ముంగిలి > పిచ్చాపాటి > సులోచనాలు

సులోచనాలు

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు, కళ్ళు కాస్త పీకుతున్నాయి చూద్దురూ అని కళ్ళ డాక్టరును కలిస్తే, కళ్ళకే అద్దాలు తగిలించేశారు! తలనొప్పి లేదు. దగ్గిర వస్తువులు, దూరపు వస్తువులూ అన్నీ సజావుగానే కనిపిస్తున్నాయి కదా – మరింకెందుకు అని అడిగితే, కళ్ళద్దాలు కానీ వాడకపోతే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతాయని హడలగొట్టేశారు. +0.25 ఏ కదా – కేవలం చదువుకొనేప్పుడో లేక కంప్యూటర్ వాడుతున్నపుడో పెట్టుకొంటే సరిపోదా అని అడిగితే, కుదరదు అని కరాఖండిగా తేల్చేశారు. కనీసం ఒక సంవత్సరం పాటు ఈ సులోచనాలను ఎప్పుడూ ధరించే ఉండాలి అని ఆర్డర్ పాస్ చేసారు.

నా కళ్ళద్దాలు

నా కళ్ళద్దాలు

కార్ నడిపేడప్పుడు సన్ గ్లాసెస్ అలవాటే కాబట్టి, కళ్ళద్దాలు కొత్తేమీ కాదు. కానీ పొద్దస్తమానం అంటే కాస్తంత ఏదోగా ఉన్నది. ఇరుపక్కల కానీ, పైకీ కిందకి కానీ చూడవలసి వస్తే, ఇదివరకు తల తిప్పకుండా కళ్ళను కాస్తంత అటూ ఇటూ తిప్పుతూ చూసేవాడిని. కానీ ఈ కళ్ళద్దాలు వచ్చాక, ఎటు చూడాలో అటువైపు మొత్తం తల తిప్పి చూడవలసి వస్తోంది. ముఖ్యంగా మెట్లు దిగుతుంటే మొత్తంగా తలను కిందకు వంచి చూడవలసి వస్తోంది. అన్నిటికన్నా చీకాకు – టీ తాగుతున్నపుడు! నాకేమో వేడిగా ఆవిర్లు కక్కుతూ ఉండే టీ తాగడం అలవాటు. అంత వేడి టీని నోటి దగ్గిరకు తేగానే ఆవిరి వల్ల కళ్ళద్దాలమీద పొర కమ్మేస్తోంది. కళ్ళద్దాలున్న పరిచయస్తులకు ఇలా అవ్వడం చూసిన జ్ఞాపకం లేదు. అంటే దీనికేదో చిట్కా ఉండే ఉండాలి. అర్జంటుగా కనుక్కొని, ఈ కష్టం నుండీ బయట పడాలి. అంతే కాదు. రాత్రి పడుకొనే ముందు ఏ పుస్తకమో లేక కంప్యూటర్లో ఏదన్నా చదివేసో పక్క ఎక్కిన తరువాత తెల్సిసివస్తోంది; కళ్ళకు అద్దాలున్నాయని. మరో తప్పిదం – ఒకటి రెండు సార్లు సన్‍గ్లాసేస్‍ను ఈ కళ్ళద్దాలు ఉండగానే  మరిచిపోయి పెట్టుకొనే ప్రయత్నం కూడా చేసాను!

మొట్టమొదటిసారిగా కళ్ళద్దాలు పెట్టుకొని ఆఫీసుకు వెళితే, అందరూ ‘అరే! కొత్తగా ఉందే!’ అన్నట్టు చూసారు. ఏదో ఇబ్బంది. కొందరు చాలా బాగున్నాయి అంటే ఒకరో ఇద్దరో సానుభూతి వ్యక్తం చేసారు. సైటొచ్చిందా అని ఒకరిద్దరు జాలి పడితే, తలనొప్పికోసమా మాష్టారు అని మరి కొందరు. ‘అదేం లేదు మహాప్రభో నా ఖర్మ కాలి ఏదో Cylindrical correction అంట’ అని నా సంజాయిషీలు.

కానీ శ్రీమతిగారికి మాత్రం నా కళ్ళద్దాల లుక్కు బాగా నచ్చేసింది. ‘ఏది ఏమయినా, వీటితో మీరు భలే ఉన్నారు. వీటిని ఎప్పుడూ వాడండేఁ!’ అని కితాబునిచ్చేసింది. చూద్దాం…ఈ కళ్ళద్దాల లుక్కు పాతబడటానికి ఎంత కాలం పడుతుందో! మా వాడినడిగితే, పెట్టుకున్నా పెట్టుకోకపోయినా – రెండు విధాలా బాగుంటానని ఒక డిప్లొమాటిక్ సమాధానం ఇచ్చాడు. వాడి గురించి తెలిసీ ఇలాంటి ప్రశ్న వేసినందుకు తగిన శాస్తే జరిగింది.

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. వారంలో గుణం కనిపించింది. చడీ చప్పుడు లేకుండా కళ్ళు పీకడం అనే పీడ వదిలింది. వాడడం మొదలు పెట్టిన వెంటనే తేడా తెలియలేదు కానీ, ఇప్పుడు కళ్ళవద్ద ఏ నొప్పీ లేదు. అంటే ఆ డాక్టరు నాకు చేసినది సరైన వైద్యమే! మనసులో ఎక్కడో చిన్న అనుమానం ఉండేది. కళ్ళకు అద్దాలు తగిలించాడా లేక నెత్తిన టోపీ పెట్టాడా అని. పాపం. మంచి డాక్టరే. కళ్ళకు అద్దాలు మత్రమే తగిలించి బాధ నుండీ ఉపశమనం లభించేట్టు చేశాడు. వైద్యో నారాయణో హరిః…

ప్రకటనలు
  1. 11:37 ఉద. వద్ద ఫిబ్రవరి 25, 2013

    ఎక్కువగా టోపీ పెట్టించుకోడం అలావాటయిపోయి…… 🙂

  1. No trackbacks yet.

మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు...

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s