ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి > సీతమ్మ అగ్ని పరీక్ష – నిజానిజాలు

సీతమ్మ అగ్ని పరీక్ష – నిజానిజాలు

ఈ టపా/వ్యాసం ఎందుకు?

రామాయణానికి మూలం ఏది అన్న విశేషం గురించిన ఫణీంద్రగారి టపాలో, ఒకరు అసంధర్భంగా చేసిన వ్యాఖ్య – ఈ టపా రాయటానికి మూల కారణం.

రాముడు సీతను నిప్పుల్లో దూకి పాతివ్రత్యం నిరూపించుకోమంటాడా ? లేక సీతే రాముడు అనుమానించాడని దూకుతుందా.. నీకోసం కాదు.. నా పౌరుషాన్ని నిరూపించుకోడానికి యుద్ధం చేశాను అంటాడు రాముడు సీతతో.. అని చదివాను.. ఇది కూడా ఆ మ.భా. నే అన్నాడా ? ఎవరైన వాల్మీకి గారిని అడిగి చెప్తారా ? .. 😉

నిష్కారణంగా – అద్దాలమేడమీద రాయి విసిరినట్టుగా అనిపించింది. “ఛీ! నోర్ముయ్ అప్రాచ్యుడా” అని అతనికి సమాధానం ఇవ్వగలను – కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. నా వ్యాఖ్యపై పగబట్టి, అడ్డమైన చోటా ఏకి పెడతాడు. ఆ ఆడిగినతను వ్యంగ్యంగా వేసిన ప్రశ్న, శ్రీరాముడి ఔన్నత్యాన్ని నమ్మిన కొందరి మనసులలో సైతం ఎక్కడో అక్కడ ఏదో ఒక మోతాదులో దాగి ఉండి ఉంటుంది. అడగడానికి జంకుతారు అంతే! “శ్రీరాముడు గొప్పవాడే కానీ, ఆ ఒక్క విషయం ఏమిటో అర్థమవ్వదు” అన్నట్టు.

అంచేత, కేవలం మహాకవి శ్రీ వాల్మీకిమహర్షి విరచిత శ్రీమద్రామాయణంలోని విశేషాలనే ప్రస్తావిస్తూ – అసలు ఏమి జరిగింది అన్న ప్రశ్నకు సంభందించిన వివిధ అంశాలను ఈ టపాలో పొందుపరుస్తున్నాను. నేను చెప్పానని కాదు! నాకు అనిపించిందని కాదు! ఈ టపాను పూర్తిగా చదివి మీరే పై ప్రశ్నలకు సమాధానం కూర్చుకోండి.

ఇది కాలక్షేపం టపా కాదు. ఐదారు పుటలు నింపేటంతటి సమగ్రమైన వ్యాసం. దయచేసి, ఒకటి రెండు వాక్యాలను చదివి, వ్యాఖ్యలు చేయవద్దని మనవి.

రావణుడి వరము

ముందుగా రావణాసురుడు ఎటువంటి వరాలను పొందాడో తెలుసుకోవాలి. ఈ విశేషాలు – శ్రీమద్రామాయణములోని ఉత్తరకాండ పదవ సర్గలో తెలుస్తాయి. బ్రహ్మదేవుడిని తన ఘోరమైన తపస్సుచే మెప్పించి, రావణుడు అమరత్వాన్ని ప్రసాదించమని కోరుతాడు. పూర్తిగా అమరత్వము ప్రసాదించడం కుదరదని; వేరే మరేదైనా కోరుకొమ్మని బ్రహ్మదేవుడు చెప్పడంతో, రావణుడు “గరుడజాతి, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, దేవతల” చేతిలో మరణం సంభవించకూడదని కోరుకుంటాడు. మనుషులు మొదలైన ఇతర ప్రాణులన్నీ తనకు గడ్డిపోచలతో సమానం – కాబట్టి తను కోరుకున్న వారి చేతిలో తప్ప, ఇతర ఏ ప్రాణివలన తనకు ప్రాణభయం లేదని అంటాడు. రావణాసురిడి వర ప్రభావం చేత, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, ఇంద్రుడు, లేదా దేవీ అవతారాలు రావణాసురుడిని సంహరించకూడదు.

రామావతారము

దశరథుడు అశ్వమేధ-పుత్ర కామేష్టి యఙ్ఞాలు చేసినపుడు, ఒక చిన్న సంఘటన జరుగుతుంది. దాని వివరాలు బాలకాండ పదిహేనవ సర్గలో ఉన్నాయి. ఋష్యశృంగమహర్షి ‘అధర్వశిరస్సు’ అను వేదభాగంలో పేర్కొనబడిన మంత్రములతో, విద్యుక్తంగా ‘పుత్రకామేష్టి’ క్రతువును దశరథునితో జరిపిస్తున్నపుడు, బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమతమ హవిర్భాగములను గ్రహించడానికి యఙ్ఞశాలలో ప్రత్యక్షమవుతారు. అలా కలిసినపుడు, వారందరూ బ్రహ్మదేవుడితో రావణాసురుడు పెడుతున్న బాధలను విన్నవించుకుంటారు. బ్రహ్మ ఒసగిన వరాలను గౌరవిస్తూ, వారందరూ రావణుడి దుండగాలన్నిటినీ భరిస్తున్నామని వాపోతారు. అప్పుడు బ్రహ్మ తానిచ్చిన వరాన్ని గుర్తు చేస్తూ, “మానవుని చేతిలో అతని మరణము సంభవము – ఇతరుల వలన కాదు” అని సంహారోపాయాన్ని తెలియజేస్తారు. అప్పుడే విచ్చేసిన శ్రీమహావిష్ణువుకు వారి బాధలను తెలుపుతూ, ఆయన్ని మనవావతారం ఎత్తి రావణుడిని సంహరించమని విన్నవించుకుంటారు. అందుకు సమ్మతిస్తూ, ఆయన దశరథుడికి జన్మించి, రావణుడిని – అతని వారందరినీ సంహరిస్తానని అభయమిస్తారు.

శ్రీరాముడు విష్ణ్వావతారమే – కాదనలేము. కానీ, ఆయన విష్ణువులాగా వచ్చి రావణుడిని సంహరించలేదు. రావణుడి తాత (తల్లికి తండ్రి) అయిన సుమాలి దుష్కృత్యాలను అరికట్టడానికి, ఆయన విష్ణువుగానే యుద్ధం చేశారు. అదే పద్ధతిలో, రావణుడిని అరికట్టడం, కుదరదు. అందుకని నూటికి నూరుపాళ్ళూ మనుష్య అవతారం దాల్చి సంహరించాల్సిందే! అంచేత, కౌసల్యాదేవి గర్భవాసం చేసి, ఒక మనిషిలా పుట్టి, ఒక మనిషిలాగానే పెద్దవారయ్యారు.

సీతమ్మ ఎవరు?

శ్రీరాముడు శ్రీమహావిష్ణువు అవతారమైతే, సీతమ్మ లక్ష్మీ దేవే కదా! ఇందులో ప్రశ్న ఏమిటి? ఆవిడ శ్రీమహాలక్ష్మి అవతారం అని మనకు తెలుసు – కానీ తనకు తెలుసా? మన ముఖ్యప్రశ్నకు సమాధానం కావాలంటే, ఇలాంటివీ, ఇటువంటి ఇతర ప్రశ్నల సమాధానం కూడా కావాలి. సరే, ఆవిడ శ్రీమహాలక్ష్మి అవతారం అని సీతా దేవికి తెలుసా? శ్రీమహాలక్ష్మి అని కాకపోయినా, తానొక దివ్య అవతారమని సీతమ్మకు ఖచ్ఛితంగా తెలుసు. ఆవిడకు తెలుసని, నాకెలా తెలుసు? రామాయణంలోనే ఈ ప్రశ్నకు సంబంధించిన విశేషాలున్నాయి.

శ్రీరాముడిలాగా సీతమ్మ – తల్లి గర్భంనుండి జన్మించలేదు. బాలకాండ అరవైఆరవ సర్గలో, జనకుడు ఈ విషయాన్ని విశ్వామిత్రునికి చెబుతారు. ఒకప్పుడు యాగనిమిత్తమై తాను భూమిని దున్నుతుంటే, నాగటిచాలునుండి ఒక కన్య వెలువడింది – కాబట్టే ఆమె ‘సీత’ అని ప్రసిద్ధికెక్కింది అని ఆయన తేట తెల్లంగా చెబుతారు.

అరణ్యకాండ నలబైఏడవ సర్గలో – తాను ఒంటరిగా ఉన్నప్పుడు, రావణుడు సన్యాసి వేషంలో తనగురించి అడిగినపుడు, తనొక చిత్రమైన సమాధానం చెబుతుంది. తనగురించి చెబుతూ, మిథిలేశుని పుత్రికనైన తను, శ్రీరాముని ధర్మ పత్ని అని – వివాహానంతరం ఇక్ష్వాకువంశరాజులరాజధానియైన అయోధ్యలో ఏలోటూలేకుండా “మనుష్యులకు సహజములైన” వివిధ సుఖభోగములను అనుభవిస్తూ పన్నేండేళ్ళు గడిపిందని చెబుతుంది. మనుష్యులకు సహజములైన సుఖభోగములను అని నొక్కి చెప్పడం వెనుక అర్థమేమిటి!?!

తరువాత, యుద్ధకాండ నూటాపంతొమ్మిదవ సర్గను నిశితంగా పరిశీలించాలి. రావణ వధానంతరం, శ్రీరాముని చెంత అగ్ని ప్రవేశ నిర్ణయం తీసుకునే ముందు, ఆవిడ తన భర్తతో తన నడవడికగురించి చెబుతూ “జనక మహారాజు పెంచి పెద్ద చేసినందుకు తనకు జనకుని కూతురు జానకిగా లోక ప్రసిద్ధి ఏర్పడినా – తను వాస్తవముగా భూసుతనని, అయోనిజయని, దివ్యవనిత అని శ్రీ రాముడు మరిచాడా?” అని ప్రశ్నిస్తుంది.

తానెవరని శ్రీరాముడు భావించేవాడు?

‘సాధారణ మానవకాంత కాను’ అని సీతమ్మకు తెలుసునన్న విషయం అర్థమవుతోంది. అదే ప్రశ్న శ్రీరాముడికైతే? తన నిజస్వరూపమేమిటో తనకు తెలుసా? సీతమ్మకు తన దివ్యత్వ అవగాహన ఉన్నా, శ్రీరాముడికి మాత్రం తాను శ్రీమహావిష్ణువన్న విషయం తెలియదు. తను పుట్టింది మానవకాంత గర్భం నుండి. శ్రీకృష్ణావతారంలో, సాధారణ మానవుడు కాదని – పసిగుడ్డుగా ఉన్నప్పుడే తెలుస్తుంది. శ్రీకృష్ణుడి మొదటి రాక్షస సంహారం – పూతన ఎలా మరణించింది? చనుబాలు తాగినంత మాత్రాన ఎవరన్నా మరణిస్తారా? మట్టి తిన్నావా అని ప్రశ్నిస్తే, తన నోటిలో బ్రహ్మాండాన్ని సాధారణ బాలలు చూపగలరా? గోవర్ధనగిరిని చిటికెనవేలితో ఎత్తడం? సుదర్శన చక్రంతో దుష్టులను సంహరించటం? అసలు భగవద్గీతలో తానెవరో విరాట్‌రూపమెత్తి చూపటం! ఇటువంటి లీలలు శ్రీరాముడు ఎన్నడన్నా చేశాడా? కోదండం, కత్తి – ఇవే ఆయుధాలు. రాక్షస సంహారాలన్నీ, వీటితోనే!

శరభంగ మహర్షి దర్శనానికి వెళ్ళినపుడు, ఆ మహర్షితో సంభాషిస్తున్న ఇంద్రుడు – శ్రీరాముని రాక గమనించి అన్న మాటలు “శ్రీరాముడు ఇటే వచ్చుచున్నాడు. ఆయన ఇచటికి వచ్చుటయు మేము సంభాషించుటయు జరుగకముందే నేను ఇచటినుండి వెళ్ళి పోయెదను. ఆయన వహించినదీక్ష ముగిసినపిమ్మట మేము కలసికొనుట యుక్తము. ఆయన తనలక్ష్యసాధనలో కృతార్థుడైన పిమ్మట, నేను ఆయనను దర్శింపగలను. దేవతలకు సైతము దుష్కరమైన మహాకార్యమును అతడు సాధింపవలసిఉన్నది. ఆ ఘనకార్యము నెఱవేఱిన పిమ్మట నేను ఆయనను దర్శింతును” అని చెప్పి ఇంద్రుడు అంతర్ధానమైపోతాడు.

యుద్ధంలో మొదటిసారి ఇంద్రజిత్ రణరంగప్రవేశం చేసినపుడు, కనబడకుండా మాయాయుద్ధం చేస్తూ శ్రీరామలక్ష్మణులను విపరీతంగా గాయ పరిచి, వారిని నాగాస్త్రములతో బందించి, మూర్ఛవల్ల కింద పడిపోయేట్టు చేస్తాడు. యుద్ధం ఓడిపోయామని వానరులు ఖిన్నులవుతారు. వారిరువురిని సంహరించానని తలచి, ఇంద్రజిత్ లంకకు తిరిగివెళ్ళిపోతాడు. ఇక ఏ ఆశా లేదు అని అందరూ ఖిన్నులై ఉండగా, గరుత్మంతుడు దివ్యంగా అక్కడికి చేరుకొని వారిరువురి వద్ద వాలతాడు. ఆయన రాకతో, నాగాస్త్రబంధనం సడలి, శ్రీరామలక్ష్మణులు తేరుకుంటారు. వారిరువిరిని నిమురుతాడు. దానితో, వారిద్దరికీ దెబ్బలన్నీ మానిపోయి, ధైర్యోత్సాహాలు, తేజస్సు, బలపరాక్రమాలు రెండితలవుతాయి. అప్పుడు శ్రీరాముడు గరుత్మంతుని ఆకారరూపాలను చూసి, తానెవరని ప్రశ్నిస్తాడు. దానికి గరుత్మంతుడు “నేను నీ ప్రియమిత్రుడను!” దేవదానవ ఇంద్రాదులకైనా విడిపించవీలుకాని నాగాస్త్రబంధము – తనొక్కడి వల్లనే విడుతుంది గనుక, తాను అక్కడికి వేంచేసినట్లు చెబుతాడు. అంతే గాక “వారిరువురి మధ్యనున్న బంధమేమిటో, తానిప్పుడు అడిగితెలుసుకోవలసిన అవసరం లేదని – రాక్షసులతో యుద్ధం పూర్తి అయిన తరువాత ఆ విషయం బోధ పడగలదు” అని చెప్పి, వారి వద్ద నుండి శెలవు తీసుకొని తిరిగి వెళ్ళిపోతాడు. గరుత్మంతుడెవరో శ్రీమహావిష్ణువుకు చెప్పాలా? కానీ శ్రీరాముడు గరుత్మంతుడిని ఎందుకు గుర్తుపట్టలేక పోయాడు?

సవినయంగా దారి ఇమ్మని వేడుకున్నా, సముద్రుడు తన మాట విన్నాడా? సేతువు కట్టి మాత్రమే, ముందుకు సాగగలిగింది వానర సేన. శ్రీరాముడి వద్దనున్న ధనస్సు శార్ఙ్గము కాదే! సుదర్శనానిని ఎప్పుడూ వాడలేదే! శ్రీరాముడికి తను విష్ణుమూర్తియొక్క పూర్ణావాతారమన్న విషయం తెలియదు. మీలా-నాలా, తానోక మనుష్యుడు అని మాత్రమే తెలిసిన వ్యక్తి.

సీతమ్మ అగ్నిప్రవేశం చేసిన తరువాత, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ, శివ, ఇంద్రాది దేవతలు తనను స్తుతించినపుడు, అర్థం కాక “దశరథ మహారాజు తనయుడైన రామునిగా, సామాన్య మానవునిగా నన్ను గూర్చి నేను తలంతును – నేను ఎవరినో, ఎవరి వాడనో, ఏల వచ్చితినో” తెలుపమని బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వేదప్రతిష్ఠితమైన శ్రీరామ స్తవాన్ని చదివి, తాను శ్రీ మహా విష్ణువని తెలియజేస్తారు.

రావణవధ జరిగే వరకూ, శ్రీరాముడికి తన నిజస్వరూపమేమిటో తెలియదు. అప్పటివరుకూ, ఆయన కేవలం ఒక మానవుడు మాత్రమే.

అగ్ని ప్రవేశ ఘట్టంలో ఏమి జరిగింది?

రావణుడు మరణించిన తరువాత, శ్రీరాముడు చేసిన మొట్టమొదటి పని విభీషణ పట్టాభిషేకం. తరువాత హనుమను పంపి, సీతమ్మకు రావణవధ గురించి తెలియజేయిస్తాడు. లంకాధిషుడైన విభీషణుడికి సీతమ్మను సర్వాలంకారాలతో తన కడకు తీసుకురావలసిందిగా చెబుతారు. సీతమ్మ ఎలా ఉందో అలానే – స్నానాదులు ఆచరింపకనే శ్రీరాముడి దర్శనానికి వెళదాం అని అన్నా, రామాఙ్ఞను అతిక్రమించడం కుదరదని, సర్వాలంకారాలతో వెళ్ళడం మంచిదని విన్నవించుకొని, అంతఃపురకాంతలను పురమాయిస్తాడు విభీషణడు.

శ్రేష్ఠమైన తెరలతో శోభిల్లుతున్న పల్లకిలో సర్వాలంకారాలతో వస్తున్న సీతమ్మను చూడాలని వానరులు ఉబలాటపడుతుంటే, విభీషణుడి ఆఙ్ఞమేర, రాక్షసభటులు బెత్తాలతో వానరులను దూరంగా తరుముతారు. ఇది చూసిన శ్రీరాముడు కనులెఱ్ఱచేస్తూ ఆ రాక్షసభటులను చూస్తారు. తన సమక్షంలో వానరులను ఇబ్బందులపాలు ఎందుకు చేస్తున్నట్టని ప్రశ్నించి, ఆ కలకలాన్ని అరికడతారు. విభీషణుడితో అప్పుడు ఆయన అన్న మాట “స్త్రీకి గృహములు, వస్త్రములు, ప్రాకారములు, తెరలు, రాజమర్యాదలకన్నా ఆమె సద్‌ప్రవర్తనే భద్రకవచం” అని అంటారు. అంచేత, పల్లకిని వీడి, అందరూ (వానరులు) చూస్తుండగానే, తన వద్దకు కాలి నడకన తీసుకురమ్మని చెబుతారు.

తన వద్దకు చేరుకున్నపుడు, కటువుగా మాట్లాడటం నిజమే! తన బాధ్యత కాబట్టి సీతను రావణ చెరనుండి విడిపించానని చెబుతాడు. తాను దశదిశలలో ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చునని చెబుతాడు. లక్ష్మణునిరక్షణలోగాని, భరతుని పరిరక్షణలోగాని, వానరరాజైన సుగ్రీవుని ఆశ్రయించి గాని లేదా రాక్షస ప్రభువైన విభీషణుడిని ఆశ్రయించిగానీ కాలం వెళ్ళబుచ్చుకొమ్మని సలహా ఇస్తారు. ఈ సంభాషణలోనే ఆయన ఒక గమనించదగ్గ ఉదాహరణ చెబుతూ “నీవు పరుల ఇంట ఇంతకాలము వసించినందులకు నా యెదుట నిలిచియున్న నీ ప్రవర్తన విషయమున నాకు సందేహము కలుగుచున్నది. నేత్రరోగికి దీపకాంతి ఇష్టము కానట్లు – నాకు నీవు ప్రతికూలవైతివి; ఇది నిశ్చయము.”

హనుమ, లక్ష్మణ, సుగ్రీవ, విభీషణుడుతో సహా అందరూ ఈ పరిణామానికి వ్యథచెంది శ్రీరాముడికి సీతపై ఆసక్తి తగ్గి ఆమెయందు ప్రీతి తరిగిందా అని అనుమాన పడతారు. సీతమ్మ విపరీతమైన భావావేశాలకు లోనై, చెప్పలేనంత బాధ పడుతూ తన పవిత్రతను మాటలతో నిరూపించుకొనే ప్రయత్నం చేస్తుంది. తనను సూటిగా చూడకుండా శ్రీరామూడు ఆమే మాటలు వింటున్నా, సమాధానం చెప్పరు. “నాపై ప్రభువునకు విశ్వాసము కలిగించుటకు అగ్నిప్రవేశము ఒక్కటే నాకు శరణ్యము” అని – లక్ష్మణుడిని చితిపేర్చమని ఆఙ్ఞాపిస్తుంది. శ్రీరాముడు చలించడు. ఆయన ముఖవైఖరిని బట్టి లక్ష్మణుడు చితి పేరుస్తాడు. శ్రీరాముడికి ప్రదక్షిణం చేసి “అన్ని విషయములందును సర్వ ధర్మఙ్ఞుడైన రాఘవుని అనుసరించియున్నచో, అగ్నిదేవుడు నన్ను రక్షించుగాక” అని సీతమ్మ అగ్ని ప్రవేశం చేస్తుంది. ఆవిడ అగ్నిలో ప్రవేశిస్తున్నపుడు రాక్షసులు, వానరులు కనివినియెరుగని రీతిగా దిక్కులు పిక్కటిల్లునట్లుగా హాహాకారాలు చేస్తారు. దేవతలు, గంధర్వులు, మొత్తం లోకం గగ్గోలుపెడతుంది. ఆమెను పవిత్రమైన ఆజ్యాహుతిగా భావిస్తుంది. దుఃఖముతో కన్నుల నీరుగారుస్తూ శ్రీరాముడూ వ్యాకులుడైపోతాడు. బ్రహ్మ, శివ, ఇంద్ర, కుబేర, యమ, వరుణాది దేవతలందరూ ఆదరాబాదరాగా అక్కడికి చేరుకుంటారు. సీతమ్మ అగ్నిప్రవేశం చేస్తున్నపుడు, ఎందుకు అడ్డుకోలేదని అడుగుతారు. ఆవిడ పాతివ్రత్యాన్ని కొనియాడుతారు. శ్రీరాముడి నిజస్వరూపమేమిటో బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు.

సీతాసాధ్విని అగ్నిదేవుడు చెక్కుచెదరకుండా పైకితెచ్చి శ్రీరాముడికి అప్పగిస్తాడు.

ఇలా ఎందుకు జరిగి ఉంటుంది?

ఈ ప్రశ్నకు వివిధ కోణాలలో సమాధానాలు చెప్పవచ్చు. పైన ప్రస్తావించిన విషయాలన్నన్నిటినీ కలిపి చూసే ప్రయత్నం చేద్దాం. రావణుడు పొందిన వరానికి అనుగూణంగా, శ్రీమహావిష్ణువు ఒక మనిషిలా అవతారం దాల్చ వలసిందే! శ్రీరాముడిలాగా శ్రీకృష్ణుడు కూడా తల్లి గర్భంనుండి జన్మించినవాడే. కానీ పరిపూర్ణావతారస్వరూపమైన శ్రీకృష్ణుడికి తానెవరో తెలిసినట్టు, పూర్ణావతారుడైన శ్రీరాముడికి తెలియదు. తెలియనట్టు ప్రవర్తించడం కాదు – నిజంగా తెలియదు. కానీ తన ధర్మపత్ని అయిన సీత సాధారణ వనిత కాదు అని తెలుసు.

మొదటి కోణం – కాబోయే ప్రభువూ, పట్టమహిషులు

సీతమ్మ పాతివ్రత్యానికి లోక ప్రసిద్ధి. కానీ తన సౌందర్యం కూడా అంతే! తమకిచ్చి వివాహం చేయలేదని, వివిధ దేశాల రాజులు మిథిలా నగరంపై దండెత్తి ముట్టడి చేశారన్న విశేషాలు శ్రీమద్రామాయణంలోనే ఉన్నాయి. అంతటి సౌందర్యరాశిని, మహాబలవంతుడూ కామపిశాచి ఐన రావణుడు అపహరించి తన చెరలో పది మాసాలు బంధించి ఉంచాడు. రావణుడు పరస్త్రీలను బలవంతంగా చెరిస్తే, మరణిస్తాడన్న శాపం గురించి తన వారికి కూడా తెలియదు – అటువంటిది మానవుడైన శ్రీరాముడికెలా తెలుస్తుంది. వాడి వైభవం, శక్తి, బలం ఇత్యాదులను శ్రీరాముడు స్వయంగా రామరావణ సంగ్రామంలో చూశాడు. తేలికగా ఒక్క బాణానికి తెగిపడలేదు. విపరీతమైన శ్రమతో కూడుకున్న యుద్ధం చేసి కానీ వాడిని సంహరించలేకపోయాడు. అటువంటివాడి చెరలో అంతటి సౌందర్యవతి అయిన భార్య పదిమాసాలు బందించబడి ఉంటే, ఏమి జరిగి ఉండవచ్చునో అన్న అనుమానం ఒక మనిషికి కలగడంలో ఆశ్చర్యం ఏమున్నది? తను ఒక మానవుడైనా, ఇక్ష్వాకు వంశంలో జన్మించిన యువరాజు. ఏదో ఒక రోజు కోసలరాజ్యానికి ప్రభువై ఏలవలసినవాడు. అంతటి ధర్మశీలుడు, తన పట్టమహిషికి కూడా అందుకు తగ్గ అర్హత ఉండాలి అని ఖచ్ఛితంగా కోరుకుంటాడు. అదే శ్రీరాముడు, సాధారణ కుటుంబంలో జన్మించి ఉంటే, ఖచ్ఛితంగా, ఈ ఘట్టం జరిగి ఉండేదే కాదు. తన భార్య కేవలం తన భార్య మాత్రమే. ఒక దేశానికి పట్టమహిషి కాదు.

రెండవ కోణం – యుద్ధం ఎందుకు జరిగినట్టు?

అదొక మహాసంగ్రామం. శ్రీరాముడిని విజయం వరించినా, అంత తేలికగా తెమిలిన యుద్ధం కాదు. వానరసేనలో ఎన్నో లక్షలమంది అశువులుబాసారు. వానర ప్రముఖులను పక్కన పెట్టి, ఒక వానరుడి లాగా ఆలోచించి చూడండి. ఒక సాధారణ వానరుడు యుద్ధానికి ఎందుకు వచ్చినట్టు? కోసలదేశాన్నేలే దశరథుడికి ముగ్గురు భార్యలట, వారిలో కౌసల్యాదేవికి రాముడు పుట్టాడట, ఆయన శివధనుర్భంగం చేసి సితమ్మను పెళ్ళాడాడట, కైకమ్మ భరతుడికి రాజ్యం దొరకాలని పద్నాలుగేళ్ళు అరణ్యవాసానికి పంపించిందట, ఆయన భార్యను ఎవడో రాక్షసుడు అపహరించాడట, వాలిని చంపి సుగ్రీగ్రీవుడిని వానరరాజుగా చేశాడట, అందుకు కృతఙ్ఞతగా సుగ్రీవుడు మనను యుద్ధానికి తోడ్కొని వచ్చాడట. ఛా! ఛా! వానరాలు అలా ఎందుకంటాయన్న అనుమానం ఉంటే, కిష్కిందకాండలో దక్షిణదిశకు వెళ్ళిన వానరాలు ఏం మాట్లాడుకున్నాయో మీరే చదివి చూడండి.

సుగ్రీవుడికి రాజ్యం దక్కింది – శ్రీరాముడికి సీత దక్కింది, కానీ మనకు ఏం దక్కింది? ఎంతో మంది వానరులు మరణించారు. బతికున్న వానరులులో ఒకరి తండ్రి, ఒకరి పుత్రుడు, ఒకరి బంధువు లేదా మరొకరి మిత్రుడు – ఎవరో ఒకరు మరణించే ఉంటారు. సీతమ్మను తీసుకెళ్ళి శ్రీరాముడు హాయిగా పట్టాభిషేకం చేసుకొని, రాజ్యాన్నేలుకుంటున్నాడు. బతికున్న వానరులు తిరిగి కిష్కింద చేరుకున్నాక, మరణించిన వానరాలు ఎందుకు మరణించారో అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఉన్నదా? ఒక సహజ నాయకుడైన శ్రీరాముడు, యుద్ధంలో బతికి ఉన్న వానరులు, మరణించిన తమ తోటి వానరాలు మరణించినది ఒక భర్త కేవలం తన భార్యను పొందడానికి కాక, ఒక మహా సాధ్విని ఒక లోకకంటకుడైన రాక్షసుడి చెరనుండి విముక్తి కలిగించడానికని నిరూపించకపోతే తప్పు కాదా?

అందుకేనేమో, సీతారాముల మధ్యన జరిగినది – ఆంతరంగికం కాదు. బహిరంగంగా వానరుల మధ్యలో. వారిని నియంత్రించాలన్న రాక్షసభటుల ప్రయత్నాన్ని నిలువరించి, వారందరి సమక్షంలోనే శ్రీరాముడు సీతమ్మ పాతివ్రత్యాన్ని దేదివ్యమానంగా నిరూపించాలి. ఆ ప్రయత్నం తన అనుమాన నివృత్తికొరకు కాదు, బతికున్న వానరులకు – తమ తోటి వానరులు ఒక తుచ్ఛమైన కారణానికి మరణించలేదని నిరూపించడానికి. ఒక ప్రభువుగా, శ్రీరాముడు తానేలుతున్న ప్రజలకే తనకన్నా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. అటువంటి నడువడి ఉన్న ప్రభువు, అడుగకపోయినా వారికి సరైన కారణం చూపాల్సిందే!

తన యోగక్షేమాలకన్నా, తన ప్రజలకే ఎక్కువ విలువనిచ్చినందుకే – ఇంద్రుడు వరం కోరుకొమ్మని అడిగినపుడు, మరణించిన వానరులందరూ యమపురికి చేరుకున్నా, తిరిగి పునరుజ్జీవులు కావాలని అడిగి, తను ఎంత మంది వానరులను సమరానికి తెచ్చాడో, అంతే మందితో తిరిగి వెళ్ళాడు. ధర్మో రక్షతి రక్షితః అని ఊరికే అనలేదు.

మూడవ కోణం – సీతాపహరణం

శ్రీరామలక్ష్మణులను ఓడించలేడని తెలిసి, మాయోపాయం పన్నుతాడు రావణుడు. మాయలేడి రూపంలో శ్రీరాముడిని సీతమ్మకు దూరం చేయ గలుగుతాడు కానీ, లక్ష్మణుడిని మాత్రం కదల్చలేకపోతాడు. మృగరూపం దాల్చిన మారీచుడు, హా సీతా! హా లక్ష్మణా! అని శ్రీరాముడి కంఠస్వరంతో రోదించినా, లక్ష్మణుడు కీంచిత్‌మాత్రమైనా అనుమానపడడు. బేలగా సీతమ్మ ఖంగారుపడినా, మా అన్న శౌర్యప్రతాపాలు నాకు తెలుసు వదినా! అన్నకేమీ జరిగి ఉండదు అని ఆవిడను శాంతింపజేసే ప్రయత్నం చేస్తాడు. ఎంత క్షత్రియవంశంలో పెరిగినా, ఒక స్త్రీకి శౌర్యప్రతాపాలున్న లక్ష్మణుడువంటి పురుషుడికున్న దిటవు లేకపోవడం పెద్ద చోద్యమేమీ కాదు. తన పతికి ఏ ఆపద కలిగి ఉంటుందో అని ఏ భార్య అయినా భయపడినట్టే, తను చలించిపోతుంది. లక్ష్మణుడు నిర్భయంగా కదలకుండా ఉండటం అర్థం కాక, అతణ్ణి ఏదో ఒక విధంగా సహాయానికి పంపించాలని కఠోరమైన పరుషోక్తులాడుతుంది. అరణ్య కాండ నలభైఐదవ సర్గ. చదివినపుడు ఎవరికైనా “అబ్బా!” అనిపిస్తుంది. సీతమ్మను తల్లిగా చూసే లక్ష్మణుడి వంటి పుత్రతుల్యుడిని అన్నేసి మాటలని, సీతమ్మ లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటుంది. అగ్నిపరీక్ష సన్నివేశం – బహుశః దాని పరియవసానమేనేమో!

అసలు శ్రీరాముడు సీతమ్మను అనుమానించాడా?

దీపాన్ని సరిగా చూడలేని రోగగ్రస్తమైన కన్నులతో తనను తాను పోల్చుకొని శ్రీరాముడు చెప్పినదేమిటి? కొండెక్కుతున్న దీపమనో, లేక మసిబారిన దీపమనో అనలేదు. ఆయన సీతమ్మలో ఏ దోషమూ లేదు; కానీ తాను (బలవంతంగా – లోకంలాగా) చూస్తున్న కోణం లోపభూయిష్టంగా ఉన్నదని చెప్పకనే చెప్పలేదా?

ఒక స్త్రీకి తన సత్ప్రవర్తనయే రక్ష కనుక, వానరుల మధ్యనుండి సీత – వారు చూస్తుండగానే తన వద్దకు నడుచుకుంటూ రాగలదని అంత ధైర్యంగా చెప్పాడంటే, దాని అర్థమేమిటి? తన భార్యకు పల్లకీలు, తెరలు, రక్షకభటుల వల్ల కాదు – తన సత్ప్రవర్తనే రక్ష అని నమ్మి విశ్వసించిన భర్త – మనఃపూర్తిగా అనుమానిస్తున్నట్టా?

కేవలం తన పౌరుషపరాక్రమాలు నిరూపించుకోడానికేనా యుద్ధం జరిగింది?

అరణ్యకాండలోని 58, 59, 60, 61, 62, 63 ఇత్యాది సర్గలలో, శ్రీరాముడు – సీతకు ఎటువంటి ఆపదలు సంభవించి ఉంటాయో అన్న అనుమానంతో లక్ష్మణుడిని మందలించిన వైనం – ఆయనకు సీతమ్మపై గల ప్రేమకు నిదర్శనాలు. 65వ సర్గలో సీతమ్మ జాడ తెలియక వ్యథ చెందిన శ్రీరాముడు – లోకాలను సంక్షుభితం చేయాలా అని కలిగిన ఆవేశాన్ని, లక్ష్మణుడు శాంతింపజేస్తాడు. శ్రీరాముడికి తన భార్య అంటే అంతటి ప్రేమ ఉంది. కిష్కింద కాండ మొదటి సర్గలో, ప్రకృతి లావణ్యాలను తిలకిస్తూ, పదే పదే తప్పిపోయిన తన ముద్దుల భార్యను ఙ్ఞప్తికి తెచ్చుకొని బాధ పడటం – దేనికి నిరూపణ? ఇలాంటి సంఘటనలు మరెన్నో. కిష్కింద కాండ 27, 28, 30 సర్గలు – ఇలా మరెన్నో.

సుందరకాండలోని 36వ సర్గలో సీతమ్మను కలిసిన పిమ్మట, హనుమంతుడు శ్రీరాముడికి సీతపై గల ప్రేమ గురించి చెప్పినదేమిటి? “నీ మీదనే మనస్సును లగ్నమొనర్చి, తదన్యమును మఱిచిన శ్రీరాముడు, తన శరీరముపై వ్రాలెడి అడవి ఈగలను, దోమలను, తిరుగాడెడి పురుగులను, పాములను సైతం ఏమాత్రము పట్టించుకోవటం లేదు. నరోత్తముడైన శ్రీరాముడు, ఎల్లప్పుడును నీ ధ్యాసలోనే మునిగి, శోకాకులుడై యున్నాడు. నిన్ను జేరు కోరికతో ఇక దేనిని గూర్చియూ ఏ మాత్రము ఆలోచించటంలేదు. శ్రీరాముడు నిద్రనే ఎఋగడు. ఎప్పుడైనా ఒక కునుకు వచ్చినచో “సీతా! సీతా!” అను మధురవచనముల పలవరింతలతో ఉలికిపడి లేస్తున్నాడు. కఠిన నియమములను పాటించుచు నిన్ను పొందుటకై ప్రయత్నించుచున్నాడు.

ఒక ఉత్కృష్టమైన క్షత్రియ వంశంలో జన్మించినందున, శౌర్య పరాక్రమాలు నరనరాలలో ఇమిడి ఉంటాయి. వాలి – సుగ్రీవుడి భార్యను బలవంతంగా తనవద్ద ఉంచుకున్నాడన్న తప్పిదాన్ని క్షమించని శ్రీరాముడు, తన భార్యనే ఎత్తుకుపోయినపుడు ఎలా ఊరకుంటాడు. ఆ సంధర్భంలో ఆయన ఒక భర్త; అంతకు మించి ఇక్ష్వాకుకులతిలకుడైన భావి సామ్రాట్‌. రెండు బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలిగాడు.

ఇన్ని విషయాలు చదివి “ఠాట్‌! ఏమి ఎంత చెప్పినా, రాముడు అలా చేసుండకుండా ఉండాల్సింది” అని ఇంకా అనిపిస్తే, నా వ్యాసమన్నా అసంపూర్ణమై ఉండాలి – లేదా నాకు అవగతమవని బలమైన కారణం మీవద్ద మరేదైనా ఉండాలి.

ప్రకటనలు
 1. 3:26 సా. వద్ద మార్చి 4, 2012

  Sir

  Very nice detailed explanation. I like it.

 2. 6:02 సా. వద్ద మార్చి 4, 2012

  కొన్ని విషయాలు అవి అలానే జరిగాయి అవి అంతే. అని సరిపెట్టుకోవాలి. వాటిని ఇప్పటి సాంఘిక నియమాలతో అన్వయించి చూసి ఎగతాళి చేయడం కాని, దానిని ఏదోవిధంగా సమర్థించబూనడంకాని రెండూ వృధా ప్రయాసలే. రామునికి తాను అవతార పురుషుడన్న విషయం తెలియదన్నారు, కానీ సీతమ్మకి తానొక దివ్య స్త్ర్రీ నన్న విషయం తెలుసన్నారు బాగుంది, మరి ఆదివ్య స్త్రీకి మారీచుని అరుపుకీ తన భర్తయైన అవతారపురుషుని గొంతుకూ తేడా తెలియ లేదా? దొంగ భిక్షువు వేషంలో వచ్చినది తనని అపహరించడానికి వచ్చిన రావణాసురుడని తెలీదా? ఎక్కడుంది ఆమె దివ్యత్వం?ఆమెకి తెలిసే అన్నీ అలా జరిగాయని చెప్పబూనుకుంటే–నమస్కరించి ఊరుకోవడం తప్ప ఏం చేయగలం?

  • 7:00 సా. వద్ద మార్చి 4, 2012

   ‘నాకు తెలిసినది మాత్రమే నిజం’ అనుకొని సరిపెట్టుకోవడం కన్నా, చదివి తెలుసుకోవాలన్న తపన మేలేమో!

   మీరు వేశిన ప్రశ్నలకు, రావణసంహార ప్రాతిపధికకూ సంబంధం కనిపించటంలేదా?

 3. durgeswara
  7:41 సా. వద్ద మార్చి 4, 2012

  mee pariseelanaku abhinamdanalu

 4. madhavaraopabbaraju
  8:15 సా. వద్ద మార్చి 4, 2012

  ఆర్యా,నమస్కారములు.

  వివరణ చాలా చక్కగా వున్నది. ధన్యవాదములు. ఇక శ్రీ గోపాల కృష్ణ గారు అడిగిన ప్రశ్నకు మీ సమాధానం కూడా బాగుంది. ఈ పురాణాలలో మనం గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే : రావనాసరుడుకి వరమిచ్చేముందే బ్రహ్మకు ఏమి జరుగుతుందో తెలియదా? తెలిసే వరమిచ్చాడు. ప్రశ్న అలా ఎందుకు ఇచ్చాడు? అని కాదు; కవి మనకు చెప్పదలుచుకున్న విషయమేమిటంటే:- తపస్సు లేదా ఖటోర శ్రమ ద్వారా మానవుడు దేనినైనా సాధించగలడు అని; యత్ భావం, తత్ భవతి: ఎవరు చేసుకున్న కర్మను వారే అనుభవించాలి అని; మానవుడు పవిత్రమైన ధర్మాలను పాటించే సమయంలో ఎటువంటి కష్ట, నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియచెప్పటమే ఈ కధలోని ఆంతర్యం; ఆ కోణంలోనే మనం చూడాలి.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 5. laki
  8:19 సా. వద్ద మార్చి 4, 2012

  really very good detailed explanation and very thankful to you

 6. 8:33 సా. వద్ద మార్చి 4, 2012

  మాస్టారూ…

  నా టపాలోని ఓ వ్యాఖ్యకు సమాధానంగా మంచి వ్యాసం రాశారు. సంతోషం. ఈ పని నేనే చేద్దామనుకున్నాను కానీ నా దగ్గర ఇప్పుడు పుస్తకాలేమీ లేవు.

  “రెండవ కోణం – యుద్ధం ఎందుకు జరిగినట్టు?” పై చిన్న అభ్యంతరం.

  కిష్కింధలో వానరులు గుసగుసలాడుకుని ఉండవచ్చు కానీ యుద్ధ కాండలో ఆ అవకాశం లేదనుకుంటా. యుద్ధ సమయంలో చనిపోయిన రాక్షసుల శవాలను ఎప్పతికప్పుడు సముద్రంలోకి ఈద్చేయడమో… దహనం చేయించడమో చేస్తారు. కానీ వానర వీరుల మృత దేహాలను అలా చేయరు. వాటిని గుట్టగా వేసి ఉంచుతారు. అందువల్ల… హనుమ సంజీవనీ పర్వతం తెచ్చినప్పుడో లేక యుద్ధానంతరం వినువీధిలో నిలిచిన దేవతలు వరమివ్వడం వల్లనో… ఆయా వానర వీరులు తిరిగి జీవిస్తారు… అని గుర్తు. ఒకసారి సరిచూడగలరు.

  తర్కం మాత్రం బాగుంది.

  • 8:41 సా. వద్ద మార్చి 4, 2012

   ఫణీంద్రగారు – మీది అనుమానమని మీరే అంటున్నారు. అది నిజంగా అనుమానమే! సంజీవని పర్వతం తెచ్చినపుడు, మృతులై పడిఉన్న వానరులు జీవిచడం నిజమే! కానీ కుంభకర్ణుడితో సహా, ఎందరో రాక్షసులు లక్షలమంది వానరులను తినేశారు. మరి వారి సంగతో? వానరులందరూ జీవించే ఉంటే, శ్రీరాముడు ఇంద్రుడిని మరణించిన వానరులను పునరుజ్జీవులను కావింపమని ఎందుకు వరం కోరుకున్నట్టు? ఆలోచించండి. నేను ప్రతిపాదించినది తర్కం కాదని గ్రహించగలరు.

 7. 9:57 సా. వద్ద మార్చి 4, 2012

  మాస్టారూ…

  ఇంద్రుడి గురించి రాసిన వాక్యాలు మొదటిసారి చూడని పొరపాటు నాదే. అందుకే సరి చూడమన్నాను. ఇక “తర్కం” అన్నది… మూలాన్ని ఉటంకించని సందర్భాల్లో మీరు పరిశీలించిన దృష్టి గురించి. మచ్చుకి… “రెండవ కోణం…”లో రెండో, మూడో పేరాలు…! ధన్యవాదాలు.

  • 10:27 సా. వద్ద మార్చి 4, 2012

   Chronology వచ్చి, రామరావణయుద్ధంలో మరణించిన వానరులు (అంటే భుజించబడినవారు). తదుపరి – మరణించిన వానరుల వీరమరణం వెనుకనున్న నిజాన్ని నిరూపించడం. అటుతరువాత సీత అగ్ని ప్రవేశం. దాని తరువాతది ఇంద్రాదులు ప్రత్యక్షం కావటం. చివరిగా – ఇంద్రుడి వరం చేత అందరు వానరులు పునరుజ్జీవులవటం.
   .
   అగ్నిప్రవేశ ఘట్టం ముందు, వానరులలో ఎందరో మరణించారు. ఇంద్రుడు ప్రత్యక్షమై బ్రతికిస్తాడని ఎవరికీ తెలియదు. అంచేత, శ్రీరాముడికి వానరుల వీరమరణం గురించి తెలియచేయటం ఆవస్యకం. ఒకవేళ ఇంద్రుడు ప్రత్యక్షమై వారిని బ్రతికించి ఉండకపోతే, వానరులు కిష్కిందకు తిరిగి వెళ్ళాక ఎటువంటి ఆలోచనలు చేస్తారన్నది నా ప్రస్తావన లేదా మీరు చెప్పినట్టు తర్కం. అగ్నిప్రవేశ ఘట్టం వలన సంభవించిన శుభపరిణామాలలో ఒకటి – వానరులు తిరిగి బ్రతకటం.
   .
   The events need to be considered in their chronological order with due regard to the prevailing conditions associated with each situation and not the end result alone! At the end of total episode, there was no scope for such misconstrued opinion – but before the final event unfolded, the prevailing conditions did warrant a need to clarify. Hope this clarifies the authenticity of the argument.

 8. 10:28 సా. వద్ద మార్చి 4, 2012

  రామాయణం గురించి ఎవరెంత చెప్పినా ఇంకా అనుమానాలు వెలిబుచ్చుయూనే ఉంటారు.రాముడు అందరూ అనుకొంటూఉన్నట్లు అగ్నిలో దూకమనలేదు.సీతాదేవి తానుగా అగ్నిప్రవేశం చేసింది.శ్రీరాముడికీ ,లోకానికి తన పవిత్రతను చాటిచెప్పడానికి.తాను సామాన్య మానవ స్త్రీని కానని ఆమెకు తెలుసును.ఐనా జరగబోయే సంగతులు అన్నీ ఆమెకు తెలియాలని ఏమీ లేదు.ఇక రాముడికి ,తాను మానవుడిననే తెలుసు.(విష్ణు అవతారమైనా)ఎందుకంటే మానవుడి గానే రావణ వధ జరగాలి కాబట్టి.వారి వియోగానికి శాపం కూడా ఒక కారణం.యుద్ధంలో మరణించిన వానరులందరూ పునర్జీవులైనట్లే ఉన్నది.ఇవన్నీ నమ్మాలనుకున్న వాళ్ళు నమ్మవచ్చును.అలా జరగవలసి ఉంది కాబట్టి అలాగే జరిగింది.

 9. 11:50 సా. వద్ద మార్చి 4, 2012

  బాగుందండీ,

  ఆ అడిగిన వారెవరో, గాని, ఆ ప్రశ్న వేసి మీ చేత ఈ టపా రాయించడం అంతా శ్రీ రామ మయం.

  జిలేబి.

 10. Snkr
  7:54 ఉద. వద్ద మార్చి 5, 2012

  /ఇన్ని విషయాలు చదివి “ఠాట్‌! ఏమి ఎంత చెప్పినా, రాముడు అలా చేసుండకుండా ఉండాల్సింది” అని ఇంకా అనిపిస్తే, నా వ్యాసమన్నా అసంపూర్ణమై ఉండాలి – లేదా నాకు అవగతమవని బలమైన కారణం మీవద్ద మరేదైనా ఉండాలి./

  రెండూ కాదు. ఇలాంటివి పునఃశ్చరణ చేసుకోవాలంటే అలాంటి శునకవాల ప్రచ్చకులు వుండాల్సిందే అంటాను.
  చక్కటి వ్యాసం, చూచాయిగా తెలిసినవి మరీ తెలుసుకున్నాను.
  తారకమంత్రము కోరిన దొరికెను
  ధన్యుడనైతిని ఓ రన్నా..:)

 11. 9:56 ఉద. వద్ద మార్చి 5, 2012

  Good one.
  good analytical approach…

 12. వేణు
  2:01 సా. వద్ద మార్చి 5, 2012

  మీరు విశదీకరించి వ్రాసింది అద్భుతంగా వుంది. ధన్యవాదాలు!
  వేదవతి ని కూడా ఈ సందర్భంగా introduce ( వేదవతి బృహస్పతి కొడుకైన కుశధ్వజుని కూతురు. రావణుడి స్పర్శ వలన ఆత్మాహుతి చేసుకుంటుంది) చేసి ఉంటె బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే రావణుడు అపహరించింది సీతను కాదు వేదవతి ని అని కూడా వ్రాసారు. ఇది వాల్మికి రామాయణంలో ఉన్నదో లేదో నాకు తెలియదు. కలియుగంలో శ్రీనివాసుడు వేదవతి ని వివాహమాడతాడు అని కూడా చందివాను.

  మీరు దీని గురించి కూడా Clarify చేస్తే సంతోషిస్తాను. This is just to get more knowledge on this topic.

  అలాగే ఒక చాకలి నింద కు గర్భవతి ఐన సీత ను అడవికి పంపినప్పుడు కూడా మనసుకి బాధ కలుగుతుంది. అగ్ని ప్రవేశం చేసిన తరువాత కూడా ఎందుకు మళ్ళీ అడవికి ఎందుకు పంపారో. సీతను తన పుట్టింటికి జనకుడి ఇంటికి పంపినా బాగుండేదేమో అనిపిస్తుంది.

  పురుషోతాముడైన రామచంద్రుడు చేసినవన్నీ సబబే అయి ఉంటాయి అని అనుకోవాలే తప్ప, అది ప్రశ్నించడానికి మనమెవరు …..సామాన్య మానవులమే కదా!

  జై శ్రీ రామ్ !!

  • 3:38 సా. వద్ద మార్చి 5, 2012

   వేదవతి వృత్తాంతం వాల్మీకి రామాయణాంతర్గతం కాదుగనక ప్రస్తావించలేదు. పూర్తిగా కాకపోయినా, అడవికి పంపిన కారణం – పైన ప్రస్తావించబడిన మొదటి కోణంలో కనిపిస్తుంది.

 13. madhavaraopabbaraju
  7:13 సా. వద్ద మార్చి 5, 2012

  ఆర్యా, నమస్కారములు.

  చదువరులందరు తమతమ అభిప్రాయాల్ని చక్కగా తెలియచేశారు. ఈ వ్యాసానికి సంబంధించినది కాకపోయినా, నాకు రెండు సందేహాలున్నాయి. వీటికి విడిగా సమాధానాలు తెలియచేసినా పరవాలేదు:
  1. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, మనకు `వర్ణ వ్యవస్థ’ వున్నదేకానీ, కుల వ్యవస్థ లేదు. రామాయణంలో చాకలి కులంగురించి చెప్పబడిందా? నా వుద్దేశ్యంలో ఈ కుల వ్యవస్థ అన్నది ప్రస్తుత మన సమాజం పుట్టించిందని అనుకుంటాను.

  2. శ్రీరాముడు వాలిని చెట్టు చాటునుంచి చంపినప్పుడు, అట్లా ఎందుకు చంపావని వాలి అడిగినప్పుడు శ్రీరాముడు తన చర్యని ఈ విధంగా సమర్ధించుకున్నాడని చెబుతారు: * క్షత్రియుడు అయిన రాజు జంతువులను వేటాడేటప్పుడు, చెట్టు చాటునుంచికూడా చంపవచ్చని చెబుతాడు; * తమ్ముడు సుగ్రీవుని భార్యను బలవంతంగా తీసుకొనివచ్చి తన భార్యగా సుఖించటం మానవ ధర్మానికి వ్యతిరేకం కాబట్టి, ఒక రాజుగా నిన్ను శిక్షించాను అని శ్రీరాముడు చెబుతాడు.

  మానవ ధర్మాలు వేరు; జంతువుల ధర్మాలు వేరు. మానవుల్లో అన్న భార్య తల్లితో సమానం; జంతువుల్లో వావివరసులు లేవు, మూకుమ్మడి జీవనం. శ్రీరాముడు వాలిని ఒక జంతు జాతిగా చూసి, జంతువుగానే వేటాడాను అని చెప్పినట్లైతే, మానవ ధర్మాన్ని జంతు ధర్మం పై బలవంతంగా రుద్దినట్లవుతుంది. ఇది అధర్మం అవుతుంది అని నా భావన.

  ( మీ సమాధానం ఎట్లావున్నా, కవి కొన్ని ఉదాహరణలద్వారా మానవ సమాజానికి నీతిని , ధర్మాన్ని ఉపదేశించే ప్రయత్నం చేశాడనే విషయాన్ని నేను నమ్ముతాను ).

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

  • 7:51 సా. వద్ద మార్చి 5, 2012

   మాధవరావుగారు – నమస్కారము. చాలాకాలం తరువాత మీరు నా లేఖపై వ్యాఖ్యానించారు. ధన్యవాదాలు.
   .
   కొంతకాలం క్రితం, కుల/వర్ణ వ్యవస్థ మీద – మీరు ఒక టపా ప్రచురించారు. చాలా చక్కటి విశ్లేషణ ప్రతిపాదించారు. అంతకుపై, నేను మరేమన్నా తెలుపగలనా? – అని నాకే అనుమానం! ఇక వాలి వధ గురించిన విశేషమంటారా, శ్రీరామచంద్రుడే స్వయంగా ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. దానిని ఒక టపా రూపంలో తప్పక ప్రచురించగలను.
   .
   సహృదయంతో మీరు నా రాబోయే టపాలు స్పృశించవలసిన విషయాలను recommend చేసినందుకు ధన్యవాదాలు. మనఃపూర్వక ప్రయత్నం తప్పక చేయగలను.
   .
   కృతఙ్ఞతలతో…

 14. madhavaraopabbaraju
  5:43 సా. వద్ద మార్చి 6, 2012

  ఆర్యా, నమస్కారములు.

  ముందుగా మీ అప్యాయితకీ, అభిమానానికీ నా కృతజ్నతలు. మీ పేరు తెలియకపోవటంతో మిమ్మల్ని ఆర్యా అని సంబోధిస్తున్నాను. మీనుంచి మరెన్నో చక్కటి, ముఖ్యమైన రచనలు రావాలని కోరుకుంటున్నాను. మీ మిగతా రచనలను త్వరలోనే చదివుతాను.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 15. 2:50 సా. వద్ద మార్చి 30, 2012

  That is a nice article. Though there are few inconsistancies here.
  Mostly all of these are our interpreations – not that there is anything wrong with interpretation. Valmiki Maharshi did not mention any of above things and perhaps left for us to figure them out. There are many views as to Lord Rama knew or not that He is incarnation of Lord Vishnu. There are few unanswered things though. That is why we can never understand Rama Avtar.
  – He gave Moksha to Jatayu – He told – you can go to any lokas that you desire
  – He asked Ocean to give side and threated when it did not respond
  – He told when Vibhishana came that, I will give Abhayam to any one who asks me.
  Above are few of the things that can lead to understand whether Rama knows that He is the Vishnu incarnation but on “Bahya” exteriorly, He acted as a normal man who is committed to Dharma. Internally He might be aware of who He is.

  I did not quite agree with your view on Sita Mata Agni Pravesh. Rama completely had faith in Sita. He told explicitly that He did it only to prove it to the world.

  Ramo Vigrahavan Dharamaha – Whatever Rama does wil always be correct. If it appears to some that what he did is not right, perhaps there is something wrong with their analysis or understanding.

  There are quite many things Maharshi left for us to analyse. That analysis has been gonig on for hundreds of years. No matter what, Srimad Ramayanam continues to be our one and only source of solution for all the problems. Even if you read it as story or interpret read the inner meaning.

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s