ముంగిలి > రాజకీయం > కేజ్రివాల్ చేస్తున్నదేమిటి?

కేజ్రివాల్ చేస్తున్నదేమిటి?

అక్టోబర్ 18, 2012

వార్తా ఛానళ్ళను పెద్దగా పట్టించుకోని నాలాంటి వ్యక్తి సైతం గత కొద్ది రోజులగా “What’s next?” అనే ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాడంటే నా మటుకు నాకు అది విశేషమే!

ముందస్తు హెచ్చరిక లేకుండా రాబర్ట్ వాద్రాను, పేరు చెప్పకుండా ఒకటి రెండు రోజుల హెచ్చరికతో సల్మాన్ ఖుర్షీద్‌ను, ముందస్తుగా పేరు చెప్పి ఒక్క రోజు వ్యవధి ఇచ్చి నితిన్ గడ్కరీని గురించిన నిజాలను IAC బయటపెట్టి బాగానే ఇబ్బందికి గురి చేసింది. హెచ్చరిక లేక పోవడం, పేరెత్తకుండా హెచ్చరిక ఇవ్వడం, పేరు చెప్పి మరీ బట్టలూడదీయటం – ఈ మూడింటిలో ఒక pattern ఉన్నట్లే, ముందు ఒక క్రిష్టియన్‌ను తరువాత ఒక ముస్లిమ్‌ను పిదప ఒక హిందువును ఇరకాటంలోపెట్టి సర్వ మత సమానత్వాన్ని కూడా చాటింది. ఇది యాదృచికమో లేక ముందస్తుగా నిర్ణయించుకున్న పద్దతో! (అట్టా కాక – నవరాత్రుల్లో రోజుకొకరిని ఏసేస్తూ, దశమినాటికి ఏ పెద్ద పిట్టనో కాల్చిపారేసుంటే సూపర్‌గా ఉండేదేమో కదా? హి హీ…)

ఏది ఏమయినా, కేజ్రీవాల్ & కంపెనీ చేస్తున్నదేమిటో పెద్దగా బోధ పడట్లా! సల్మాన్ ఖుర్షీద్‌ ఉదంతం కుసింత విస్మయానికి గురిచేసినా, మిగతా ఇద్దరి వివరాలు – పెద్దగా ఆశ్చర్యాన్ని రేకెత్తేవి ఏమీ కావు. (సల్మాన్ ఖుర్షీద్ గారికి పరోపకార ఆలోచనలు ఉన్నాయి అని తెలియడం విస్మయానికి గురి చేసింది అని నా ఉద్దేశ్యం సుమా! అపార్ధం చేసుకునేరు.)

ఒక మాజీ కార్పోరేటర్ వేలువిడిచిన మేనల్లుడి బావమరిదివాళ్ళ తమ్ముడి స్నేహితుడుసైతం ఆ మాజీ కార్పొరేటర్ పేరు చెప్పుకు దర్జాగా పనులు చేయించుకునే మన వ్యవస్థలో, దేశంలోనే అత్యంత పరపతిగల కుటుంబానికి అల్లుడై ఉండి మడి కట్టుకు కూర్చున్నాడంటే ఆశ్చర్యపోవాలిగానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కాస్తంత లబ్ధి పొందాడని నేరారోపణ చేస్తే ఆశ్చర్యపోవడానికి అందులో వింతేముంది?

సల్మాన్ ఖుర్షీద్ పాపం అవిటి వాళ్ళకు సహాయం చేద్దామనే సదుద్దేశ్యంతో గుట్టు చప్పుడు కాకుండా లోకోపకార పనులు చేస్తుంటే, నిధులు దుర్వినియోగం అయ్యాయని ఇలా గొడవ పెట్టడం ఏమన్నా బాగుందా? అందులో మిగిలేదెంత? స్విస్స్ బాంక్ అకౌంటు తెరవడానికన్నా సరిపోతుందా? ఒక రాజకీయనాయకుడు – అదీ పాలక వర్గానికి చెందినతను తన డబ్బుతో సమాజానికి సేవ చేస్తున్నాడంటే విస్మయం కానీ, ఈ IAC బయటపెట్టిన దానిలో మాటరేది?

మొన్న జులై మాసంలో గడ్కరి కొడుకు పెళ్ళికి కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దిక్షిత, సాక్షాత్ మన్మోహన్ సింగ్‌లే విచ్చేశారు. అందరితో అంత ఫ్రెండ్లీగా ఉండే అతనికి – NCP కి చెందిన షరద్ పవార్‌కు సాన్నిహిత్యం ఉన్నది అని చెబితే అందులో కొత్తేమున్నది?

మా వీధిలో ఒక కుక్క ఉన్నదనుకోండి. అనుకోవడమెందుకు? నిజంగానే ఉంది.

  • రాత్రిళ్ళు మొరిగి మా నిద్రను పాడుచేస్తోంది.
  • చిత్త కార్తేలో తిక్క తిక్కగా ప్రవర్తిస్తోంది.
  • పక్క వీధిలో ఉన్న ఆడ కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకొన్నది.
  • పడుకోడానికి గుంటలు తవ్వుతోంది.
  • దొంగల వెంట పడకుండా వచ్చిన ప్రతి కొత్త వ్యక్తి వెంట పడి వేధిస్తోంది.

…అని దాని గురించి కొన్ని నిజాలు సేకరించి మా కాలనీ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసాననుకోండి. వారు ఆ నిజాలను నిర్ధారించి మునిసిపాలిటీ వారిని పిలిపించారనుకోండి. ఆ మునిసిపాలిటీ వారు కుక్కల బండిలో దానిని పట్టుకెళ్ళిపోయారనుకోండి. సమస్య తీరినట్టేనా? నా బుఱ్ఱ.

దీని ‘ఇలాకా’ మీద కన్నేసి ఉన్న మరో కుక్కకు మార్గాన్ని సుగమం చేసిన వాడినే అవుతాను తప్ప, నిజంగా సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నవాడిని కాలేను.

అవినీతి అన్నది వ్యవస్తలో ఉన్నదా లేక ఒకరిద్దరిలోనా? “ఆఁ! లేదు లేదు. ఒకరిద్దరికి బడిత పూజ చేస్తే మిగతా వారందరు తెలుసుకుంటారు” అని వాదిస్తే అది వితండమే అవుతుంది. పనిగట్టుకు తొవ్వితే ఒకరిద్దరు తప్ప ప్రతి రాజకీయనాయకుడి వెనుకా ఒక చరిత్ర ఉంటుంది. అలా ఎంతమందినని ఫింగరిగ్ చేయవచ్చు? పోనీ, అందరి బట్టలు ఊడదీసారనుకుందాం. రాబోయే ఎనికల్లో అలా బట్టలూడదీయబడినవారి పట్ల ప్రజలు అసహ్యాన్ని ప్రదర్శిస్తారా లేక సింపతీ చూబిస్తారా?

అంతెందుకు! కేజ్రీవాల్ పార్టీ అభ్యర్ధులకు వోట్లేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? – ఈ ప్రశ్నకు సమాధానం జయ్ ప్రకాష్ నారాయణ్ గారు చక్కగా ఇవ్వగలరు. పెద్ద పెద్ద చదువులు చదివినవారు కొవ్వొత్తులట్టుకొని నిరసనలు మాత్రమే తెలియజేస్తారు – వోట్లు వేయరు. అంతటి గొప్ప చదువులు చదవనివారికేమో కులం ముఖ్యమాయే! ఒకవేళ కులం విషయంలో టై ఏర్పడితే, తమ ఓటుకు ఎవరు ఎంత ఎక్కువ పలికితే వారికే వోటు వేస్తారు.

ఎన్నో సంధర్భాల్లో ఒక అభ్యర్ధినో లేక పార్టీనో ద్వేషించినందుకు మరొకరికి వోటు వేస్తారే తప్ప, తాము ఓటు వేసిన పార్టి అంటే నమ్మకం ఏర్పడి కాదు. ప్రత్యామ్నాయం ఉన్నదా? అది లేనప్పుడు ఎవరితో/దేనికోసం ఈ యుద్ధం?

మీడియా వాళ్ళూ, కేజ్రీవాల్ వంటివారి పుణ్యమా అని ‘రాజకీయ తప్పిదానికి’ తాత్పర్యమే మారిపోతోంది. “అవినీతికి పాల్పడటం తప్పు కాదు, తెలివితక్కువగా పట్టుబడిపోవటం తప్పు.” పట్టుబడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీరివల్ల మంచి తర్ఫీదు లభిస్తోంది. వీరి ప్రయత్నం – సమాధానానికి దారి తీస్తుందో లేదో తెలియదుకానీ, జనాలు తెలివిమీరిపోయేలా మటుకు చేస్తుంది. అల్లెప్పుడో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ శానా సీప్‌గా లక్షరూపాయల ఆశకే లొంగి – పట్టుబడిపోయాడు. అదే పార్టీ ఇప్పటి అధ్యక్షుడైన గడ్కరీ అంత సీప్‌గా ప్రవర్తిస్తాడా? అయినా ఈ భా.జ.పా. అధ్యక్ష పదవి అంతగా అచ్చిరావట్లేదు సుమీ!

ఏమో! “In front Crocodile festival” (ముందుంది ముసళ్ళ పండగ) అని మరింత ఆశతో ఎదురుచూడవచ్చేమో…వేచి చూడాలి…

ప్రకటనలు