ముంగిలి > ఆధ్యాత్మికం, మన సంస్కృతి, సనాతన ధర్మం > రామాయణం వల్ల ఏమి నీతి బోధపడుతుంది? – సమాధానాలు

రామాయణం వల్ల ఏమి నీతి బోధపడుతుంది? – సమాధానాలు

మార్చి 30, 2013

దివ్య నామాలు బ్లాగులో విష్ణు సహస్రం నుండి రోజుకొక నామం గురించి రాసుకొంటూ ఈ తెలుగు భావాలు బ్లాగులో ఏమీ రాయటం లేదు. అందువల్ల వొచ్చిన నష్టమేమీ లేదు. కానీ చాలా కాలం తరువాత అగ్రిగేటర్లు పరిశీలిస్తూ, ప్రజ సైటులో రామాయణం మీద వేసిన ప్రశ్నా, దాని మీద జరిగిన తర్జన భర్జనలు చూసి – శ్రీరాముడి గురించి ఏదోకొంత తెలిసినది రాసుకొనే అవకాశం లభించింది కదా అని మళ్ళీ చాలా కాలానికి ఇక్కడ ఓ టపా రాసుకుంటున్నాను.

2011 లో తెలుగు బ్లాగులు, చదవడం మొదలుపెట్టినప్పడి నుంచీ, రామాయణానికీ, రాముడికీ వ్యతిరేకంగా కొందరు రాసిన బ్లాగు టపాలు, వ్యాఖ్యలు చదవడం జరిగింది. మొదట్లో చాలా బాధ కలిగేది. రామాయణం చదవకుండా, వక్రీకరించి తీసిన సినిమాలను మాత్రమే పరిగణించి, ఎంత దారుణమైన రీతిలో రాస్తున్నారే అని. పోను పోనూ అర్థమవుతూ వొచ్చింది; ఈ విషయంలో వాగ్వివాదాలకు దిగడం నిష్ప్రయోజనం అని. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.

 • బ్లాగుల్లో వాద ప్రతివాదాలకు దిగిన ఏ వర్గమూ మరో వర్గాన్ని సరిగా అర్థం చేసుకున్న దాఖలాలు పెద్దగా కనబడవు.
 • శ్రీరాముడిని ఆరాధ్యంగా భావించే వర్గాన్ని కించపరచాలన్న ఉద్దేశ్యమే ప్రధానంగా కలిగి ఉండి, వ్యాఖ్యలు చేయడం అనే ధోరణి కనిపిస్తూ ఉంటుంది. అలా వ్యాఖ్యలు రాసే వారు నిజంగా రాముడిని వ్యతిరేకిస్తారో లేక కేవలం నమ్మే వారిని కించపరచాలని రాస్తారో – ఒకో సారి అర్థం కాదు.
 • శ్రీరాముడిని కీర్తిస్తూ వ్రాసే టపాల కన్నా, వ్యతిరేకిస్తూ వ్రాసే టపాలకే చెల్లుబాటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. రామాయణాన్నో, శ్రీరాముడినో వ్యతిరేకిస్తూ ఏదో ఒక భావం వ్యక్తపరిస్తే, ఒక్క సారిగా చదువరుల సంఖ్య పెరుగుతుండడం కనిపిస్తూ ఉంటుంది.
 • శ్రీరాముడి జీవితంలో రావణుడు ఎంతటి పాత్ర పోషించాడో, నా ఉద్దేశ్యంలో సీతమ్మ గురించి అవాకులూ చవాకులూ పేలిన పురవాసులు సైతం అంతటి పాత్రా పోషించారు. శ్రీరామరాజ్యంలోనే అటువంటి ప్రేలాపనలు పేలారంటే, ఈ కాలంలో అటువంటివి వినిపించడం పెద్ద విశేషమేమీ కాదు కదా! శ్రీరాముడిని ఆరాధించేవారు ఉన్నట్లే, ఆయన గురించి నీఛంగా మాట్లాడేవాళ్ళూ ఎప్పటికీ ఉంటారు. నాకు అర్థమయినంత మటుకూ, ఆయనపై (ఒక దైవంలా కాక, ఒక వ్యక్తిగా) పరిపూర్ణమయిన సదభిప్రాయం కలగాలంటే రాసి పెట్టి ఉండాలి. శ్రీరాముడిని అరాధిస్తూనే, ఎంతో కొంత అనుమానం లోలోపల అణగద్రొక్కుకొని ఉండే వారు ఎంతో మంది. భక్తి ఉంటుందే కానీ, పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేసే వారు – నమ్మకస్తులలో సైతం తక్కువ మందే ఉంటారని నా అభిప్రాయం.

Anyway, పూనుకొన్నాను కాబట్టి కొన్ని ఆరోపణలు, వాటి వెనుకనున్న నిజానిజాలు కొన్నిటిగురించి నా తృప్తికొద్దీ రాసుకొనే అవకాశాన్ని వినియోగించుకొంటాను. ప్రజలో వొచ్చిన కొన్ని వ్యాఖ్యలు యథాతదంగా…

 1. తండ్రి కోసం ప్రజల్ని వదిలేస్తే, తర్వాత ప్రజల కోసం పెళ్ళాం పిల్లల్ని వదిలేయాల్సి వస్తుంది.
 2. వదిలేయ్యకముందు బార్యని యెవరయినా ఎత్తుకు పొతే యుద్ధం చెయ్యాలి, తర్వాత చేతకాక తనే వదిలేస్తే దేవుడిపై భారం వెయ్యాలి.
 3. పలానా ఆశ్రమంలో వదిలి రమ్మన్న పెద్దమనిషికి ఎక్కడ ఉన్నారో తెలిసినా వెళ్ళడు , అదేంటో ఖర్మకాలి కనిపిస్తే (అంటే ఆ పిల్లలు తో యుద్డంచేయ్యాల్సి రావడం ఖర్మ కాకపోతే ఏంటి ) రమ్మని బ్రతిమాలెయ్యడం కన్నా ఆదర్శ ప్రాయం ఏముంది ?
 4. మనస్తత్వమూ, పరిస్థితులూ మారాయనేదే నా అభిప్రాయంకూడా. అలా మారినప్పుడు రామాయణం ఇప్పటికీ ఒక ఆదర్శం ఎలా అవ్వగలుగుతుంది? దాంట్లోని మంచితోపాటు, చెడునుకూడా నేర్చుకొనే అవకాశం ఉందికదా. కొన్ని విషయల్లో రాముడుకన్నా మనం ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నాం. ఆమేరకు రామయణాన్ని కొంచెం మార్చిరాసుకుంటే తప్పేముంది?
 5. రామో విగ్రహవాన్ ధర్మః. వాల్మీకి రామాయణంలోని ఈ మాట అన్నది యెవరో దేవతో మహర్షో కాదు. వాల్మీకి మారీచుడిచే రావణునితో చెప్పించారు.
  వీళ్ళు మంచి/చెడుల ఆధారంగా ఒకర్ని దేవుడిగా భావించడం జరగడంలేదు. ఫలానాయన దేవుడుకాబట్టి ఆయన మంచివాడు అనే దానికి వీరు వచ్చారు.
 6. పదకొండో తరగతి సంస్కృతంల, రామ:, రామం, రామేణ, రామాయ, రామాత్.. అని పదాల మూలాలను చదువుకున్న. మరి ఈ రామ: అనే మూల పదానికీ, దశరథ పుత్రుడు రామునికి సంబంధం ఉందా ?

తండ్రి కోసం ప్రజల్ని వదిలేస్తే, తర్వాత ప్రజల కోసం పెళ్ళాం పిల్లల్ని వదిలేయాల్సి వస్తుంది.

1.a తండ్రికోసమా లేక తండ్రి మాట నిలబెట్టడానికా? దేవవ్రతుడు భీష్ముడు అయినది ‘తండ్రి కోసం’ అనే కారణానికి చక్కటి ఉదాహరణ. గంగా పుత్రుడు తన తండ్రి సుఖంకోసం సంసార సుఖానికి దూరం అయ్యాడు. శ్రీ రాముడు తన తండ్రిని ధర్మ సంకటం నుండీ బయట పడవేయడానికి అరణ్యవాసం స్వీకరించాడు. ఎప్పుడో కైకమ్మకు ఇచ్చిన వరాలను దశరథ మహారాజు ఇష్టానికి విరుద్ధంగా వాడుకొన్నపుడు, అటూ ఇటూ కాని ధర్మ సంకటంలో పడిన తన తండ్రినీ, వంశ గౌరవాన్ని నిలపడానికీ – శ్రీ రాముడు ఆ నిర్ణయం తీసుకొన్నాడు. ‘రామా! నన్ను చెరలో వేసేసి నువ్వు పట్టాభిషేకం చేసుకో’ అని తండ్రి బ్రతిమిలాడినా, తను కష్టాలను ఎన్నుకొన్నాడు కానీ, కంసుడిలా తన తండ్రినే చెరలో వెయ్యలేదు. ఇక్కడ గమనించవలసినది తండ్రిని ధర్మ సంకటం నుండీ బయటపడవేయడమూ, వంశ గౌరవాన్ని నిలబెట్టడమూనూ. పైపెచ్చు అప్పటికి ఆయనకు పట్టాభిషేకం జరుగలేదు. కాబట్టి ‘ప్రజల్ని వదిలెయ్యడం’ అనేది నిజం కాదు.

1.b ఇక ‘ప్రజల కోసం పెళ్ళాం పిల్లల్ని వదిలేయటం’ గురించి చూస్తే, ప్రజలవద్ద వోట్లు అడుక్కొని, ఎన్నికయిన తరువాత ఆ ప్రజలనే కాదని పెళ్ళాం బిడ్డల్ని మాత్రమే పట్టించుకొనే నాయకులు ఈ కాలంలో కోకొల్లలు. కంసుడిలా తండ్రిని చెరలో వేసినా, లేక ప్రజల కన్నా పెళ్ళాం బిడ్డలకే ప్రాధాన్యం ఇచ్చి ఉన్నా, వాల్మీకి రామాయణం కాదు మీడియా కథనాలు రాసుకోవాలి.

వదిలేయ్యకముందు బార్యని యెవరయినా ఎత్తుకు పొతే యుద్ధం చెయ్యాలి, తర్వాత చేతకాక తనే వదిలేస్తే దేవుడిపై భారం వెయ్యాలి.

2. a భార్యను ఎవరయినా ఎత్తుకుపోతే ఆ కాలంలో కాదు, ఈ కాలంలోనైనా యుద్ధం చేయాలి. తన భార్యను ఎత్తుకుపోయినపుడు మాత్రమే కాదు సుగ్రీవుడి భార్యను బలవంతంగా అట్టే పెట్టుకొన్నాడని వాలిని కూడా శిక్షించాడు కోదండ రాముడు.

2.b ‘ఎవడ్రా పట్టమహిషి గురించి అవాకులూ చవాకులూ పేలిందీ? వాడి శిరస్సు ఖండించండి’ అని నోరెత్తిన ప్రతి వాడినీ శిక్షించి ఉంటే విషయం వేరేలా ఉండేది. అలా కాక, తన భార్య పాతివ్రత్యం సాక్షాత్ దేవతలే ధృవీకరించినా, తన దేశ ప్రజల అభీష్టం మేర గర్భిణి అయిన తన భార్యనే వొదులుకొన్నాడు. ఇది చేతకాని తనమా లేక త్యాగానికి పరాకాష్ఠా? పోనీ ఆవిడను ఆశ్రమానికి పంపిన తరువాత తను మరో వివాహం చేసుకొన్నాడా? అదీ లేదే! మంచితనం, చేతకానితనాలు ఒకటేనా?

పలానా ఆశ్రమంలో వదిలి రమ్మన్న పెద్దమనిషికి ఎక్కడ ఉన్నారో తెలిసినా వెళ్ళడు , అదేంటో ఖర్మకాలి కనిపిస్తే (అంటే ఆ పిల్లలు తో యుద్డంచేయ్యాల్సి రావడం ఖర్మ కాకపోతే ఏంటి ) రమ్మని బ్రతిమాలెయ్యడం కన్నా ఆదర్శ ప్రాయం ఏముంది ?

3.a వాల్మీకి ఆశ్రమానికి దగ్గిరగా వొదిలిరమ్మని శ్రీరాముడు, సౌమిత్రికి చెబుతాడు. For a change కొంత కాలం పంపడానికి కాదు. ప్రజలు ఒక సాధ్విపై అపవాదులు వేస్తున్నారే అని బాధ పడి ఆ తప్పిదం జరుగకుండా ఉండడానికి గర్భవతి అయిన తన సొంత భార్యనే వొదిలిపెట్టేస్తాడు. ఇష్టంతో కాదు. ఆ నిర్ణయం ఆయన ప్రభువుగా ప్రజల ఉద్దేశ్యం మేర చేశాడు; అన్నీ తెలిసిన ఒక భర్తలా కాదు.

3.b ఖర్మకాలి పిల్లలతో యుద్ధం చెయ్యడం, రాముడు సీతమ్మను తిరిగి రమ్మని బ్రతిమిలాడడం వంటివి వాల్మీకంలో లేవు. జరిగినది ఏమంటే, రాముడు అశ్వమేధయాగం చేస్తున్నందున, శిష్యగణంతో వాల్మీకి ఆ యజ్ఞాన్ని వీక్షించడానికి వస్తారు. ప్రజలలో రామాయణ గాథను ప్రచారం చేయమని కుశలవులకు వాల్మీకి చెబుతారు. అశ్వమేధం జరిగినన్నాళ్ళూ ఆ పిల్లలిద్దరూ రామాయణాన్ని గానం చేస్తారు. అది తెలిసి రాముడూ వినగోరుతాడు. పరిణామక్రమంలో సీతమ్మను సభా మధ్యంలోకి వాల్మీకి మహర్షి తీసుకొని వస్తారు. తన పాతివ్రత్యం సాక్షిగా తాను శ్రీరాముడిని మాత్రమే ఆరాధించినది నిజమయితే, భూదేవి తనను వొడిలో చేర్చుకోవాలని సీతమ్మ పలికిన వెంటనే భూమాత సీతమ్మను రసాతలానికి తీసుకొనిపోతుంది. సీతను తిరిగి అప్పజెప్పకపోతే తన క్రోధాన్ని చవిచూడవలసి వొస్తుందని రాముడు ఆగ్రహాన్ని ప్రదర్శించినపుడు బ్రహ్మదేవుడు అవతార ప్రయోజనం, వైకుంఠ పునరాగమనాల గురించి చెప్పి శాంత పరుస్తారు. వాల్మీకంలోని ఈ విషయం ఎక్కడ? సినిమాలలో కమర్షియల్ వాల్యూతో చూబించే కథ ఎక్కడ? తెలుసుకొని రాస్తే బాగుంటుందేమో కదా!

మనస్తత్వమూ, పరిస్థితులూ మారాయనేదే నా అభిప్రాయంకూడా. అలా మారినప్పుడు రామాయణం ఇప్పటికీ ఒక ఆదర్శం ఎలా అవ్వగలుగుతుంది? దాంట్లోని మంచితోపాటు, చెడునుకూడా నేర్చుకొనే అవకాశం ఉందికదా. కొన్ని విషయల్లో రాముడుకన్నా మనం ఉన్నతంగా ఆలోచించగలుగుతున్నాం. ఆమేరకు రామయణాన్ని కొంచెం మార్చిరాసుకుంటే తప్పేముంది?

4. రామాయణాది గ్రంథాలను పక్కన పడవేసి – ఒక వ్యక్తి స్థాయి నుండీ, దేశం స్థాయి వరకూ దిగజారిపోతున్నాము. ప్రజలంటే పట్టని నాయకులు, నాయకులను పొద్దస్తమానం తూలనాడే ప్రజలు, ఆడది సుఖభోగ వస్తువుగా మాత్రమే చూసే మగాళ్ళు, పిల్లల వ్యక్తిత్వ వికాసం గురించి పట్టని తల్లిదండ్రులు, తల్లి దండ్రులను చులకన చేసే పిల్లలు – ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో! రోజు రోజుకూ దిగజారిపోతూ తదనుగుణంగా గ్రంథాలను కూడా మార్చుకోవాలనుకోవడం సబబా లేక వాటిని పూర్తిగ చదివి వాటి స్థాయికి ఎదగాలని ప్రయత్నం చేయడం సబబా? కట్టుకొన్న మొగుడిని వొదిలేసి, పర పురుషుడితో సహజీవనం సాగించే వారికి అదో విష వృక్షం. నియమ నిష్ఠలతో బ్రతికే వారికి అదో కల్ప వృక్షం. కొందరి వక్ర దృష్టికి అణుగూణంగా మార్చాలంటే కుదురుతుందా?

రామో విగ్రహవాన్ ధర్మః. వాల్మీకి రామాయణంలోని ఈ మాట అన్నది యెవరో దేవతో మహర్షో కాదు. వాల్మీకి మారీచుడిచే రావణునితో చెప్పించారు.
వీళ్ళు మంచి/చెడుల ఆధారంగా ఒకర్ని దేవుడిగా భావించడం జరగడంలేదు. ఫలానాయన దేవుడుకాబట్టి ఆయన మంచివాడు అనే దానికి వీరు వచ్చారు.

ఎప్పుడో సంభవించిన అవతారం గురించి వాల్మీకి మహర్షితో ఎవరైనా దేన్నైనా ఎందుకు చెప్పిస్తారు? దాని వల్ల అలా చెప్పించిన వారికి దక్కేదేమిటి? నిజానికి దేవుడు కాబట్టి మనిషై పుట్టిన రాముడు మంచివాడు అని కాదు, అంత మంచివాడైన మనిషి మరింకెవ్వరూ ఉండరని ఆయన్ని దేవుడిగా ఆరాధిస్తారు. ఇది అందరికీ అర్థం కాదు.

పదకొండో తరగతి సంస్కృతంల, రామ:, రామం, రామేణ, రామాయ, రామాత్.. అని పదాల మూలాలను చదువుకున్న. మరి ఈ రామ: అనే మూల పదానికీ, దశరథ పుత్రుడు రామునికి సంబంధం ఉందా ?

రామః – రమయతి మోదయతి రూపసంపదేతో రామః – “రూపసంపద చేత సంతోషింపజేయువాడు రాముడు” అని అమరకోశం రామ అన్న పదానికి అర్థం చెబుతోంది.

కేవలం వాల్మీకి రామాయణాన్ని మాత్రమే చూస్తే బాలకాండ 18వ సర్గలో (అతీత్యైకాదశాహం తు నామకర్మ తథాఽకరోత్ । జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకేయీసుతమ్ ॥ 20 ॥) “పుత్రులు జన్మించిన పదకొండు దినముల పిమ్మట దశరథుడు వారికి జాతకర్మనామకరణోత్సవములను నిర్వహించెను. కులపురోహితుడైన వసిష్ఠుడు ఉత్తమ గుణములుగల జ్యేష్ఠకుమారునకు ‘రాముడు’ అనియు, కైకేయి సుతునకు ‘భరతుడు’ అనియు, సుమిత్రా పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనియు నామకరణములు జేసెను” అని ఉన్నది. రామ అను శబ్ధానికి గల అర్థం సరిగ్గా కుదురుతుందని కులగురువు పెట్టిన పేరు.

శ్రీరామ జన్మ లగ్న కుండలి

శ్రీరామ జన్మ లగ్న కుండలి

ఆ పద్దెనిమిదవ సర్గలోని 8, 9వ శ్లోకాలలోని వివారలను బట్టి ఆయన జన్మలగ్నకుండలిలో రవి మేషంలోనూ, గురుడు కర్కాటకంలో, శని తులారాశిలో, కుజుడు మకరంలో ఉచ్ఛస్థానాల్లో ఉన్నారు. గురు గ్రహానికి ఉన్న పేర్లలో ఆంగీరస ఒకటి – అంగీరసుని పుత్రుడు కాబట్టి. శనిగ్రహానికి మంద అనే పేరు ఉన్నది – మంద గతితో కదులుతాడు కాబట్టి. కుజుడికి ఉన్న ఒక పేరు అంగారకుడు. ఉచ్ఛస్థానాల్లో ఉన్న ఆయా క్రమంలోని గ్రహాలు అంటే ‘రవి’, ‘ఆంగీరస’, ‘మంద’ మరియూ ‘అంగారక’ గ్రహాల పేర్లలోని మొదటి శబ్ధాలను కలిపితే ‘ర్‌‘ + ‘‘ + ‘మ్‍‘ + ‘‘ = రామ. ఇలా కూడా ఆయనకు పెట్టిన ఆ పేరు వెనుకనున్న రహస్యాన్ని కొందరు పండితులు వివరించారు. నమ్మడం నమ్మకపోవడం వేరే విషయం. విషయ పరిజ్ఞానం ఉంటే ముక్కున వేలేసుకోవాల్సిందే! కాబట్టి ఆ పేరు వెనుక ఏ సందేహమూ లేదు.

బల రాముడు, పరశు రాముడూ ఉన్నారు కానీ రాముడు అంటే దశరథ నందనుడైన శ్రీ రాముడే!

:: శ్రీమద్రామాయణము – అరణ్యకాండము, సర్గ 37 ::
న రామః కర్కశస్తాత! నాఽవిద్వాన్నాఽజింతేంద్రియః ।
అనృతం దుశ్శ్రుతం చైవ నైవం త్వం వక్తుమర్హసి ॥ 12 ॥
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్యపరాక్రమః ।
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ॥ 13 ॥

రాముడిని దూషించిన రావణుడికి మారీచుడు చేసిన హితబోధ: శ్రీరాముడు కఠినాత్ముడు కాడు, సకలవిద్యావిశారదుడు. ఇంద్రియనిగ్రహముగలవాడు. రామునిగూర్చి నీవు వినినదంతయును, పలికినవన్నియును అసత్యములు. ఆ సత్పురుషునిగూర్చి నీవు ఇట్లు పలుకదగదు. అతడు ధర్మస్వరూపుడు, నిరుపమాన పరాక్రమశాలి, దేవతలకు ఇంద్రునివలె అతడు సమస్తలోకములకును ప్రభువు.

ప్రకటనలు