, వస్త్రాలు, నీరు నిండిన ఘటము దానంచేస్తే ఎంతో పుణ్యమని భవిష్య పురాణ వచనం. ఈ రోజున గంగా స్నానం లేదా నదీ స్నానం లేదా సముద్ర స్నానాలు విశేష ఫలాన్నిస్తాయి.

శ్లో|| అస్యాం తిథౌ క్షయ ముపైతి హుతం న దత్తం తేనాఽక్షయేతి కథితా మునిభిస్తృతీయా |
      ఉద్దిశ్య య త్సురపిత్రూన్ క్రియతే మనుష్యైః తచ్చాఽక్ష్యయం భరత భారత సర్వమేవ ||

ఈనాడు చేసే పుణ్యకార్యాలు క్షయం కాకుండా వుంటాయనే దీన్ని “అక్షయ తృతీయ” అన్నారని శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు తెలిపారట.

శ్లో|| యః కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం |
      వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరమ్ ||

ఈ రోజున నారాయణునికి చందన లేపనం చేయడం వల్ల, విష్ణుమందిరవాసం లభిస్తుందని స్కాంద పురాణంలో రాజర్షి అంబరీషునికి నారదుడు వివరీంచినట్టు పేర్కొనబడింది. మన రాష్ట్రంలోని సింహాచల పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీవరాహ నరసింహస్వామి వారికి చందనోత్సవం చేస్తారు. ఉగ్రమూర్తి అయిన నారసింహుడిని శాంతింపజేసేందుకు మూలవిరాట్టుకి చందనం పొరలు పొరలుగా పూయటం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం. అందువల్ల విగ్రహం చందనంతో పూయబడి లింగాకృతిని పొందుతుంది. అక్షయ తృతీయనాడు మాత్రం గంధపు పొరలను తొలగించి, అభిషేకాదులు జరిపి కొన్ని గంటలు స్వామివారి నిజరూప దర్శనాన్ని అనుమతిస్తారు.

బదరీనాథ్ మందిర ద్వారాలను ఈరోజునే తెరుస్తారు.

బంగారం కొనాలా వద్దా?

ముందే చెప్పినట్టు, బంగారం కొనకూడదు అని ఎక్కడా చెప్పినట్టుగా కనిపించలేదు. కాకపోతే దానం చేయాలి అనైతే ఉటంకింపబడింది. కాబట్టి ఈ టపాను చదివారు కాబట్టి ఇప్పటినుండి బంగారం కొనకుండా దానాలు, జపాలు, ఉపవాసాలు గట్రాలు మాత్రమే చెయ్యాలి సుమా అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు; చెప్పినా పట్టించుకునేవాళ్ళుంటారనీ అనుకోను. అసలు కథేంటి, మన ప్రస్తుత వ్యవహారమేంటి అని మీముందు కొన్ని విశేషాలు ప్రస్తావించడమే ఉద్దేశ్యం.

జోతిష్య శాస్త్రంలోని “ద్విపుష్కర”, “త్రిపుష్కర” యోగాల గురించి అంతగా అవగాహన లేకపోవడం ఒకిందుకు మంచిదే అనిపిస్తుంటుంది. ఇవిగానీ ప్రాచుర్యంలోకి వస్తే అక్షయ తృతీయ ఎ పాటి? అమ్మకందారుల ధాటికి పిచ్చెక్కిపోయుండేది.

ప్రకటనలు
  1. 1:03 ఉద. వద్ద మే 5, 2011

    super post.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s