ముంగిలి > పిచ్చాపాటి > విడాకులు, విడిపోవడాలు

విడాకులు, విడిపోవడాలు

బులుసు సుబ్రహ్మణ్యంగారి టపా ‘ఔను, వాళ్ళిద్దరూ విడిపోయారు ()’ టపా చదివినపుడు పలు ఉదాహరణలు జ్ఞప్తికి వచ్చాయి. ఆ కథ లాంటి యదార్థ గాథలు అరుదుగానైనా, అడపా దడపా ఎదురుపడుతున్నాయి.

ఇరవైల్లో, ముప్పైల్లో ఉన్న దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయిన సంఘటనల గురించి తెలిసినపుడు, కాస్తంత బాధ కలిగినప్పటికీ, ‘మారుతున్న విలువలు’ అని ఏదోలా అరాయించుకోవచ్చు. కానీ, రెండేళ్ళ క్రితమే ఘనంగా కూతురి పెళ్ళి చేసి, జీవితంలో చక్కగా స్థిరపడి పెళ్ళికి సిద్ధంగా ఉన్న కొడుకును చంకలో పెట్టుకొని, ఒకావిడ తన కుటుంబాన్ని తాత్కాలికంగా వొదిలేసి తన ఉనికిని వెతుక్కుంటూ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయిన ఒక యదార్థ గాధ బొత్తిగా మింగుడు పడటంలేదు. “అబ్బో! ఏమి కుటుంబం, ఏమి కుటుంబీకులు!” అని ముచ్చటపడినవారందరికీ, ఇప్పటి ఆ కుటుంబ పరిస్థితి అర్థం కాకుండా ఉన్నది. అలా తనకు దూరంగా వెళ్ళిపోయిన భార్య గురించి తాపత్రయ పడుతూ ఆ ఇంటి పెద్ద పడుతున్న బాధ వర్ణనాతీతం. కనీసం మాటలన్నా ఉంటే, విషయం ఏమిటో తెలుసుకొని, తనలో ఆవిడకు కనిపిస్తున్న దోషాలను సరిదిద్దుకుందామని అనుకున్నా, అసలు తనతో ఫోనులో కూడా మాట్లాడటానికి ఒప్పుకోని తన భార్యలోని మార్పుకు గల కారణం ఏమిటో తెలియక ఆరోగ్యాన్ని కూడా పాడూ చేసుకుంటున్నాడు – అతను. మూడు దశాబ్దాల కాపురం తరువాత ఇంతటి ఎడబాటుకు కారణం ఎవరికీ అంతుబట్టకుండా ఉన్నది.

ఏదీ నిష్కారణంగా మటుకు జరుగదు. బహుశః రోజువారీ వొత్తిళ్ళలో, ఆ భార్యా భర్తలు తమ మధ్యన పెరుగుతున్న అగాధాన్ని అంచనా వేసి ఉండరు. సుబ్రహ్మణ్యం గారి కథలో ఉన్నట్లు ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనబడక కొన్ని విపరీత నిర్ణయాలు తీసుకుంటుంటారేమో!

విడాకులకు సంబంధించి లెక్కలేమన్నా దొరుకుతాయా అని కాస్తంత వెతికాను. చట్ట పరంగా విడిపోతున్న జంటల సంఖ్య గణనీయంగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. రమారమిగా ప్రతి వంద జంటలలో ఒక జంట విడిపోతోందిట – శుమారుగా 0.01% అన్నమాట. కొన్ని పాశ్చాచ్య దేశాలలో ఇది 50% వరకూ ఉందిట. వారితో పోల్చుకొంటే మన పరిస్థితి కాస్తంత మెరుగ్గా ఉన్నప్పటికీ, గత పదేళ్ళలో మన దేశంలో విడిపోతున్న జంటల సంఖ్యలో 100% వృద్ధి కనబడుతోందిట. పదేళ్ళ క్రితం 0.0074% ఉన్నది ఇప్పుడు 0.01% కు చేరుకున్నది.

పై లెక్కలు చట్ట పరంగా విడిపోతున్నవారివే. విడాకుల వరకూ పోకుండా, విడిపోయి ఉంటున్న వారి లెక్కలు మరింకెన్నో. కానీ, నా అంచనా ప్రకారం మన దేశంలో కూడా మెల్లి మెల్లిగా విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి అదుపుతప్పే పరిస్థితులు దాపురించడానికి ఎంతో కాలం పట్టదు. ఇదేదో దివ్య దృష్టితో చూసి చెబుతున్నది కాదు. పెళ్ళి అనే పవిత్ర బంధంతో ముడిబడి ఉన్నప్పుడు, సమాజానికి వారి వల్ల ప్రమాదం ఉండదు. కానీ ఒక సారి నిర్ణయించుకొని విడిపోయ్యాక, జవసత్వాలు ఉన్నవారు సమాజానికి రేడియో ధార్మిక పదార్థంలా తయారవుతారు. వారి కష్టాలనుండి తాత్కాలికంగా ఉపశమనం పొందినా, మెల్లిగా తోడు కోసం వెంపర్లాడే పరిస్థితి ఏర్పడవచ్చు. వారి ప్రభావం ఇతర జంటలపై పడి అవి విచ్ఛిన్నం అయ్యే ప్రమాదానికి తెలిసో తెలియకో కారణం కావచ్చు. విడాకులు పుచ్చుకున్నవారందరూతప్పు చేశారు అని వేలెత్తడం నా ఉద్దేశ్యం ఏమాత్రం కాదు. కొన్ని సంధర్భాలలో పరిస్థితుల ప్రభావం వల్ల ‘విడాకులు’ అన్నది ఆవశ్యకమై ఉండి ఉండవచ్చు.

వ్యక్తిగత స్థాయిలో ‘విడాకులు’ అనే ప్రక్రియ ఒక వ్యక్తికి ఊరట కలిగించవచ్చునేమో కానీ, సమాజం స్థాయిలో మటుకు అది అంటు వ్యాధి స్థాయి రుగ్మత. అందుకేనేమో ఒక జంట విడిపోయే ముందు, కోర్టులు కూడా అయినంత మేర కౌన్సెల్లింగ్ వంటివి చేసి ఆ ప్రయత్నాన్ని విరమింపజేయాలని శతవిధాల ప్రయత్నిస్తాయి. అంతకు ముందు, స్నేహితులూ, బంధువులూ సైతం తమ వంతు సాయం చేయాలనీ చూస్తారు.

ఫలానా వయసువాళ్ళు, లేదా ఒక స్థాయి ఆర్థిక పరిపుష్టి ఉన్నవారు, ప్రేమ వివాహాలు చేసుకున్నవారు, లేదా కొన్ని ఆచార వ్యవహారాలను పాటించే/పాటించనివారికి మాత్రమే ‘విడాకులు’ అనే రోగం అంటుకొంటుందని – కొన్ని అపోహలు ఉండేవి. కానీ నేను పైన ప్రస్తావించిన నిజ జీవితపు సంఘటన చూసాకా, అవన్నీ పటాపంచలైపోయాయి. ‘విడాకులు’ అనేది నిన్నో నేడో పుట్టుకొచ్చినది కాదు. కానీ కొన్ని సామాజిక కారణాలవల్ల అవి సంభవించడానికి నేటి పరిస్థితులు అగ్గికి ఆర్ఘ్యంలా పని చేస్తున్నాయి.

ఒక వ్యక్తి స్థాయిలో నేను ఎలా జాగ్రత్త పడాలి అని ప్రశ్నించుకున్నప్పుడు, ఇప్పటివరకూ నేను చూసిన, విడిపోయిన జంటలనుండి ఒక విషయాన్ని తెలుసుకున్నాను.

నా గురించి నా జీవిత భాగస్వామి ఎటువంటి ఫిర్యాదులూ చేయటంలేదంటే దాని అర్థం – అంతా సజావుగా వున్నట్లే అని భరోసాగా చెప్పలేము. ఎవరికి వారు ఆత్మావలోకనం చేసుకోవలసిందే. తన భార్య, లేక భర్త స్థానంలో తనుంటే, తనకు సుఖంగా ఉండేదా? మరెవరినుంచో మెప్పు పొందడానికి – ఈ ప్రశ్నకు సమాధానాన్ని తనకు అనువుగా చెప్పడం కాదు; అంతరాత్మ సాక్షిగా తనను తాను ప్రశ్నించుకోవాలి.

స్త్రీ స్వేచ్ఛ, సమాజంలో విచ్చలవిడితనం, మంటగలిసిపోతున్న విలువలు వంటి కారణాలను వెతుక్కొని, వాటిని మాటలతో ఖండించి, కాస్తంత తృప్తి పొందే కన్నా, ఎవరికి వారు తమ జీవిత భాగస్వామితో తనకున్న సంబంధం ఎంత ఆరోగ్యంగా ఉన్నదో పరిశీలించుకొంటూ జాగ్రత్త పడటం అన్నిటికన్నా మేలు.

ఆఫీసులు, స్నేహితులు, చుట్టుపక్కవారు, బంధువులూ, రాజకీయాలు, సినిమాలు, ఫాషన్లూ వంటి విషయాలకన్నా – రోగం వచ్చినా రొష్టు వచ్చినా, కష్టంలోగానీ, సుఖంలో గానీ జీవితాంతం తోడుగా ఉండే జీవిత భాగస్వామి ముఖ్యం. నిజంగా సమాజానికి మేలు చెయ్యాలనుకుంటే, సభలకెక్కి వాళ్ళెవరినో ఉద్ధరించాల్సిన పని లేదు. ఈ విషయంలో మటుకు, ఎవరి కుటుంబాన్ని వారు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే, సమాజానికి అదే పది వేలు. పైన ఉదహరించినటువంటిది రిటైర్మెంటు వయసులో ముంచుకొచ్చినపుడు బాధ పడే కన్నా, ముందు నుంచే – తన జీవిత భాగస్వామితో తనకున్న బంధాన్ని గమనిస్తూ, కాపాడుకొంటూ జాగ్రత్త పడటమే కావలిసినది.

కొన్ని జంటలను చూసినపుడు, నాకు కనిపించిన సాధారణ తప్పిదాలు.

 • ఆఫీసులో పై అధికారులతో జాగ్రత్తగా మెలుగుతూ, ఇంట్లో మటుకు తన భార్యతోనో, భర్తతోనో తీసి పడేసినట్టు ప్రవర్తించడం. పై అధికారికి విలువనివ్వడం ఏమాత్రం తప్పు కాదు. కానీ ఆ వ్యక్తికి మన జీవితంలో శాశ్వతమైన స్థానం ఉండదు. ఆలాంటి వ్యక్తితో ఉద్యోగాన్ని కాపాడుకోడానికి జాగ్రత్తగా మెలగగలిగినపుడు, మన జీవితంలో శాశ్వత స్థానం గల వ్యక్తికి అంతటి విలువ ఎందుకు ఇవ్వకూడదు?
 • ఇంట్లో జిడ్డుగారుతున్న ముఖంతో, ఆకర్షణీయంగా తయారవ్వక, బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం టింగు రంగా అని ముస్తాబై వెళుతూ ఉంటారు. ఎవరిని ఇంప్రెస్ చేయడం ముఖ్యం?
 • మా అమ్మా నాన్నలు దేవతలు కానీ మీ అమ్మానాన్నలో లేక అన్నదమ్ముళ్ళో వెధవలు అనే విధంగా మాట్లాడటం. ఎవరి రక్త సంబంధీకులు వారికి ముఖ్యం. హాస్యానికైనా అవతలవారి రక్త సంబంధీకులను కించపరచడం, తెలిసో తెలియకో తన భార్యనో లేక భర్తనో బాధకు గురి చేయడమే కదా!
 • ఒకరు క్షేత్రమయితే మరొకరు బీజం. సంతానంపై ఇద్దరికీ హక్కులూ, బాధ్యతలూ ఉంటాయి. తెలిసో తెలియకో పిల్లల ముందు తన భార్యనో లేక భర్తనో కించపరచడం లేదా పిల్లలు కించపరిచినపుడు సరిదిద్దే బదులు, వారికి వత్తాసు పలకడం.
 • ఆఫిసులోనో లేక వృత్తివ్యాపారాలలోనో ఎదురయ్యే వత్తిళ్ళను ఇంటికి పట్టుకేళ్ళడం.
 • ‘చండీ’ అంటే ‘ముండీ’ అని సమాధానం ఇస్తూ ఉండడం. ఈ జాడ్యం కొందరి నరనరాల్లో పేరుకుపోయి ఉంటుంది. అయిన దానికి – కాని దానికి, ఇంటా బయాటా అందరితో ఏ విషయంలోనూ ఏకిభవించక తన ప్రజ్ఞను చాటుతూ ఉంటారు. బయటివారు “ఛీ! పో” అని తప్పించుకుంటారేమో కానీ పెళ్ళి చేసుకున్న వ్యక్తి తప్పించుకోలేరు కదా! ప్రతి దానికీ వాదనకు దిగడం కొందరికి నచ్చవచ్చునేమో కానీ, అందరికీ నచ్చకపోవచ్చు.
 • ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేప్పుడైనా, భార్యనో/భర్తనో సంప్రదించకపోవడం. లేదా తను నిర్ణయించుకున్న దానికే బలవంతంగా వొప్పించడం. లేదా కలిసి ఒక ఒప్పందానికి వచ్చినా, చివరికి తనకు నచ్చినదే చేయడం.

A Wednesday హిందీ సినిమాలో ఒక సన్నివేశం. గందరగోళ పరిస్థితులలో, నలుగురు ఉగ్రవాదులను బస్సులో తీసుకెళుతున్న ఇన్స్‌పెక్టర్ జై ప్రతాప్ సింహ్‌ – భార్య ఫోన్ కాల్ వచ్చినప్పుడు, పక్కకు వెళ్ళి నెమ్మదిగా ఏమీ జరుగనట్టు మాట్లాడతాడు. టి.వీ. లో ఆ సన్నివేశం చూశాక శ్రీమతిగారిని ‘ఆ పరిస్థితులలో మనిద్దరం ఉంటే నేను ఎలా మాట్లాడి ఉండే వాడినంటావ్‌?’ అని ప్రశ్నించాను. ఠక్కున సమాధానం వచ్చింది – ‘గయ్ఁ మని అరుస్తూ ఫోన్ పెట్టెయ్‌ అని గద్దించి ఉండేవాళ్ళు’ అని. నిజమే! అంతటి ఓర్పూ సహనాలుండడం అంత తేలికేమీ కాదు. నా వల్లయితే ఒక్కనాటికి కాదు. కనీసం సాధారణ పరిస్థితులలోనైనా జీవిత భాగస్వామికి ఇవ్వవలసిన విలువనిస్తే సరిపోతుంది కదా!

తోక: బులుసు సుబ్రహ్మణ్యం గారు బ్లాగ్ సన్యాసం పుచ్చుకోవడాన్ని బల్ల గుద్ది ఖండిచేవారిలో నేనూ ఒకడిని.

ప్రకటనలు
 1. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు
  10:16 ఉద. వద్ద డిసెంబర్ 14, 2012

  మనిషిలో సమతుల్యత ఉంటుంది, దాన్ని దెబ్బ తీస్తేనే ఇంకొకరికి డబ్బులు అదే చేయిస్తున్నారు.

 2. 11:15 ఉద. వద్ద డిసెంబర్ 14, 2012

  ఈ కాలం లో కొత్త సమస్యలు వస్తున్నాయి వృద్ధులకి. పిల్లల మీద మనవల మీద ప్రేమతో, మమకారంతో ఎంత శ్రమ పడుతున్నారో అనిపిస్తోంది. కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఇంకొంచెం సీరియస్ గా వ్రాసి ఉండాల్సింది అనిపించింది.

  మీ విశ్లేషణ బాగుంది.
  తోక…..నేనూ ఖండిస్తున్నాను…..దహా.

  • 8:32 సా. వద్ద డిసెంబర్ 14, 2012

   సుబ్రహ్మణ్యం గారు: ఒకో సంఘటన వెనుక ఒకో కారణం ఉంటుంది కదా అని, మరింత లోతుగా వెళ్ళే ప్రయత్నం చేయలదు.

   మీరు ఏమి ఖండిస్తున్నారో సరిగా అర్థం కాలేదు. కొంపదీసి పైనున్న తోకను కాదు కదా? 😉

 3. 11:22 ఉద. వద్ద డిసెంబర్ 14, 2012

  మరో టపా రాయించే పని పెట్టేసేరు బాబోయ్! నేను రాయలేనండి. 🙂

 4. 12:26 సా. వద్ద డిసెంబర్ 14, 2012

  మీ విశ్లేషణ బాగుంది.

 5. 5:21 ఉద. వద్ద డిసెంబర్ 15, 2012

  You summarized so well in bullet points some of the most common mistakes we do! If only one can learn from this post..Sorry could not type in telugu as I am in a hurry but after reading the post , I really felt like leaving a comment, nice post.

 6. 3:08 ఉద. వద్ద డిసెంబర్ 16, 2012

  పర్లేదు ఇద్దరు వ్రాసారు. కొనసాగింపు నేను వ్రాస్తాను!

  ధన్యవాదాలు తెలుగు భావాలు గారు

 7. 11:10 సా. వద్ద డిసెంబర్ 16, 2012

  ”ఇదం కాష్ట మిదం కాష్టం నద్యాం నాగతి సంగతః

  సంయోగాచ్చ వియోగాచ్చ కా తత్ర పరివేదన ”

  నదీ ప్రవాహములో రెండు కట్టెపుల్లలు కొట్టుకొని వస్తుంటాయి.

  ఆ రెండు కట్టెలు ఒకచోట కలుస్తాయి. కొంత దూరం ప్రయాణం చేస్తాయి.

  నదీ ప్రవాహం లో జనించిన కెరటమే ఆ రెండు కట్టెలను విడదీస్తుంది.

  ఇక మళ్ళీ ఆ కట్టే పుల్లలు కలుస్తాయని చెప్పలేము.

  జీవితమనే ప్రవాహములో కాలమనే కెరటం భార్యాభర్తల్ని కలిపి

  సంసారమనే ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

  కలిపిన నదీ కెరటమే నిర్దాక్షిణ్యంగా విడదీస్తుంది.

  కాలం లో కలసి కాలం లోనే అంతరించి పోతున్న ఈ బంధాలు ఎంత విచిత్రమైనవి?

  అందుచేతనే

  ”సంసారోయ మతీవ విచిత్రః”

  విచిత్రమైనదీ సంసారం అంటూ శంకరులు భజగోవింద స్తోత్రం ద్వారా తెలిపి యున్నారు

  Pls. see the above video

  thanks
  ?!

  • 11:16 సా. వద్ద డిసెంబర్ 16, 2012

   మీరు ప్రస్తావించినది విడాకులకు అనువయించుకోవచ్చునంటారా?

   • 11:22 సా. వద్ద డిసెంబర్ 16, 2012

    పైన FYI అని పెట్టి ఉండాల్సింది.

    నేను గృహస్తమ? సన్యాసమా? అనే సంగ్దిగ్ధం లో ఉన్న బ్రహ్మ చారి ని ..

    అది తేల్చి చెప్పే అర్హత అనుభవం రెండూ నాకు లేవు సర్,

    ”శం” కరోతి ఇతి శం కరః

    శుభమును చేకూర్చు వాడైన ఆదిశంకరుని వాక్యం దృష్ట్యా ఎవరైనా ఆలోచిస్తారేమో అని ఈ కామెంట్ చేసాను.

    ?!

    • 4:47 ఉద. వద్ద డిసెంబర్ 17, 2012

     మీరు చెప్పినది నిజమే. కాల గమనంలో కలుస్తాము విడిపోతాము. చైనీస్ ఫిలాసోఫీ Taoism అని ఒకటుంది. దానిలోనూ దాదాపు ఇదే సిద్ధాంతం. ప్రతీ ఒక్కరికీ, The Way, అనే రేఖ ఉంటుంది. ఆ రేఖలు కాల గమనంలో కలుసు కుంటూ, విడిపోతూ ఉంటాయి. కానీ ఈ వేదాంతాలు అసలు సమస్యని పరిష్కరించక “అంతా మిధ్య” లాగా చెబుతాయి. అల్లా అని ఊర్కోలేముకదా.

     నా ఉద్దేశంలో భార్యా భర్తలు వాదించు కొనేటప్పుడు కొంత లిమిట్ వరకూ ప్రశాంతంగా ఉంటుంది. ఆ తరువాత బ్రేకింగ్ పాయింట్ రాబోతోందనో వచ్చిందనో సూచనలు కనపడుతుంటాయి. ఏవరికి అది వస్తోందని ముందరగా అనిపిస్తే వారు తప్పొప్పుల విచారణ మానేసి వాదనలు ఆపటం మంచిది. ఇంకొకరు ఆపక పోయినా మౌనం గా ఉండటము మేలు. ఆ తరువాత సమస్యా పరిష్కరణ కాలమే నిర్ణయిస్తుంది. “Time cures many things” ఇప్పుడు అప్లై అవుతుంది.

 8. kvsv
  11:43 సా. వద్ద డిసెంబర్ 16, 2012

  @స్త్రీ స్వేచ్ఛ, సమాజంలో విచ్చలవిడితనం, మంటగలిసిపోతున్న విలువలు వంటి కారణాలను వెతుక్కొని, వాటిని మాటలతో ఖండించి, కాస్తంత తృప్తి పొందే కన్నా, ఎవరికి వారు తమ జీవిత భాగస్వామితో తనకున్న సంబంధం ఎంత ఆరోగ్యంగా ఉన్నదో పరిశీలించుకొంటూ జాగ్రత్త పడటం అన్నిటికన్నా మేలు.

  హ్ మ్ మ్ మ్…అలా అయితే బ్రతకటం కష్టం 🙂

  • 9:13 ఉద. వద్ద డిసెంబర్ 17, 2012

   దేని వల్లో చెప్పనే లేదు! “ఖండించి కాస్తంత తృప్తి పొందడమా” లేక “పరిశీలించుకొంటూ జాగ్రత్త పడటమా?”

 9. 11:54 సా. వద్ద డిసెంబర్ 16, 2012

  బులుసు సుబ్రహ్మణ్యం గారు బ్లాగ్ సన్యాసం పుచ్చుకోవడాన్ని బల్ల గుద్ది ఖండిచేవారిలో నేనూ ఒకడిని.

  Me Too…..

  idi చూస్తుంటే నాకు ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది,

  ఒక ప్రముఖ చిత్రకారుడి ఫోటో exhibition జరుగుతుంటే….

  ఒక చిలుక వచ్చి …. ఒక చిత్రపటం పై ఉన్న పండ్లను నిజమైన పండ్లే అని భ్రమించి తినటానికి తంటాలు పడుతుంటే…

  ఒకతను అది చూసి ఇలా అన్నాడంట …

  ”మీరు గీసిన చిత్రం ఎంత సహజం గా ఉన్నదో ఆ చిలుక చర్యను చూస్తున్న ఎవ్వరైనా చెప్పగలరు” అని

  అందుకు ప్రతిగా ఆ చిత్రకారుడు …..

  నిజంగా నా చిత్రం అంత సహజమైతే…

  ఆ చిలుక ఆపండ్లను పట్టుకున్న సుందరిని చూసి వెంటనే పారిపోయి ఉండేది..

  కాని అలా కాక అది పండ్లను మటుకే భుజింప యత్నిస్తున్నదంటే,,,,

  అది ఆ సుందరి రూపాన్ని ఒక బొమ్మ వలెనె చూచిoదని కదా ?!

  నేను ఇంకను నేర్చుకొన వలసియున్నది అని సమాధాన పడ్డాడట….

  ఏమిటో !!

  బ్రహ్మ సత్యం proof చూప లేక పోయిన జగత్ మిథ్య కు ఇలాంటి నిదర్శనాలు కోకొల్లలు..

  ?!

 10. Snkr
  7:19 ఉద. వద్ద డిసెంబర్ 17, 2012

  సన్యాసం అంత కాని పనేమీ కాదులేండి. వ్యక్తి(గత) స్వేచ్చ నిచ్చే సన్యాసం కొన్నేళ్ళు మంచిదే.
  “నేను సైతం మీదు ఖండనకు
  ఖడ్గమొక్కటి అరువు ఇచ్చా..
  నేను సైతం… నేను సైతం…”

 1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s