ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి, సనాతన ధర్మం > ఏ సముద్రంనుండి వరాహస్వామి భూమిని పైకేత్తారు?

ఏ సముద్రంనుండి వరాహస్వామి భూమిని పైకేత్తారు?

శ్రీ మహా విష్ణువు మూడవ అవతారంగా వరాహావతారమునెత్తి, భూమిని సముద్రగర్భము నుండి పైకెత్తారని అందరికీ తెలిసినదే. దానిని ఎంతో అందముగా చూపించే చిత్రాలు, ప్రతిమలూ సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాము.

యజ్ఞవరాహమూర్తి

యజ్ఞవరాహమూర్తి

కానీ ఓకప్పుడు చిన్ని సందేహము కలిగేది. భూమి సముద్రములో ఉంటే, ఆ సముద్రము దేనిపై ఉన్నట్టు? ఆ కాపాడిన భూమిని మూపురము పై పెట్టుకొని, ఆయన దేని మీద నుంచోని ఉంటారు? వేంకటాచల వైభవాంతర్గతంగా శ్రీనివాసుడు ఆ వరాహస్వామివద్దనే తనుండటానికి స్థలం పోందారంటారుకదా – ఓక విష్ణుస్వరూపమే మరో విష్ణుస్వరూపమువద్ద నివాసానికి స్థలం పోందడమేమిటి? అంటే అప్పుడు వరాహస్వామి తను ఏత్తిన భూమిమీదే ఉన్నట్టుకదా? ఈ ప్రశ్నలు నాకు మాత్రమే వచ్చి ఉంటాయనుకోను. పైపేచ్చు, హైందవేతరులు ఈ స్వరూపాన్ని అపార్థం చేసుకోని ఏకినంత ఇతర ఏ స్వరూపాన్ని కించ పరచి ఉండరు.

నా విశ్లేషణ ఆవిష్కరించే ముందు చిన్ని ఉపోద్ఘాతం. ఠక్కున ఓ వ్యక్తిని “Food” అని అడిగితే తన ప్రాంతానుగూణమైన సమాధానమిస్తాడు కదా? ఒక తెలుగువాడినడిగితే “బియ్యము” అనవచ్చు; ఓ ఉత్తరదేశవాసినడిగితే చపాతీ అనవచ్చు. “Food” అనేది ఆలోచనను ప్రేరేపించే పదం. కానీ దాని అర్థంయొక్క వ్యక్తీకరణ ఆ వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడు, అతని అనుభవాలేమిటి అనే వివిధ అంశాలతో ముడిపడి ఉంటుంది. ఇలాగే ఎన్నో. “సంపద” అంటే ఒకరికి రూపాయి కట్టలు అనిపించవచ్చు; మరొకరికి పెద్ద ఇల్లు, ఇంకొకరికి ఇంకేదో. ఇవేవీ తప్పు కాదు – కానీ ఇవే కేవల ప్రతిరూపాలూ కావు.

ఇప్పుడు తిరిగి “భూమీ-సముద్రంవైపు” ఈ కోణంలో ఆలోచిస్తే, వరాహమూర్తి ప్రతిమను చిత్రించినవారు ఎమీ అర్థం చేసుకొనుంటారు అన్నది కాస్త పరిశీలించాలి. శ్రీమద్భాగవతం మూడవ స్కందములో పదమూడవ అధ్యాయంలో వరాహావతార వర్ణన ఉన్నది. 18వ శ్లోకంలో ఎలా అవతరించారన్నది ఉన్నది. కానీ ఇదికాదు విశ్లేషణ. 29, 30 శ్లోకాలలో ఇలా ఉన్నది.

29: పర్వతాకార కాయంతో – విపరీతమైన వేగంతో (శక్తితో) సముద్రములో దూకినపుడు, సముద్రము రెండుగా చీలినదా అన్నట్టు ఉవ్వెత్తున లేచిన కెరటాలు రెండు చేతులుగా గోచరించి సముద్రుడు నన్ను కాపాడుమని వేడుకొన్నాడు. (వేడుకొన్నాడా అనిపించినట్టు)

30: పదునైన తన కోరలతో అలా నీటిని చీల్చుతూ అనంతమైన ఆ నీటి సముద్రపు అంతానికి చేరుకొని, ఆ యజ్ఞస్వరూపుడు సకలజీవులను ధరించగల భూమిని కనుగొని తానే పైకెత్తారు.

ఈ శ్లోకాల తాత్పర్యానికి, పైన ఉన్న చిత్రం బాగానే న్యాయం చేసినట్టు కనిపిస్తుంది. కానీ అలా మాత్రమే కుదురుతుందా? మరోలా అర్థంచేసుకోలేమా? ఇందుకోసం ఒకసారి, హరివంశం ఏమి చుబుతోందో చూద్దాం.

…ద్వీపాలతో మహనీయ పర్వతాలతో పైకెత్తిన పిమ్మట, ఆ భూతధాత్రిని తిరిగి మహా సాగరమధ్యంలో భద్రంగా నిక్షేపించాడు…

సాధారణంగా వరాహము ఎలా ప్రవర్తిస్తూ ఉంటుంది? ముక్కు రంద్రాలను మూసుకొని, పచ్చిగా ఉన్న వాటిలో మూపును దూర్చి, తలను అటూ ఇటూ కదుపుతూ, ఏదో వెతుకుతున్నట్టు తోడేస్తూ, క్రిందినున్న పదార్థాలనుకూడా పైకి లాగేస్తుంటుంది. బహుశః మనకు తేలికగా అర్థమవటానికన్నట్టు, అటువంటి జీవితో పోల్చి – అది చేసినట్టే – సముద్రజలాలలో మునిగి ఉన్న భూతలాన్ని తోడినట్లు – చూపించేవిధముగా వ్రాసినట్టు కూడా అనిపిస్తోంది. చిత్రకారుడు భూమినీ-సముద్రాన్ని వేరుగా చూపించడం, అందులోనూ భూగోళ స్వరూపంతో చిత్రించడం వల్ల మొదటి సందేహం పుట్టుకొచ్చింది. సముద్రమూ-భూమి వేరుకాదు. ఆ సముద్రములోనుండి తోడి, కుప్పలుగా పోసినవే ‘సప్తద్వీపాలు’ – అని నాకు అనిపించింది.

వరాహ స్వరూపమెందుకు అనేది పైన వ్రాశాను. కానీ అసలు స్వరూపమేమిటి? స్వామివారి అంగాగాన్ని యజ్ఞానికి సంబందించిన విషయాలతో పోల్చారు. ఈ అవతారాన్ని “యజ్ఞవరాహమూర్తి” అని అందుకే అంటారు – అలానే అనాలి కూడా! 35వ శ్లోకంలో కుండ బద్దలుకొట్టినట్టు చెప్పనే చెప్పారు. “రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం దుర్దర్శనం” – “దుష్కృతాత్ములకు అవగతమవలేని స్వరూపం” అని.

ఇప్పటికీ సప్త ద్వీపాలు/ఖండాలు కదులుతూనే ఉన్నాయని – అందువల్లనే హిమాలయాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయని, నేటి శాశ్త్రమూ చెబుతోంది. అంటే ఏ దైవిక శక్తి (శక్తి అనాలో, ప్రేరణ అనాలో, కారణం అనాలో?) అపార కరుణవల్ల భూమి సముద్రానికి పైన తేలియాడుతున్నట్లున్నదో, అటువంటి స్థిరత్వానికి భంగము కలుగజేయని రీతిలో, తానే మరో రూపంలో రావాలంటే, తదనుగుణమైన స్థానంలో వెలియడమే బహుశః మనకు తేలికగా అర్థమవడానికి స్కాందపురాణంలోని వేంకటాచలవైభవంలో యజ్ఞవరాహమూర్తీ – శ్రీనివాసులు “చర్చించుకున్నట్టు” చూపించారేమో!

ఆసక్తిగలవారికోసం, శ్రీమద్భాగవతాంతర్గతమైన యజ్ఞవారాహావతార అధ్యాయ సంస్కృత మూలాన్ని, ఈ టపాతో జతపరుస్తున్నాను. 34వ శ్లోకము నుండి 45వ శ్లోకము వరకు, బ్రహ్మదేవుడు ఆ యజ్ఞవరాహ స్వరూపాన్ని కీర్తించినవి.

శ్రీమద్భాగవతాంతర్గతమైన
యజ్ఞవారాహావతార
అధ్యాయము
ప్రకటనలు
 1. RADHAKRISHNA
  1:52 సా. వద్ద నవంబర్ 27, 2011

  బాగా వ్రాసారండీ. ఈ విషయం మీదే నాకు కూడా చిన్నప్పటి నుండీ ఓక సందేహం వున్నది. అయితే ఆయన ఎక్కడ నుంచున్నాడని కాదు… ఆయన ఎత్తినట్లు చూపించే భూమి గుండ్రంగా వున్నట్లు మన పురాతన కవులు ఎలా వర్ణించారు?……..పురాతన శిల్పులు ఎలా చెక్క గలిగారు?? ఎందుకంటే [ఇప్పుడు మనం చూస్తున్న అనేక దేవాలయాలు మనకు యురోపియన్లు వచ్చి తెలివి నేర్పక ముందివి చాలా వున్నయి కదా] మన “యురోపియను-బుద్ధి” గల గొప్ప చరిత్రకారుల ప్రకారం ఎవరో యురోపియను భూమి గుండ్రంగా వున్నదని కనిపెట్టాడంటారు కదా!!!? అంతా వాళ్ళకే తెలుసు కదా!!… మరి మన పురాతన కవులకి, శిల్పులకీ భూమి “గోళమని” ఎలా తెలిసింది??

 2. anrd
  4:18 సా. వద్ద నవంబర్ 27, 2011

  త్రిమూర్తులను సృష్టించిన ఆదిశక్తియైనపరమాత్మ తాము మూలమూర్తిగా ఎప్పుడూ ఉంటారు. తమ అంశలతో ఒకేసమయంలో ఎన్ని అవతారాలనైనా సృష్టించగలరు. ఒకేసారి కోట్లాది బ్రహ్మాండాలనూ, జీవరాశులను సృష్టిస్తున్న మూలదైవానికి ఏదీ అసంభవం కాదు. విష్ణుమూర్తి ఒకేసారి ఎన్నో అవతారాలను ధరించగలరు. విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే శ్రీరామునిగా అవతారాన్ని ధరించారు. అలాగే ఒకేసారి ఎన్ని అవతారాలనైనా ధరించగలరు.

  అనంతవిశ్వంలో ఎన్నో లోకాలు, పాలసముద్రం, వంటి ఎన్నోసముద్రాలు ఉన్నాయని పెద్దలు చెబుతారు. ఇక భూమిని హిరణ్యాక్షుడు పడవేసింది ఏ సముద్రంలోనో మనకు తెలియదు.

  భూమిపై సముద్రాలు ఉంటాయి .కానీ భూమి తిరిగేటప్పుడు నీరు క్రింద పడటం లేదంటే గురుత్వాకర్షణ శక్తి కారణం అంటున్నారు. భూమికి గురుత్వాకర్షణ శక్తిని కల్పించిందీ దైవమే. మరి భూమి, ఇతర గ్రహాలు, ఇవన్నీ ఆకాశం నుంచి క్రిందపడకుండా ఎలా ఉంటున్నాయో ? గతితప్పకుండా సూర్యచంద్రులు ఎలా వస్తున్నారో ? ఊళ్ళను ముంచేసే వానలు వానగా కురవకముందు తేలికైన మబ్బుల్లో ఆకాశంలోనే నిలిచి ఎలా ఉంటున్నాయో ?
  మనము తెలుసుకోవలసింది ఈ విశ్వాన్ని నియమబద్ధంగా నడిపిస్తున్నది దైవశక్తే అని . ఆ దైవం యొక్క వైజ్ఞానిక చాతుర్యం అత్యద్భుతమైనది.

  భూమి బల్లపరుపుగా లేదని విదేశీ పరిశోధకులు కనుగొన్నారని అంటున్నారు. అలా కనుగొన్నందుకు వారు గొప్పవారే. కానీ ప్రాచీన దేవాలయాల్లో వరాహ స్వామి వారి ప్రతిమలను గమనిస్తే భూమి ఆకారం బల్లపరుపుగా ఉండకపోవటం మనం గమనించవచ్చు. ఆ విధంగా
  భూమి ఇప్పుడు బల్లపరుపుగా లేదన్న విషయం మనప్రాచీనులకు ఎప్పుడో తెలుసు అనిపిస్తుంది.

  ఇంకా మనం ఇలా కూడా అనుకోవచ్చు భూమి ఒకప్పుడు బల్లపరుపుగా కూడా ఉండి ఉండవచ్చు. ఆతరువాత భగవంతుడు భూమి ఆకారాన్ని మార్చి ఉండవచ్చు. మన పెద్దలు పూర్వ కాలములో విశ్వములో జరిగిన సంఘటనలు కధతో పాటు సింబాలిక్ గ మనకు చెప్పారేమో. ఆ ప్రకారము ఇలా ఆలోచిస్తే ……ఒకప్పుడు హిరణ్యాక్షుడు భూమిని చాపలా చుట్టి సముద్రములో వేశాడని ఒక పుస్తకములో చదివినట్లు గుర్తు…. ఆ తరువాత వరాహస్వామివారు భూమిని రక్షించి పైకి తీస్తారు. ఇవన్నీ విశ్వములో జరిగిన ఒక సంఘటనను సూచిస్తున్నాయేమో. కొన్ని లక్షల సంవత్సరముల కాలములో భూమి ఆకారం మారి ఉండవచ్చు. ఇది నా ఊహ మాత్రమే. భగవంతుడు క్షమించాలి. తోచింది వ్రాసినందుకు.

  ఒకప్పుడు యూరోప్,ఆసియా కలిసే ఉండేవని ….గోండ్వానా ల్యాండ్ అనేది ఉండేదని , నూతన పరిశోధకులు చెప్తున్నారు.

  ఊళ్ళలో చూసే వరాహాలకు కోరలుండవు. కాబట్టి వరాహావతారం మనం ఇప్పుడు చూస్తున్న మనుషుల మధ్య తిరిగే వరాహాలకు సంబంధించినది కాదు అనిపిస్తుంది. భూమి , సముద్రాలు ఒకలాంటి వాయువు ఆధారంగా నిలిచిఉన్నాయని చదివినట్లు గుర్తు. వీలుకుదిరితే మరికొన్ని వివరములతో వ్యాఖ్య వ్రాస్తానండి…….

 3. 4:22 సా. వద్ద నవంబర్ 27, 2011

  బాగుంది.వ్యాఖ్య రాయడం మొదలెడితే టపా అయిపోవచ్చు.

 4. వేణు
  12:38 ఉద. వద్ద నవంబర్ 28, 2011

  మీరు చాల బాగా వ్రాసారు. నాకూ కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయ్ …
  విష్ణు మూర్తి దశావతారాల ప్రణాళిక ముందే వేసుకుని ఉంటాడా…లేక ..భగవద్గీత లో క్రింద చెప్పిన విధంగా ….అవసరమైనప్పుడే అవతారం ఎత్తాడా?
  (గూగుల్ వారి సౌజన్యం తో ..)
  यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
  अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥
  “Whenever and wherever there is a decline in religious practice, O descendant of Bharata, and a predominant rise of irreligion—at that time I descend Myself.”
  परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
  धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥
  “To deliver the pious and to annihilate the miscreants, as well as to reestablish the principles of religion, I Myself appear, millennium after millennium.”
  ఇప్పటి వరకు తొమ్మిది అవతారాలే వ్యక్తీకరణం అయ్యాయి…..అయితే…..పదవ అవతారం కల్కి అని మనకు తెలుసు ……..
  రాముడు, కృష్ణుడు, బుధ్ధుడు …వాళ్ళందరూ మనుషుల్లాగే జన్మించారు …అయితే …వాళ్ళు చిన్నపుడు దశావతారాల గురుంచి చదువుకునే వుంటారు…..కదూ…
  అంటే …విష్ణుమూర్తి ముందే …దశావతారాల ప్రణాళిక వేసుకునే ఉంటాడన్న మాట …………. అలా కాదనుకుంటే ……రాముడు….ఆరు అవతారాలని , కృష్ణుడు ఏడు అవతారాలని, బుద్ధుడు ఎనిమిది అవతారాలని చదువుకుని ఉండాలి……..మనం తొమ్మిది అవతారాలని చదవాలి …..ఏమంటారు…..
  ఇది నాకున్న మిడి మిడి జ్ఞానం తో వ్రాసింది …….ఏవైనా తప్పులుంటే మన్నించాలి…….మీకు దీనిపై అవగాహన ఉంటె విషదీకరించ గలరు….. ..
  ఇంకా చాలా సందేహాలున్నాయి …..ఓ రెండిటిని మాత్రం ఇక్కడ వ్రాయాలనిప్రిస్తున్నాయి…….. బలరాముడా లేక బుద్దుడా ఎవరు అసలు అవతారం ? పరశురాముడు చిరంజీవా,…ఎందుకంటే …రామాయణం లోను మహాభారతం లోనూ కనిపిస్తాడు ….అంటే రెండు యుగాలలో జీవించే ఉన్నాడా ……ఇలాంటి కోవలోకే వచ్చే వారు హనుమంతుడు మరియు జాంబవంతుడు …కాక పోతే వారు చిరంజీవులని తెలుసు….?

  • guttinasrinivas
   11:09 ఉద. వద్ద మార్చి 19, 2012

   >>> విష్ణు మూర్తి దశావతారాల ప్రణాళిక ముందే వేసుకుని ఉంటాడా…లేక ..భగవద్గీత లో క్రింద చెప్పిన విధంగా ….అవసరమైనప్పుడే అవతారం ఎత్తాడా?
   మనుష్యులకి బుద్ధి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినా కాలం ఆయన ఆధీనంలోనే ఉంటుంది. కాబట్టి, ఆయన ముందుగానే ఆలోచించార లేక అవసరమైనప్పుడే అవతారమెత్తారా అన్నది మనం తర్కించక్కరలేదు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతోందో అన్నీ ఆయనకి తెలుసు. కానీ, అవసరమైనంతవరకూ వారు కలగజేసుకోరని సూక్ష్మంగా చెప్పచ్చు.

   అలాగే బుద్ధావతారం, మనకి తెలిసిన బౌద్ధమత ప్రవక్త అవతారం కాదు. దాని గురించిన పూర్తి వివరాలు నాదగ్గర ప్రస్తుతం లేవు కానీ, అది గౌతమ బుద్ధుడు మాత్రం కాదని తెలుసు.
   శ్రీక్రృష్ణావతారం మానవులవలె జన్మించినదని చెప్పటం కుదరదు. అక్కడ వారి జన్మ వృత్తాంతం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే, శ్రీరామ జననానికి శ్రీకృష్ణ జననానికి చాలా తేడా కనిపిస్తుంది. ఒక్క రామావతారం మాత్రమే పూర్ణ మనుష్యావతారం. మిగిలినవన్ని కూడా పుట్టుకతోనే పరమాత్మ ప్రకటనములు. మరొక ఉదాహరణ, వామన మూర్తి జననం. వారుకూడా గర్భవాసం చేసే పుట్టినట్లు కనబడుతుంది.

   >>> బలరాముడా లేక బుద్దుడా ఎవరు అసలు అవతారం ?
   పైన చెప్పినట్లు, బుద్ధుడే దశావతారాలుగా చెప్పబడే అవతారాలలో ఒకటి. బలరామావతారం కుడా పరమాత్ముని అంశావతారముగానే చెప్పబడుతుంది కానీ, దశావతారాలలో పరిగణింపబడినట్లుగా వినలేదు.

   ఈ లెక్కలన్ని కూడా మన సౌలభ్యంకోసం, ఉపాసనా అనుకూల్యతకోసం మనకి మనం వేసుకున్నవి.

   “అజాయమానో బహుధాభిజాయతే” అంటుంది శ్రుతి. పరమాత్ముడు కేవలం పదే అవతారాలెత్తాడని చెప్పలేదు. ఒక్కసారి భాగవతం చూస్తే దశావతారాలు మాత్రమేకాక ఇంకా అనేకం కనబడతాయి.

   >>> పరశురాముడు చిరంజీవా?
   పరశురామావతారం జన్మతః వచ్చినట్లుగా చెప్పబడలేదు. శ్రీవారు తపస్సుచేత అవతారమైనారని చెప్పబడుతోంది. కేవలం పరమాత్ముని రుద్రాంశమాత్రమే (తదణుగుణమైన అంశలతో కలిపి) శ్రీ పరశురామావతారమునందు స్వీకరింపబడింది.

   ఇక వారు చిరంజీవా అంటే, ఋషుల ఆయుర్ప్రమాణములు మన లెక్కలలోకి రావు. వారికి మృత్యువు రాదు. ఉదాహరణకి, నేటి బయాలజీ లెక్కలలోనే, శరీరములోని పునర్నిమాణవ్యవస్థ కనుక లోపరహితంగా పనిచేస్తే, మన శరీరాలు సహితం ఎనాళ్ళైనా పడిపోవని చెప్తారు. మరి ఇక వారి శరీరాల గురించి ఊహ కూడా అసాధ్యమే. ఒక సిద్ధాంతం ప్రకారం:
   “The cells in our body drop and newer ones created all the time. In a typical case, the entire body will be regenerated in about seven years. However, as age progresses, the process faulters – eventually causing the body to fail. If a quirk in our immunity system leads to a perfect detoxification and a prefect regeneration, we can duck decay.

   Our human body appears to be designed to live for about 192 years. Most of us die of slow poisoning by chemicals in our food.”

   కాబట్టి వారు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మాత్రమే వారి శరీరాలు విడిచిపెడతారు. అలాగని వారు శరీరాలు విడిచిపెట్టిన తర్వాత కూడా అవి నాశనమవ్వవు. వారెప్పుడైనా ఎదైనా కార్యార్థం మళ్ళీ రావల్సి వస్తే ఆ అవసరంకోసం ఆ శరీరాలు భద్రంగా ఉంచబడతాయి. అది మానవుల వల్లనా లేక మానవాతీత శక్తుల వల్లనా అనేది అప్రస్తుతం.

   ఆంజనేయులవారు పూర్ణావతారం. శ్రీవారికి పూర్ణోపాసన ఉన్నది. జాంబవంతులవారిది అలాగ చెప్పబడలేదు.

   అట్లగే, చిరంజీవి అంటే చాలా కాలం జీవించేవారని అర్థం. సనాతనధర్మంలో కేవలం పరమాత్ముడు మాత్రమే శాశ్వతం, మిగిలినవన్నీ పడిపోయేవే – ఆఖరికి అమృతం తాగిన దేవతలు కూడా.

 5. 3:22 సా. వద్ద నవంబర్ 28, 2011

  ఏదో తోచిన విషయం ఒకటి రాస్తే, ఈ కామెంట్లు నాకు కొత్త పని పెట్టాయే! కానీ బాగుంది. నిజానికి ఓ కొత్త టపా రాయాలి. ఐనా, కౢప్తంగా చిన్ని ప్రయత్నం.

  *** రాధాకృష్ణ గారు: ముఖ్యంగా మీ వ్యాఖ్య నాకు కొత్త పని పెట్టింది. నిజానికి ఒక చుక్క గంగ మాత్రమే చవి చూసాను. చదవ వలసినవి, నేర్చుకో వలసినవీ చాలా ఉన్నాయి. ఇప్పటికి నాకు తెలిసినంత మటుకూ, భూమి గోళంగా ఉంటుంది అని ఎక్కడా చదివిన జ్ఞాపకం లేదు. మళ్ళీ పరిశీలనగా, ముఖ్యంగా, సూర్య సిద్ధాంతంతో మొదలుపెట్టి, సమాధానం దొరికితే తప్పక టపా రూపంలో తెలుపుతాను. పురాతన వరాహ క్షేత్రాలలో, భూమాత ఓ దేవతా స్వరూపంగా స్వామివారి ఎడమ తొడ మీద కూర్చున్నటు ఉంటారు. గత కొన్ని వందల ఏళ్ళలో కట్టిన గుళ్ళ సంగతి వేరు.

  *** anrd గారు: వరాహమంటే Wild Boar. వీటికి మాత్రమే కోరలుంటాయి. పైపెచ్చు ఇవి కాస్తంత రౌద్ర ప్రవృత్తిగలవై ఉంటాయి. స్వామివారు వరాహావతారంలో కాస్తంత రౌద్రంగానే చూపించబడ్డారు. మన పరిసరాలలో ఉన్నవి పందులు. అవి సాధు జంతువులు. అయినా వరాహావతారమంటే, ఆ దైవం నిజంగా ఆ రూపంలో వచ్చిందని నేను భావించను. అంతరిక్ష-ఖగోళ-భౌగోళిక శక్తులను ఇట్లా తేలికగా అర్థమయ్యేట్టు వివరిస్తారని నా భావన.

  *** వేణు గారు: సూటిగా చెప్పాలంటే ‘అంతా ఒక మాయ’. కానీ మీరడిగిన ప్రశ్నలకు త్వరలోనే నాకు తెలిసిన సమాధానాలు ఒక టపాగా ప్రచురించే ప్రయత్నం చేస్తాను.

 6. anrd
  6:25 సా. వద్ద నవంబర్ 28, 2011

  నాకు ఏమనిపిస్తోందంటే……**.” శ్రీ దేవీ భాగవతము ” గ్రంధములో ………వరాహస్వామి తన బంగారుకోరతో భూదేవిని సముద్రం నుంచీ పైకి తెచ్చి స్థిరంగా నిలబెట్టారని చెప్పటం జరిగింది. అంటే ” ఒకే కోర ” …………………
  అంటే మనం సామాన్యంగా చూసే వరాహాలకు కోరలుండవు. అడవిలో తిరిగే వరాహాలకు రెండు కోరలుంటాయి. అంటే ఆ అవతారమూర్తి మనం భావించే వరాహం వంటిది కాదు……….
  ** మరి ఏమిటి ? అంటే దీనికి సమాధానం ” శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ” వారే చెప్పటం జరిగింది. ” శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము ” అన్న గ్రంధంలో 61 వ పేజీలో వివరములు చక్కగా ఉన్నాయండి..

  ఇంతకుముందు ఈ విషయాలను చదివినా అంతగా గమనించలేదు మీ టపా చూసిన తర్వాత మళ్ళీ చదివితే బాగా అర్ధమయింది. మీకు కృతజ్ఞతలండి.
  మరికొన్ని వివరములతో టపా వ్రాశానండి. ..

 7. 3:17 సా. వద్ద డిసెంబర్ 22, 2011

  తెలుగు భావాలుగారూ.. నమస్తే..!

  మీ టపాని ఆలస్యంగా చూసాను..! “వరాహమూర్తి” భూమిని పైకెత్తిందీ.. హిరణ్యాక్షుణ్ణి చంపిందీ.. ఒకే అవతారంలోనేనా అని నాకు ఎప్పట్నుంచో డౌటు..! ఒకవేళ ఒకే అవతారం అయినప్పటికీ, ఒకే సమయంలో కాదని నా గట్టి నమ్మకం..! దీని గురించి అలా ఉంచితే, పురాణాల్లోని ఈ సంఘటన యొక్క వర్ణన వెనుక కొంత విజ్ఞానం ఉందని నా ఉద్దేశ్యం..!
  ఒక సిద్ధాంతం(ఎక్కువమంది అంగీకరించేది) ప్రకారం, భూగోళం పుట్టినపుడు(ఏర్పడినపుడు) ఈ గ్రహం మొత్తం నీళ్ళతోనే (సముద్రం) నిండిపోయి ఉంది(ట). అటుపైన కొన్ని కోట్ల తర్వాత, భూఅంతర్భాగం నుండి శిలాద్రవం(లావా) పైకి ఉబుకువచ్చి, భూభాగం (నేల) ఏర్పడింది(ట).
  ఇంక, ఒకప్పుడు ఖండాలన్నీ ఒకదగ్గరే ఉండేవని చదువుకున్నాం.. అంటే ఒకటే పెద్ద ఖండం ఉండేది.. అది ఎలా ఏర్పడిందన్నదానికి ఎక్కువ మంది చెప్పుకునే సిద్ధాంతమే పైది..! అంతపెద్ద భూభాగం ఏర్పడాలంటే ఎంత శిలాద్రవం పైకి ఎగసి ఉండాలి..? అంత పెద్దమొత్తంలో లావా పైకి ఉబుకు రావడానికి పెద్ద ఉల్కగానీ, గ్రహశకలం గానీ కారణమై ఉండవచ్చని చాలామంది అభిప్రాయం.. దీన్నే బహుశా, మన పూర్వీకులు “ఆది వరాహం”గా అభివర్ణించి ఉంటారు.. “ఆది వరాహం” ఇప్పటికీ భూమిని మోస్తోందని పురాణవేత్తల నమ్మకం.. నా ఉద్దేశ్యం, ఆ గ్రహశకలం/ఉల్క భూమిలోకి చొచ్చుకుపోయి ఉందన్నమాట..!
  ఇదంతా జరిగింది ప్రస్తుత కల్ప ప్రారంభంలో..! ఇది శ్వేతవరాహ కల్పం అని అందరికీ తెల్సు.. దానిక్కారణం ప్రస్తుతం భూభాగం ఏర్పడింది తెల్లని రంగులో ఉండే, వరాహంగా అభివర్ణించబడుతున్న ఒక ఉల్క/గ్రహశకలం అన్నమాట..! శ్వేతవరాహ కల్పంలో ఇప్పటి వరకూ గడిచిన కాలాన్ని గణిస్తే, భూమి పుట్టుకకి ఉజ్జాయింపుగా సరిపోతుందని ఎక్కడో చదివాను..

  నా interpretationలో తప్పులేమన్నా ఉంటే సవరించగలరు..!

  • 10:59 ఉద. వద్ద డిసెంబర్ 24, 2011

   ‘వామనగీత శర్మ’ గారు: భాగవతం మూడవ స్కందంలో, శ్రీమన్నారాయణీయం 13వ దశకం ఇత్యాదులలో – భూమిని పైకెత్తింది, హిరణ్యాక్షుణ్ణి సంహరించిందీ, ఒకే అవతారంగా చూపించారు. మీ సందేహానికి ఏదన్నా బలమైన కారణం ఉందా? మీరన్నట్టు, ఈ అవతారం భౌగోళిక ఖగోళ సంఘటనలను, వృత్తాంత రూపంలో అందించినది అని నా అభిప్రాయం కూడా! కాకపోతే, గ్రహశకలం లేక ఉల్క అని నేననుకోను. ఎందుకంటే, మంగళ గ్రహం ఆవిర్భావం వెనుకనున్న వృత్తాంతం ఒక్కసారి పరిశీలించండి. శివుడి చెమట బిందువు భూమి మీద పడి భౌమ్యుడైన కుజుడు ఆవిర్భవించాడని పురాణాలు, indirectగా ఇలాంటి ఉల్కలు, గ్రహ శకలాలు, Asteroids వంటివాటిని చూపాయి. యజ్ఞవరాహం అలాంటి ఆవిర్భావం కాదు. శ్వేతవరాహ కల్పం అన్నది శివపురాణాంతర్గత లింగోద్భవంతో కూడా ముడిబడి ఉంది.

   • 9:40 సా. వద్ద డిసెంబర్ 24, 2011

    అష్ట దిగ్గజాలు, ఆది కూర్మం , ఆది వరాహం అనేవి భూమిని మోస్తున్నాయని వర్ణన ఎందుకు వచ్చింది…? “ఆది” వరాహం భూమిని పైకెత్తింది కూడా సముద్రం నుండే కదా..! ఒక పెద్ద ఖండం (దీన్ని శాస్త్రీయంగా ఏమంటారో నాకు తెలీదు.. లూరేసియా అనుకుంటా..!) “శిలాద్రవం” పైకి ఉబుకువచ్చి ఏర్పడడం, ఒక పెద్ద గ్రహశకలం వల్ల తప్ప ఇంక దేని వల్లనా అయ్యే ఛాన్సే లేదు.. (ఇప్పటి వరకూ ఉన్న భావనల దృష్ట్యా) అయితే, ఇది నిజం , ఇది అబద్ధం అని ఖచ్ఛితంగా చెప్పగల స్థాయికి ఆధునిక విజ్ఞానం ఎదగలేదు.. (నేనూ అంతే..!).. ఇవి టెక్టానిక్‌ ప్లేట్స్‌ గానీ, అంతరిక్షం నుండి పడిన ఉల్కలో, గ్రహశకలాలో అవుతాయని నా ఉద్దేశ్యం..

    “వరాహావతారం”, “మత్స్యావతారం” గురించి నాకు సరైన అవగాహన లేక, కొన్ని సందేహాలు అప్పుడప్పుడూ వస్తాయిలెండి. పై వ్యాఖ్య రాసిన తర్వాత జ్ఞాపకం వచ్చింది.. నా డౌటు మత్య్సావతారం పైన, ప్రళయ కాలంలో జీవులని, జీవులున్న నావనీ రక్షించడం; వేదాలను తస్కరించి సముద్రంలో దాగిన రాక్షసుల్ని సంహరిందీ ఒకే సమయంలోనేనా అని నా డౌటు..!

    మీరు చెప్పిన ఉల్క ప్రస్తావన నాకు సరిగా అర్థం కాలేదు.. కొద్దిగా వివరించగలరా..?

   • 9:43 సా. వద్ద డిసెంబర్ 24, 2011

    క్షమించాలి… బృహత్‌ ఖండాన్ని “పేంజియా ” అంటారు

 8. Satyanarayana Piska
  5:48 సా. వద్ద డిసెంబర్ 24, 2011

  చాలా మంచి వ్యాసం అందించారండీ.

 9. Krishna Chowdary
  4:10 సా. వద్ద మే 23, 2013

  Kalpantham lo motham bhagavantudi srusti antha nillatho nindipothundi. Modata Paatalam tarvatha okkoka vurdva lokam nillatho ninidipothundi. Alage kalpamu prarambamlo okokka lokam malli punarnirmathamavuthaie. Aaprakaram ga nillalo vunna bhumini varaha murthy nilla paiki techi malli bhumini prathistinchinaaru. Idantha okka rojulo jaragaledukada. Appitike punarnirmithamaina lokaallo Hiranyakshudu putti vundavachu. Tarvatha Varaha swamy atanini champi vundavachu.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s