ముంగిలి > మన సంస్కృతి, సనాతన ధర్మం > ఏకాదశి పుణ్య తిథి వివరాలు

ఏకాదశి పుణ్య తిథి వివరాలు

ప్రతి మాసంలోని రెండు పక్షాలలో వచ్చే పదకొండవ తిథిని ఏకాదశి అంటారన్న విషయం అందరికీ తెలిసినదే. పౌర్ణమికి ముందు వచ్చేది శుక్ల/శుద్ధ ఏకాదశి; పౌర్ణమి తరువాతది కృష్ణ/బహుళ ఏకాదశి. ఏకాదశి ప్రాధాన్యం – హైందవులకు సుపరిచితమే. శ్రీహరి కృపను తేలికగా పొందడానికి గల సాధనాలలో, ఏకాదశి వ్రతం ఒకటి. మాసానికి రెండు చొప్పున, అధిక-క్షయ మాసాలను పక్కన పెడితే, ఏడాదికి 24 ఏకాదశులు. ఒకొక్కఏకాదశికి ఒక్కో పేరూ, ప్రాధాన్యం, చరిత్రలూ ఉన్నాయి.

శ్రీమహావిష్ణు

శ్రీమహావిష్ణు

భవిష్యోత్తర పురాణంలో తాత్వికంగా పరిశీలించవలసిన గాధ ఒకటున్నది. కృతయుగంలో తాళజంఘుడి పుత్రుడైన మురుడు అనే దానవుడు, వరబలంతో విఱ్ఱవీగుతూ, బ్రహ్మరుద్రేంద్రాది సమస్త దేవతలను హింసిస్తూ, వారిని వారి లోకాలనుండి తరిమిగొట్టాడు. వారు శ్రీమహావిష్ణువును శరణుజొచ్చారు. వారికి అభయమిచ్చి, ఆయన మురాసురుడితో యుద్ధానికి దిగారు. సుదీర్ఘకాలం వాడితో యుద్ధం చేసినవారై, కాస్తంత అలసటకులోనై, ‘సింహవతి’ అనే గుహలో ప్రవేశించారు. శ్రీమహావిష్ణువు సంకల్పమాత్రంచేత ఒక కన్యక ఉద్భవించింది. ఆ దానవుడితో యుద్ధం చేసి, ఆ కన్యక వాడిని సంహరించింది. ఆమెయే ఏకాదశి. శ్రీమహావిష్ణువు సంతుష్టుడై, ఆమెను వరమడుగమన్నారు. “నేను సర్వకాలమును మీకు ప్రీతిపాత్రనై ఉండవలెను. సర్వ తిథులలోనూ నేను ప్రముఖముగా పూజింపబడవలె. నా తిథియందు భక్తితో ఉపవసించినవారికి మోక్షము లభింపవలెను” అని మూడు కోరికలు కోరింది.

ఇటువంటిదే మరో తాత్వికమైన కథ కూడా ఉన్నది. సంధర్భం వేరైనా, లోకకంటకుడైన మృదుమన్యుడనబడే రాక్షసుడిని అయోనిజ ఐన ఒక కన్య సంహరించినదే ఆ వృత్తాంతం కూడా. తనే ఏకాదశి.

ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి తిథుల పేర్లేంటి? కౢప్తంగా వాటి ప్రాధాన్యతావిశేషాలేమిటి? అన్ని ఏకాదశి తిథులు – శ్రీమహావిష్ణ్వార్చన, సత్‌ప్రవర్తన, దానాల వంటివాటితో కూడుకున్న ఉపవాస నియమాన్ని పాటించడం వల్ల గొప్ప ఫలితాలను ప్రసాదిస్తాయి. ఇవి కాకుండా వివిధ గ్రంథాలలో మరిన్ని వివరాలు దొరికాయి. ఒక్కసారిగా కుదరక, మెల్లి మెల్లిగా సమయం దొరికినపుడు, ఈ టపాలో ఒక్కో ఏకాదశికి సంబంధించిన విశేషాలు మరిన్ని జతచేస్తూ పోతాను. కొన్ని ఏకాదశి తిథులు – వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో ప్రఖ్యాతినొందాయి. అలా దొరికిన నామాలన్నిటిని సేకరించి, క్రింది పట్టికలో పొందుపరిచాను; గమనించగలరు.

మాసము పక్షము నామాలు విశేషాలు
1. చైత్రము శుక్ల దమనైకాదశి
కామదైకాదశి
అవైధవ్యైకాదశి
వరాహ పురాణంలో, ఈ ఏకాదశి వ్రతానికి సంబంధించిన గాధ ఒకటున్నది. నాగలోకాన్నేలే పుణ్డరీకుడనే నాగరాజు – ఒకానొక కారణాన, లలితుడనే సర్పాన్ని రాక్షసుడైపొమ్మని శపిస్తాడు. అతని భార్య అయిన లలితా కుడా అతనితో కష్టాలు అనుభవిస్తుంటుంది. వింధ్యాచల పర్వతం మీద ఉండే ముని ఒకరు ఉపదేశించిన విధంగా ఆ దంపతులిరువురు ఈ వ్రతాన్ని చేసి శప విముక్తి పొందుతారు.
కృష్ణ బహులైకాదశి
వరూథిన్యైకాదశి
ఈనాడు ఉపవసించినవారు వేయిగోవులను దానమిచ్చిన ఫలితాన్ని పొందుతారు. నర్మదానదీతీరాన మాంధాత అనే రాజుతో ముడిబడిఉన్న కథ ఒకటుంది. ఇతివృత్తమేమంటే, శ్రీమహావిష్ణువు ఆదేశం మేర మథురా నగరానికెళ్ళి, వరాహావతారంలో స్వామిని పూజించి తనకు కలిగిన అంగ లోపాన్ని (కాలు) సరిదిద్దుకుంటాడు.
2. వైశాఖము శుక్ల మోహిన్యైకాదశి పాదరక్షలు, పాలు, చల్లని పదార్థములను దానం చేస్తారు.ఈ రోజు పురుషోత్తముడైన శ్రీరామచంద్రప్రభువుయొక్క ప్రతిమకు శ్వేతవస్త్రంతోకూడిన షోడశోపచారాలు చేస్తారు.
కృష్ణ సిద్ధైకాదశి
అపరైకాదశి
అచలైకాదశి
ఛత్త్రము శీతల పానీయాల దానం.మలయగిరి చందనం, తులసి, కర్పూరాలు – గంగాజల సహితంగా విష్ణుదేవుని పూజ చేస్తారు.
3. జ్యేష్ఠము శుక్ల త్రివిక్రమైకాదశి
నిర్జలైకాదశి
భీమసేని
జలకుంభములు, పరమాన్నము, నేయి, ఛత్త్రాల దానాలు. నీరు చుక్కైనా తాగకుండా ఉపవసిస్తారు గనుక దీనికా పేరు వచ్చింది. పద్ధతిగా ఈ ఏకాదశి వ్రతం చేసినట్లయితే, అన్ని ఏకాదశుల వ్రత ఫలితం లభిస్తుంది.
కృష్ణ యోగిన్యైకాదశి
పాపనాశని
యష్టికాచందన దానం. శ్రీమన్నారాయణుడి ప్రతిమకు షోడశోపచారాలు చేసి, పేద బ్రాహ్మణులకు దానాలు చేస్తారు.
4. ఆషాఢము శుక్ల ప్రథమైకాదశి
శయనైకాదశి
ఈనాటినుండే చాతుర్మాస్యం ఆరంభమవుతుంది. ఈనాడు గోపద్మవ్రతం ఆచరించాలంటారు.
కృష్ణ కామికైకాదశి దేవీసనాథుడగు పురుషోత్తముని పూజించాలి. నవనీతదానము, మృష్టాన్నభోజనము (దానము) ముఖ్యము. అభిష్టఫలసిద్ధికరి.
5. శ్రావణము శుక్ల పుత్రైకాదశి
లలితైకాదశి
ఛత్త్రతాంబూలదానాలు చేస్తారు.

ప్రాచీన కాలంలో మహిష్మతినగరాన్ని మహీజితుడనే రాజు ధర్మభద్ధంగా రాజ్యానేలుతుండేవాడు. అతడికి సంతానం లేకపోవడంవల్ల, ఋషులను రప్పించి విచారించాడు. ఒకానొక శ్రావణ మాస ఏకాదశినాడు ఆ రాజు ఒక గోవును తన తటాకంనుండి నీరు తాగుతుంటే తరిమిన పాప ప్రభావం వల్ల సంతానం కలగటంలేదని చెప్పి, పుత్రదా ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్టలతో చేయమని చెబుతారు. ఆ రాజు అలానే చేయడం వల్ల సంతానం కలుగుతుంది.

కృష్ణ అజైకాదశి
ధర్మప్రభైకాదశి
తిలపిష్టరౌప్యపాత్ర దానాలు చేస్తారు. హరిశ్చంద్రుడు తన ఐశ్వర్యాన్ని తిరిగి పొందినది ఈ వ్రతాన్ని చేశే!
6. భాద్రపదము శుక్ల పరవర్తనైకాదశి ఆషాఢంలో యోగనిద్ర చెందిన శ్రీమహావిష్ణువు రెండునెలలపిదప పక్కకు పొర్లు దినము.
కృష్ణ ఇందిరైకాదశి
ఇంద్రైకాదశి
గోదానము, పేలపిండి దానాలు.
7. ఆశ్వీయుజము శుక్ల పాపాంకుశైకాదశి అరటిపళ్ళు, లడ్లు దానము.
కృష్ణ రమైకాదశి పెసరపిండి లడ్లు, బెల్లము దానం. కేశవ పూజ.
8. కార్తీకము శుక్ల ప్రబోధిన్యైకాదశి
ఉత్థానైకాదశి
భీష్మైకాదశి
ఆషాడంతో మొదలైన చాతుర్మాస్యం సంపూర్ణం. విష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనే దినము. వివాహాది శుభ ముహుర్తాలు, ఇక్కడినుండి మళ్ళీ మొదలవుతాయి.
కృష్ణ ఉత్పత్తికైకాదశి పైన ఏకాదశి వృత్తాంతంలో విష్ణుమూర్తి నుండి కన్యక ఉద్భవించి, మురాసురుడిని సంహరించిన దినం. శ్రీమహావిష్ణువును శ్రీకృష్ణుని రూపంలో పూజిస్తారు. నివేదనకు, ఫలాలను మాత్రమే వాడతారు.
9. మార్గశిరము శుక్ల మోక్షైకాదశి
వైకుంఠైకాదశి
ముక్కోటి ఏకాదశి
ఉత్తరాయణ ఆరంభ కాలం. మహా పుణ్య తిథి. అందరికీ తెలిసిన గీతా జయంతి. ఈనాడే శోకతప్తుడైన అర్జునుడికి శ్రీకృష్ణభగవానుడు గీతోపదేశం చేసినది. అంచేత ఈ రోజు గీతా పుస్తకానికి పూజలు చేసి పఠనం మొదలుపెడతారు.
కృష్ణ విమలైకాదశి
సఫలైకాదశి
అచ్యుతుని పూజ విశేషం. బ్రాహ్మణులు, పేదవారికి అన్నదానాదులు చేస్తారు. పేరులోనే ఉన్నట్టు సాఫల్యం – అంటే ఈ ఏకాదాశి వ్రతం వల్ల చేసే పనులు సఫలం అవుతాయి.
10. పుష్యము శుక్ల నందైకాదశి
పుత్రదైకాదశి
శ్రీమహావిష్ణువు పూజ విశేషం. వ్రత ప్రభావం వల్ల సంతాన ప్రాప్తి.
కృష్ణ కళ్యాణ్యైకాదశి
షట్తిలైకాదశి
తిలలు కలిపిన నీటితో స్నానం చేయడం, తైలకపిండితో శరీరాన్ని రుద్దుకోవడం, నువ్వులతో చేసిన పదార్థాలను సేవించడం, మంచినీటియందు నువ్వులను కలపటం, తిలదానము, తిలలతో దేవపూజ చేయటం వల్ల, దీనికి “షట్తిలైకాదశి” పేరు వచ్చింది.
11. మాఘము శుక్ల కామదైకాదశి చిమ్మిలితో గోవుఆకారాన్ని తీర్చి దానం చేస్తారు.
కృష్ణ విజయైకాదశి పాదరక్షల దానం
12. ఫాల్గుణము శుక్ల ధాత్ర్యైకాదశి
అమలక్యైకాదశి
ఉసిరిచెట్టులో స్వామివారికి ప్రీతిగనుక, దీని పూజ చేస్తారు. ఉసిరితోచేసిన పదార్థాలను సేవించడం, వీటిని దానం చేయడం.
కృష్ణ సౌమ్యైకాదశి
పాపమోచన్యైకాదశి
శ్రీమహావిష్ణువు పూజ విశేషం.
ప్రకటనలు
  1. 9:43 ఉద. వద్ద ఏప్రిల్ 18, 2012

    చాలా మంచి విషయాలు చెప్పేరు.

  2. వినయ్ గిరీష్
    9:57 సా. వద్ద జనవరి 22, 2013

    ఏకాదశి గురి౦చి బాగా చెప్పరు

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s