ముంగిలి > ఆధ్యాత్మికం > కైకేయి మంథరలు | రామాయణంలోని స్నేహాలు

కైకేయి మంథరలు | రామాయణంలోని స్నేహాలు

మంథర కైకేయియొక్క అరణపుదాసి ఐనా, “ఓ మూఢురాలా” అని కైకేయిని సంబోదించేతంటతి చనువునును బట్టి, దాసి అనడం కన్నా – ఆంతరంగికురాలు, సన్నిహితురాలు అనడం సబబు. తప్పుడు స్నేహాలకు తలమానికమైన ఉదాహరణ.

వాల్మీకి మహర్షి, పాత్రలను సంబోధించిన విధానం బట్టి, వారెటువంటివారో ఒక అంచనాకు తేలికగా రవచ్చు. ఉదాహరణకు అయోధ్యకాండ సమయంలో తప్పుడు పనులు చేస్తున్న మారీచుడిని మానవాస్త్రంతో రాముడు దెబ్బకొట్టిన తరువాత, అతను మారి ఒక ఋషిలాగా ధర్మబద్ధంగా జీవితం సాగిస్తుంటాడు. మాయలేడిగా మారి తనకు సహాయం చేయమని రావణుడు అడగడానికొచ్చినపుడు, అదే మారీచుడిని, వాల్మీకి మహర్షి ‘మహాప్రాజ్ఞో మారీచో‘ అని అరణ్యకాండలో సంబోధిస్తారు. అయోధ్యకాండ 7వ సర్గలో కైకేయికి దుర్బోధ చేసిన ఘట్టంలో మహర్షి ఉపయోగించిన వర్ణన ‘మంథరా పాపదర్శినీ‘. ఇక మీరే లెక్కేసుకోండి.

కౌసల్యాదేవి దాసి ద్వారా, శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలుసుకొని, మంథర కైకేయిని చేరి “ఓ మూఢురాలా! లెమ్ము. ఇంకను పరుంటివేల? భయంకరములైన పెనుఆపదలు, దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోవుచుండగా తెలిసికొనలేకున్నావు” అని మొదలుపెడుతుంది. ఇక దాని తరువాత కైకేయిని రెచ్చగొట్టాలని “మీ ఆయన నీమీద చూపించే ప్రేమ కేవలం ఒక నటన,” “కపటి ఐన నీ భర్త…,” “దశరథుడు నీకు పతిరూపములోనున్న శత్రువు,” “పామును ఒడిలో చేర్చుకొనినట్లు దశరథుడిని నమ్మి లాలించావు,” “నీ భర్త అసత్యవాది – పాపి” అన్ని హద్దులు మీరి మాట్లాడుతుంది. ఇవేవి కైకేయి చెవికెక్కవు. అప్పటివరకు, పాన్పుపైనే ఉండి వింటున్న కైక, శ్రీరామపట్టాభిషేకం విషయం వినపడగానే వెంటనే ఆనందంతో లేచీ కూర్చుంటుంది. పట్టాభిషేక వార్తకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై, మంథరకు ఒక విలువైన ఆభరణాన్ని బహూకరిస్తుంది. ఆ ఆభరణాన్ని మంథర దూరంగా విసిరికొడుతుంది!

పై సన్నివేశం బట్టి, విరిద్దరి మధ్యనున్న సంబంధాన్ని, వీరి వ్యక్తిత్వాలను లెక్క కట్టొచ్చు.

‘దశరథుడు’ అంటే, వీధి చివరి కిళ్ళీకొట్టువాడు కాదు – కోసల దేశానికి మహారాజు! వశిష్ఠ బ్రహ్మర్షి వంటి రాజ గురువులుండి, ఆశ్వమేధ యాగాలవంటివి చేసి, ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్న చక్త్రవర్తి! అలాంటి దేశ ప్రభువును పట్టుకొని అంతలేసి మాటలందంటే, ఎంతటి పాప చింతన కలదై ఉండాలి? తను ఎవరి వద్ద దాసిగా కొలువు చేస్తోందో, ఆ కైకేయి భర్తనే తూలనాడింది. ఒక భార్య దగ్గిర భర్త గురించి ఇంత దారుణంగా మాట్లాడితే, ఈ కాలంలోనైనా – ఎంత బరితెగించిన స్త్రీఐనా ఒప్పుకోదేమో?

ఇక కైక విషయానికొస్తే, రావడం రావడం కస్సు-బుస్సులాడుతూ వచ్చి అంతలేసి మాటలాడుతుంటే, పట్టి పట్టనట్టుగా ఉన్నదంటే, తనకు అలవాటై ఉండాలి. ఐనదానికి కానిదానికి చాడీలు చెప్పెవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారో, అలా ప్రవర్తించింది – “దీని స్వభావమే అంత!” అన్నట్టు. తనను “మూఢురాలా” అని సంబోధించేతంటతి స్వాతంత్ర్యం ఇచ్చి పక్కన పెట్టుకుంది. తనంటే పిచ్చి అభిమానమున్నట్టుగా కూడా భావించి ఉండవచ్చు. నిజానికి ఇక్కడ కైకేయి ఒక అమాయకురాలిగా కనిపిస్తోంది. ఎంత అమాయకత్వం అంటే, తనమీద – పట్టమహిషికన్నా ఎక్కువ ప్రేమ కురిపించే భర్తను అన్నేసి మాటలంటుంటే, నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండేటంత! శ్రీరామ పట్టాభిషేకం గురించి తెలియగానే ఎగిరి గంతేసిందంటే, తనకు రాముడి మీద ఉన్న పుత్ర వాత్సల్యం భరతుడిమీద ఉన్నదానికన్నా తక్కువేంకాదు – అని తేటతెల్లమవుతోంది. ఈ అమాయకత్వాన్ని వాడుకొని, తనను ఎంతో ఇష్ట పడే భర్తకు విరుద్ధంగా ప్రవర్తించి, పుత్ర ప్రేమను విషపూరితం చేయటానికి – మంథరకు పెద్దగా సమయం పట్టలేదు.

కైకేయి మంథరలు

కైకేయి మంథరలు

ముందు భర్తను తూలనాడి ప్రయత్నిస్తుంది – మంథర. తరువాత రాముడి మీద పడుతుంది. దశరథునిగురించి ఏమీ మాట్లాడదుకానీ, రాముడిగురించి చెడుగా చెబితే మాత్రం, కైక ఒప్పుకోదు. వెంటనే, రాముడి గుణగణాలను కొనియాడుతుంది. చివరి అస్త్రంగా సవతిపోరునెత్తుతుంది. “…నీవు రామమాతయగు కౌసల్యను లోగడ తృణీకరించియుంటివి. నీ సవతియగు ఆమే, ఆ పగను ఇప్పుడు ఎట్లు తీర్చుకొనక యుండును?” అన్న ప్రశ్న కైకమీద ఎట్టకేలకు ఫలిస్తుంది.

ఇక కైక నమ్మిన తరువాత, రాముణ్ణి 14 ఏళ్ళు అడవులకు పంపి, భరతుడి పట్టాభిషేకం ఎలా చేయించాలో చక్కగా చెబుతుంది. మలిన వస్త్రాలు ధరించి, కోపగృహంలో ఇదంతా ఎలా సాధించాలో సవివరంగా చెబుతుంది. తర్వాతి వృత్తాంతం అందరికీ తెలిసిందే. కానీ పూర్తిగా తెలుసుకోవాలంటే, రామాయణం చదవాల్సిందే. అయొధ్యకాండలో ఈ రాద్ధాంతం చదవటానికి గట్టి గుండె కావాలి. దశరథుడు పడిన ఆవేదన, కౌసల్యామాత అనుభవించిన క్షోభ వర్ణనాతీతం. ఒక్క శ్రీరాముడు తప్ప, అందరూ విచలితులైపోతారు. పాపం సీతమ్మకు నారచీర కట్టుకోవడం రాక బాధ పడుతుంటే, రాముడే సీతమ్మ కట్టుకున్న పట్టు వస్త్రాలపై ఆ నారచీర కట్టు నేర్పించినపుడు, అంతఃపురకాంతలు ఆమే అగత్యం చూసి భరించలేక, సీతమ్మకెందుకు ఈ అగఛాట్లు అని రోదించినా కైకకు పట్టదు. బ్రహ్మర్షి ఐన వసిష్టుడు సైతం కదిలిపోతాడు. “దురాచారపరురాలా కైకా” అని మందలిస్తాడు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే!

సీతాలక్ష్మణ సమేతంగా, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాక, దశరథుడు ప్రాణాలు విడుస్తాడు. జరిగిన విషయం చెప్పకుండా, భరతుణ్ణి అయొధ్యకు రప్పిస్తారు. వాతావరణంలోని దుఃఖానికి బెంబేలెత్తిపోతూ భరతుడు, కైకమ్మను ఏమి జరిగిందని అడుగుతాడు. దానికి కైకమ్మ తాపీగా చెప్పే సమాధానం “నాయనా! భరతా! నీ తండ్రియైన దశరథమహారాజు గొప్ప మహాత్ముడు, మిగుల పరాక్రమశాలి, యజ్ఞాచరణశీలుడు, సత్పురుషుల పాలిటి పెన్నిధి. సమస్త ప్రాణులును పొందెడి పరమగతియే మీ తండ్రికినీ ప్రాప్తించెను.” ఓహో! తరువాత తను భరతుడికోసం పడిన శ్రమను వివరిస్తుంది. కైకకు కథ అడ్డం తిరుగుతుంది.

మంథర దశరథమహారాజుని ఏ రకంగా తూలనాడుతుందో, తన భర్తని తను ఎంత కించపరిచిందో అంతే దారుణంగా తన కొడుకు చేతిలో దారుణాతి దారుణమైన మాటలు పడుతుంది.

ద్వారపాలకులు మంథరను ఈడ్చుకొచ్చి శత్రుఘ్నుడికి జరిగినది చెబుతారు. ఎరుపెక్కిన కళ్ళతో కోపావేశుడై, శత్రుఘ్నుడు తన అన్న భరతుడి దగ్గిరకు ఈడ్చుకుపోతుంటే, భవనం దద్దరిల్లేలా మంథర రోదిస్తుంది. దాని రోదనకు భయపడి, కైకేయికున్న ఇతర దాసీ గణం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని కౌసల్యా మందిరానికి పరిగెడతారు. అప్పుడు కైక ఎన్నడూ ఉహించనివిధంగా భరతుడొక మాటంటాడు. “ఈమెను క్షమింపుము. ఎవ్వరును స్త్రీలను చంపుట తగదు. కైకేయి కడుదుష్టురాలు, ఎంతయు పాపాత్మురాలు. కనుక ఆమెను నేనే చంపవలసియుండెను. కానీ ధర్మాత్ముడైన శ్రీరాముడు ‘ఇతడు మాతృహంతకుడు’ అని నన్ను నిందించునను భయముతో నేను ఆట్లు చేయలేదు.” దెబ్బకు దెయ్యం దిగుతుంది!

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనం? మంథర వంటి స్నేహితురాలి లేని-పోని మాటలు నమ్మి, కైక తన సౌభాగ్యాన్నే కాదు, తన కొడుకు ప్రేమకూ దూరమై పోతుంది. అందరూ చీదరించుకునే దారుణమైన పరిస్థితులకు దిగజారి పోతుంది. పాపం భరతుడు కూడా మిగతా అందరిదగ్గిర ఎన్నో మాటలు పడతాడు. శ్రీరాముడు, వసిష్టాదులు మినహా అందరూ భరతుణ్ణి శంకించి తూలనాడుతారు.

తాత్వికాన్ని పక్కన పెట్టి, లౌకికంగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు కనిపిస్తాయి. చాడీలు చెప్పే స్నేహితులు, లేని పోనివి కల్పించి అంచనాలు వేయించే స్నేహితులను నమ్ముకుంటే, ఉన్నది కూడా చేయిజారిపోతుంది. తను కాక తన వారు కూడా ప్రతిఫాలాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఇలాంటి మంథర వంటి వారు కోకొల్లలు. మంచి స్నేహితులు దొరకడం దేవుడెరుగు, ఇలాంటి వారు ఒక్కరు చాలు – సర్వనాశనం కావటానికి.

ఇంతకీ ఈ మంథర ఎవరు? ఇలా ఎందుకు జరిగింది? ఈ విషయాలపై నేను సేకరించిన తాత్విక, లౌకిక కారణాలుగల విశ్లేషాత్మక టపా ప్రచురించే ప్రయత్నం చేస్తాను.


స్నేహమంటే?

రామాయణంలోని స్నేహాలు

1. వాలి రావణులు
2. శ్రీరామ సుగ్రీవులు
3. శ్రీరామ గుహులు
4. కైకేయి మంథరలు
5. హనుమ సుగ్రీవులు
ప్రకటనలు
 1. 10:23 ఉద. వద్ద డిసెంబర్ 26, 2011

  mee vishleshana baagundi.

 2. 12:50 సా. వద్ద డిసెంబర్ 26, 2011

  రామాయణ కాలం కలియుగములోనూ మా రాజ్యములో జయలలితా,శశికళా రూపములో వెలసిల్లు చున్నారు. గమనించవలె. ఇది పురాణ కాలములో మాత్రమె సంభవము కాజాలదు. అన్ని కాలములకు వర్తించును.

  బ్లాగు కాలమునకు టపా మరియు కామెంటు దారలకున్న స్నేహము లాంటిదన్నమాట !

  చీర్స్
  జిలేబి.

 3. visali
  6:07 సా. వద్ద డిసెంబర్ 26, 2011

  తన స్థాయి కన్న తక్కువ వారికి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుందో రామాయణంలో ఈ సన్నివేశం తెలుపుతుంది. ఒక దాసి యజమానురాలిని “ఓ మూర్ఖురాలా” అని సంభోదిస్తే తల తీసివేయక, ఇంకా ఆ మాటలు వింది అంటే అక్కడ ఆవిడ వ్యక్తిత్వం బయటపడుతుంది. ఎక్కడెక్కడ ఇంక రామాయణం అయ్యిపోతుంది అని అనిపిస్తుందో అదే సమయం లో ఒక స్త్రీ పాత్ర వచ్చి కథ పొడిగిస్తుంది.

  అరణ్యవాసం లో ఉన్నప్పుడు శూర్పణఖ, సీత ఆత్మ హత్య చేసుకొవాలనుకున్నప్పుడు త్రిజట…ఇలా….

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s