ముంగిలి > సరదాగా, హాస్యం > ‘తెలుగు భావాలు’ న్యూస్ ఛానెల్‌, మాయావతి ఇంటర్‌వ్యూ – ఓ దుస్స్వప్నం

‘తెలుగు భావాలు’ న్యూస్ ఛానెల్‌, మాయావతి ఇంటర్‌వ్యూ – ఓ దుస్స్వప్నం

నిన్న రాత్రి ఓ కలొచ్చింది. ‘తెలుగు భావాలు’ పేరిట ఓ న్యూస్ ఛానెల్ తెరిచినట్టు, దానికై మాయవతిని మొదటి ఇంటర్‌వ్యూ చేసినట్టు.

నన్నూ, కెమెరామెన్‌ను తీసుకెళ్ళి ఓ పెద్ద హస్తినాసనం ముందు రెండు కుర్చీలలో కూర్చోబెట్టి వేచిఉండమని చెప్పారు. ఎదురుగాఉన్న కుర్చీ భలే ఉందే అని తిలకిస్తున్నాము. అంతలోనే మిష్రాజీ వేగంగా వచ్చి మమ్మల్ని నిలబడమని సైగచేశారు “बेहेनजी आ रहें हैं (అక్కగారొస్తున్నారు)” అని హెచ్చరిస్తూ. ఠక్కున నించున్నాం. నల్ల దుస్తులేసుకున్న బాడీగార్డ్‌లు నలుగురు ముందు వస్తుంటే, వెనక బెహెన్జీ. ఇతర పరివారాన్ని పక్కన నుంచోమని సైగ చేస్తూ, మెల్లిగా ఆ ఏనుగుబొమ్మలతో అలంకరించిన ఆసనాన్ని ఠీవీగా అధిరోహించి, మా ఇద్దరినీ పై నుంచి కిందదాకా ఓ లుక్కేసి, మిష్రాజీ వైపు తిరిగి ఏవో హిందీలో వినపడీ వినపడనట్టుగా సంప్రదింపులు జరిపిన తరువాత, మిష్రాజీ కూర్చోమని సైగ చేస్తే ఒద్దికగా కూర్చున్నాము. పక్కనే ఉన్న హాండ్‌బాగ్ చూసి, ఇంట్లో కూడా ఇదెందుకబ్బా అనుకుంటుంటే, బెహెన్జీ గమనించి దాన్ని కాస్త దగ్గిరగా లాక్కొని “हां! तो कहिए” (ఇక చెప్పండి) అంటే అర్థంకాక నేను కెమెరామెన్ ఒకరినొకరు బిక్క చూపులు చూస్కొని మిష్రాజీ వైపు అర్థం కానట్టుగా ఓ అమాయకపు చూపు చూశాం. ఆయన వెంటనే వంగి బెహెన్జీ చెవుల్లో మళ్ళీ ఎదో చెప్పారు. అప్పుడు…

బెహెన్జీ: ఓ! మీకీ తేల్గూ అని మిష్రాజీ చెప్పార్‌. నాకీ కొంచెం తేల్గూ వచ్చు కన్క నేనూ మీదీ భాషలో మాట్లాడ్తా.

నేను: థాంక్స్ అమ్మ.

మళ్ళీ మిష్రాజీ వైపు ఆవిడ ఓ లుక్కిచ్చారు. ఆయన వెంటనే మమ్మల్ని ఉద్దేశిస్తూ “బెహెన్జీ… బెహెన్జీ… అమ్మ సౌత్ – బెహెన్జీ నార్థ్…” అని మెల్లిగా అన్నారు. అర్థమై నాలుక కరచుకున్నా. కానీ, నా వెంటనున్న కెమెరామాన్ పుసుక్కున “మరి వెస్ట్‌?” అంటే, “దీదీ లేవోయ్‌” అని, అతణ్ణి ప్రశ్నలడగొద్దని సైగచేశా. “ఫరవాలేదు బుద్ధిమంతులే” అన్నట్టు బెహెన్జీ ఓ చిరుమందహాసంతో మిష్రాజీ వైపు చూస్తే, ఆయనా అదే రీతిలో ఓ చిన్ని స్మైల్ ఇచ్చారు.

నేను: సారీ బెహెన్జీ. మాకీ ఛాన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

బెహెన్జీ: మీదీ కొత్తా ఛానెల్ కదా? ‘తేల్గూ బావల్’

నేను: బెహెన్జీ – ‘తెలుగు బావలు’ కాదండి – ‘తెలుగు భావాలు’… భా…. వా… లు…

మళ్ళీ బెహెన్జీ మిష్రాజీ వైపుకోలుక్కు. ఆయన వెంటనే మావైపు తిరిగి “बेहेन्जीने भी वहीं तो कहां! आप ठीक से नही सुना शायद” (బెహెన్జీ కూడా అదే అన్నారు కదా? సరిగా వినపడి ఉండదు) అంటూ కళ్ళతో “అలా మాట్లాడితే చస్తార్రోయ్” అనే విధంగా సైగ చేస్తే అప్పుడు బుఱ్ఱకెక్కింది. ఓ వెక్కిలి నవ్వును జోడించి నేను వెంటనే “ఎస్ బెహెన్జీ – ఎస్ బెహెన్జీ” అని కవరింగ్ ఇచ్చా.

బెహెన్జీ: తో… చెప్పండీ. మీకీ క్వష్చన్స్ ఏంటో?

నేను: బెహెన్జీ. కొత్త అంశమైన రాష్ట్ర విభజన గురించి చర్చించడానికి మీకు O.K. అయితే, కొన్ని ప్రశ్నలు. పెద్దగా ప్రజలు కోరినట్టు వినలేదు కదా, ఇప్పుడు సడన్‌గా ఈ నాలుగు రాష్ట్రాల ఏర్పాటు ఎందుకు చేస్తున్నదీ, మా ప్రేక్షకులకి వివరించగలరా?

బెహెన్జీ: అచ్ఛా ప్రశ్న్ హైఁ! హిప్పుడూ ఉన్న ఒక్టీ రాష్ట్రం ఎన్నో హెడ్డేక్స్ తెచ్చీ పెడ్తోంది. ఇట్లా నాల్గూ సెపరేట్ స్టేట్స్ పెడితే చాలా లాభాల్ హున్నయ్.

నేను: లాభాలా?!? అవేంటి బెహెన్జీ?

బెహెన్జీ: Noidaలో నేను కట్టిన పార్క్ చూశారు కదా? చాలా బాగుంది కదా? హిప్పుడు మొత్తం స్టేట్‌కి ఒక్టే పార్క్ ఉంటే దూర్ హున్న ప్రజ్లాకి కష్టం హైఁ. నాల్గూ స్టేట్స్ హుంటే, నాల్గు పార్క్స్ కట్టచ్చు కదా?

నేను: (ఇదెక్కడి దిక్కుమాలిన ఐడియా అనుకుంటూ) కాదు బెహెన్జీ. అంత కావాలంటే ఒకటే రాష్ట్రంలో నలుమూలలా ఒక్కో పార్క్ కట్టొచ్చు కదా? దానికి రాష్ట్ర విభజన ఎందుకు?

బెహెన్జీ: ఒక్టీ పార్క్ కడ్తే కాంగ్రెస్ వాల్లు హెంత అల్లరీ చేశార్‌? ఇంకా మూడూ పార్క్స్ కడితే వాళ్ళూ ఇంకా హెంతా అల్లరీ చేస్తార్‌? ऊपरसे ఒక్టీ పార్క్ కట్టాలంటే హెంత (ఎంత) పైసా కావాలి తెల్సా? హెక్కడ్ నుంచీ వస్తుందీ అంతా డబ్బుల్‌?

నేను: (కొద్దిగా బుఱ్ఱగోకుతూ) అర్థం కాలేదమ్మా..సారీ బెహెన్జీ. డబ్బు సమకూర్చుకోవడం, అల్లరి తప్పించుకోవడం, రాష్ట్ర విభజనతో ఎలా కుదురుతుంది?

బెహెన్జీ: अभी देखिये. ఒక్టీ రాష్ట్రం అంటే ఒక్టీ ముఖ్‌మంత్రీ. నాల్గూ స్టేట్స్ అంటే నాల్గూ ముఖ్‌మంత్రీలు. ఇండిపెన్డెన్స్ వచ్చినాక హిట్లాంటి పార్క్ ఎవరూ కట్టార్‌? ఎవరూ లేదు. అందుకే నాకీ పేరు చెప్పి, కాంగ్రెస్ తప్పు ప్రోపగాండా చేస్తుంది. అదే ఫోర్ ముఖ్‌మంత్రీలు చేస్తే అది ఫాషన్ హవుతుంది కదా? ఒక్టీ ముఖ్‌మంత్రీని తిడతార్, కానీ నాల్గూ ముఖ్‌మంత్రీల్ని తిట్టర్ కదా? ऊपर से నాల్గూ స్టేట్స్ అంటే నాల్గు బడ్జెట్స. సమ్‌ఝే?

నేను: ఓహో! అలా వచ్చారా? బాగుంది బెహెన్జీ. అంటే పార్క్ నిర్మాణాలు పూర్తయ్యాక నాలుగు రాష్ట్రాలను కలిపి మళ్ళీ ఉత్తర్‌ప్రదేశ్ అని ఏకీకరిస్తారా?

బెహెన్జీ: नहीं नहीं (కాదు కాదు) अभी, और भी కారణాలు हैं (ఇంకా కారణలున్నాయి).

నేను: వాటి వివరాలు చెబుతారా బెహెన్జీ?

బెహెన్జీ: दूसरा (దూసరా) కారణం. ఇది చెప్పను, చూపుతాను.

अरे उस बाघ को इधर लाइए (ఆ పులిని ఇటు తీసుకురండి) అని బెహెన్జీగారు కేక వేసారు. గుండె జారి పొట్టలోకొచ్చింది. ఎనభై దశకంలో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమాల్లో స్పెక్ట్ర్ (Spectre) తిక్క రేగితే నంబర్-2, నంబర్-3లను మొసళ్ళకు, సొర చేపలకు ఎరగా వేసిన సన్నివేశాలు గుర్తొచ్చి మమ్మల్ని పులులకు సింహాలకు గాని ఎరగా వెస్తారా అనే అనుమానంతో తెల్లమొహాలేసిన మా ముందుకొక నక్కను తెచ్చారు. ఇదేంటిది? పులిని తెమ్మంటే నక్కను తెచ్చారు అనుకుంటుండగా ఆవిడ ఓ ప్రశ్న వేశారు.

బెహెన్జీ: यह क्या हैं? (ఇదేంటి చెప్పండి?)

నేను: నక్క!

బెహెన్జీ: అరే! సరిగా చూసీ చెప్పండీ.

మళ్ళీ ఏం తప్పు చేస్తున్నానో అర్థం కాక మిష్రాజీవైపుగా ఏఁవన్నా క్లూ వస్తుందేమోనని చూస్తూ ఒక్కొక్క పదం బరువెంతో చూస్తున్నట్టుగా “ఇది…నక్క…లాగా…కనిపిస్తోంది” అన్నాను.

బెహెన్జీ: మీకీ మీడియా వాళ్ళకి దిమాగ్ తక్కువ హైఁ. నక్కాకి ఇట్లా పులీలాగా లైన్స్ ఉంటాయా చెప్పండి?

అప్పుడర్థమై “ఇది పులీ హైఁ” అని ఓ పులికేక వేశా. వెయ్యి వాట్ల బల్బులాగా వెలిగిపోయింది బెహెన్జీ ముఖం.

బెహెన్జీ: షబ్బాష్‌. ఇది పులీ హైఁ. కానీ మీకు తెల్సా ఇది పుట్టినప్పుడు పులి కాదు హైఁ.

నేను: అదేంటి బెహెన్జీ?

బెహెన్జీ: ఇది పుట్టినప్పుడు నక్క హైఁ. నేను దీన్కీ లైన్స్ వాత పెట్టించి పులిలాగా చేంజ్ చేయించా. अब बोलो कैसा हैं? (ఇప్పుడు చెప్పండి ఎలా ఉందో)

నేను: అబ్బో! సూపర్ హైఁ. కానీ దీనికి మన ఇంటర్‌వ్యూకి లింక్ కిధర్ హైఁ?

బెహెన్జీ: లింక్ హైఁ. ఇప్పుడు మన ప్రధాన్‌మంత్రీ మన్మోహన్‌సింహ్ అయినా, సోనియాజీ చాలా పవర్ఫుల్ కదా? ఎట్లా? తను పార్టీ హెడ్‌లాగా పనీ చేస్తూ అన్ని స్టేట్స్ కంట్రోల్ చేస్తుంది కన్క. సో, నేను ఎప్పుడూ ఇట్లా ముఖ్‌మంత్రీలాగా ఉండీ పోతే, పవర్ ఎట్లా వస్తున్దీ? సో, నేను కూడా సోనియాజీ అవ్వాలి. లేకిన్ ఆ ఫామిలీలో పుడ్తేనే ఆ ఛాన్స్ అని అందర్కీ తెల్సు. మరీ నేను హేం చెయ్యాలి?

నేను: ఎం చెయ్యాలి?

బెహెన్జీ: హిప్పుడు ఈ నక్కని నేను ఎట్లా పులీ చేశాను? దిమాగ్‌తో. ఐసే హీ, నేను ఇప్పుడు ఫోర్ స్టేట్స్ తయారు చేస్తే అక్కడ ఫోర్ ముఖ్‌మంత్రీలు వస్తే, వాళ్ళూ అందరినీ కంట్రోల్ చేస్తే – నేను కూడా ఆ ఫామిలీలో పుట్టకుండా సోనియాజీ లాగా మారొచ్చు హైఁ. సమ్‌ఝే?

నేను: అర్థమైంది.. అర్థమైంది.. మా భాషలో ఒక సామెత ఉంది. “పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు” అని. అబ్బబ్బబ్బా. ఇలా నిజ జీవితంలో ఇంత ప్రాక్టికల్‌గా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు బెహెన్జీ. షుక్రియా…షుక్రియా.

ఈ సారి మూడు వెయ్యివాట్ల బల్బుల తేజస్సు విరజిమ్ముతూ మిష్రాజీ వైపు సగర్వంగా ఆవిడ లుక్కిస్తే, ఆయన మా వైపు “శహబాష్‌రా బడుద్ధాయిలు” అన్నటు ఓ లుక్కు రిఫ్లెక్ట్ చేశారు.

నేను: బెహెన్జీ, ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ కారణాలేమన్నా ఉన్నాయా?

బెహెన్జీ: హైఁ!

నేను: ఎంటి హైఁ?

బెహెన్జీ: ఇదీ సీక్రేట్‌. మీరు ఇదీ సీన్ కట్ చేస్తే చెప్తా.

నేను: బెహెన్జీ అంత మసాలా ఉన్న విషయాన్ని మీడియాకు చెప్పి, సీక్రెట్‌గా ఉంచమంటే ఎలా కుదురుతుంది చెప్పండి?

బెహెన్జీ: మీదీ ఫేస్ నాకీ నచ్చింది. అన్ద్కే చెప్పాలనుకున్నా. సీక్రేట్‌గా పెట్టకపోతే చెప్ప.

నేను: సరే! ప్రయత్నిస్తా. చెప్పండి.

బెహెన్జీ: కసమ్‌సే? ప్రామిస్‌?

నేను: చెప్పండమ్మా…సారీ బెహెన్జీ.

బెహెన్జీ: నాకీ ఇన్టెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కొంచెం ప్రజలాకి కూడా కోపాం వచ్చిందని. పార్క్ కడితే ఫండ్స్ వేస్ట్ అయ్యాయని. ఇస్ లియే, ఇప్పుడు రాష్ట్రాన్ని ఫోర్ పార్ట్స్ చేస్తే, ఎక్కడో అక్కడ మా బా.సా.పా. పవర్లోకి వస్తే నేను అక్కడీ సీ.ఎం. అవుతా. అపుడూ, నన్ను ఎవరూ ఎం చెయ్యలేరు కదా?

నేను: అమ్మ నాయనోయ్‌! ఇదా అసలు కథ?

బెహెన్జీ మిష్రాజీ వైపు కొద్దిగా అనుమాన పడుతూ ఓ లుక్కిచ్చారు. వెంటనే ఆయన ఓ బాడీగార్డుకి. ఆ బాడీగార్డు నా వైపు ఓ రెండు అడుగులు ముందేసి తన్న గన్ను వంకీ కాస్త కిందకి దింపి నా వైపుందా అన్నట్టు పట్టుకున్నాడు. అర్థమయింది. ఎకసెకాలు కుదరవని.

నేను: ఫరవాలేదు బెహెన్జీ. నేను ఎవరికీ చెప్పను.

బెహెన్జీ: బోలియే. ఇంకా హేమ్టీ అన్నా అడుక్కోవాలి అన్పిస్తోందా?

నేను: బెహెన్జీ. అడుకున్నది, మీరిచ్చినదీ ఇక చాలు. శెలవిస్తే బయలుదేరుతాము.

బెహెన్జీ: ఠీక్ హైఁ. ఇదీ ప్రోగ్రామ్ హెప్పుడూ వస్తున్దో మిష్రాజీకి చెప్పి వెళ్ళండి.

నేను: ఎఁవనుకోనంటే ఓ చిన్ని ప్రశ్న.

బెహెన్జీ: పూచియే (అడగండి)

నేను: వికీలీక్స్‌లో వచ్చిన వార్త. అదే…కొత్త సాండల్స్ కావలిసొచ్చినపుడు ముంబైకి ఓ ప్రైవేట్ జెట్ పంపించి తెప్పించుకున్నవి – ఇప్పుడు మీరు వేసుకున్న పాదరక్షలేనా?

బెహెన్జీ: క్యా బక్వాస్ బాత్ కర్ రహేఁ హైఁ? (ఏం పిచ్చ పేలుళ్ళు పేలుతున్నారు?)

ఈసారి ఓ తీక్షణమైన లుక్కు, మిష్రాజీ వైపు. ఆయన “మీరయిపోయార్రా నా చేతిలో అన్నట్టు” మమ్మల్నో లుక్కేసి, మీరెళ్ళండి నేను చూసుకుంటానని చెబితే బెహెన్జీగారు నిష్క్రమీంచారు. అదుగో అప్పుడే మెళకువ వచ్చి ఇదెక్కడి స్వప్నంరా బాబు అని ఓ పెద్ద ఊపిరి పీల్చాను. అందుకే అంటారు. పడుకునే ముందు పిచ్చ పిచ్చ ప్రోగ్రాంలు గట్రా చూడకుండా బుద్ధిగా దైవ నామ స్మరణ చేసి పడుకొమ్మని. అప్పుడప్పుడు బుద్ధి గడ్డి తిని దారి తప్పితే, ఇట్లాంటి కలలే వచ్చేది.

Transliterated with Kacchapi

ప్రకటనలు
వర్గాలుసరదాగా, హాస్యం ట్యాగులు:,
  1. 2:46 సా. వద్ద నవంబర్ 17, 2011

    Wonderful

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s