ముంగిలి > పిచ్చాపాటి, మన సంస్కృతి, శిరోభారం > నార్వేలో ఉదంతం – ఇక్కడ జుట్లు పీక్కోవడం

నార్వేలో ఉదంతం – ఇక్కడ జుట్లు పీక్కోవడం

డిసెంబర్ 6, 2012

నార్వేలో జరిగిన ఉదంతం పుణ్యమా అని ఓ రెండు వర్గాలు తమ భావ వ్యక్తీకరణను అంతర్జాలంలో కాస్తంత ఘాటుగానే చేశాయి. భారత దేశ సంస్కృతి మిదే వేలెత్తి – పాతభావాలు అని ఒకరు కరాఖండిగా తేల్చేస్తే, మరొక వర్గం అందుకు భిన్నంగా తల్లి దండ్రుల హక్కు అన్నట్టుగా తమ భావాలను వ్యక్త పరిచారు. కానీ వీరిద్దరిలో ఎవరిది సరైన ఆలోచనా విధానం?

సరే మన భారత దేశ ‘పాతభావాల’ సంస్కృతి పిల్లల దండన విషయంలో ఏమి చెప్పింది?

నమ్మినా నమ్మకున్నా, ఇంచుమించు ప్రతి భారతీయుడికి నృసింహ అవతారం గురించి తెలిసే ఉంటుంది. అత్యంత శాంత స్వభావుడూ, గుణాతీతుడూ ఐన శ్రీ మహా విష్ణువు ప్రపంచాలు భీతిల్లే విధంగా నరసింహ అవతారం ఎత్తడానికి కారణం ఏమిటి? హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుడిని పదే పదే చిత్ర హింసలకు గురిచేయడమే! తన మాటా, గురువుల మాటా వినటంలేదని కన్న కొడుకు అని కూడా చూడకుండా పడరాని కష్టాలకు తన సొంత కొడుకైన ప్రహ్లాదుడిని గురి చేస్తాడు. అడుగడుగునా వెన్నంటే ఉండి కాపాడుతున్నా, ఆ బాలుడు పడిన కష్టాలను మరువలేక ఇక నృసింహావాతారంలో రంగ ప్రవేశం చేసి ఆ దుష్ట రాక్షసుడిని సంహరించిన తరువాత కూడా శాంతించడానికి కాస్తంత సమయం తీసుకుంటాడు ఆ దేవ దేవుడు. స్వయంగా లక్ష్మీ దేవి, బ్రహ్మాది దేవతలు సైతం ఆ ఉగ్ర రూపానికి భయపడి వెనుకంజ వేసినప్పటికీ, ఆ పసి బాలుడి ప్రార్థనకు లొంగి మరలా లోకాలు ఊరటపొందే విధంగా తన త్రిగుణాతీత స్థితికి చేరుకుంటాడు.

మరో సుపరిచితమైన ఉపాఖ్యానం – ధ్రువుడిది. తన కన్న తండ్రి తొడ మీద సోదరుడు ఎక్కినట్టే తనూ ఎక్కి కూర్చోవాలన్న చిన్న ఆశ పడినందుకు, ఆ బాలుడిని దయలేకుండా చీదరించుకొంటుంది ఆతని సవతి తల్లి. తన తల్లి అంటే తన తండ్రికి చిన్న చూపు. సవతి తల్లి అంటే ప్రేమ. ఆ వివక్ష వారి కడుపున పుట్టిన వారి మీదా అలాగే చూబిస్తాడు. తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలు ధ్రువుడు వినలేక పోయాడు. తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గర నుంచి ధ్రువుడు పట్టరాని దుఃఖంతో కర్రదెబ్బ తిన్న పాములాగా రోషంతో రోఁజుతూ తన తల్లి వద్దకు వెడతాడు. తన తల్లి అసహాయతను కూడా చూస్తాడు. ఆ పసి వయసులో భగవంతుడు అంటే సరిగా అర్థం తెలియకపోయినా, తన స్థాయిలో కొన్ని నెలలు గొప్ప తపస్సు చేస్తాడు. అతని తపః ప్రభావాన్ని సహింపలేక ముల్లోకాలు కంపించాయి. మెచ్చి సాక్షాత్కరించిన పిదప పసి బాలకుడు తనని ఎలా స్తుతించాలా అని తడబడ్డప్పుడు, తన శంఖంతో ఆ బాలుని చెక్కిలి స్పృశించి తనను స్తుతించే శక్తిని కూడా ప్రసాదిస్తాడు ఆ దేవ దేవుడు. ఏమి అడగాలో తెలియని ఆ పసి బాలుడి భక్తికి మెచ్చి మరెవ్వరూ ఊహించలేని, పొందలేని ఉత్తమ గతిని ప్రసాదిస్తాడు. దాని తరువాత వేటకై వెళ్ళి మరణించిన తన కొడుకును వెతుక్కుంటూ వేళ్ళి ధ్రువుడి సవతితల్లి కార్చిచ్చులో పడి కాలిపోతుంది.

దేవీ నవరాత్రుల్లో రెండేళ్ళ నుండి పదేళ్ళలోపు ఆడపిల్లల కాళ్ళు కడిగి వారిని పూజించి తరించమని చెబుతున్నది ఈ దేశ సంస్కృతి. పిల్లలు దైవ స్వరూపం అని ఏదో ‘punch dialogue’ కోసం కాదు; త్రికరణశుద్ధిగా నమ్మాలని నేర్పుతోంది ఈ సంస్కృతి. ఇవేవీ మనకు పట్టవు. పాత చింతకాయ పచ్చళ్ళు అని పక్కన పడవేసి Paedophile సంస్కృతికి పెద్ద పీఠ వేయడం ఫాషన్ గా తయారయింది.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వేదాలు, ఉపనిషత్తులలో ఉన్న విషయాలు సామాన్యులకు అర్థం కావని, మన ఋషులు తెలికగా అర్థమయ్యే విధంగా కథల రూపంలో పురాణాలను మనకు అందించారు. ఒక మనిషి తన జీవితంలో – వివిధ సంధర్భాలలో మార్గదర్శన పొందే విధంగా ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు, కథల రూపంలో తేలికగా పొందుబరిచారు. వక్ర భాష్యాలను ప్రచారం చేస్తూ, అవి పుక్కిటి పురాణాలనీ, రావణాసురుడు, నరకాసురాది దైత్యులు గొప్పవారని ప్రచారం చేస్తూనే, మరో పక్క ఈ దేశ సంస్కృతి గురించి వేలెత్తి చూపుతారు. ఏంటో ఈ విడ్డూరం.

ఇక కల్లు కుండలో పాలు ఉన్నా, అది కూడా కల్లే అని గుడ్డిగా నమ్మి వాదనకు దిగుతారు – మరో వర్గం వారు. మన సంస్కృతిలో పిల్లలను రాచి రంపాన పెట్టయినా దారిలోకి తెమ్మని ఎక్కడ ఉన్నది? ఎంత తమ కడుపున పుట్టినా, ఆ బిడ్డకూ ఒక మనసు అనేది ఉంటుంది. బలహీనతలు ఉంటాయి. అర్థం చేసుకొనే పరిపక్వత ఉండదు. కొన్ని కొన్ని సంధర్భాలలో, మానసిక రుగ్మతలు ఉండవచ్చు. వారి స్థాయికి మనం దిగకుండా, వారిని మన స్థాయికి ఎత్తగలిగే నేర్పరి తనం ఉండాలి. లేక పోతే, ముందు మనం నేర్చుకోవాలి. కడుపులో పిండాన్ని చంపితే నరకంలో ఎన్ని బాధలు పడతారో గరుడ పురాణం చూస్తే తెలుస్తుంది. అటువంటిది, పుట్టి ఈ భూమి మీద పడ్డ పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి?

మన వ్యవహారం – దేశ కాల పరిస్థితులకు అనుగూణంగా మారుతుంటుంది. ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లు మన దేశంలో ప్రవర్తించినట్లు అన్ని దేశాలలో ప్రవర్తించడం కుదరదు. భారత దేశాన్ని ఇష్టం వచ్చినట్లు తిడుతుండే వాళ్ళు, ఏ చైనాకో లేక గల్ఫ్ దేశాల్లోకో వెళ్ళి అదే పద్దతిలో ఆ దేశాన్ని దూషిస్తూ కూర్చుంటాను అంటే కుదురుతుందా? శాల్తీలు గల్లంతైపోతాయి. డాలర్లలో సంపాదన ఉన్నా, ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం రూపాయిల్లో లెక్క వేసి కడుపు కాల్చుకు తిరిగే వారు ఎంతమంది లేరు? Be a Roman when in Rome. ఈ చిన్నపాటి విషయం అర్థమవ్వక కష్టాల్లో ఎంతమంది పడలేదు?

నార్వేలో జరిగినది ఒక సంఘటన. దాని గురించి మనం తర్జన భర్జనలకు దిగి, కష్టాల్లో ఉన్న ఆ తల్లి దండ్రులను దోషులనుగానో లేక నిర్దోషులనుగానో నిర్ణయించలేము. వార్తలు అని ప్రచారం చేసే వారిని ఎంత నమ్మవచ్చో అందరికీ తెలుసును. లేదూ – కాలక్షేపానికి కొట్టుకు చస్తాము అని తీర్మానించుకుంటే తప్పేమీ లేదు – భేషుగ్గా జుట్లు పీక్కోవచ్చును. కానీ ఏ మాత్రం అవగాహన లేక, ఈ జాతినీ, దాని సంస్కృతిని అందులో భాగం చెయ్యడం అన్యాయం.

ప్రకటనలు