ముంగిలి > శిరోభారం > పిల్లలు – మత వైషమ్యాలు

పిల్లలు – మత వైషమ్యాలు

జూలై 27, 2012

మొన్నీమధ్య – మా ఇంటికి శ్రీమతిగారి స్నేహితురాలు వచ్చింది. తనతోబాటు తల్లిదండ్రులు, ఓ నాలుగైదేళ్ళున్న అబ్బాయి ఉన్నారు. వారు అన్య మతస్తులు. మతాలు వేరయినా, స్నేహం గాఢమైనదే. చదువుకునే రోజులనుండీ ఉన్న స్నేహం.

ఇంటికి పిల్లలు ఎవరన్నా వస్తే – నాకు పండగే! పిల్లలతో కలిసిపోవడం అంటే ఎక్కడలేని సరదా. వాళ్ళతో మాట్లాడాలంటే – పెద్దలతో సంభాషించేటప్పుడు కలిగే వికారాలేవీ అడ్డురావు. కృత్రిమమైన మందహాసాలు, ఏ విషయం మాట్లాడాలి, ఏ విషయాలు మాట్లాడాకూడదు, పాండితీ ప్రదర్శనలను, అహాల వంటివి ఏవీ అడ్డురావు. పిల్లలు ఏమి అనాలనుకుంటున్నారో మొహం మీద చెప్పేస్తారు. నచ్చితే నచ్చిందని – నచ్చకపోతే నచ్చలేదని. వారి మనసు ఆకట్టుకుంటే నెత్తిన ఎక్కించుకుంటారు. శుద్ధమైన, స్వచ్చమైన, నిష్కళంకమైన మనసులు.

మాయావిడ స్నేహితురాలి కుటుంబం కాబట్టి, వాళ్ళకీ వాళ్ళకీ సవాలక్షా ఉంటాయి. అంచేత నేనూ, మావాడూ, ఆ బుడతడు – ఒక వర్గంగా మిగిలిన (పెద్ద) వాళ్ళనుండి విడిపోయి, మా ఆటల్లో మేం పడ్డాము. కాసేపు గడిచాక అందరూ భోజనాలకు ఉపక్రమించారు. భోజనం వద్ద పేచీ పెడతాడని – ఆ బుడతడికి తరువాత తీరికగా భోజనం పెట్టవచ్చని వారంతా లేచారు. అబ్బే! పాపం ఒక్కడే అవుతాడని, వాడికి కాలక్షేపంగా నేనూ తరువాత భోజనం చేస్తానని ఉండిపోయాను.

కాసేపు ఆటలు ఆడిన తరువాత “టీ.వీ. చూస్తావా?” అని అడిగాను. సరేనన్నాడూ. “ఏం పెట్టను? ‘ఛోటా భీం’ పెట్టనా?” నాకు ఎదురైన ఈ కాలపు పిల్లలందరు – అంటే ఇప్పుడిప్పుడే మాటలోస్తున్న వయసునుండి ఏడూ-ఎనిమిది తరగతులు చదువుతున్న పిల్లలు సైతం నోళ్ళు వెళ్ళబుచ్చి మరీ చూసే కార్టూన్ ‘ఛోటా భీం’. అందుకే అడిగాను. దానికి వాడి సమాధానం “No.” ఆశ్చర్యపోతూ “Why?” అని అడిగాను. దానికి వాడిచ్చిన సమాధానం “I should not watch Chhota Bheem. It is a Hindu Cartoon.” దిమ్మతిరిగి పోయింది!

సరేలేనని, Disney XD లో Power Rangers వస్తుంటే అది చూస్తావా అని అడిగితే సరేనన్నాడు! అదో పెద్ద తలనొప్పి మేళం. కానీ పిల్లాడు చూస్తానన్నాడు కదా అని పెట్టాను. కాసేపాగి వాడికీ చిరాకుగా తోచినట్లుంది – ఛానెల్ మార్చమన్నాడు. ఛానెళ్ళు తిరగేస్తుంటే “Put this” అని ఆపాడు. సరేనని వాడు అడిగినదే పెట్టాను. వాడు అడిగినది ఏమిటో తెలుసా? ‘Roll No. 21’ అనే మరో కార్టూన్‌. బహుశః వాడికి ఈ కార్టూన్ చూడకూడదని చెప్పడం మరిచి ఉంటారు.

పిల్లలకు కూడా విషాన్ని నూరిపోయాలా?

పిల్లలకు కూడా విషాన్ని నూరిపోయాలా?

జరిగినది ఏమిటా అని ఆలోచిస్తుంటే మరో బాంబు పేల్చాడు. “What is your religion?” అని అడిగాడు. పెద్దలు నేర్పిన విషయమైతే వాడి బుఱ్ఱకు ఎక్కింది కానీ, చాకచక్యంగా తెలుసుకోవడం లేదా అడగటం ఇంకా రాలేదు. పాపం వాడికేమీ తెలియదు. వాడికేం చెప్పారో అదే చేసాడు. అదృష్టవశాత్తు – ఈ తతంగం జరిగినపుడు మా వాడు పక్కన లేడు. ఉండి ఉంటే, ఈ కష్మలం వాడి బుఱ్ఱనుండి కడగాల్సిన అగత్యం పట్టేది.

కాస్తంత ఇబ్బందిగా తోచింది. నాలుగైదేళ్ళ బుడతడికి Religion అంటే ఏమి అవగాహన ఉంటుంది? ఎదో ఒకటి చేసి దాటేశాను. ఇబ్బంది వాడు వేసిన ప్రశ్నవల్ల కాదు; వాడి వయసు పిల్లలకు కూడా ఈ విషయాలను బోధిస్తారని తెలిసినందుకు. ఈ కాలం పిల్లలను ఏడూ ఎనిమిది తరగతులనుండే IIT prep అని ఊదరగొడతారని తెలుసు. అంతకన్నా ముందే ఈ లౌకిక ఙ్ఞానాన్ని కూడా బోధించాలని నాకు ఇంకా తెలియదు. జపాన్ దేశస్తుల సహాయంతో నిర్మించిన ‘Ramayana: The Legend of Prince Rama’ ఆనిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్‌తోబాటు ‘The Polar Express’, ‘The Ten Commandments’ వంటి DVDలు కొని మా వాడికి చూపించి తప్పు చేశానా?

మరో పిడుగుకూడా నెత్తిన వేసాడు – కానీ దాని గురించి రాయబుద్ధి కావటంలేదు. ఇది జరిగినపుడు అందరూ పక్కనున్నారు.

ఇంతకాలం ఉన్న ఒక అందమైన అపోహ చెదిరిపోయినట్టు అనిపించింది. ఇకనుండి పిల్లలతో కూడా ఆచితూచి మాట్లాడాలేమో!

ప్రకటనలు
వర్గాలుశిరోభారం ట్యాగులు:, ,
 1. 4:59 సా. వద్ద జూలై 27, 2012

  పరమత సహనం అని మనం చూస్తూ కూర్చుంటుంటే, వాళ్ళు చాప కింద నీరు లాగా సమాజాన్ని ముక్కలు చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికయినా కళ్ళు తెరవక పోతే మనందరిదీ అధోగతే..

  • 8:14 సా. వద్ద జూలై 27, 2012

   మరో కోణంలో ఆలోచించండి. పై టపాలోని సంఘటనలో – నిజానికి sense of insecurity కనిపిస్తోంది.

 2. 8:26 సా. వద్ద జూలై 27, 2012

  పరమత సహనం ఎక్కడ వస్తుంది సార్? పెద్ద వాళ్లకే లేదు. ఈ కులాల గురించీ మతాల గురించీ ఎంత మంది పిచ్చి పిచ్చి గా బ్లాగ్స్ లో మాట్లాడటం లేదు?
  పెద్ద వాళ్ళే పిల్లలను నాశనం చేసేది.

  ఇలాంటి విషయమే ఈ మధ్య ఒక బ్లాగ్ లో రాశాను. ఆ బ్లాగ్ మోడరేటర్ గారికి నచ్చక comment తీసేశాడు. ఆయన హైందవ-విషనాగు అని రాసి రాసి చంపాడు.
  అందులో కామెంట్స్ రాయటమే మానుకున్నా.

  ఇవన్నీ ఈ దేశం లో పెరిగేవే కానీ తరిగేవి కావు.

  • 8:35 సా. వద్ద జూలై 27, 2012

   So called పెద్దలు ఎంత కొట్టుకున్నా ఫరవాలేదు – ఎవడి maturity వాడిది. కానీ పిల్లలకు కూడా నూరిపోయడం దారుణం!
   .
   మీ ప్రయత్నం గమనించాను. “అందులో కామెంట్స్ రాయటమే మానుకున్నా.” << I can understand.

 1. No trackbacks yet.
వ్యాఖ్యలను మూసివేసారు.