ముంగిలి > పిచ్చాపాటి > విరిసీ విరియని పువ్వే ముద్దు

విరిసీ విరియని పువ్వే ముద్దు

దోహా నుండి వచ్చిన వ్యక్తి ఒకరు, ఖర్జూరాలు ఇచ్చారు. అవి డైనింగ్ టేబుల్ మీద గత వారం రోజులుగా ఉన్నాయి. రోజూ కనిపిస్తున్నాయి – కానీ వాటి జోలికి పోలేదు. మొన్న ఆదివారం, మా ఆవిడ వాటిని చక్కగా ఓ పళ్ళెంలో సర్ది, వెంట తీసుకొచ్చి పక్కన కూర్చుంది. తింటారా అని అడిగింది కూడా. ఏదో పనిలో ఉండి ఊఁహూఁ అని సమాధానమిచ్చా. సర్లే అని తను మెల్లిగా ఒకొక్కటి నోట్లో వేసుకుంటోంది. ఎందుకో తన వైపు చూసాను. తను తింటుండడం గమనించి, నాకూ మనసు కలిగింది. ఒకటి తీసుకొని నోటిలో వేసుకున్నా. అది తడవు, ఒకటి-రెండు మినహా మొత్తం అన్నీ నేనే తినేశాను. ఆ తినే వేగాన్ని గమనించి “మరో రెండు పాకెట్లున్నాయి. ఇంకో పాకెట్టు విప్పనా?” అని అడిగింది.

నిజానికి ఖర్జూరాలు నా ఒకానొక ‘ఈక్‌నెస్‌’. చదువుకునే రోజుల్లో మా బస్‌స్టాండ్ వద్ద తోపుడు బండి మీద కుప్పగా పోసి, పాకెట్టు రూపాయి చొప్పున అమ్మే వారు. జిగురు జిగురుగా ఉండే ఖర్జూరప్పళ్ళు అలా రోడ్డు మీద ఏ ఆచ్ఛాదనం లేకుండా ఉన్నా కూడా, రోజుకో పాకెట్టు కొనుక్కు తినే వాణ్ణి. అలాంటిది, అందుబాట్లో డైనింగ్ టేబుల్ మీద కనబడుతున్నా ఇప్పుడు ఎందుకు పట్టించుకోలేదు?

అంతకన్నా మరికొన్నేళ్ళ వెనకటి మాట. ప్రతి వారం మా అమ్మ – శ్రీ కృష్ణ దేవరాయ ఆంధ్ర భాష నిలయానికి వెళుతుండే వారు. కోఠీలో ఉన్నది. తనకు నవలలు చదివే అలవాటు ఉండేది. అక్కడ చందాదారుగా చేరి, ప్రతివారం ఒక నవల తెచ్చుకునేది. తనతో బాటు వెళ్ళడానికి మేమంతా ఎగబడే వాళ్ళం. కారణాలు రెండు. అక్కడ – పిల్లలకు సంబందించిన పుస్తకాలు కూడా ఉండేవి. చందమామతో పాటు, ఆ కాలంలో అలాంటి పుస్తకాలు మరి కొన్ని దొరికేవి. పేర్లు గుర్తుకు లేదు. వాటితో పాటే బోలెడు కామిక్స్ కూడా ఉండేవి. వీటికన్నా పెద్ద ఆకర్షణ మరొకటి ఉండేది. తిరిగి వస్తుంటే, దారిలో చెఱకు రసం అమ్మేచోట ఆగి ఒక గ్లాస్ ఇప్పిచేది. ఆవిడ మూడ్ బాగుంటే, ఛాట్ బండార్‌లో ఛాట్ కూడా! అదే నేటి పరిస్థితితో పోలిస్తే, చెఱకు రసం ఇప్పటికీ దొరుకుతోంది. ఛాట్ బండార్‌లూ ఉన్నాయి. కానీ వెళ్ళి తినాలనో, తాగాలనో ఉత్సాహం మాత్రం లేదు.

ఇలా ఎన్నెన్నో మార్పులు చెందిన అభిరుచులు. ఇప్పటికీ నాకు ఖర్జూరాలన్నా, చెఱకు రసమన్నా, ఛాట్ అన్నా ఇష్టమే. కానీ అప్పటి ఆసక్తి మాత్రం లేదు. నా అంతట నేను ప్రయత్నపూర్వకంగా వెళ్ళి తినను. కానీ నా ప్రయత్నంతో పనిలేకుండా అవకాసం దొరికితే మాత్రం – ఓ పట్టు పడతా.

చదుకునే పిల్లాడిగానో లేక యువకుడిగానో – నా వద్ద డబ్బు పరిమితిగా ఉండేది. తినాలనే తపన మాత్రం అధికం. ఈ రోజు పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నం. డబ్బు ఉన్నది కానీ తినాలనే ఆసక్తి సన్నగిల్లింది. ఎందుకు?

దీనికి సమాధానం – నేను డబ్బు సంపాదించడం మొదలు పెట్టిన రోజుల్లో వీటన్నిటినీ కుమ్మేయడమే. ఒక్క సారిగా వనరులు చేకూరేసరికి ఉబ్బి తబ్బిబ్బయి వీటన్నిటినీ అడ్డూ ఆపు లేకుండా తినేవాణ్ణి. వీటి మీద ఆసక్తి సన్నగిల్లుతోంది అని కూడా గుర్తించలేక – దొరికినపుడు, కుదిరినపుడు, కుదరకపోతే కుదుర్చుకొని మరీ అపరిమితంగా ఆస్వాదించాను. మెల్లి మెల్లిగా సన్నగిల్లిపోయి, ఆసక్తిని తట్టి లేపాల్సిన పరిస్థితి నేటిది.

ఈ తిళ్ళ వ్యవహారం పక్కన పెట్టి ఇతరత్రా విషయాలు గమనించినట్లయితే కూడా, పరిస్థితి పెద్దగా భిన్నంగా ఏమీ లేదు. ఒకప్పుడు సంగీత్ థియేటర్‌లో ఏదన్నా కొత్త సినిమా వస్తే వదిలేవాణ్ణి కాదు. కొన్నేళ్ళ వరకూ నేను చూడని ఇంగ్లిష్ సినిమా లేదు. వీటి పట్ల నేడు నాకున్న ఆసక్తి – ఖర్జూరప్పళ్ళ మీద ఉన్న ఆసక్తే! ప్రయత్నపూర్వకంగా వెళ్ళను – లేదా చూడను. కానీ అవకాసం దొరికితే మటుకు ఆసక్తీగా చూస్తాను. ఒకప్పుడు సినిమాలను కూడా విపరీతంగా చూడటం – సన్నగిల్లిన ఆసక్తికి కారణం.

ఇవే అంశాలపై – అందరికీ నాలాగే ఆసక్తి సన్నగిల్లి ఉంటుందని ఏమీ లేదు. కొందరికి ఇంకా మనసు తీరి ఉండదు. అందరూ ఒకేలా ఉండరు కదా! కొన్ని కొన్ని ఆసక్తులు ఇంకా జవసత్వాలతోనే ఉన్నాయి. కానీ నేను ఏ రకంగా వాటిని ట్రీట్ చేస్తానో అన్న విషయం పై – ఎంత కాలం ఆసక్తి మిగిలి ఉంటుందనేది ఆధార పడి ఉంటుంది. ఉదాహరణకు పంచామృతం అంటే కూడా నాకు మహా ఇష్టం. కానీ ఏ పండక్కో, లేక అభిషేకం చేయించినపుడో తప్ప దొరకదు. ఇష్టం కదా అని పాలు, పెరుగు, తేనే, నెయ్యీ పంచదారలు కలిపి – అసంధర్భంగా తయారు చేసుకొని తాగేయటం మొదలు పెడితే, అది కూడా ‘హాం ఫఠ్‌’ అయి కూర్చుంటుంది.

చిన్న గమనిక. ఇష్టాలు, అవసరాలు, వ్యసనాలు వేరు వేరు సుమండీ! ఒకే తాటిపై చూడటం సరి కాదు.

పంచామృతం విషయంలో సంయమనం పాటించినట్లే, చెఱకు రసం, ఛాట్‌, ఖర్జూరప్పళ్ళు, సినిమాలను కూడా – కాస్త పరిమితిగా ఆస్వాదించి ఉంటే, వాటిపై నాకున్న ఆసక్తి వేరేగా ఉండి ఉండేదేమో! Of course, వీటి మీద ఆసక్తి సన్నగిల్లడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదనుకోండి! కానీ వీటి స్థానంలో – వేరే విలువైనవాటిపై ఆసక్తి సన్నగిల్లితే?

సమాజంలోని కట్టుబాట్లు, నియమాలు, నియంత్రణలు – ఇవన్నీ నిజానికి మన సుఖాలకు అడ్డు కాదు. ఆ సుఖం విలువను నిలిపి ఉంచడానికే ఉన్న అమరికలు. వీటిని పాత చింతకాయ పచ్చళ్ళ కింద జమ కట్టి, విచ్చలవిడిగా జీవితాన్ని ఆస్వాదించి – అది నిస్సారంగా కనిపించడం మొదలు పెట్టినపుడు – తెలిసొస్తుంది.

…అందీ అందని అందమే ముద్దు…విరిసి విరియని పువ్వే ముద్దు…

ప్రకటనలు
వర్గాలుపిచ్చాపాటి ట్యాగులు:
  1. 10:12 సా. వద్ద ఏప్రిల్ 4, 2012

    Totally agree! Nice post!

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s