ముంగిలి > ఆధ్యాత్మికం > శ్రీరామ సుగ్రీవులు | రామాయణంలోని స్నేహాలు

శ్రీరామ సుగ్రీవులు | రామాయణంలోని స్నేహాలు

వాలి రావణుల తప్పుడు స్నేహానికి భిన్నమైన ఉత్తమ శ్రేణి స్నేహం – శ్రీరామ సుగ్రీవుల మైత్రి. శ్రీకృష్ణార్జునుల మధ్య, వ్యక్తిత్వాల ఆకర్షణ – స్నేహానికి పునాది. శ్రీరామ సుగ్రీవుల మధ్య – పరస్పరావసరాలు మూల కారణం. ఈ కోవకు చెందిన స్నేహాలనే, నేను ఈ శీర్షిక ముందుమాటలో Arranged marriages తో పోల్చినది. శ్రీరాముడికి సుగ్రీవుడెవరో తెలియదు. సుగ్రీవుడికీ శ్రీరాముడెవరో తెలియదు. దూరంగా రామలక్ష్మణులు మొదటిసారి కనిపించినపుడు, తనను చంపమని – వాలి ఎవరో ఇద్దరు యోధులను పంపించి ఉంటాడని అనుమానంతో, హనుమను విషయం తెలుసుకోడానికి, మారువేషంలో పంపిస్తాడు.

సీతమ్మను వెతుకుతూ, రామలక్ష్మణులు కబందుడి బారిన పడతారు. శ్రీరాముడు కుడి భుజాన్ని, లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నరికివేసిన తరువాత, కబందుడు తన శాపవిమోచన శుభ ఘడియలాసన్నమైనవని తలిచి, వెంటనే తన వికృతమైన రాక్షస శరీరానికి అగ్నిసంస్కారం చేయమని వేడుకుంటాడు – వారు అలానే చేస్తారు. అప్పుడు చితి నుండి ఉద్భవించిన ఓ దివ్య పురుషుడు, సీతమ్మ జాడను తెలుపడు కానీ, అందుకు ఓక మార్గం సూచిస్తాడు. భార్యా వియోగం అనుభవిస్తున్న సుగ్రీవుడి ఆచూకీ తెలిపి, ఋష్యమూక పర్వతం మీద ఉండే అతనితో స్నేహం చేయమంటాడు. అలానే జరుగుతూంది. ఇరువురూ ఒకరికొకరు సహాయం చేయటానికి ఒప్పుకొని, అగ్నిసాక్షిగా స్నేహం చేస్తారు.

రామ సుగ్రీవులు - అగ్నిసాక్షిగా మైత్రి

రామ సుగ్రీవులు - అగ్నిసాక్షిగా మైత్రి

వాలి వధ అనంతరం, శ్రీరాముడు సుగ్రీవుడిని వర్షాకాలమంతా కిష్కిందలో సుఖంగా గడపమని చెప్పి, లక్ష్మణుడితో తను ప్రస్రవణగిరి వద్దే ఉంటాడు. కానీ, సుగ్రీవుడు కామ పరవశంలో, ఏకాంతంగా భోగలాలసుడై, శరత్కాలం వచ్చినా, తన వాగ్దానాన్ని మరిచి సుఖాలలో మునిగితేలుతుంటాడు. అప్పుడు హనుమ హితబోధ చేస్తే, స్పృహవచ్చి నీలుడిని అన్ని దిక్కులనుండి సమస్త వానర సైన్యములను సమీకరించమని ఆదేశిస్తాడు. ఇంతలోనే తన అన్న పడుతున్న వ్యథను చూడలేక, మాటనిలబెట్టుకోని సుగ్రీవుడిని లక్ష్మణుడు మందలించాలని కిష్కింద చేరుకున్నప్పుడు, ముఖం చెల్లక, సుగ్రీవుడు వాక్చతురతగల తారను పంపి, లక్ష్మణుడి కోపాన్ని శాంతింపజేస్తాడు. ఐనా మాట మరిచినందుకు, లక్ష్మణుడు సుగ్రీవుడిని మందలిస్తాడు. తన తప్పు ఒప్పుకొని, సుగ్రీవుడు సీతాన్వేషణ మొదలుపెడతాడు.

సీతమ్మ జాడ తెలిసిన తరువాత, సేతు నిర్మాణం చేసి, వానర సేన లంకకు చేరుకుంటుంది. యుద్ధం ఆరంభమవకముందు శ్రీరాముడు సుగ్రీవునితో, వానరసేనాపతులతో కలసి, సువేల పర్వతం ఎక్కి, త్రికూటపర్వతం పైనున్న లంకా నగరాన్ని వీక్షిస్తారు. దూరంగా రావణాసురుడు కనిపించగానే, శ్రీరామునిపై ఉన్న అపారమైన స్నేహపూర్వక ఆప్యాయతవల్ల, ఒక్క ఉదుటున లేచి – సుగ్రీవుడు సువేల పర్వతం నుండి ఎగిరి లంకకు చేరుతాడు. రావణుడితో భీకరంగా మల్లయుద్ధం చేస్తాడు. ఒకరినొకరు ఏ మాత్రం తీసిపోనట్టుగా ద్వంద్వ యుద్ధం చేస్తారు. ఇక రాక్షసరాజు మాయా యుద్ధానికి సిద్ధపడ్డాడని తెలిసి, సుగ్రీవుడు తిరిగి శ్రీరాముడిని చేరుతాడు.

అప్పుడు ఆప్యాయంగా శ్రీరాముడు సుగ్రీవుడిని అక్కున జేర్చుకొని – మాటమాత్రం చెప్పకుండా అలాంటి సాహసానికి మరెన్నడూ పునుకోవద్దని విన్నవించుకుంటాడు. ప్రాణమిత్రుడైన సుగ్రీవుడికి జరగరానిదేదన్నా జరిగిఉంటే, సీతవలనకానీ, భరతలక్ష్మణశత్రుఘ్నులతోగానీ, చివరికి తన ప్రాణములతోగానీ తనకు ఏమి ప్రయోజనమని ప్రశ్నిస్తాడూ.

సుగ్రీవుడు రావణుడితో యుద్ధానికి చెప్పకుండా వెళ్ళిన తరువాత, ఒకవేళ సుగ్రీవుడికేదన్న జరిగితే – తాను ఏమి నిర్ణయం తీసుకున్నాడో శ్రీరాముడు చెబుతాడు. రావణుడిని, అతని పుత్రులను, బలములను, రణరంగంలో హతమార్చి, లంకకు విభీషణుడిని ప్రభువును చేసి, కోసలరాజ్యాన్ని భరతుడికి అప్పగించి, తన దేహము చాలించాలని నిర్ణయించుకున్నట్టు చెబుతాడు. ఇది చాలు శ్రీరామ సుగ్రీవుల స్నేహాన్ని అర్థం చేసుకోడానికి.

సుగ్రీవుడు శ్రీరాముడితో స్నేహం చేసినపుడు, అతనికి శ్రీరామ వైభవం అంతగా తెలియదు. నా పరిస్థితి ఎలాంటిదో, నీ పరిస్థితీ అంతే – మనమిద్దరూ ఒకటే అనే భావనతో సుగ్రీవుడి మైత్రి మొదలవుతుంది. వాలిని చంపడం, రాముడివల్ల అవుతుందా అని అనుమానపడతాడు – పరీక్షలూ పెడతాడు. వేటికీ శ్రీరాముడు చలించడు. అగ్నిసాక్షిగా చేసిన స్నేహానికి కట్టుబడి, సుగ్రీవుడు ఏది చెబితే అది చేస్తాడు. వాలి మరణించిన తరువాత, ఒక్క సారిగా అన్ని భోగాలు దొరకటంతో, వాటిని అనుభవించడంలో మునిగిపోయి, తన కర్తవ్యాన్ని తాత్కాలికంగా మరుస్తాడు. ‘నువ్వెవరు-నేనెవరు’ అనే స్థితికి దిగజారక, భోగాలనుండి స్పృహను తెచ్చుకుంటాడు. తన తప్పును ఒప్పుకుంటాడు.

సుగ్రీవుడికున్న ఏ అర్హతలవల్ల శ్రీరాముడికి దగ్గిరయ్యాడు?

ఒక్కమాటలో చెప్పాలంటే, సుగ్రీవుడిది కల్మషంలేని చిన్నపిల్లాడిలాంటి మనసు. మనసు మాత్రమే సుమా! వీర్యశౌర్యాలు, బాహు బలం అన్నీ ఉన్నా, మనసు ఎంతో మంచిది. తనను తరిమేసిన అన్నయ్య పేరు చెబితే భయపడి, భూమంతా తిరిగాడు. చివరికి ఋష్యమూక పర్వతం మీద వాలి అడుగు పెట్టకుండా శాపం పొందాడు కాబట్టి, అక్కడికి చేరుకుంటాడు.

హనుమ వంటి స్నేహితుడు – రాజ్యంలేని రాజుకు మంత్రి. హనుమంతుడో గొప్ప ధర్మవేత్త. భారతంలో అర్జునుడికి ఉన్న వరం ధర్మాత్ముడైన అన్న చెప్పు చేతల్లో మెలగడం. రామాయణంలో అందుకు పోల్చదగ్గ ఉదాహరణ సుగ్రీవ-హనుమలది. ‘ఏయ్ ఠాట్‌! నువ్వెవరురా నాకు చెప్పడానికి’ అని డాంబికాలకు పోకుండా, హనుమ ఎలా మార్గదర్శకత్వం చేస్తే, పూర్తి నమ్మకంతో అలా నడిచి, ఎన్నడూ అధర్మానికి వొడిగట్టకపోవడం – శ్రీరామ సాంగత్యాన్ని పొందడనికి గల రెండో కారణం. ఒక సత్సంగం మరో సత్సంగానికి కారణమయింది.

రావణుడు మరణించినపుడు, విభీషణుడు “ఛీ! ఈ నీచుడికి నేను అంత్యక్రియలు చేయను” అంటాడు. కానీ, సుగ్రీవుడికి అన్న మృత కళేబరాన్ని చూసినపుడు, పట్టలేని దుఃఖం పొంగుకొచ్చి, అన్నీ త్యజించాలన్న వైరాగ్యం పుట్టుకొస్తుంది. అదీ కల్మషంలేని అమాయకమైన మంచి మనసంటే! నిజంగా వాలి మరణం కోరుకొనుంటే, శత్రుశేషం మిగలకుండా వాలి పుత్రుడినికూడా చంపేసుండే వాడు – అందుకు భిన్నంగా అంగదుడికి యువరాజ పట్టాభిషేకం చేస్తాడు. అంగదుడికి సుగ్రీవుడిమీద అనుమానం ఉన్నట్టు, కిష్కిందకాండ చివరిలో బయట పడుతుంది – కానీ సుగ్రీవుడికి అంగదుడిమీద ఉన్న ఆప్యాయతను శంకింపజేసే ఏ ఘట్టమూ రామాయణంలో దొరకదు. చూచాయిగా తనూ చూశాడు – ఒక రాక్షసుడు ఎవరో స్త్రీని బలవంతంగా విమానంలో దక్షిణదిశకు ఎత్తుకొపోవడం. అందుకే, దక్షిణదిశకు సీతాన్వేషణకు వెళ్ళిణ బృందంలో జాంబవంతుడి వంటి అనుభవజ్ఞుడిని, హనుమంతుడి వంటి తెలివి గలవాడివంటివారిని చేర్చి, ఆ బృందానికి నాయకుడిగా అంగదుడిని పెట్టాడు. ఒకవేళ మనసులో కల్మషం ఉండి ఉంటే, విజయావకాశాలు మెండుగా ఉన్న ఆ బృందానికి ఖచ్చితంగా అంగదుడినిగాక, మరెవరినన్నా నాయకుణ్ణి చేసుండేవాడు.

ఇక శ్రీరాముడో? వానరప్రభువని ఎప్పుడూ చిన్న చూపు చూడడు. తనతో సమానమైనవాడిగానే, ఎప్పుడూ ఆదరిస్తాడు. సుఖాలలో ఒళ్ళుమరిచి తన గురించి పట్టించుకోవడం మానేసినపుడు కూడా, తన దుర్భాగ్యాన్నే తిట్టుకుంటాడు కానీ, సుగ్రీవుడిని ఏమీ అనడు. తప్పు తెలిసి తనను చేరినపుడు, మళ్ళీ ఆప్యాయంగా క్షమిస్తాడు. యుద్ధంలో ఏది నిర్ణయించినా, సుగ్రీవుడిని సంప్రదించిన తరువాతనే.

తన పట్టాభిషేకంలో సుగ్రీవుడు పక్కనేఉంటాడు. చివరికి అవతారం చాలించినపుడు కూడా, సుగ్రీవుడు రాముణ్ణే అనుగమిస్తాడు. వీరి స్నేహమెక్కడ? వాలి రావణుల స్నేహమెక్కడ?

తరువాయి లేఖలో, శ్రీరామ గుహుల స్నేహంగురించిన విశేషాలతో కలుస్తా. కుల వివక్షను నమ్మేవారికి, శ్రీరామ-గుహుల కథనం పెద్దగా నచ్చకపోవచ్చు.


స్నేహమంటే?

రామాయణంలోని స్నేహాలు

1. వాలి రావణులు
2. శ్రీరామ సుగ్రీవులు
3. శ్రీరామ గుహులు
4. కైకేయి మంథరలు
5. హనుమ సుగ్రీవులు
ప్రకటనలు
  1. 10:38 ఉద. వద్ద డిసెంబర్ 21, 2011

    ఆర్యా! మీరు మూలం చదివి చక్కగా వివరించారు. నేను శృత పాండిత్యం తో రాసాను. చాలా విషయాలు తెలుసుకున్నా. ధన్యోస్మి.

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s