ముంగిలి > సందర్శన > బెలూం / బేలుం / బిలం గుహల వివరాలు

బెలూం / బేలుం / బిలం గుహల వివరాలు

క్రితం శుక్రవారం, అనుకోకుండా ఈ గుహలను చూడటానికి వెళ్ళడం జరిగింది. ముందరి టపాలో, ఈ గుహల అందాలను – ఫొటోల రూపంలో పంచుకున్నాను. ఈ టపాలో, వికీపీడియాలో లేని వివరాలు అందించే ప్రయత్నం.

అనుకోకుండా వెళ్ళాము కాబట్టి, వీటి గురించిన వివరాలేవీ ముందస్తుగా తెలియదు. వీటి పేరే చిత్రంగా తోచింది. బెల్లం గుహలని, బేలుం గుహలని, బేలం గుహలని, మరికొందరు బెలూం గుహలని చెప్పారు. ‘బిలం’ అనే పదానికి వచ్చిన తిప్పలు – ఈ పేర్లన్నీ. కర్నూలు జిల్లా కొమిలిగుండ్ల మండలంలో ఉన్నవివి. రవాణా సౌకర్యం గురించి పెద్దగా తెలియదు. నన్నడిగితే, మీ సొంత వాహనంలో ఇక్కడికి చేరుకోవటం శ్రేయస్కరం. తాడిపత్రినుండి 30 కిలోమీటర్లు, గుత్తినుండి 64 కిలోమీటర్లు, నంద్యాల నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. హైదరాబాదునుండి చేరుకోవాలంటే అద్భుతంగా ఉండే NH 44 మీద ప్రయాణం చేసి, కర్నూలు పట్టణం దగ్గిర NH 40 ఎక్కి – నంద్యాల వైపుగా ప్రయాణం చేస్తూ, పాణ్యం వద్ద NH 40 దిగి బనగానపల్లి మీదుగా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇలా వెళితే శుమారు 330 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి. వసతి సౌకర్యాలేవీ లేవు. భోజనం కూడా అంతంత మాత్రమే! హరిత వారు నడిపే Restaurant ఉన్నది కానీ – మీరు మధ్యాహ్నం తినడానికి కావలిసినవి వెంట తెచ్చుకోవడమే ఉత్తమం. ఉదయం తొమ్మిదీ-పది మధ్యలో ఇక్కడికి చేరుకొని, రెండూ-మూడు గంటలు ఇక్కడ గడపడానికి కేటాయిస్తే, ఈ గుహల అందాలను పూర్తిగా ఆస్వాదించడం కుదురుతుంది. ఐతే, ఇలాంటి గుహలు గట్రాలు అందరికీ నచ్చుతాయని లేదు.

ఈ గుహల గురించిన విశేషాలు, వికిపీడియాలో ఉన్నాయి గనుక, వీటి చరిత్ర గురించి పెద్దగా చెప్పదలచుకోలేదు. ఆసక్తి ఉన్నవారు వికిపీడియా లంకెను చదవండి.

ఇక్కడ ఏముంది? నిజానికి రాళ్ళూ రప్పలు. అంతే! కానీ అబ్బురపరుస్తాయి. కొన్ని లక్షల ఏళ్ళు జలపాతాలు చెక్కిన గుహలు ఇవి. బొఱ్ఱా గుహలను ఇంకా చూడలేదు గనుక, రెంటినీ పోల్చలేను. నేను చూసిన మొదటి గుహలు ఇవే. అందుకేనేమో మహా బాగా నచ్చేశాయి. కాకపోతే నేను వేసుకున్న దుస్తులు, నా వెంట ఉన్న వారి వల్ల – వీటిని పూర్తిగా ఆస్వాదించలేక పోయాను. మరొకసారి సరైన పద్దతిలో చూడటానికి వెళ్ళ వలసిందే.

భూమికి శుమారు 20 మీటర్ల లోతులో ఉన్నాయి కాబట్టి – ముఖ్యంగా గాలిలో తేమ వల్ల విపరీతంగా ఉక్క పోస్తుంది. ఫ్లాష్‌ కెమేరాతో ఫోటో తీయాలని ప్రయత్నిస్తే, గాలిలో తేమ ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. ఈ క్రింది చిత్రం చూడండి!

గాలిలో తేమ

గాలిలో తేమ

కెమేరాలలో వీటి అందాలను బంధించడం కాస్తంత కష్టమైన పనే! చాలా మంది పర్యాటకులు (మగ వారు), తమ షర్టులు/టీ-షర్టులు విప్పేసి తిరుగుతూ కనిపిస్తారు. ప్రవేశించినది మొదలు బయటకు వచ్చేవరకు స్నానం చేసినట్టు చెమటలు పడతాయి. కాబట్టి పలచనైన దుస్తులు ధరించి వెళ్ళాలి. ఆడవారికి కాస్తంత ఇబ్బంది కలగడం ఖాయం. చీరలు కానివ్వండి – చుడీదార్‌లైనా కానివ్వండి. (ఆడోళ్ళూ – యుద్ధానికి దిగకండి ప్లీజ్‌. ఉన్నమాట చెప్పాను. ఇక్కడ జాతి వైష్యమ్యమేమీ లేదు) చెమట రూపంలో శరీరం విపరీతంగా నీటిని కోల్పోతుందిగనుక, కనీసం మనిషికి రెండు లీటర్ల నీటినైనా వెంట తీసుకెళ్ళాలి. Electrol వంటివి కలుపుకొని ఒక లీటరు, మంచి నీరు ఒక లీటరు తిసుకెళితే బాగుంటుంది. పసి పిల్లలు, వృద్ధుల వంటి వారిని వెంట తీసుకెళ్ళకపోవడం బెటర్‌.

ఆస్థమా వంటి రుగ్మతలతో ఇబ్బంది పడే వారు కాస్తంత జాగ్రత్త వహించాలి. లోపలికి వేళ్ళినకొద్దీ ఊపిరి పీల్చడం కష్టతరమవుతుందని చెప్పారు. నాకు అలాంటి ఇబ్బందులేమీ కలుగలేదు. గాలి ఆడటానికి, ఒకటీ రెండు చోట్ల ఉపరితలంనుండీ గుహలలోకి గాలిని blow చేసే యంత్రాలు అమర్చారు.

బ్లోవర్

బ్లోవర్

ప్రవేశ ద్వారం వద్ద టికెట్టు తనిఖీ చేసే సిబ్బంది ‘Guide కావాలా?’ అని ఆడుగుతారు. జాగ్రత్తపరులు వీరి సేవలను వినియోగించుకోవడం మంచిది. తప్పిపోయి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడదు కానీ, ఒకే గుహలో తెలియకుండా తిరుగుతూ ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ టికెట్టు సంగతి చెప్పలేదు కదూ! మనిషి ఒక్కింటికీ 40 రూపాయలు. పిల్లలకయితే 25.

నేను వెళ్ళినది వేసవి గనుక, బురద వంటి ఇబ్బందులేమీ లేవు. నా అనుమానం ప్రకారం వానాకాలంలో ఇక్కడికి వెళ్ళకపోవడం మేలేమో. వేసవి, చలి కాలాలు ఉత్తమం. అంటే చలి కాలంలో చెమట పట్టదనుకోకండి! ఎప్పుడెళ్ళినా పడుతుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు

 1. రుగ్మతలతో బాధ పడుతున్నవారు, ఐదారేళ్ళకన్నా చిన్న పిల్లలు, వృద్ధులు – వెళ్ళకపోవడం మంచిది
 2. మంచినీటిని వెంట తీసుకెళ్ళడం మరవొద్దు సుమా!
 3. సన్నటి కాటన్ దుస్తులు ధరించి వెళితే, ఉబ్బరింతను భరించడం కుదురుతుంది
 4. Guide సహాయం తీసుకోవడం మంచిది
 5. టార్చ్‌లైట్ వెంట తీసుకెళితే సౌకర్యంగా ఉంటుంది
 6. లోపల తినుబండారాలతో పనిలేదు. కాబట్టి అనవసరపు మొతలు బయట వాహనంలో వదిలి వెళితే మంచిది. మంచి నీరు, టార్చ్‌లైటు, కెమెరాలు చాలు
 7. ఇటువంటి ప్రదేశాలలో మనిషి అనేవాడు, ధూమ్రపానం మధ్యపానం వంటివి చేయడు. ఒకరు ఏమంటారోనని కాదు, ఎవరికి వారే నిర్ణయించుకోవాలి
 8. వెళ్ళాలి, చూడాలి, ఆనందించాలి. మనం వెళ్ళినట్టు అక్కడ ఙ్ఞాపకాలూ-గుర్తులు వదలవలిసిన అవసరం లేదు. అంచేత రాళ్ళ మీద పేర్లు చెక్కితేనో లేక రాయటం వల్లనో కలిగే శునకానందం కన్నా పర్యాటక అందాలు అని తలచి – వీటికి తగిన విలువనీయటమే సభ్యత. కాదంటారా?
ప్రకటనలు
 1. Suma
  12:47 సా. వద్ద ఏప్రిల్ 10, 2012

  ఒక మంచి పర్యటక ప్రదేశమును పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు.

 2. madhavaraopabbaraju
  1:32 సా. వద్ద ఏప్రిల్ 11, 2012

  ఆర్యా,నమస్కారములు.

  ఫోటోలు బాగున్నాయి. ఈ గుహాలని నేనుకూడా చూడాలనుకున్నాను. వివరాలు ఇచ్చినందుకు సంతోషం.

  మీ స్నేహశీలి,
  మాధవరావు.

 3. 3:49 ఉద. వద్ద ఏప్రిల్ 23, 2012

  mana manchi telugu praanthaanni parichayam chesinanduku ,dhanyavadamulu

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s