ముంగిలి > ఆధ్యాత్మికం, సనాతన ధర్మం > దశావతారాలు/అవతారాలు, బుద్ధుడు/బలరాముడు, చిరంజీవులు

దశావతారాలు/అవతారాలు, బుద్ధుడు/బలరాముడు, చిరంజీవులు

యజ్ఞవరాహమూర్తి స్వామివారి టపాకు వేణు గారు వేసిన ప్రశ్నలకు సమాధానంగా ఈ టపా వ్రాస్తున్నాను.

1 ప్ర) విష్ణుమూర్తి దశావతారాల ప్రణాళిక ముందే వేసుకొని ఉంటారా లేక అవసరార్థం అవతారం ఎత్తుతారా?

కలియుగాంతం రాక మునుపే, మన పురాణాలు కల్కి భగవానుని రాక గురించీ – ఆ స్వామివారు కాశ్మీర దేశంలో ఏ నామధేయంగల తండ్రికి జన్మిస్తారో వంటి విషయాలనుసైతం తెలుపుతున్నాయి. దీనిని బట్టి మీ ప్రశ్నలో తప్పకుండా ఆలోచింపజేసే విషయం ఉన్నది. కాస్తంత నిశితంగా పరిశీలిద్దాము.

అవతారము‘ – తారా స్థాయినుండి క్రిందికి దిగిరావడమని రమారమిగా అర్థం. వాడుక భాషలో ‘దిగిరావడం’ అని చెప్పవచ్చు. పురుషసూక్తంలో ఉన్న “అజాయమానో బహుధా విజాయతే” అంటే – జన్మనెత్తకనే, ఆ చైతన్యం ఎన్నో రూపాలలో గోచరిస్తుంది అని అర్థం చేసుకొనవచ్చును. రెంటినీ కలిపి ఆలోచించండి!

అవతారాలు ఆరు రకాలు. అంశావతారం, అంశాంశావతారం, ఆవేశావతారం, కలావతారం, పుర్ణావతారం ఇంకా పరిపూర్ణావతారం. అందుకే గమనించారో లేదో – వ్యాసుడు విష్ణ్వాతారమే, మనువు విష్ణ్వాతారమే, కపిలమహర్షీ విష్ణ్వాతారమే, పరశురాముడూ విష్ణ్వాతారమే, శ్రీకృష్ణుడు విష్ణ్వాతారమే. కానీ అందరినీ ఒకలాగే పూజిస్తున్నామా? విష్ణుస్వరూపమైన శ్రీ రాముడు మరో విష్ణుస్వరూపమైన పరశురాముని కాకతాళీయ పరిస్థితులలో ఎదురుపడిన సంఘటన రామాయణంలో చెప్పబడింది; అందరూ చదివో లేక వినో ఉంటారు. విష్ణుదేవుని ఆవేశావతారమే అయిన పరశురామునికి, శ్రీరాముడూ కూడా విష్ణ్వావతారమని తెలిసే ఉంటే, అసలు ఆ సంఘటన జరిగి ఉండేదా?

శ్రీ మహావిష్ణువు, లేదా పరమశివుడు, లేదా పరాశక్తి – ఎలా పిలిచినా – ఆ చైతన్యం ఒక అవతారము దాల్చినపుడు, ఒక్క రూపములోనే ఉండాలి అని ఎక్కడా లేదు. ఉదాహరణకు, భాగవతంలో శ్రీ కృష్ణుడు అవతారమును చాలించే ముందు, అర్జునుణ్ణి తోడ్కొని సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని వైకుంఠంలో దర్శించినట్టున్నది. ఆయనవద్దా సుదర్శనమున్నది – ఈయన వద్దా సుదర్శనమున్నది. ఇద్దరూ ఒకటే కానీ ఇద్దరూ వేరు – వేరు కూడా! శ్రీ కృష్ణుడు అర్చించిన విష్ణు ప్రతిమే గురువాయుర్‌లో ఉన్న మూల విరాట్టు అంటారు. ఆశ్చర్యంగా ఉందేఁ?  అంతెందుకు! మనందరిలోనూ విష్ణువు యొక్క అంశ ఉంటుంది. ఒక కుటుంబాన్ని పోషించే వ్యక్తిలో విష్ణ్వాంశ ఉంది; ఒక వ్యవస్థ సుస్థిరతకై పాటుబడే వ్యక్తిలో విష్ణువున్నాడు; అస్థిరత కలిగించే వ్యక్తులూ – వారి చేష్టలు గమనించినపుడు తిరగబడాలనింపించడం విష్ణు తత్వమే కదా! ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో! ఎక్కడో మనకు భిన్నంగా కాదు – మనందరిలోనే ఆ చైతన్యం తెలియకుండా వెలుగుతుంటుంది “అజాయమానో బహుధా విజాయతే“. అంతటి తత్వాన్ని యథాతదంగా ప్రతిపాదిస్తే సరిగా అర్థమవుతుందో లేదో – లేకపోతే మనకు ఇష్టం వచ్చినట్టు అనువదించుకొని తత్వాన్ని పక్క దారి పట్టిస్తామేమోనని మన ఋషులు తేలికగా పోల్చుకోగలిగిన విధంగా విషయాలను బోధించారేమో అని నా అభిప్రాయం.

దీనిబట్టి అర్థమయ్యేదేమిటంటే, మీరు ఉటంకించిన గీతా శ్లోకం చెప్పినట్టు, దేశ-కాల పరిస్థితులకనుగూణంగా సుస్థిరతను ఏర్పరచడానికి, ఆ చైతన్యం కొన్ని కొన్ని సందర్భాలలో కొందరిలో విశేషంగా ప్రకాసిస్తూ మన మధ్యన తిరుగాడుతుంది.  సరే, ఇలా-ఇలా అని ముందే పది అవతారాల ప్రణాళిక వేసుకోనుంటారా? ప్రణాళిక అని అననుకానీ, అవసరాలను ఊహించుకొని ఎంతటి తేజస్సుతో ఉద్భవించాలో ముందే తెలుసుకోవచ్చును. పైపెచ్చు, కల్పాలు, మన్వంతరాలు అని సమయాన్ని యుగాల కొలతలతో హైందవ ధర్మం లెక్క కడుతుంది. అంటే, మళ్ళీ మళ్ళీ ఒకే లాంటి దేశ కాల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే మునుపెన్నడో వచ్చిన అవతారం లాంటిదే మళ్ళీ రావాలన్నమాట.

2 ప్ర) బలరాముడా లేక బుద్దుడా?

బలరాముడు అని అనేవారి తర్కం – బుద్దుడు సనాతన ధర్మానికి భిన్నమైన ధర్మాన్ని బోధించాడు అని. బుద్ధుడు అని తర్కించే వారి వాదన – ఒకే కాలంలో రెండు అవతారాల ప్రయోజనం ఏమిటీ అని? ఇది ఒక్క ముక్కలో తేల్చే విషయం కాదు. పై పెచ్చు ఈ రెంటిలో ‘ఇదీ’ అని ఎవరన్నా అంటే, వాదనలకు తలుపులు తెరిచినట్టే! అంచేత దినిని స్పృశించకుండా వదిలివేయటమే శ్రేయస్కరం.

3 ప్ర) చిరంజీవులు

చిరంజీవులు అంటే చిరకాలం జీవించిఉండే వారు అని అర్థం. కానీ అంతం లేని వారని కాదు.

అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః |
కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః ||

దీనిని బట్టి తెలిసేదేమనగా అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడూ (కృష్ణద్వైపాయనుడు) హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు. వీరు ఏడుగురు చిరంజీవులు. హనుమంతుడు భవిష్య బ్రహ్మ; బలి చక్రవర్తి భవిష్య ఇంద్రుడు.

ప్రకటనలు
 1. వేణు
  10:08 ఉద. వద్ద నవంబర్ 29, 2011

  నా సందేహాలను టపా గా వ్రాసినందుకు ధన్యవాదాలు! మీ సమాధానాలు సంతృప్తినిచ్చాయి.
  అంతా విష్ణు మాయ!

 2. manohar Chenekala
  12:18 సా. వద్ద నవంబర్ 29, 2011

  Good explanation

 3. estari
  8:53 సా. వద్ద అక్టోబర్ 25, 2012

  జీవ పరిణామము గురించి తెలుపంది.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s