ముంగిలి > పిచ్చాపాటి > మొక్కలకు నీళ్ళు – స్వయంచలిత వ్యవస్థ

మొక్కలకు నీళ్ళు – స్వయంచలిత వ్యవస్థ

జూలై 12, 2012

మాకోక సమస్య ఉండేది. కుండీలలో మా డాబా మీద అందమైన పూల మొక్కలను పెంచుతుంటాము. ఎప్పుడన్నా ఓ ఐదు పది రోజుల ప్రయాణానికి బయలుదేరాలంటే, మనసు ఉసూరుమనేది. తిరిగి వచ్చేసరికి ఆ మొక్కలన్నీ నీళ్ళు లేక ఎండిపోయేవి. మరో సమస్య ఏమిటంటే – అడపాదడపా నీళ్ళుపోయడం కుదరక, మొక్కలను మాడుస్తుండేవాళ్ళం. ఇలా కొన్ని సార్లు జరిగాక, ఇక మొక్కలను పెంచడం మానేశాము. ఇవే కాక ఇతర చీకాకులు మరికొన్ని కూడా ఉన్నాయి.

 1. ముఖ్యంగా – కుండీలలో పెంచుతున్న మొక్కలకు సరైన మోతాదులో నీళ్ళు పోయాలి. ఎక్కువ నీళ్ళు పోస్తే, మొక్కలకు మంచిది కాదు.
 2. శుమారుగా నెలకొకసారి, మా కాలనీ మీదకి కోతుల సైన్యం దండెత్తుతుంటుంది. మహా తుంటరి మూక. ఒకసారైతే పక్కింటివాళ్ళ డాబా మీద ఏకంగా GI పైపునే ఊడబెరికాయి!

ఈ సమస్యకు ఒక పరిష్కారం కోసం వెతకనారంభించాను. మొత్తానికి ఓ చక్కటి సమాధానం దొరికింది. దాని వివరాలు…

Drip irrigation గురించి అందరికీ తెలిసిందే. కానీ సాధారణంగా దీని వాడకం భారీస్థాయిలో అంటే Farmhouse లేదా వ్యవసాయం లేదా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లలో మొక్కలు పెంచడం వంటి అవసరాలతో ముడిబడి మాత్రమే కనిపిస్తుంటుంది. ఇంటి పెరటి అవసరాలు తీర్చుకోవడానికి లేదా పూల తోట్లలో పూల మొక్కలు పెంచడానికి Drip irrigation ను ఎవరూ ప్రస్తావించరు. ఈ Drip irrigation ను నేనెందుకు వాడుకోలేనన్న ప్రశ్న మెదిలింది. మొదట eBay లో వెతికాను. అక్కడ సమాధానం దొరికినా, కాస్తంత ఖరిదుగా తోచింది. సమస్య డబ్బుకాదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా అనిపించింది. ఇక Internet కుదరదన్న నిర్ధారణకొచ్చి, మార్కెట్‌లో వెతకాలని నిర్ణయించుకున్నాను. భాగ్యనగరంలో రాణీగంజ్ పరిసరాలు ఇటువంటి సామాగ్రికి ప్రశస్తి. అక్కడ కొన్ని దుకాణాలలో వాకబు చేసి ప్రయత్నించాను. చివరికి కవాడీగూడాలోఉన్న విజేతా ప్లాస్టిక్స్‌కు1 చేరుకున్నాను. అదొక హోల్‌సేల్‌ దుకాణం. చిల్లరగా కూడా అమ్ముతారు. నా అవసరాన్ని వివరించాను. అతనొక సులువైన ప్రణాలికను ప్రస్తావించాడు. కానీ ఆ ప్రణాలిక మా కోతుల బెడదను తట్టుకోలేదు. అంచేత, వెంటనే నేనొక ప్రణాలికను నిర్ధారించి – దానికి కావలసిన సామాగ్రిని కొని తెచ్చాను.

సామాగ్రి వివరాలు

Drip irrigation pipe. నా అవసరానికి నలభై మీటర్ల పైపు కావలసి వచ్చింది. వానాకాలం, చలికాలం, వేసవికాలాలను తట్టుకునే విధంగా తయారుచేయబడింది. ఇట్టే రెండు ముక్కలు చేయవచ్చు; ఇట్టే జోడించవచ్చు. మీటరు ఆరు రూపాయలు.

డ్రిప్ ఇర్రిగేషన్ పైప్

a. డ్రిప్ ఇర్రిగేషన్ పైప్

Drippers. ఈ డ్రిప్పర్లద్వారా మొక్కలకు ఎంత నీరు పారాలో నియంత్రించవచ్చు. నీలి రంగులో ఉన్న డ్రిప్పర్ గంటకు ఎనిమిది లీటర్లను వదులుతుంది. నల్ల డ్రిప్పర్ గంటకు నాలుగు లీటర్లను పారనిస్తుంది. ఒకే పైపుకు నీలి డ్రిప్పర్‌, నల్ల డ్రిప్పర్‌లను జోడించినట్లయితే, నీలి డ్రిప్పర్‌నుండి బొట్లు బొట్లుగా వచ్చే నీటి మోతాదు, నల్ల డ్రిప్పర్‌నుండి పారే నీటి మొతాదుకు రెండింతలుంటుంది. అవసరానికి తగ్గట్టు ఎంచుకోవాలి. ఒక్కో డ్రిప్పర్ ఖరీదు రెండున్నర రూపాయలు.

డ్రిప్పర్‌లు

b. డ్రిప్పర్‌లు

ఈ డ్రిప్పర్‌లోపల ఉన్న Disc సన్నటి రంద్రంతో నీటి వత్తిడినీ, ప్రవాహాన్ని నియంత్రిస్తుంది.

డ్రిప్పర్‌ నిర్మాణం

c. డ్రిప్పర్‌ నిర్మాణం

పైపుకు సన్నని రంధ్రం చేయడానికి ఒక పంచ్ దొరుకుతుంది. పైపుకు ఎక్కడ కావాలో అక్కడ ఒక రంధ్రాన్ని పంచ్ చేసి, డ్రిప్పర్‌ను అందులో చొప్పించాలి. ఈ పంచ్ వెల ఐదు రూపాయలు.

పంచ్

d. పంచ్

డ్రిప్పర్‌ను పైపుకి అమర్చి మొక్కకు నీటిని అందించే అమరిక

e. డ్రిప్పర్‌ను పైపుకి అమర్చి మొక్కకు నీటిని అందించే అమరిక

Pipe fittings. T-bend, L-bend, pipe joiners వంటివి ఎన్నికావాలో నిర్ణయించుకొని తెచ్చుకోవాలి. ఇవి ఏమిటో వివరించాల్సిన అవసరం లేదనుకుంటాను. వీటి వెల రూపాయి నుండి, ఐదు రూపాయలవరకు ఉంటుంది.

పైప్ ఫిట్టింగ్స్

f. పైప్ ఫిట్టింగ్స్

Regulator / Tap. పైపులోకి ప్రవహించే నీటిని నియంత్రించడానికి కొన్ని టాప్స్ (Taps) కావలసి ఉంటుంది. ధర ఐదు రూపాయలు.

టాప్‌ / రెగ్యులేటర్

g. టాప్‌ / రెగ్యులేటర్

Dummy for closing pipe ends. డమ్మీ రంధ్రాలలోకి పైపు చివర్లను వంచి చొప్పించినట్లయితే, నీరు పారకుండా ఉంటుంది. వెల రూపాయి. పైన ఉన్న ‘e’ చిత్రంలో దీని వాడకం చూడవచ్చు.

డమ్మీ

h. డమ్మీ

Submersible pump: మా ఓవర్‌హెడ్‌ టాంక్‌నుండి నీటిని తోడి, ఈ Drip irrigation వ్యవస్థలోకి నీటిని పంప్ చేయడానికి, Air Coolerలలో వాడే Submersible Pump నొకదానిని కొన్నాను. ఇది గంటకు 1000 లీటర్ల నీటిని తోడుతుంది. వెల 150 రూపాయలు.

Submersible Air Cooler Pump

i. Submersible Air Cooler Pump

Electrical casings and fittings. నిమజ్జక (Submersible) పంప్ వాడినందున, దానికి కరెంటును అందించాలి. మన ఇళ్ళలో ఉండే 230v AC సరిపోతుంది. పంపుకు విద్యుత్తును అందించే తీగలను electrical casing pipes తో కప్పి ఉంచడం మంచిది. ఎండలు, వానలను తాట్టుకోవడానికి. కరెంటు తీగ (Wire), ఎలెక్ట్రికల్ పైపులు, క్లాంపులు (Clamps), స్క్రూలు (Screws) వగైరా సామనుకు శుమారుగా 300 రూపాయలు ఖర్చయింది.

విద్యుత్‌తీగల పైపులు, ఫిట్టింగులు

j. విద్యుత్‌తీగల పైపులు, ఫిట్టింగులు

డ్రిప్‌, విద్యుత్‌తీగల పైపులు

k. డ్రిప్‌, విద్యుత్‌తీగల పైపులు

ప్రణాళిక

ప్రణాళిక

l. ప్రణాళిక (Click to enlarge)

 1. సాధారణ 230v AC కరెంటు
 2. స్విచ్ (Switch)
 3. నిమజ్జక పంపు (Submersible pump)
 4. వెలివెల్లువ అమరిక (Pressure exhaust / కింద ‘o‘ చిత్రంతో  వివరించాను)
 5. ఓవర్‌హెడ్‌ టాంక్ (Overhead tank)
 6. నియంత్రణ కవాటాలు (Pressure regulators). పైన ‘g’ చిత్రంలో చూపిన కుళాయిల సహాయంతో, నీటి ప్రవహాన్ని నియంత్రించడానికి అమర్చిన అమరిక
 7. మొక్కల వద్ద కావలసిన డ్రిప్పర్‌ల అమరిక

నేను మా డాబా మీద Drip irrigation వ్యవస్థను కోతుల బెడద తట్టుకోవడానికని, కాస్తంత జటిలంగా అమర్చాను. అంటే గోడకు పైపును అమర్చి, ప్రతి మొక్కకు ఒక T-bend ను వాడి మరో పైపును జోడించి, డమ్మీతో మూసి డ్రిప్పర్ తగిలించడం. ఇటువంటి కోతులు ఇతరత్రా బెడదలు లేని వారు, ఇంత జటిలంగా గోడకి అమర్చనవసరం లేకుండా, కేవలం పైపును పూల తోట్ల మీద పరిస్తే సరిపోతుంది. ఆ ఒకే ఒక్క పైపుకు సరిగ్గా మొక్క దగ్గిర రంధ్రాన్ని పంచ్ చేసి డ్రిప్పర్‌ను తగిలిస్తే సరిపోతుంది. అన్నన్ని T-bendలు, డమ్మీలు, గోడకు క్లాంపులు అవసరం ఉండదు.

మొక్కకు తగ్గట్టు, 8 LPH లేదా 4 LPH (Litres per hour) డ్రిప్పర్‌లను వాడాలి. ఉదాహరణకు, మల్లేమొక్కకు 8 LPH డ్రిప్పర్ వాడాలి. గులాబి వంటి మొక్కలకు 4 LPH డ్రిప్పర్‌లు సరిపోతాయి. పైన జతచేసిన ‘b’ చిత్రాన్ని చూడండి.

సరే! Drip irrigation వ్యవస్థ ఏర్పరచడం పూర్తయింది. అదీ కోతులను తట్టుకొనేదిగా దృఢంగా అమరింది. కానీ, నా అసలు సమస్యకు సమాధానం ఇంకా దొరకలేదు. ఐదు పది రోజులు ఇంటికి దూరంగా ఉన్నప్పుడు, మొక్కలకు నీళ్ళు ఎవరు పోస్తారు?

సమాధానం – స్వయంచలిత (automated) వ్యవస్థ. మరలా eBay లో వెతికాను. ఒక పరికరం దొరికింది. Electronic Digital Timer. ఇదొక అద్భుతమైన పరికరం. దీనిలో ఎనిమిది సెట్టింగ్స్‌ను వాడుకోవచ్చు. అంటే, ఎప్పుడు స్విచ్ ఆన్ + స్విచ్ ఆప్ అవ్వాలో అని ఎనిమిది సెట్టింగ్స్‌ను ప్రోగ్రామ్ చేయవచ్చు. అద్భుతం; పరమాద్భుతం.

Frontier Digital Timer

m. Frontier Digital Timer

Frontier Digital Timer arrangement

n. Frontier Digital Timer arrangement

నేను వాడినది TM-619H మోడల్‌. దీని వెల శుమారు 900 రూపాయలు. Air Cooler లో వాడే సబ్‌మర్సిబుల్ పంపును (Submersible pump) డాబా మీద ఉన్న ఓవర్‌హేడ్ టాంక్‌లోకి దింపి, ముందే అమర్చిన Drip irrigation వ్యవస్థతో కలిపాను. ఇక ఆ సబ్‌మర్సిబుల్ పంపుకు పంపవలసిన కరెంటును డిజిటల్ టైమర్‌కు జోడించేసరికి – స్వయంచలిత నీటి పారుదల వ్యవస్థ సిద్ధం!

కానీ ఇక్కడో తిరకాసుంది. ఇంచుమించుగా సబ్‌మర్సిబుల్ పంపు – గంటకు వెయ్యి లీటర్ల నీటిని తోడుతుంది. మొక్కలకు అమర్చిన డ్రిప్పర్లేమో గంటకు నాలుగు, ఎనిమిది లీటర్ల నీటిని మాత్రమే వదలడానికై తయారుచేయబడ్డాయి. పంపునుండి వచ్చే నీటి వత్తిడి అధికంగా ఉండడంవల్ల, డ్రిప్పర్ల ద్వారా ఎక్కువ మోతాదులో నీరు ప్రవహించసాగింది. దీనికి పరిష్కారం – వెలివెల్లువ దారి (exhaust) అమరిక. పంపునుండీ నీటిని Drip వ్యవస్థలోకి పంపే గోట్టానికి ఓవర్‌హేడ్ టాంక్‌లోనే ఒక కుళాయి అమర్చాను. దానిని తగినంతగా తెరిచి వుంచడం ద్వారా, Drip వ్యవస్థలోకి ప్రవహించే నీటి వత్తిడిని నియంత్రించగలిగాను. దీనితో అన్ని సమస్యలకు పరిష్కారం దొరినట్టే.

వెలివెల్లువ అమరిక

0. వెలివెల్లువ అమరిక

ఈ వెలివెల్లువ అమరిక పుణ్యమా అని మరో సమస్యకు కూడా పరిష్కారం దొరికింది. అదే సైఫన్ ఎఫెక్ట్ (Siphon Effect). వెలివెల్లువ అమరిక వల్ల సైఫన్ ఎఫెక్ట్ ఉండదు. ఈ అమరిక లేకపోతే, ఓవర్‌హెడ్‌ టాంక్‌లో నీరుగనుక నిండుగా ఉన్నట్లయితే, పంపుకు విద్యుత్‌ప్రవాహాన్ని నిలిపివేసినప్పటికీ – డ్రిప్పర్లద్వారా నీరు ప్రవహిస్తూనే ఉండేది.

హెచ్చరిక

హెచ్చరిక

హెచ్చరిక: Air Cooler లో వాడే Submersible Pump ఇంకా దానికి సంబందించిన విద్యుత్ వ్యవస్థను అతి జాగ్రత్తగా అమర్చవలసి ఉంటుంది. Waterproof insulation tape ను వాడి ఏమాత్రం నీరు జొరబడకుండా ఎంతో జాగ్రత్త వహించాలి. ఏ మాత్రం పొరబాటు జరిగినా, మొదటికే మోసం రావచ్చు. అందుకని అనుభవం ఉంటేనే ప్రయత్నించండి. అనుభవం లేకపోతే Electrician ను రప్పించి అతనితో చేయించండి. అసలు ఈ 230v AC బెడదే వద్దనుకుంటే, మరొక ప్రత్యామ్నాయం ఉన్నది. అది 12v DC బ్రష్‌లెస్ మోటర్‌ (Brush-less Motor). కానీ దీని ఖరీదు AC పంప్ కన్నా పది రెట్లు అధికం. అంతే కాక, 230v AC ను 12v DC కు మార్చే ఆడాప్టర్‌ను (Adaptor) కూడా వినియోగించవలసి వస్తుంది.

ఈ డ్రిప్ వ్యవస్థను తయారు చేయడంకన్నా – నిజానికి దాని గురించి తెలుగులో రాయడమే కష్టంగా తోచింది. సరిగ్గా వివరించానో లేదో! ఆసక్తి ఉన్నవారికి ఏవన్నా సందేహాలు కలిగితే, నిర్మొహమాటంగా తెలుపగలరు.

1 – విజేతా ప్లాస్టిక్స్ దుకాణానికి చేరుకోవాలంటే, టాంక్ బండ్ మీద ఉన్న మారియాట్ (అదే ఒకప్పటి వైసెరాయ్‌) హోటల్ సందులో ముషీరాబాద్ వైపుగా వెళుతున్నపుడు, రోడ్డుకు ఎడమవైపు తగిలే Indian Oil పెట్రోల్ బంక్ పక్క సందులోకి వెళ్ళాలి. అది ఒక కాలనీ. గూగుల్ మాప్స్‌ను వాడకండి. తింగరబుచ్చిది – తప్పు చూబిస్తోంది.

ప్రకటనలు
 1. 10:42 ఉద. వద్ద జూలై 12, 2012

  మీరు సామాన్యులు కాదు! మీ ఆలోచన(Thought), మీ సృజనాత్మకత(Creativity), మీ ఆచరణ(Implementation/Practice), మీ వివరణ(Explanation) ….. చాలా బాగున్నాయి…ధన్యవాదాలు.

  • 12:32 సా. వద్ద జూలై 12, 2012

   ఐతే మొత్తానికి నేను తెలుగులో వివరించినది అర్థమయ్యేవిధంగానే ఉన్నదన్నమాట. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.

 2. vinod
  12:17 సా. వద్ద జూలై 12, 2012

  what are you by profession?

 3. voleti
  12:51 సా. వద్ద జూలై 12, 2012

  చాలా వివరంగా ఫొటోలతో సహా బాగా రాసారు.. ఎవరైనా ఈ పద్దతిని సుబ్బరంగా పాటించచ్చు… మీ అనుభవ పూర్వక సందేశంతో.. ధన్యవాదములు..

  • 12:59 సా. వద్ద జూలై 12, 2012

   కాస్తంత జంకుతూ పోస్ట్ ప్రచురించాను. నిఘంటువును పక్కనెట్టుకొని మరీ రాయవలసివచింది. చాలా థాంక్స్ వోలేటిగారు.

 4. 11:47 సా. వద్ద జూలై 28, 2012

  మీ ప్రయత్నం అభినందనీయం. నావైపు నుండి ఓ చిన్న హెచ్చరిక! ఇదొకటి వచ్చింది కదా అని తోటపని మానేస్తే పొట్టపెరిగేను. పోయేది నా సొమ్మేమీ కాదు కనుక ఓ ఉచిత సలహా! ఆ మొక్కల మొదళ్ళదగ్గర వరిగడ్డి (దొరికితే) కానీ మార్కెట్టులో అలాగే ఉండే సింథటిక్ మెష్ గానీ వేస్తే డ్రిప్‌లోంచి వచ్చే నీటిని అవి పీల్చుకుని ఎక్కువసేపు మొక్కల వేళ్ళవద్ద తేమ నిలువ ఉండేలా చేస్తాయి. వరిగడ్డైతే కుళ్ళి ఎరువుగానూ పనికొస్తుంది.

  • 10:54 ఉద. వద్ద జూలై 29, 2012

   తోటపని అంతగా తగ్గదు. కలుపు మొక్కలు, మొక్కలకు ఎరువు వేయడం, కొమ్మలను కత్తిరించడం వంటివి యథావిధిగా చేస్తూనే ఉండాలి. Drip system వల్ల, మొక్కలకు నీరు చాలా పొదుపుగా కానీ కావలసినంతగా వెళుతుంది. So, synthetic mesh అవసరం అసలు ఉండదు. కానీ వరిగడ్డి plan బాగుంది. ప్రయత్నించి చూడాలి.

 5. Snkr
  6:29 ఉద. వద్ద జూలై 29, 2012

  సగం BSc(Ag/Horti) గ్రాడుయేట్ అయినట్టనిపించింది, బాగా అర్థమయ్యేలా రాశారు.

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.