ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి > విశ్వామిత్ర వృత్తాంతం – మొదటి భాగం

విశ్వామిత్ర వృత్తాంతం – మొదటి భాగం

విశ్వామిత్రుడి గాధ నాకు ఎంతగానో నచ్చుతుంది. క్షత్రియ వంశములో పుట్టిన ఈ మహాత్ముడు ఒక రాజుగా ఉన్నప్పుడు వసిష్ఠాశ్రమంలో ఒకానొక సంధర్భములో దురాశ, గర్వం, మితిమీరిన కోపం, అవతలివారిని తక్కువగా అంచనా వేయటం వంటి భావనలకులోనై తన సర్వస్వాని కోల్పోతాడు. పగబట్టి ఎలాగైనా కక్షసాధించుకోవాలని ప్రయత్నించి మళ్ళీ భంగపడతాడు. ఐనా పట్టు వదలక ఎన్నో లోభాలకు లొంగి, మళ్ళీ తేరుకొని, తాను ఎన్నుకున్న దారిలో పట్టువదలక ప్రయాణం చేసి కోరుకున్న సిద్ధిని పొంది బ్రహ్మర్షిగా పేరు తెచ్చుకుంటాడు. ఈయన పుణ్యమేమో గాని, శ్రీ రామ చంద్రుని గురువై పిదప శ్రీ రామ కళ్యాణ ఘట్టంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కాలంలో కూడా మనలో ఎందరో ఇటువంటి భావనలనకు లోనవుతూ ఉంటారు. కానీ ఈయనలా పట్టుదల బహుకొద్దిమందికే ఉంటుంది.

నా మిడి మిడి జ్ఞానాన్ని ప్రదర్శించకుండా వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ, బాలకాండలో నుండి యథాతధంగా కాస్తంత శ్రమపడి ఆ మహనీయుడి వృత్తాంతం రెండు మూడు టపాలలో పొందుపరచాలని ప్రయత్నం.

బాలకాండ – 51వ సర్గ

కుశుడు అను మహారాజు ప్రజాపతి కుమారుడు. అతని పుత్రుడైన కుశనాభుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి. సుప్రసిద్ధుడైన ‘గాధి’ కుశనాభుని సుతుడు. ఆ గాధినందనుడే మహాతేజస్వియైన విశ్వామిత్రుడు. మహా బలసంపన్నుడైన విశ్వామిత్రుడు చతురంగబలములను సమకూర్చుకొని, ఒకానొకప్పుడు ఒక అక్షౌహిణీ సైన్యముతో భూమండలమును చుట్టివచ్చెను. అతడు నగరములను, రాష్ట్రములను, నదులను, పర్వతములను దాటుచు వసిష్ఠుని అశ్రమమునకు విచ్చేసెను. ఆ ఆశ్రమము వివిధములగు వృక్షములతో కళకళలాడుచుండెను. అచట నానావిధములైన వన్యమృగములు తిరుగాడుచుండెను. అచట సిద్ధులు చారణులు నివసించుచుండిరి. దేవదానవ గంధర్వులతో, కిన్నరులతో అది శోభిల్లుచుండెను. ప్రశాంతముగానున్న ఆ ఆశ్రమమున లేళ్ళగుంపులు హాయిగా మసలుచుండెను. పక్షులు కిలకిలారావములతో అది మనోహరముగానుండెను.

బ్రహ్మర్షులు, దేవర్షులు అందు తమతపోజీవన విధానములను కొనసాగించుచుండిరి. అక్కడి ఋషులందరును తపస్సిద్ధి సంపన్నులు, అగ్నివలే తేజో మూర్తులు. ఆ మహాత్ములలో కొందఱికి జలములు మాత్రమే ఆహారము. మఱి కొందఱి ఆహారము వాయువు మాత్రమే. ఇంకనూ కొందరు పండిరాలిన ఆకులను మాత్రమే భుజించుచుందురు. పండ్లు, దుంపలు మాత్రమే కొందఱికి ఆహారము, వారు మనో నిగ్రహము గలవారు, రాగద్వేషములకు అతీతులు, జితేంద్రియులు. బ్రహ్మదేవుని పుత్రులైన వాలఖిల్యులు, వైఖానసులు, అచట జపహోమతత్పరులైయుండిరి. ఆ వసిష్ఠాశ్రమము మఱియొక బ్రహ్మలోకమా అనునట్లు విరాజిల్లు చుండెను.

విజేతలలో శ్రేష్ఠుడును, మహా బలశాలియు ఐన విశ్వామిత్రుడు దానిని దర్శించెను.

బాలకాండ – 52వ సర్గ

గొప్పబలసంపన్నుడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమమును దర్శించి, ఎంతగానో సంతసించెను. అనంతరము ఆ మహావీరుడు మహాతపస్వియైన వసిష్ఠునకు ప్రణమిల్లెను. మహాత్ముడైన వసిష్ఠుడు ఆయనకు స్వాగత సత్కారములను జరిపి, ఆయనను ఉచితాసనమున అలంకరింపజేసెను. ప్రజ్ఞాశాలియగు విశ్వామిత్రుడు ఆసనమును అధిష్ఠించిన పిమ్మట, శాస్త్రమర్యాదలను అనుసరించి, వసిష్ఠుడు అతనికి ఫలమూలాదులతో అతిథిపూజలను నిర్వహించెను. మహా పరాక్రమశాలియు, రాజశ్రేష్ఠుడును ఐన విశ్వామిత్రుడు వసిష్ఠునినుండి అతిథిసత్కారములను అందుకొనిన పిమ్మట “మీ తపశ్చర్యలు, అగ్నికార్యములు నిర్విఘ్నముగా కొనసాగుచున్నవా? మీ శిష్యులు కుశలమే గదా? మీ వనవృక్షములు పుష్పఫలశోభితములే గదా!” అని ఆ మహర్షిని ప్రశ్నించెను. అంతట వసిష్ఠుడును ఆ ‘అందరును కుశలమే’ అనిమహారాజుతో నుడివెను. బ్రహ్మసుతుడును, జపతపస్సంపన్నుడును ఐన వసిష్ఠుడు సుఖాసీనుడైయున్న విశ్వామిత్ర మహారాజును ఇట్లడిగెను. “ఓ మహారాజా! నీవు కుశలమే గదా! ధార్మికుడవైన ఓ వీరా! రాజవృత్తిని అనుసరించి ధర్మముగా ప్రజానురంజకముగా పాలించుచున్నావా? నీ బృత్యులను చక్కగా పోషించుచున్నావా? వారు రాజశాశనములను బాగుగా నడుపుచున్నారా? ఓ శత్రుమర్ధనా! నీ శత్రువులనందఱిని జయించితివా? ఓ పరంతపా! నరశ్రేష్ఠ! పుణ్యమూర్తీ! నీ చతురంగబలములు దృఢముగా ఉన్నవా? నీ ధనాగారములు సురక్షితములేనా? నీ మిత్రులు, పుత్త్రులు, పౌత్త్రులు కుశలమే గదా?”

మహాబలశాలియైన విశ్వామిత్రుడు వసిష్ఠమహర్షితో ‘అందరును కుశలమే’ అని సవినయముగా పలికేను. ఆ ధర్మమూర్తులిద్దరును మిక్కిలి సంతుష్టులై, పరస్పర ప్రీతికరముగా చక్కని కథా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి. ఫలితముగా వారిలో ఆత్మీయత పెంపొందెను. కథాప్రసంగముల అనంతరము వసిష్ఠమహర్షి దరహాసముచేయుచు విశ్వామిత్రునితో ఇట్లనెను. “ఓ మహాబలశాలీ! సాటిలేనివాడవైన నీకును, నీ చతురంగబలములకును తగువిధముగా ఆతిథ్యమును ఇయ్యదలచితిని. దయతో స్వీకరింపుడు. పూజ్యుడవైన ఓ మహానుభావా! నేను సంకల్పించిన ఈ అతిథి సత్కారములను గ్రహింపుడు. నీవు మహారాజువు. ఉత్తముడైన అతిథివి, మాకు అవశ్యము పూజనీయుడవు.”

వసిష్ఠుడు ఇట్లు పలికినపిదప ప్రజ్ఞావంతుడగు విశ్వామిత్ర మహారాజు ‘మీ ప్రియ వచనములే మాకు సంతృప్తి గూర్చినవి. అవియే మాకు అతిథి సత్కారములు. – ఓ పూజ్య మహర్షీ! మీ దివ్య దర్శనము చేతను పాద్యములతోడను, ఆచమనీయములతోడను మీ ఆశ్రమమున లభించు ఫలమూలాదులతోడను, పూజార్హుడవైన నీవు మమ్ము సత్కరించితివి. నీకు నా నమస్కారములు. నా యేడ మిత్రభావమును చూపుము. వెళ్ళుటకు నాకు ఆజ్ఞనిమ్ము.’ ఇట్లు పలుకుచున్న మహారాజును, ధర్మాత్ముడు ఉదారబుద్ధిగలవాడును ఐన వసిష్ఠుడు ‘తన ఆతిథ్యమును స్వీకరించుటకై’ పదే పదే విశ్వామిత్రుని అభ్యర్థించెను.

అంతట ఆ గాదినందనుడు వసిష్ఠమహర్షియొక్క అభ్యర్థనను ఆమోదించుచు “ఓ మునీశ్వరా! మీ ఇష్టానుసారమే కానిండు” – అని పలికెను. విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా తాపసశ్రేష్ఠుడును మహాతేజస్వియు, మిక్కిలి పుణ్యాత్ముడును ఐన వసిష్ఠుడు సంతసించినవాడై, పలువన్నెలుగల కామధేనువును పిలిచెను.

‘చిత్రవర్ణములుగల ఓ కామధేనూ! ఇచటికి త్వరగా రమ్ము. నా మాట వినుము. సైన్యములతో, పరివారములతోగూడి విచ్చేసిన ఈ రాజుకు తగిన విధముగా భోజన సత్కారములను చేయదలచితిని. తగిన ఏర్పాట్లు చేయుము. ఓ కామధేనూ! నా మాటను నిలుపుటకై ఎవరెవరికి ఏది కావలయునో తదనుగుణముగా షడ్రసోపేతభోజనపదార్థములను సమృద్ధిగా శీఘ్రమే సమకూర్చుము. ఓ శబలా రుచికరములైన అన్నపానములతో, లేహ్య చోష్యములతో గూడిన అహారపదార్థములను అన్నీంటిని త్వరత్వరగా సృష్టింపుము.

బాలకాండ – 53వ సర్గ

వసిష్ఠుని అభ్యర్థనమేరకు కామధేనువు విశ్వామిత్రునకును, ఆయన అనుచరులకును వారివారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్థములను సమకూర్చెను. ఆ కామధేనువు చెరుకుగడలను, రసములను, తేనెలను, పేలాలను, మధురపానీయములను, ఆసవములను, శ్రేష్టమైన పానకములను, నానా విధములైన భక్ష్యములను సమకూర్చెను. పర్వతప్రమాణములో వేడివేడి అన్నపురాసులు, పాయసములు, సూపములు, పెరుగులు, పాలు, క్షణములో అచట సమృద్ధిగా సిద్ధమయ్యెను. నానా విధములైన మధురరసములు, షడ్రసములతో గూడిన భక్ష్యవిశేషములు, పాత్రలనిండా బెల్లపుపానకములతో గూడిన పెక్కు విధములగు తినుభండారములు మొదలగునవన్నియును కామధేనువు మహిమతో అక్కడ ప్రత్యక్షమయ్యెను. వసిష్ఠుడు సాదరముగా సమర్పించిన ఆతిథ్యముతో విశ్వామిత్రుని పరివారములన్నియును మిక్కిలి సంతృప్తిపడెను.

వసిష్ఠుని ఆదరాభిమానములకును, క్షణములో సమకూరిన అత్యద్భుతభోజనములకును విశ్వామిత్రుడు ఎంతయో సంతుష్టుడాయెను. రాజుగారి అంతఃపురజనులు, బ్రాహ్మణులు, పురోహితులు, ఆమాత్యులు, మంత్రులు, భృత్యులు మొదలగువారితోగూడిన విశ్వామిత్రప్రభువును వసిష్ఠుడు ఆదరించెను. అంతట పరమానందభరితుడైన విశ్వామిత్రుడు వసిష్ఠమహర్షితో ఇట్లు నుడివెను. “వాక్చతురుడవైన ఓ బ్రహ్మర్షీ! పూజార్హుడవైన నీచేత అతిథిసత్కారములతో ఆదరింపబడితిని. ఇక నాదొక మనవి ఆలకింపుడు. మీకు లక్షగోవులను సమర్పించెదను. మీ కామధేనువును నాకొసంగుడు. ఓ పూజ్యుడా! ఈ కామధేనువు ఒక గోరత్నము. రత్నములన్నియును రాజునకే చెందును. కనుక అది రాజునే చేరవలయును. అందువలన న్యాయముగా కామధేనువు నాదే. కనుక దీనిని నాకు ఇచ్చివేయుడు.”

విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా ధర్మాత్ముడు, పూజ్యుడు ఐన వసిష్ఠమహాముని ఆ రాజుతో ఇట్లు నుడివెను. “ఓ రాజా! లక్ష గోవులనిచ్చినను – అంతేకాదు శతకోటిధేనువులనిచ్చినను, అంత మాత్రమే గాదు బంగారు రాసులనిచ్చినను కామధేనువును మాత్రము ఇయ్యజాలను. ఇది నానుండి వేఱగుటకు వీలులేదు. ఏలనన, మాన్యులకు కీర్తివలె ఈ కామధేనువుతో నాకు విడదీయరాని సంబందము గలదు. నా హవ్యకవ్యములకును, అట్లే జీవనయాత్రకును ఇదియే ఆధారము. సాయం ప్రాతః కాలములయందు చేయు హోమములకును, భూతబలికిని, అట్లే ‘దర్శపూర్ణమాసాది’ అగ్ని కార్యములకును ఇదియే మూలము. ఈ కామధేనువుయొక్క పాలు, పెరుగు, నేయి మున్నగు వానిని స్వీకరించుట వలన చిత్తశుద్ధి ఏర్పడును. ప్రాణతృప్తి కలుగును, మనోదేహములకు బలము చేకూరును. ‘స్వాహా’, ‘వషట్‌’ అను మంత్రములు దీని ఆధీనములోనున్నవి. వేదశాస్త్రాది వివిధ విద్యలకు ఇది పెన్నిది. వేయేల! ఓ రాజా! నా సకలకార్యములకును నిస్సంశయముగా ఇదియే ఆధారము. నిజముగా ఇదియే నా సర్వస్వము, ఆనందదాయిని. కనుక ఓ రాజా! ఇంకను పెక్కు కారణములవలన ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను.”

వసిష్ఠమహాముని ఇట్లు పలికిన పిమ్మట మాటలనేర్పరియైన విశ్వామిత్రుడు మిక్కిలి కోపోద్రిక్తుడై ఇట్లనెను. “ఓ నిష్ఠాగరిష్ఠుడా! నడుమునందు బంగారు త్రాళ్ళతోడను, సువర్ణకంఠాభరణములతోడను, అంకుశములతోడను అలంకృతములైన పదునాలుగువేల ఏనుగులను ఇచ్చెదను. చిరుగంటలపట్టెడలతో అలంకరింపబడిన నాలుగేసి శ్వేతాశ్వములను పూన్చిన ఎనిమిది వందల బంగారు రథములను సమర్పించెదను. కాంభోజ, బాహ్లిక దేశములలో పుట్టి గంధర్వజాతికి చెందిన మిక్కిలి బలిష్ఠములగు పదునొకండువేల గుఱ్ఱములను నీకు ఇచ్చెదను. పలువన్నెలతో ఒకదానికంటే మరియొకటి మేలైన, వయసులోనున్న ఒకకోటి ఆవులను నీకు సమర్పింతును. ఈ కామధేనువునుమాత్రము నాకిమ్ము. ఓ బ్రాహ్మణోత్తమా! నీవు కోరినంత బంగారమును, రత్నాల రాసులను ఇచ్చెదను. ఈ కామధేనువును నాకిమ్ము.”

ధీశాలియైన విశ్వామిత్రుడు ఇట్లు నుడువగా అంతట వసిష్ఠ మహర్షి ‘ఓ రాజా! ఏట్టి పరిస్థితిలోను ఈ కామధేనువును నీకు ఇయ్యజాలను’ – అని పలికెను. “ఓ రాజా! ఇదియే నాకు రత్నాల గని, ధననిధి, నా సర్వస్వము ఇదియే, అంతేగాదు ఇది నా జీవనాధారము. దర్శపూర్ణమాసాది యాగములను, దక్షిణలతో గూడిన యజ్ఞములను, తదితర వివిధ పుణ్యకార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము. నా ఋషిజీవితసమస్త విధులకును ఈ కామధేనువే జీవగఱ్ఱ. ఇక పెక్కుమాటలతో పనిలేదు. సకల మనోరథములను ఈడేర్చే ఈ దివ్యధేనువును ఇయ్యనే ఇయ్యను.”

బాలకాండ – 54వ సర్గ

వసిష్ఠమహాముని కామధేనువును తనకిచ్చుటకు నిరాకరింపగా, అంతట విశ్వామిత్రుడు ఆ ధేనువును బలవంతముగా లాగుకొని పోసాగెను. మిక్కిలి బలశాలియైన రాజు ఆ విధముగా తీసుకొని పోవుచుండగా ఆ కామధేనువు తనలో దుఃఖశోకములు పెల్లుబుకుటతో కన్నీరు గార్చుచు ఇట్లు చింతింపసాగెను. “మహనీయుడైన వసిష్ఠుడు నన్ను పరిత్యజించెనా యేమి? మిక్కిలి దుఃఖితనై దైన్యమునకు లోనైన నన్ను ఈ రాజభటులు బలవంతముగా ఈడ్చుకొని పోవుచున్నారు. ఈ ధర్మాత్ముని మిక్కిలి భక్తితో సేవించుచుంటిని. ఈయనకు నాపై గల ప్రీతి అపారము. నేను నిరపరాధను. ఐననూ పవిత్రాత్ముడైన ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు. నేను చేసిన దోషమేమి? ఇట్లు చింతించుచు ఆ ధేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండెను. పిమ్మట వందలకొలదిగానున్న ఆ సైనుకులను విదుల్చుకొని, ఆ ధేనువు వాయువేగముతో వెళ్ళి, వసిష్టమహాముని పాదములనాశ్రయించెను. ఆ కామధేనువు వసిష్ఠుని యెదుట నిలిచి ఆర్త స్వరముతో ఏడ్చుచు మేఘ దుందుబి ధ్వనితో ఇట్లు విన్నవించెను. “ఓ బ్రహ్మ కుమారా! పూజ్య మహర్షీ! ఈ రాజభటులు నీనుండి నన్ను లాగుకొని పోవుచున్నారు. నీవు నన్ను పరిత్యజించితివా ఏమి?”

శొకముతో అలమటించుచున్న ఆ ధేనువుయొక్క మొఱవిని ఆ బ్రహ్మర్షి దుఃఖిత ఐన ఒక సోదరితోవలె ఆ శబలతో ఇట్లనెను. “ఓ శబలా! నిన్ను నేను త్యజించుట లేదు. నీవు నాకు ఇసుమంతయు అపకారము చేయలేదు. బలశాలియైన ఈ రాజే బలగర్వముతో మత్తిల్లి నా నుండి బలవంతముగా నిన్ను గొనిపోవుచున్నాడు. ఇతనితో సమానమైన బలము నాకు లేదు. ఇతడు బలశాలియైన రాజు, క్షత్రియుడు, మీదు మిక్కిలి భూమండలమునకు అధిపతి. తపోబలముతో రాజును దండింపరాదు. చతురంగబలసమన్వితమైన ఒక అక్షౌహిణీ సేనతో గూడియున్న ఇతడు మిక్కిలి శక్తిశాలి.”

వసిష్ఠుని మాటల ఆంతర్యమును గ్రహించి, ఆ కామధేనువు తేజోమూర్తియైన ఆ బ్రహ్మర్షితో సవినయముగా ఇట్లనెను. “ఓ బ్రహ్మర్షీ! నిజముగ క్షత్రియునిబలము బలమే కాదు. బ్రాహ్మణుని బలమే బలము. అది మిక్కిలి గొప్పది. అది దివ్యమైనది. క్షత్రియబలముకంటే మిన్నయైనది. విశ్వామిత్రుడు మహావీరుడే! కాదనను. కానీ నీ తపఃశక్తి తిరుగులేనిది. సాటిలేని బలశాలివైన నీముందు అతడు బలహీనుడే. ఓ మహాత్మా! నీ బ్రహ్మబలము నన్ను పరిపృష్టమొనర్చినది. నాకు ఆజ్ఞనిమ్ము. ఆ దురాత్ముని బలగర్వమును నేను చిత్తుచేసెదను.”

కామధేనువు ఇట్లు పలుకగా మహాయశస్వియైన వసిష్ఠుడు ‘శత్రుబలమును రూపుమాపగల సైన్యమును సృష్టింపుము’ అని ఆదేశించెను. ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆ దివ్యధేనువు సైన్యమును సృజించెను. ఆ ధేనువుయొక్క ‘హూంబారవము’ నుండి వందలకొలది పప్లవులు (మ్లేచ్ఛజాతి సైనుకులు) బయల్వెడలి విశ్వామిత్రుడు చూచుచుండగానే అతని బలములన్నింటిని నశింపజేయసాగిరి. తన బలములన్నియు హతమగుట చూచి విశ్వామిత్రుడు మిక్కిలి కృద్ధుడై రథమునదిరోహించెను. పిమ్మట రోషముతో కనులెఱ్ఱజేయుచు వివిధములగు శస్త్రములతో పప్లవులను హతమార్చెను. వందలకొలది పప్లవులు విశ్వామిత్రునిచేతిలో మసియైపోగా చూచి, ఆ ధేనువు కృద్ధయై వెంటనే శకులను, యవనులను అసంఖ్యాకముగా సృజించెను. శకులతో యవనులతో ఆ ప్రదేశమంతయు నిండిపోయెను. వారు మహావీరులు. మిక్కిలి ప్రభావశాలురు, సంపెంగకేసరములవలె భాసిల్లుచుండిరి. పొడవైన ఖడ్గములను, కత్తులను ధరించియుండిరి. అట్టి ఆ సైనికులు విశ్వామిత్రుని బలములన్నింటిని మహాగ్నిజ్వాలలవలె భస్మమొనర్చిరి. అంతట మహాబలశాలియైన విశ్వామిత్రుడు గొప్పశక్తిగల అస్త్రములను ప్రయోగింపగా యవనులు, కాంభోజులు, పప్లవులు అను మ్లేచ్ఛ జాతులవారు చెల్లాచెదరై పోయిరి.

బాలకాండ – 55వ సర్గ

విశ్వామిత్రుని అస్త్రప్రభావముచే వ్యాకులపాటునకు లోనైన ఆ సైనికులను జూచి, వసిష్ఠుడు, ‘ఓ కామధేనూ! నీ యోగ మహిమచే వీరులైన సైనికులను సృష్టింపుము’ అని ఆ ధేనువును ప్రోత్సహించెను. ఆ ధేనువు ‘హూంబారవము’ నుండి సూర్యతేజస్సుగల కాంభోజులు, పొదుగునుండి శస్త్రములను ధరించిన పప్లవులు పుట్టుకొని వచ్చిరి. యోనిప్రదేశమునుండి యవనులు, పురీషప్రదేశమునుండి శకులు, రోమకూపములనుండి మ్లేచ్ఛులు, హారీతులు, కిరాతులు ఉద్భవించిరి. ఆ పప్లవాది సైనికులచే విశ్వామిత్రుని చతురంగబలములన్నియును తత్‌క్షణమే నేలపాలాయెను.

మహాత్ముడైన వసిష్ఠునికారణముగా తమ సైన్యములు అన్నియును మసియైపోగా, విశ్వామిత్రుని వందమంది సుతులును మిక్కిలి క్రుద్ధులై వివిధములగు ఆయుధములను చేతబట్టి తపోధనుడైన వసిష్ఠునిపై దాడిచేసిరి. పూజ్యుడైన ఆ మహర్షి ఒక్క హూంకారముతో వారిని అందఱిని భస్మమొనర్చెను. విశ్వామిత్రుని పుత్రులతోపాటు వారి చతురంగబలములును మహాత్ముడైన వసిష్ఠునివలన క్షణకాలములో బుగ్గియైపోయెను. తన వందమంది కుమారులును, సమస్తబలములును సశించిపోవుట జూచి, సుప్రసిద్ధుడైన విశ్వామిత్రుడు సిగ్గుపడి మిగుల చింతాక్రాంతుడయ్యెను. సముద్రునివలె అతని వేగము చల్లారెను. అతడు కోఱలుతీసిన పామువలె శక్తిహీనుడయ్యెను, రాహుగ్రస్తసూర్యునివలె వెంటనే తేజోవిహీనుడయ్యెను. నూరుమంది పుత్రులును, సమస్త బలములును నశింపగా రెక్కలుతెగిన పక్షివలె దీనుడయ్యెను. అతని గర్వము అణగెను. ఉత్సాహము నీరుగారెను. నిర్వేదము ఆవరించెను. ‘క్షాత్ర ధర్మమును అనుసరించి, ఈ పుడమిని పాలింపుము’ అని విశ్వామిత్రుడు ఒక కుమారునకు రాజ్యభారమును అప్పగించి వనములకేగెను.

కిన్నరులు, నాగులు, సంచరించునట్టి హిమవత్పర్వత ప్రాంతమునకు చేరి, ఆ విశ్వామిత్రుడు పరమేశ్వరుని అనుగ్రహమును పొందుటకై తపస్సుచేయసాగెను.

పిమ్మట కొంతకాలమునకు వృషభద్వజుడు, వరదుడు ఐన పరమశివుడు మిక్కిలి పట్టుదలగల విశ్వామిత్రునకు దర్శనమిచ్చి ఇట్లనెను. “ఓ రాజా! నీవు ఎందులకు తపస్సు చేయుచుంటివి? నీ కోరికను దెలుపుము. నీయెడ ప్రసన్నుడనైతిని. నీ అభిమతమును ప్రకటింపుము.”

మహాతపస్వియైన విశ్వామిత్రుడు మహాదేవుని ప్రసన్న వచనములను విని ఆయనకు ప్రణమిల్లి, ఇట్లు విన్నవించుకొనెను. “ఓ పరమేశ్వరా! నా తపస్సు మీ మెప్పుబడసినచో సాంగోపాంగముగా ధనుర్విద్యను, ఉపనిషద్రహస్యములను నాకు ప్రసాదింపుడు. దేవతలు, దానవులు, మహర్షులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, మొదలగువారి యందుగల అస్త్రపటిమ నాకునూ అబ్బునట్లు అనుగ్రహింపుడు – ఓ దేవదేవా! ఇదియే నా కోరిక.”

అంతట పరమశివుడు ‘అట్లేయగుగాక’ అని పలికి అంతర్ధానమాయెను. మహా బలశాలియూ, రాజర్షియు ఐన విశ్వామిత్రుడు సహజముగనే గర్వముగలవాడు; దివ్యాస్త్రములను పొందుటవలన ఆయనగర్వము ఇంకనూ అధికమాయెను. పర్వకాలములందు సముద్రమువలె పరాక్రమవృద్ధితో అతడు పొంగిపోయెను. అప్పుడతడు “ఇక ఋషీశ్వరుడైన వసిష్టుడు హతుడైనట్లే” అని తలపోసెను.

పిమ్మట ఆ రాజు వసిష్ఠుని ఆశ్రమమునకువెళ్ళి, తన అస్త్రములను ప్రయోగించెను. ఆ అస్త్రములధాటికి ఆ తపోవనము పూర్తిగా దగ్ధమైపోయెను. శక్తిమంతుడైన విశ్వామిత్రుడు అట్లు అస్త్రములను ప్రయోగించుచుండుట చూచి, మునులందరును వసిష్ఠుని శిష్యులును గుంపులు గుంపులుగా నలుదిక్కులకును పరుగుదీసిరి. అట్లే వేలకొలది మృగములును, పక్షులును భయభ్రాంతులకు లోనై పాఱిపోయెను. మహాత్ముడైన వసిష్ఠుని ఆశ్రమమునందలి వృక్షములు, పొదలు ధ్వంశముకాగా అది శూన్యమయ్యెను. క్షణములో ఆ ప్రదేశమంతయును ఊషరక్షేత్రమును తలపింపజేసెను. అందు నిశ్శబ్ధము తాండవించెను.

అంతట వసిష్ఠుడు “భయపడకుడు, భయపడకుడు – సూర్యుడు మంచునువలె ఈ క్షణములోనే విశ్వామిత్రుని అంతరింపజేసెదను” అని అభయవచనములను పలుకుచున్నను వారు పాఱిపోవుచునే ఉండిరి. జపతపస్సంపన్నుడును, మహా తేజస్వియును ఐన వసిష్ఠుడు క్రుద్ధుడై విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. “ఓ మూర్ఖుడా! ఎంతో కాలమునుండి పూలమొక్కలతో, ఫలవృక్షములతో కలకలలాడుచున్న ఈ వనవాటికను ధ్వంసమొనర్చిన దురాచారుడవు నీవు. ఇక నీకు నూకలు చెల్లినట్లే” – అని పలికి, క్రోధావేశముతో వెంటనే – పొగలేని ప్రళయాగ్నివలెను, మఱియొక యమదండము వలెను ఒప్పుచున్న భయంకరమైన తన బ్రహ్మదండమును చేబూని నిలిచెను.

— సశేషం

Transliterated with Kacchapi

ప్రకటనలు
 1. 8:41 ఉద. వద్ద నవంబర్ 6, 2011

  mee opika ki dhanya vaadaalu

  chaala santhosham

  Jai Sri ram

 2. 12:32 సా. వద్ద నవంబర్ 7, 2011

  Dear sir ,
  with great patience you typed so mush matter. Dhanyavadamulu. chadivi chala santhoshinchanu.

 3. 4:17 సా. వద్ద నవంబర్ 7, 2011

  ధన్యవాదాలు. నిజానికి విశ్వామిత్ర వృత్తాంతం మునుపెన్నడో చదివి తెలుసుకున్నప్పటికి, ఇలా వ్రాస్త్రున్నప్పుడు కొత్త అనుభూతి. చదువుతున్నప్పుడు బహుశః కొన్ని కొన్ని విశేషాలు మనకు పూర్తిగా అవగతమవవేమో అనిపిస్తుంది. కానీ వ్రాయాల్సివచ్చినపుడు ఒక్కొక్క అక్షరం, పదం పట్టి పట్టి చదివి టైప్ చేయడంవల్ల ఇంకా బాగా అర్థమైతున్నదేమో అని అనిపిస్తోంది.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s