ముంగిలి > శిరోభారం > పైశాచికానందం

పైశాచికానందం

సెప్టెంబర్ 20, 2012

మా ప్రహరీ గోడకు ఆనుకొని ఉన్న స్థలంలో కూడా పూల మొక్కలు పెంచుతుంటాము. ఆ స్థలం చుట్టూ చక్కగా ఒక గట్టును కట్టించి, చూడటానికి కంటికి ఆనే విధంగా చేయించి, కొన్ని మొక్కలు నాటాము. ఆ మొక్కలలో నూరు వరహాల మొక్క (Ixora) ఒకటి. ఎఱ్ఱని పువ్వులు పూసినపుడు – ఆ  మొక్క చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మా కాలనీలో మరికొందరి ఇళ్ళ వద్ద కూడా ఈ మొక్కలు ఉన్నాయీ.

కానీ – దాని అందమే దాని శత్రువు!

నూరు వరహాలు

నూరు వరహాలు

ఒక గుత్తిలో ఉన్న చిన్ని చిన్ని పువ్వులు అన్నీ విచ్చుకుంటే చాలు – మాయం అయిపోతూ ఉంటాయి. వాటి అందానికి మంత్ర ముగ్ధులై – గంధర్వులో అప్సరసలో వాటిని తెంపుకొని పోతుండరు! మనుష్యరూపంలో తిరుగాడే పిశాచాలు కొన్ని ఈ పని చేస్తుంటాయి. ఈ మనుష్యుల profile ఏమన్నా ఉంటుందా అంటే – చెప్పడం కష్టమే! ఆడా, మగ, పిన్నా, పెద్దా, ధనికులు, దరిద్రులు, వయసులోనున్నవారు, వయసుమళ్ళినవారు అందరూ తలా ఒక చెయ్యి వేస్తుంటారు. అడపా దడపా వీరిని దొంగతనం చేస్తున్నప్పుడు రెడ్ హాండెడ్‌గా పట్టుకొని నిలదీసిన సంఘటనలు ఇవి.

ఉదయం ఐదున్నర ప్రాంతాలలో ఒక యువతి కోస్తున్నపుడు – ఆ పని ఎందుకు చేస్తున్నదని అడిగితే “రోడ్డు మీద ఉంది కాబట్టి కోస్తున్నాను” అనే కుంటిసాకు చెప్పింది. ప్రతిస్పందనగా – “మీరూ ఇపుడు రోడ్డుమీదే ఉన్నారు! నేను కూడా మీలాగానే ప్రవర్తించవచ్చునా?” అని అడిగేసరికి – పట్టిన దెయ్యం వదిలి, మరింకెప్పుడూ ఆ పని చేయలేదు.

ఒకానొక గురువారం – ఉదయం వేళ, ఓ పదేళ్ళ తుంటరి – పూవులగుత్తిని కోస్తూ కనిపించాడు. వాడిని నిలదీస్తే “మా మేడం కాలనీలో దొరికే పూలని కోసుకు తెమ్మనది” అని చెప్పాడు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో కాపలా కాసేవాడి కొడుకు వాడు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆవిడ ఒకత్తె – వీడికి చిల్లర డబ్బుల ఆశ చూపి ఈ పని చేయిస్తుందని తెలిసింది. వీడు పట్టుకొచ్చిన దొంగ పూలతో ఆవిడ దర్జాగా సాయిబాబా మందిరానికెళ్ళి, వాటిని సమర్పించుకొని పుణ్యాన్ని మూటగట్టుకుంటుందట. గాలి బాపతు. దీనీ భక్తి చెంచల్‌గూడా జైలుకెళ్ళ! ఇటువంటివారి విడ్డూర భక్తివల్లనే కదా కొందరు పనిలేక – మతాన్ని, ముఖ్యంగా హిందూ మతాన్ని ఏకిపారేస్తుంటారు. ఈ దోంగ భక్తులను, ఆ మతద్వేషులను ఒక గదిలో రెండు రోజులు భంధించి ఉంచితే – రెండు మేళాల తిక్క కుదురుద్ది!

మరొక శుభోదయవేళ, చూడటానికి హన్సికా మోత్వానికి అన్నలాగా ఉన్నతను ఒకడు – సైలెంట్‌గా పువ్వులు కోస్తుంటే, మా వాడు చూసి చెప్పాడు. మా కాలనీ కాదు. బండి మీద వచ్చాడు. ఏమి చేస్తున్నాడని నిలదీస్తే, ఎక్కడలేని హ్యుమిలిటీ ప్రదర్శిస్తూ క్షమాపణ వేడుకున్నాడు. మరింకెప్పుడూ అలా చేయనని హామీ ఇచ్చి తొక ముడిచాడు. డబ్బున్న ధనికుడే! ఇవేం దొంగ బుద్ధులో?

ఎనభై తొంబై ఏళ్ళున్న పెద్దాయన ఒకడు, కాలనీలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. వయసు పైబడినందున పూర్తిగా మతి స్థిమితం లేనివాడని మా అందరికీ తెలుసు. పిచ్చివాడు కాదు. పక్క వీధిలో ఉన్న ఒక ధనికుల కుటుంబానికి చెందినవాడు. మొగ్గలను తెంపి వెళ్ళిపోతుంటే “తాతా! ఎందుకు కోసావు” అని నెమ్మదిగా అడిగినపుడు, అర్థం అయ్యీ అవ్వనట్టుగా ముఖం పెట్టి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కానీ అతని కళ్ళలో న్యూనతా భావం మాత్రం ఖచ్చితంగా కనిపించింది. మరింకెప్పుడూ కోసిన దాఖలాలు లేవు.

అరవై డెబ్భై ఏళ్ళున్న పెద్దావిడ ఒకరు – మా శ్రీమతిగారిని, మావాడిని కనబడినప్పుడల్లా పలకరించి ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. ఒక రోజు ఆవిడ నిండుగా పూసిన రెండు గుత్తులను తెంపుకొని దర్జాగా వెళ్ళిపోతుంటే, “ఇదేమి పనండీ?” అని దైన్యంగా ప్రశ్నిస్తే “ఏమీ అనుకోకండి. ఇలా ఎప్పుడూ చేయలేదు. చాలా అందంగా ఉండేసరికి ఉండబట్టలేక కోసాను. క్షమించాలి; మరింకెపుడూ ఇలా చేయను” అనే వివరణ వెళ్ళబుచ్చుకుంది. అందంగా కనిపిస్తే – చెరచాలన్నమాట! ఈవిడగానీ ఈ కాలంలో యువకుడిగా ఉండి ఉంటే, అందంగా ఉన్న ఆడాళ్ళ సంగతి ఏఁ గాను?

పక్క వీధిలో ఉండే మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒకావిడ – ఒక్క పువ్వు కూడా మిగల్చకుండా కోసుకు పోతుండేది. ఒక రోజు పువ్వులు కోస్తున్నపుడు పట్టుకొని అలా ఎందుకు చేస్తున్నదని అడిగితే, ఎంతో కాన్ఫిడెంట్‌గా “పూజ కోసం” అని చెప్పింది. మరో గాలి మేళం. దొంగ పూలతో పూజ చేసినా తప్పులేదు అని భావించే అమాయక, అయోమయ వక్ర జాతి.

వినాయక చవితి వచ్చింది కదా – మొక్కలకు గడ్డుకాలమే! వినాయకుడికి పత్రి, ఎఱ్ఱరంగు పూలూ సమర్పించుకోవాలన్న భక్తుల భక్తిని కాష్ చేసుకోడానికి so called బడుగు బలహీన వర్గాలకు చెందిన కొందరు ఎగబడతారు. కాలనీల మీద బడి – ఏ మొక్క దొరికితే అది, అడ్డదిడ్డంగా తుంచి – తెంచి, పత్రి పేరిట అమ్మజూపుతారు. ఇక నూరు వరహాలులాంటి పూమొక్క సంగతి ఏమి చెప్పాలి? చిన్నపాటి కొడవళ్ళు, పెద్ద పెద్ద గోనసంచులుచ్చుకొని మా కాలనీ మీద పడ్డారు. కాపలా కాసి వారికి అర్థమయ్యే విధంగా గదమాయించి మొక్కలను కాపాడుకోవలసిన అగత్యం పట్టిందంటే నమ్మాలి!

ఇలాగే మరెన్నో ఘటనలు ఉన్నాయి. ఎన్నని రాసి – వాపోవాలి?

ఒక్క చుక్క నీరు పోసిన పాపాన పోరు. దాని స్థితిగతులతో సంబంధమే లేదు. చీడ పట్టినపుడు, మందు కొట్టరు – కానీ దర్జాగా పువ్వులు మాత్రం కోస్తారు. పోనీ – జాగ్రత్తగా పూలు మాత్రమే కోస్తారా అంటే – అదీ లేదు. అడ్డదిడ్డంగా ఆకులూ, కొమ్మలూ రాలి కింద పడేలాగా కోసి పారేస్తారు. భక్తి, ఆకర్షణ, డబ్బు – ఇలా ఏవేవో కారణాలు. పట్టుబడినపుడు క్షమాపణ చెప్పుకున్నారంటే, వీరి అంతరాత్మను తొక్కిపెట్టి చేస్తున్న పని అని తెలుస్తున్నది. ఈ పనివల్ల వీరికి కలిగే ఆనందాన్ని పైశాచికానందం అనడం తప్పా?

నూరు వరహాలు

నూరు వరహాలు

ప్రకటనలు