ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి > విశ్వామిత్ర వృత్తాంతం – రెండవ భాగము

విశ్వామిత్ర వృత్తాంతం – రెండవ భాగము

విశ్వామిత్ర వృత్తాంతం – మొదటి భాగం తరువాయి భాగము

బాలకాండ – 56వ సర్గ

ఇట్లు పలికిన వసిష్టునితో బలశాలియైన విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును సంధించి ‘నిలువుము నిలువుము’ అని హెచ్చరించెను. అప్పుడు పూజ్యుడైన వసిష్ఠుడు మరియొక యమదండమా యనునట్లున్న తన బ్రహ్మదండమును పైకెత్తి కోపముతో హూంకరించుచు ఇట్లు నుడివెను. “ఓ క్షత్రియాధమా! గాధిపుత్రా! ఇదిగో ఇక్కడనేయున్నాను. నీ బలమెంతడిదో చూపుము. నీ శస్త్రగర్వమును ఇప్పుడే అణచెదను. ఓ దుష్టక్షత్రియా! బ్రహ్మబలముముందు క్షత్రియ బలమెంత? దివ్యమైన నా బ్రహ్మబలమును చూడుము.”

విశ్వామిత్రుడు ప్రయోగించిన ఘోరమైన ఆగ్నేయాస్త్రము నీటిదెబ్బకు నిప్పువలె వసిష్ఠుని బ్రహ్మదండ ప్రభావమున నిస్తేజమయ్యెను. అందులకు కుపితుడైన విశ్వామిత్రుడు క్రమముగా వారుణాస్త్రమును, రౌద్రాస్త్రమును, ఐంద్రాస్త్రమును, పాశుపతమును, ఇషీకాస్త్రమును ప్రయోగించెను. ఇంకనూ అతడు మానవము, మోహనము, గాంధర్వము, స్వాపనము, జృంభణము, మాదనము, సంతాపనము, విలాపనము, శోషణము, దారణము, అజేయమైన వజ్రాస్త్రము, బ్రహ్మపాశము, కాలపాశము, వరుణపాశము, పైనాకము, దయితము, శుష్కాశని, ఆర్ద్రాశని, దండము, పైశాచము, క్రౌంచము – అను అస్త్రములను ధర్మచక్రమును, కాలచక్రమును, విష్ణుచక్రమును, వాయవ్యము,మథనము, హయశిరము – అను అస్త్రములను ప్రయోగించెను. ఇంకనూ కంకాళము, ముసలము అను శక్త్రిద్వయమును, వైద్యాధరమహాస్త్రమును, దారుణమైన కాలాస్త్రమును, ఘోరమైన త్రిశూలాస్త్రమును, కాపాలము, కంకణము మొదలగు సర్వాస్త్రములను జపనిష్ఠాగరిష్ఠుడైన వసిష్ఠ మహర్షిపై ప్రయోగించెను.

బ్రహ్మపుత్రుడైన వసిష్ఠమహామునియొక్కదండము ఆ అస్త్రములను అన్నింటిని అద్భుతావహముగా కబళించివేసెను. ఆ అస్త్రములన్నియును వమ్మైపోగా అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. ఆ బ్రహ్మాస్త్రవిజృభంణమును జూచి, అగ్ని మొదలగు దేవతలు, గంధర్వులు, నాగులు, మొదలగువారు భయభ్రాంతులైరి. ఇంకను ముల్లోకములును మిక్కిలి భయముతో వణకిపోయెను. వసిష్ఠమహర్షి తన బ్రహ్మతేజఃప్రభావమున మిక్కిలి భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రమునుగూడ బ్రహ్మదండముచే నిర్వీర్యమొనర్చెను. బ్రహ్మాస్త్రమును కబళించుచున్న మహాత్ముడైన వసిష్ఠుని రౌద్రరూపము చూడశక్యముగానిదై, స్మరించినంత మాత్రమున భయమును గొల్పునదై, ముల్లోకములను మూర్చిల్లజేయు చుండెను. మహానుభావుడైన వసిష్ఠునియొక్క రోమకూపములనుండి పొగతోనిండిన జ్వాలలు గల అగ్నికిరణములు బహిర్గతములగుచున్నట్లు ఉండెను. వసిష్ఠుడు చేతబట్టిన బ్రహ్మదండము పొగలేని ప్రళయాగ్నివలెను, మరియొక యమదండమురీతిగను ప్రజ్వరిల్లెను.

అనంతరము తపోధనుడైన వసిష్ఠుని స్తుతించుచు మునీశ్వరులు ఇట్లు పలికిరి – “ఓ బ్రహ్మర్షీ! నీ బలము అమోఘము. నీ మహిమతో ఈ బ్రహ్మాస్త్రతేజమును ఉపశమింపజేయుము. ఓ పూజ్యుడా! మహాతపశ్శాలియైన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ జపశ్రేష్ఠా! శాంతింపుము. ప్రసన్నుడవగుము. లోకముల బాధలను తొలగింపుము.”

మునులు ఇట్లు వేడుకొనగా మహాతపస్వియు, తేజశ్శాలియు ఐన వసిష్టుడు ప్రశాంతచిత్తుడయ్యెను. వసిష్ఠునిచేతిలో ఓటమిపాలైన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను. “ఛీ! క్షత్రియ బలముకూడా ఒక బలమా! బ్రహ్మతేజోబలమే నిజమైన బలము.

‘ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్‌’
‘dhigbalaṃ kṣatriyabalaṃ brahmatējōbalaṃ balamˈ’

ఒకే ఒక్క బ్రహ్మదండము నా అస్త్రములను అన్నింటిని వమ్ముగావించినది. ఇప్పుడు నాకు నిజమైన బలమేదో తేటతెల్లమైనది. బ్రహ్మత్వమును పొండుటకై అనగా బ్రహ్మర్షినగుటకై క్షత్రియరోషమును పరిత్యజించి, మనస్సును, ఇంద్రియములను నిగ్రహించి, తీవ్రముగా తపస్సును చేసెదను.”

బాలకాండ – 57వ సర్గ

మహాత్ముడైన వసిష్ఠునితో వైరము పూనుటవలన కలిగిన పరాభవమును గుర్తుచేసికొనుచు విశ్వామిత్రుడు మిక్కిలి పరితపింపసాగెను. పిదప అతడు పదే పదే నిట్టూర్చుచు పట్టమహిషితోగూడి దక్షినదిశకువెళ్ళి, ఫలమూలములను మాత్రమే ఆహారముగా గొనుచు, ఇంద్రియ నిగ్రహముతో మిక్కిలి తీవ్రమైన తపస్సును ఆచరించెను. అతడు వేయి సంవత్సరములు తీవ్రముగా తపస్సొనర్చినపిమ్మట సృష్టికర్తయైన బ్రహ్మ ప్రత్యక్షమై మహా తపసియైన ఆ విశ్వామిత్రునితో ఇట్లు నుడివెను. “ఓ కౌశికా! నీవు నీ తపశ్శక్త్రిచే రాజర్షులుపొందెడి లోకములను జయించితివి. నీవు ఆచరించిన ఈ తపశ్చర్యనుబట్టి నిన్ను ‘రాజర్షి’గా గుర్తించుచున్నాన్ను.”

లోకములు సృష్టించువాడును, మహాతేజస్వియు ఐన బ్రహ్మదేవుడు ఇట్లు పలికిన పిదప తన సత్యలోకమునకు వెళ్ళెను. ఆయనవెంట వచ్చిన దేవతలును దివికేగిరి. విశ్వామిత్రుడు బ్రహ్మవచనములను విని, సిగ్గుతో తలవంచుకొనెను. మఱియు తీవ్రమైన దుఃఖమునకులోనై, కోపముతో ఇట్లనుకొనెను. ‘నేనింతటి తీవ్రమైన తపస్సొనర్చినను సమస్తదేవతలును, ఋశీశ్వరులును నన్ను రాజర్షిగా మాత్రమే గుర్తించిరి. నా తపస్సునకు తగిన ఫలితము దక్కలేదనియే తలంతును.’ మహా తపస్వి ఐన విశ్వామిత్రుడు ఇట్లు తలపోసి, మునుపటికంటెను తీవ్రముగ తపస్సు చేయనారంబించెను.

ఇదేకాలమున ఇక్ష్వాకువంశప్రముఖుడైన ‘త్రిశంకు’ మహారాజు వర్ధిల్లుచుండెను. అతడు సత్యవాది, జితేంద్రియుడు, అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు. గొప్ప యజ్ఞములనొనర్చి తత్ప్రభావమున దేవతలకు నివాసభూమియైన స్వర్గమునకు సశరీరముగా వెళ్ళవలెను అని అతనికి బుద్ధి పుట్టెను. వెంటనే అతడు వసిష్ఠమహర్షిని ఆహ్వానించి ఆయనకు తన సంకల్పమును తెలిపెను. అంతట మహాత్ముడైన వసిష్ఠుడు ‘అది అసాధ్యము’ అని (అనగా త్రిశంకుకు అర్హత లేదని) వచించెను.

వసిష్టుడు తనకోరికను నిరాకరింపగా ఆ రాజు దక్షిన దిశగా బయలుదేఱెను. తనమనోరథసిద్ధికై వసిష్ఠునిపుత్రులకడకు వెళ్ళెను. అచట దీర్ఘకాలమునుండి తపమొనచుచు తేజోమూర్తులైన పెక్కుమంది వసిష్ఠపుత్రులను మహా తేజస్వియగు త్రిశంఖువు దర్శించెను. అతడు మహాత్ములైన గురుసుతులందఱిని సమీపించి, క్రమముగా వినయముతో వారికి ప్రణమిల్లెను. పిమ్మట లజ్జతో తలవంచుకొని, అంజలి ఘటియించి ఆ మహానుభావులతో ఇట్లు విన్నవించుకొనెను. “మీరు అనన్యశరణ్యులు. ప్రపత్తితో మిమ్ము శరణుజొచ్చుచున్నాను. నన్నాదుకొనుడు. మీకు పుణ్యముండును. మహాత్ముడైన వసిష్ఠమహర్షిచే నేను నిరాకరింపబడితిని. నేనొక మహా యజ్ఞమును చేయదలచితిని. దానికి మీరు అనుజ్ఞయిండు. గురుపుత్రులైన మీయందఱికిని నమస్కరించి వేడుకొనుచున్నాను. తపమొనరించుచున్న బ్రహ్మవేత్తలైన మీకు శిరసా ప్రణమిల్లి ప్రార్థించుచున్నాను. నేను సశరీరముగా దేవలోకమును పొందగోరుచున్నాను. నా మనోరథసిద్ధికై పూజ్యులైన మీరు విచ్చేసి, నాతో యజ్ఞమును జరిపింపగలరు.

ఓ తపోధనులారా! ఈ విషయమున వసిష్ఠమునిచేత నేను తిరస్కరింపబడితిని. యజ్ఞకార్యసిద్ధికై గురుపుత్రులైన మిమ్ములను ఆశ్రయించుటతప్ప నాకు మఱియొక మార్గము కనిపించుటలేదు. ఇక్ష్వాకుప్రభువులందరికిని పురోహితుడైన వసిష్ఠుడే వారికి పరమగతి. విద్వాంసులైన పురోహితులు రాజులను సర్వదా ఉద్ధరించుచుందురు. మీరు వసిష్ఠుని యంతటివారు. అందువలన పూజ్యులైన మీరే మాకు రక్షకులు.

బాలకాండ – 58వ సర్గ

త్రిశంకువచనములు వినిన పిమ్మట వసిష్ఠమహర్షిపుత్రులు నూరుగురును మిక్కిలి కృద్ధులై, ఆ రాజుతో ఇట్లు నుడివిరి. “ఓ దుర్బుద్ధీ! సత్యవ్రతుడైన వసిష్ఠుడు నిరాకరింపగా, ఆయనమాటను పెడచెవినబెట్టి, ఆయన పుత్రులమైన మమ్ము ఎట్లు ఆశ్రయించుచుంటివి? ఇక్ష్వాకుప్రభువులందఱికిని పురోహితుడైన వసిష్ఠుడే పరమగురువు. సత్యవాది ఐన ఆ మహర్షివచనము అతిక్రమింపరానిది. పరమపూజ్యుడైన ఆ మహర్షి ‘నీవు సశరీరముగా దివికేగుట అసాధ్యము’ అని నుడివెనుగదా. అట్టి యజ్ఞమును నీచే మేము ఎట్లు జరిపింపగలము? ఓ రాజా! నీవు మూర్ఖుడవు. ఇక నీవు నీ నగరము దారి పట్టవచ్చును. పూజ్యుడగు వసిష్ఠుడు ముల్లోకములలో ఎవరిచేనైనను యజ్ఞముచేయింపసమర్థుడు – ఆయన మాటను కాదను మేము నీచే యజ్ఞము జరిపించి, ఆయనను ఎట్లు అవమానింపగలము?”

క్రోధావేశములతో పలికిన వారి మాటలను విని, ఆ రాజు మరల వారితో ఇట్లు నుడివెను. “గురువైన వసిష్ఠుడును, అట్లే ఆ గురువుగారిపుత్రులైన మీరును నన్ను తిరస్కరించితిరి. ఓ తపోధనులారా! మీకు శుభమగుగాక. నేను మఱియొకదారి చూచుకొందును.”

సాక్షాత్తు బ్రహ్మపుత్రుడును, కులగురువు ఐన వసిష్టుని మాటను త్రోసిపుచ్చుటయేగాక ఆ రాజు దురహంకారపూరితుడై ‘ఇతరులను ఆశ్రయించెదను’ అని పలికిన మాటలను విని, ఆ మహర్షిపుత్రులు, మిక్కిలి కృద్ధులై ‘నీవు చండాలత్వమును పొందుదువుగాక’ అని అతనిని శపించిరి. తదనంతరము ఆ మహాత్ములు తమ ఆశ్రమమునకు చేరిరి.

ఋషిపుత్రులు నుడివిన ఘోరశాపవచనములను విని, మిక్కిలి ఖిన్నుడై, ఆ త్రిశంకుప్రభువు తన నగరమునకు జేరి చీంతింపసాగెను. ఇట్లు ఆ రాత్రి గడిచినంతనే రాజు చండాలరూపమును పొందెను. అతడు ధరించిన పీతాంబరము నలుపు రంగుకు మాఱెను. అతని శరీరముగూడ నల్లనిదై తేజోవిహీనమయ్యెను, కఱకుదనమును పొందెను. కేశములు కురుచవయ్యెను. అతడు స్మశానమునందలి మాలలను, బూడిదను దాల్చియుండెను. చండాలరూపమును పొందిన ఆ రాజును జూచి, మంత్రులు అందరును భయపడి పాఱిపోయిరి. పురజనులును భీతితో వారిని వెన్నంటి పరుగులుదీసిరి. ఆ రాజు ఒంటరివాడై, రాత్రింబవళ్ళు దుఃఖముతో కుమిలిపోవుచున్నను ధైర్యము వహించి, తపోధనుడును, వసిష్ఠునియెడ వైరభావముగలవాడును ఐన విశ్వామిత్రుని కడకు చేరెను.

వసిష్ఠపుత్రుల శాపమువలన ఇహపరసుఖములకు దూరమై చండాలరూపముననున్న ఆ త్రిశంకుని జూచి, విశ్వామిత్రముని అతనిపై జాలిపడెను. మిక్కిలి ధార్మికుడును, మహాతేజస్వియు ఐన ఆ ముని భయంకరరూపముతోనున్న ఆ రాజును జూచి, కనికరము చూపి, ‘నీకు శుభమగుగాక’ అనుచు ఇట్లు వచించెను. “మహా బలశాలివైన ఓ రాజా! నీవు వచ్చిన పనియేమి? వీరుడవైన ఓ అయోధ్యాపతీ! ఎవరిశాపమువలన నీకు ఈ చండాలత్వము దాపురించినది?”

పెద్దలతో మాట్లాడుటలో కుశలుడైన ఆ రాజు మహర్షి మాటలను విని, అంజలి ఘటించి, తనకు చండాలత్వము ప్రాప్తించుటకు కారణమైన శాపమునుగూర్చి వాక్చాతుర్యముగల విశ్వామిత్రునకు ఇట్లు వివరింపసాగెను. “సశరీరస్వర్గప్రాప్తి కలుగవలెనను నా కోరికను గురువైన వసిష్ఠుడును, ఆయనకుమారులును తిరస్కరించిరి. ఆ కోరిక నెఱవేఱలేదు సరిగదా! దానికి తోడు గురుపుత్రుల శాప కారణముగా నాకు ఈ చండాలత్వము ప్రాప్తించినది – ఓ సౌమ్యుడా! ఈ శరీరముతో స్వర్గమును పొందవలెనను వాంఛతో నూరు యజ్ఞములను ఆచరించితిని. ఆ యజ్ఞఫలముగూడా నాకు దక్కలేదు. ఓ మహాత్మా! నా క్షత్రియధర్మముపై ఆన! ఎట్టి క్లిష్ట పరిస్థితులలోనూ ఇంతవఱకును నేను యెన్నడును అసత్యమును పలికియెరుగను. ఇకముందు పలుకబోను. అనేకవిధములగు యజ్ఞములను ఆచరించితిని. ప్రజలను ధర్మమును అనుసరించి పరిపాలించితిని. గురువులును, మహాత్ములును, నా సద్గుణములకును, సదాచారములకును ఎంతయు సంతసించిరి. ఓ మునీశ్వరా! ధర్మమార్గమున సంచరించుచు నేను యజ్ఞముచేయ సంకల్పించితిని. అందులకువారు సుముఖత చూపలేదు. దీనినిబట్టిచూచినచో ‘ఈశ్వరేచ్ఛయే తిరుగులేనిది. దానిముందు పురుషప్రయత్నము తలవంచవలసినదే. సమస్తమూ దైవాధీనమే. ఇహపర సుఖములన్నింటికిని దైవమే శరణ్యము’ అని తెలియుచున్నది. నేను మిక్కిలి ఆర్తుడను, దురదృష్టవంతుడను. నాకు దైవము అనుకూలమగునట్లు చేయుటకు మీరే సమర్థులు. మీకు పుణ్యముండును. ఇంక నేను ఇతరులను ఎవ్వరినీ ఆశ్రయింపను. మీరు తప్ప నన్ను ఆదుకొనగలవారు ఎవ్వరునూ లేరు. నా యెడ అనుగ్రహమును చూపి, దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మీరే తగుదురు.

బాలకాండ – 59వ సర్గ

ఈ విధముగా అర్థించిన రాజుపై కౌశికునకు జాలి కలిగెను. తనయెదుట చండాలరూపముననున్న ఆ రాజుతో ఋషి ఇట్లు అనునయవచనములు పలికెను. “నాయనా! ఇక్ష్వాకువంశనరేంద్రా! భయపడకుము. నీవు ధర్మాత్ముడవని నేనెరుగుదును. నీకు నేను అండగానుందును. ఓ రాజా! యజ్ఞనిర్వహణకు సహాయపడు పుణ్యాత్ములైన మహర్షులందఱిని ఆహ్వానింతును. అనంతరము నీవు నిశ్చింతగా యజ్ఞము చేయుము. గురుపుత్రులశాపమువలన వచ్చిన నీ చండాలరూపము ఇట్లేయున్నచో ఈ రూపముననే నిన్ను సశరీరముగా స్వర్గమునకు చేర్చెదను. ఓ నరేంద్రా! నా కడకు వచ్చి శరణుజొచ్చితివి. కనుక ఇక స్వర్గము నీచేజిక్కినట్లే యని తలంతును.”

మహాతేజస్వియైన విశ్వామిత్రుడు త్రిశంకువుతో ఇట్లు పలికిన పిమ్మట ఆ ముని మిక్కిలి బుద్ధిశాలురను, పరమ ధార్మికులును ఐన తన పుత్రులను పిలిచి ‘యజ్ఞమునకు కావలసిన సామగ్రిని సమకూర్పుడు’ అని అదేశించెను. పిదప శిష్యులను పిలిచి వారితో ఇట్లు పల్కెను. “నాయనలారా! సకల ఋషిగణములను, వారి శిష్యులను, మిత్రులను, ఋత్విజులను, సకలవేదశాస్త్రపండితులను నా ఆజ్ఞగా తీసుకొనిరండు. నా ఆహ్వానము అందుకొనినవారిలో ఎవ్వరైనను ఉపేక్షాభావముతో నిందాపూర్వకముగా పలికినచో వారిమాటలను అన్నింటిని నాకు తెల్పుడు.”

విశ్వామిత్రునిశిష్యులు ఆయనమాటలువిని, ఆజ్ఞను శిరసావహించి అన్ని దిక్కులకును వెళ్ళిరి. ఆహ్వానము అందుకొనిన బ్రహ్మవాదులు వెంటనే అచటికి విచ్చేసిరి. శిష్యులందరును మిక్కిలి తేజస్వియైన మునికడకు వచ్చి, బ్రహ్మవేత్తలు పలికిన మాటలు ఆయనకు వినిపించిరి. మీ పిలుపునందుకొని, బ్రాహ్మణోత్తములందరును వచ్చుచున్నారు. ‘మహోదయుడు’ అను మునియు, వసిష్ఠుని కుమారులు వందమందియుతప్ప అందరును విచ్చేయుచున్నారు. ఓ మునీశ్వరా! ఆ వసిష్ఠునికుమారులు కోపముతో పలికిన మాటలన్నింటిని వినుడు. “యజ్ఞమును చేయువాడు చెండాలుడు, చేయించెడివాడు క్షత్రియుడు. అట్టి యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలును, ఋషులును ఎట్లు స్వీకరింతురు? విశ్వామిత్రుని ఆదేశమునకు తలయొగ్గి, సదాచారమును విస్మరించి, చండాలభోజనమును స్వీకరించినచో వారు బ్రాహ్మణులేయైనను మహాత్ములేయైనను స్వర్గమునకు ఎట్లు చేరగలరు? ఓ మునివరా! మహోదయుడు, వసిష్ఠునిసుతులు వారందరును కనులెఱ్ఱజేసి ఇట్లు నిష్ఠురముగా పలికిరి.”

అంతట విశ్వామిత్రమహర్షి వారి మాటలను విని, క్రోధముతో మండిపడుచు కనులెఱ్ఱజేసి, ఇట్లు నుడివెను. “తీవ్రముగా తపమునాచరించుచు పవిత్రముగానున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దురాత్ములందరును మసియైపోవుదురు. ఇందు సందేహములేదు. నేడే వారందరును యమపాశముచే నరకమునకు ఈడ్వబడుదురు. ఇంకను ఏడువందలజన్మలవఱకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు. మఱియు వారు ‘ముష్టికులు’ అను హీనజాతికి చెందిన క్రూరాత్ములై కుక్కమాంసమును తినుచు జీవింతురు. వికృతవేషధారులై నీచములైన మాటలతో చేష్టలతో ఈ లోకమునందు సంచరించుచుందురు. దురాత్ముడైన మహోదయుడు సజ్జనుడనైన నన్ను దూషించెను. కనుక అతడు కిరాతుడై జనులందఱిచే దూషింపబడును. కఠినాత్ముడై, ఎల్లప్పుడు సకలప్రాణులను హింసించుచు, చంపుచు బ్రతుకుచుండును. అతడు నా శాప ప్రభావమున చిరకాలము దుర్గతుల పాలగును.”

మహాతపస్వియు, తేజస్వియు ఐన విశ్వామిత్రమహాముని ఋషులసమక్షమున ఇట్లు పలికి మిన్నకుండెను.

బాలకాండ – 60వ సర్గ

వహాతేజస్వియగు విశ్వామిత్రుడు వసిష్ఠపుత్రులను, మహోదయుని తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరును వినుచుండగా ఇట్లు నుడివెను. “‘త్రిశంకువు’ అను పేరుతో సుప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాకు వంశజుడు, ధార్మికుడు, దానశీలుడు. పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు. ప్రస్తుతము శాపకారణముగ చండాల రూపమును పొందియున్నవాడు. అట్టి ఇతడు సశరీరముగా స్వర్గమునకు జేరి, దానిని వశపఱచుకొనవలయునన్న కోరికతో నన్ను ఆశ్రయించెను. యజ్ఞప్రభావమున ఇతడు తన శరీరముతోడనే స్వర్గమునకు చేరునట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలెను.”

అచ్చట చేరియున్న ధర్మజ్ఞులైన ఋషులందరును విశ్వామిత్రుని మాటలను విని, తమలో తాము ఇట్లనుకొనిరి. కుశికవంశజుడైన ఈ విశ్వామిత్రుడు ముక్కోపి. అతను చెప్పినట్లుగనే చేయుదము. వెనుకాడవలదు. పూజ్యుడైన ఆ మహర్షి నిప్పులాంటివాడు, ఆయనకు కోపము వచ్చినచో శపింపగలడు. అందువలన యజ్ఞమును నిర్వహింతుము. విశ్వామిత్రుని తేజఃప్రభావమున ఇక్ష్వాకువంశమువాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరునట్లు క్రతువును నడుపుదము. అందరును తమతమపనులను ప్రారంభించుదురు గాక.

మహర్షులందరును తమలో తాము ఇట్లనుకొని, తమతమ పనులను చేయసాగిరి. మహాతేజస్వియగు విశ్వామిత్రుడును ఆ క్రతువునకు యాజ్ఞకత్వమును వహించెను. వేదమంత్రములను బాగుగా నేర్చిన ఋత్విజులు క్రమముగా మంత్రయుక్తముగా కల్పోక్తప్రకారము విధ్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి. అంతట మహాతపస్వియైన విశ్వామిత్రుడు చాలాకాలము మంత్రములను ఆవృత్తిచేయుచు, యజ్ఞహవిర్భాగములను స్వీకరించుటకై సకలదేవతలను ఆవాహనము చేసెను. కాని అప్పుడు ఆహుతులైన దేవతలెవ్వరును హవిర్భాగములకై రారైరి. అంత విశ్వామిత్రమహాముని కోపముతో ఊగిపోవుచు స్రువమును పైకెత్తి దేవతలు రానందుకు మండిపడుచు త్రిశంకువుతో ఇట్లు నుడివెను. “ఓ నరేంద్రా! నా తీవ్ర తపశ్శక్తిని చూడుము. ఇదిగో నా తపః ప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెదను. ఓ రాజా! దుర్లభమైన స్వర్గమును సశరీరుడవై చేరుము. రాజా! నేను పెక్కుకష్టములకోర్చి సంపాదించిన తపఃఫలము ఏ మాత్రము ఉన్నను తత్ప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు.”

ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరును చూచుచుండగ స్వర్గమునకు వెళ్ళెను. స్వర్గలోకమునకు వచ్చిన త్రిశంకువును జూచి, ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను. “ఓ త్రిశంకు! మఱలిపొమ్ము. మూర్ఖుడా! నీవు గురువుచే శపింపబడితివి. కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు. తలక్రిందులుగా భూమిపై పడిపొమ్ము.”

దేవేంద్రుడు ఇట్లు తనస్వర్గప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు ‘రక్షింపుము, రక్షింపుము’ అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొఱపెట్టుకొనుచు దివినుండి భువికి పడిపోవు చుండెను. అంతట దైన్యముతో తనకుమొఱపెట్టుకొనుచున్న త్రిశంకువచనములు విని కౌశికి మిక్కిలి కృద్ధుడై ‘ఆగుము ఆగుము’ అని అతనితో పలికెను. పిమ్మట తేజస్వియైన విశ్వామిత్రుడు తనచుట్టును ఋషులు చేరియుండగా ‘మరియొక సృష్టికర్తయా! అనునట్లు’ దక్షిణమార్గమునుండునట్లుగా మఱియొక సప్తర్షిమండలమును సృజించెను. మహాయశస్వియు మునులచే పరివృతుడును ఐన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణదిశయందు మఱియొక సప్తవింశతి నక్షత్రమండలమును ఏర్పఱచెను. ఆ విధముగా నక్షత్రమండలమును సృజించినపిమ్మట క్రోధాతిరేకముతో బుద్ధివైపరిత్యమునకు లోనైన విశ్వామిత్రుడు ‘నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మఱియొక ఇంద్రుని సృజించెదను. లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా జేసెదను. అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకొనెను.

అప్పుడు సమస్త ఋషులు, సురాసురులు సంభ్రమాశ్చర్యములకు లోనై, మహాత్ముడగు విశ్వామిత్రుని శాంతపఱచుచు ఇట్లు నుడివిరి. “ఓ తపోధనా! మహానుభావా! ఈ త్రిశంకుప్రభువు గురువుచే శపింపబడెను. కనుక ఇతడు సశరీరముగా స్వర్గమును చేరుటకు అనర్హుడు.”

ఆ దేవతలమాటలను విన్నపిమ్మట విశ్వామిత్రమహాముని వారితో ఒక ముఖ్యవిషయమును ప్రస్తావించెను. “ఓ దేవతలారా! మీకు శుభమగుగాక, ‘ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపెదను’ – అని ప్రతిజ్ఞచేసియుంటిని. ప్రతిజ్ఞాభంగమునకు ఒడికట్టజాలను. ప్రస్తుతము సశరీరుడైయున్న ఈ త్రిశంకువునకు అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వతస్వర్గమగుగాక. నేను సృష్టించిన నక్షత్రములన్నియును స్థిరముగానుండును. లోకములు అన్నియును నిలిచియున్నంతవఱకు నేను సృజించిన వస్తువులన్నియును శాశ్వతముగానుండును. అందులకు సమస్త దేవతలును అనుమతింతురుగాక.:

విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధముగా నుడివిరి. “ఓ మునివరా! అట్లేకానిండు. నీకు శుభమగుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నియును ఆకాశమున జ్యోతిశ్చక్రమునకు వెలుపల అంతటను ఉండుగాక – ఆ నక్షత్రములమధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై, గురువునకు ఒనర్చిన అపచారఫలితముగా త్రిశంకువు అధోముఖుడై యుండుగాక. నక్షత్రములు ద్రువుని అనుసరించినట్లుగా మీచే సృజింపబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతివహించిన ఈ నరేంద్రుని అనుసరించును.”

పిమ్మట సమస్త దేవతలును, అచటనున్న ఋషులును మహాత్ముడైన విశ్వామిత్రుని ప్రస్తుతించిరి. అంతట ఆ తేజస్వి ‘మంచిది, సరే!’ అని దేవతలతో నుడివెను. విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యెను. అనంతరము మహాత్ములైన దేవతలును, తపోధనులైన మునులును తమ తమ స్థానములకు బయలుదేఱిరి.

— సశేషం

Transliterated with Kacchapi

ప్రకటనలు
  1. ఇంకా వ్యాఖ్యలు లేవు.
  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s